ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకోసం దేశమంతా ఎదురు చూస్తోంది. ఆ ఆసక్తికి తగ్గట్టే అనేక సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. ప్రధానమైన 5 టెలివిజన్ ఛానళ్ళు..టైమ్స్ నౌ, రిపబ్లిక్, ఇండియా టుడే, ఎబిపి న్యూస్, టివి9 భారతవర్ష్... ఆమ్ ఆద్మీ పార్టీకి సగటున 56 సీట్లు ఇచ్చాయి. బిజెపి చాలా దూరంలో 14 సీట్లకు పరిమితం అవుతుందని అంచనా. 70 సీట్ల అసెంబ్లీలో మెజారిటీకి 36 చాలు. కాంగ్రెస్ పార్టీకి కొన్ని ఛానళ్ళు సున్నా ఇస్తే, మరికొన్ని ఒకటి నుంచి 4 వరకు పేర్కొన్నాయి. అసలు ఫలితం 11న వస్తుంది.
2020-02-08థాయ్ లాండ్ లో ఓ దుండగుడు మిలిటరీ తరహా ఆయుధాలతో పౌరులపై జరిపిన దాడిలో 10 మంది మరణించారు. కాల్పుల దృశ్యాన్ని ఆ వ్యక్తి ‘ఫేస్ బుక్’లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించాడు. థాయ్ రాజధాని బ్యాంకాక్ కు ఈశాన్యంగా ఉన్న కొరాట్ నగరంలో ఈ దాడి జరిగింది. సిటీ సెంటర్ లోని టెర్మినల్21లో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఆ దుండగుడు ఆర్మీ కార్పోరల్ అని భావిస్తున్నారు. అతని పేజీని ‘ఫేస్ బుక్’ స్తంభింపజేసింది.
2020-02-08ప్రధాని నరేంద్ర మోడీకి గట్టి మద్ధతుదారు, హిందూ అతి జాతీయవాద ప్రచార సాధనం ‘రిపబ్లిక్ టీవీ’ కూడా ఢిల్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ నిర్వహించింది. ఆమ్ ఆద్మీ పార్టీ 48 నుంచి 61 సీట్లలో విజయం సాధించవచ్చని అంచనా వేసింది. బిజెపికి కేవలం 9 నుంచి 21 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ పార్టీకి 0 లేదా 1 రావచ్చని పేర్కొంది. ‘ఆప్’కి 51 లేదా 52 శాతం ఓట్లు, బిజెపికి 38 నుంచి 40 శాతం, కాంగ్రెస్ పార్టీకి కేవలం 4 నుంచి 5 శాతం, ఇతరులకు 5 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది.
2020-02-08ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, 10 బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెద్ద ఎత్తున ప్రచారానికి దిగినా...కమలం వికసించే పరిస్థితి లేదని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. శనివారం ఢిల్లీ పోలింగ్ ముగిశాక వివిధ వార్తా సంస్థలు సర్వే ఏజన్సీలతో కలసి నిర్వహించిన పోల్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం ఖాయంగా తేలింది. బిజెపి అనుకూల టైమ్స్ నౌ ఛానల్ ‘ఆప్’కి 44, బిజెపికి 26 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ ఖాతా తెరవదని ఆ ఛానల్ చెబుతోంది.
2020-02-08ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గింది. 6 గంటలకు పోలింగ్ సమయం ముగియగా.. క్యూలలో ఉన్నవారు ఇంకా ఓట్లు వేస్తున్నారు. 6.20 గంటల సమయానికి 54.97 శాతం ఓట్లు పోలైనట్లు ఈసీ డేటా చెబుతోంది. అతి తక్కువగా న్యూఢిల్లీ జిల్లాలో 51.85 శాతం, అత్యధికంగా ఈశాన్య ప్రాంతంలో 62.75 శాతం పోలింగ్ నమోదైంది. ఇంకా క్యూలలో ఉన్నవారంతా ఓట్లు వేసినా 60 శాతానికి మించకపోవచ్చు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 67 శాతం పైగా, 2019 లోక్ సభ ఎన్నికల్లో 65 శాతం పైగా ఓట్లు పోలయ్యాయి.
2020-02-08న్యూజీలాండ్ జట్టుపై టి20 సిరీస్ లో 5-0 తేడాతో ఘన విజయం సాధించిన ఇండియా, వన్డే సిరీస్ ను మాత్రం కోల్పోయింది. శనివారం ఆక్లాండ్ నగరంలో జరిగిన రెండో వన్డేలోనూ న్యూజీలాండ్ విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచుల సిరీస్ 2-0 తేడాతో ఆతిథ్య దేశం వశమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ జట్టు 273 పరుగులే చేసింది. అయితే, ఇండియాను 251 పరుగులకే పరిమితం చేయగలిగింది. న్యూజీలాండ్ జట్టుకు ఇండియాపై ఇది వరుసగా మూడో వన్డే విజయం.
2020-02-08ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఓటర్లు అంతగా ఆసక్తి చూపించలేదా? శనివారం మధ్యాహ్నం 2.41 సమయానికి కేవలం 29.03 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 2015లో మొత్తం 67 శాతం పైగా పోలింగ్ జరిగింది. ఈసారి అంత జరిగే అవకాశం కనిపించడంలేదు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ సర్వశక్తులు ఒడ్డి పని చేయగా.. బిజెపి తరపున ప్రధాని మోడీ, అమిత్ షా సహా అనేక మంది కేంద్ర మంత్రులు, బిజెపి ముఖ్యమంత్రులు ఢిల్లీపై దండయాత్ర చేశారు. అయినా, ఓటర్ల అనాసక్తి దేనికి సంకేతం?
2020-02-08డ్రాగన్ దేశంపై కరోనా వైరస్ విశ్వరూపం చూపిస్తోంది. శుక్రవారం ఒక్క రోజే 86 మందిని బలి తీసుకుంది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 722కు చేరింది. శుక్రవారం కొత్త కేసులు 3,399 నమోదయ్యాయి. 86 మరణాల్లో 81 ఒక్క హుబీ ప్రావిన్సులోనే సంభవించాయి. వైరస్ వ్యాప్తి మొదలైన వుహాన్ నగరం ఈ ప్రావిన్సులోనే ఉంది. మొత్తం కేసుల్లో దాదాపు 70 శాతం అక్కడే నమోదయ్యాయి. ఇప్పటిదాకా ఆసుపత్రులనుంచి డిశ్చార్జి అయినవారి సంఖ్య 2050కి పెరిగింది.
2020-02-08ఉమ్మడి ఏపీ విభజన సమయంలో హామీ ఇచ్చిన మేరకు ‘ప్రత్యేక కేటగిరి హోదా’, ఇతర బాధ్యతలను కేంద్రం నిర్వర్తించాలని కోరుతూ వామపక్షాలు ఆందోళనకు దిగనున్నాయి. ఈ నెల 12 నుంచి 17వ తేదీవరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, 17న కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చాయి. తొమ్మిది వామపక్ష పార్టీల నాయకులు శుక్రవారం విజయవాడలోని ఎం.బి. భవన్లో సమావేశమయ్యారు. అనంతరం సిపిఎం, సిపిఐ కార్యదర్శులు మధు, రామక్రిష్ణ వివరాలను వెల్లడించారు.
2020-02-07రాజధానిని తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆపాలని అమరావతి పరిరక్షణ సమితి నేతలు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కోరారు. శుక్రవారం సమితి నేతలు శివారెడ్డి, మల్లిఖార్జునరావు, స్వామి, శ్రీనివాస్ టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నానిలతో కలసి ఢిల్లీలో రాష్ట్రపతికి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వినతిపత్రాలు సమర్పించారు. భూములు ఇచ్చిన రైతుల్లో 25 మంది మరణించారని, ప్రభుత్వ చర్యలతో భవిష్యత్తులో ఎవరూ భూములు ఇవ్వరని నేతలు వివరించారు.
2020-02-07