భారత స్టాక్ మార్కెట్లనూ ‘కరోనా’ భయం కమ్ముకుంది. శుక్రవారం మార్కెట్ల ప్రారంభంలో బిఎస్ఇ సెన్సెక్స్ తిరోగమించింది. ఉదయం 10.00 గంటల సమయానికి సెన్సెక్స్ 1156 పాయింట్లు (2.91 శాతం) పతనమై 38,590కి చేరింది. ఎన్.ఎస్.ఇ. నిఫ్టీ 11,300 పాయింట్ల దిగువకు చేరింది. గత కొద్ది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు ‘కరోనా వైరస్’ దెబ్బకు కుదేలయ్యాయి. బిఎస్ఇ సెన్సెక్స్ గత వారంతో పోలిస్తే 2500 పాయింట్లకు పైగా దిగజారింది. శుక్రవారం 11 ప్రధాన రంగాల సూచీలు, నిఫ్టీ బాస్కెట్ లోని 50 ముఖ్యమైన షేర్లు మొత్తం నష్టాల బాట పట్టాయి.
2020-02-28‘కరోనా వైరస్’ చైనాను దాటి పశ్చిమ దేశాలకూ వ్యాపించడంతో అమెరికా స్టాక్స్ పతనం దిశగానే సాగాయి. డౌ ఇండెక్స్ గురువారం ఒక్క రోజే 1,191 పాయింట్లు (4.4 శాతం) పతనమైంది. ‘డౌ’ ఒకే రోజు ఇంత పతనం కావడం అమెరికా స్టాక్స్ చరిత్రలో ఇదే తొలిసారి. ఎస్&పి 500ది కూడా అదే స్థితి. 4.4 శాతం తగ్గి 3,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. 2011 ఆగస్టు 18 తర్వాత అత్యధిక పతనం ఇప్పుడే. నాస్డాక్ కాంపొజిట్ 4.6 శాతం పతనమైంది. ఇటలీలో ‘కరోనా’ మరణాలు పెరుగుతుండటం, కేలిఫోర్నియాలో కొత్త కేసు నమోదు కావడం మార్కెట్లను వణికించాయి.
2020-02-28ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత్ శర్మ మరణం విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్పొరేటర్ తాహిర్ హుస్సేన్ ను ఆమ్ ఆద్మీ పార్టీ సస్పెండ్ చేసింది. గురువారం తాహిర్ పైన హత్య కేసు నమోదైన నేపథ్యంలో ‘ఆప్’ సస్పెన్షన్ నిర్ణయం తీసుకుంది. రాళ్ళు, ఫైర్ బాంబులు విసిరిన గుంపులో తాను ఉన్నట్టు తాహిర్ అంగీకరించారు. అయితే, తాను దాడి చేయలేదని, తానే ప్రత్యర్ధి గుంపు లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన ఘర్షణల్లో 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
2020-02-27 Read Moreవిద్వేష ప్రసంగాలపై ఎఫ్ఐఆర్ నమోదుకు సమయం అనుకూలంగా లేదన్న భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదన.. నిన్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మురళీధర్ ను ఒప్పించలేకపోయింది. కానీ, గురువారం ఈ కేసులో వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి ధీరూభాయ్ నరేన్‌భాయ్ పటేల్ కన్విన్సయ్యారు. జస్టిస్ పటేల్, జస్టిస్ హరిశంకర్ ల ధర్మాసనం కౌంటర్ అఫిడవిట్ దాఖలు కోసం కేంద్రానికి 4 వారాలు గడువిచ్చింది. మళ్ళీ ఏప్రిల్ 13న వాదనలు విననుంది. నిన్న జస్టిస్ మురళీధర్ 24 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు.
2020-02-28 Read Moreఢిల్లీ అల్లర్లకు సంబంధించి..కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాల ‘విద్వేష ప్రసంగాల’పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ‘లాయర్స్ వాయిస్’ వ్యాజ్యంపై శుక్రవారం వాదనను వినాలని జస్టిస్ డి.ఎన్. పటేల్, జస్టిస్ సి. హరిశంకర్ ల ధర్మాసనం నిర్ణయించింది. ఢిల్లీ డిప్యూటీ సిఎం సిసోడియా, ఎమ్మెల్యే అమనతుల్లాఖాన్, ఎంఐఎం నేతలు ఒవైసీ, వారిస్ పఠాన్ లపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఈ అందరి ‘విద్వేష ప్రసంగాల’పై ప్రత్యేక ‘సిట్’తో దర్యాప్తు చేయించాలని పిటిషనర్ కోరారు.
2020-02-28కర్నూలు సుగాలీ ప్రీతి ‘హత్యాచారం’ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నెం. 37) జారీ చేసింది. 2017లో కర్నూలు కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ప్రీతి అత్యాచారానికి, హత్యకు గురైంది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీబీఐకి అప్పగించాలనే డిమాండుతో కర్నూలులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ తర్వాత సిఎం జగన్ బాధితురాలి తల్లికి హామీ ఇచ్చారు.
2020-02-28ఏపీ విభజన చట్టంలో కొన్ని అంశాలను అనాలోచితంగా చొప్పించారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పర్యవసానాలను ఆలోచించకుండా అసెంబ్లీ సీట్ల పెంపు వంటి హామీలు ఇచ్చారని గత యుపిఎ ప్రభుత్వాన్ని విమర్శించారు. కిషన్ రెడ్డి గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై విలేకరులు ప్రస్తావించినప్పుడు...దేశవ్యాప్తంగా చేపట్టకుండా కేవలం ఒకటి రెండు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ సాధ్యం కాదని స్పష్టం చేశారు. అయితే, ఈ అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు.
2020-02-28అమెరికా, ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల మధ్య ‘శాంతి ఒప్పందం’పై సంతకాల కార్యక్రమానికి భారత ప్రతినిధి హాజరు కాబోతున్నారు. శనివారం దోహాలో జరిగే కార్యక్రమంలో ఖతార్ లోని భారత రాయబారి పి. కుమారన్ పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనలు వైదొలగడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. 2001లో ఆప్ఘనిస్తాన్లో యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి 2,400 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. తాలిబన్లకు సంబంధించిన ఓ కార్యక్రమంలో ఇండియా పాల్గొనడం ఇదే తొలిసారి అవుతుంది.
2020-02-28 Read Moreబీమా కోరెగావ్ ఘర్షణలకు సంబంధించి నమోదైన 649 కేసుల్లో 348 కేసులను, మరాఠా రిజర్వేషన్ ఆందోళనల్లో హింసపై నమోదైన 548 కేసుల్లో 460 కేసులను మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉపసంహరించుకుంది. మహా వికాస్ అఘాది ప్రభుత్వంలో హోం శాఖ మంత్రిగా ఉన్న ఎన్.సి.పి. నేత అనిల్ దేశ్ ముఖ్ ఈ విషయాన్ని వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆమోదంతో.. ఎల్గార్ పరిషద్ కేసును పూణె పోలీసుల నుంచి ఎన్.ఐ.ఎ.కు బదిలీ చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్.సి.పి. ఖండించింది.
2020-02-27 Read Moreచైనా తర్వాత కరోనా వైరస్ ఇప్పుడు దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీ దేశాలను భయపెడుతోంది. ఆయా దేశాలకు ఇటీవలే విస్తరించిన వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం... ఇప్పటిదాకా దక్షిణ కొరియాలో 1,766 మందికి సోకగా 13 మంది మరణించారు. ఇటలీలో 650 మందికి సోకితే 17 మంది, ఇరాన్ దేశంలో 245 మందికి వైరస్ సోకగా 26 మంది, జపాన్ లో 210 మందికి గాను నలుగురు మరణించారు. ‘కరోనా’కు కేంద్ర బిందువైన చైనాలో బుధవారం అర్దరాత్రి వరకు 78,497 కేసులు నమోదైతే 2,744 మంది మరణించారు.
2020-02-27