ఏపీలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు ఖరారయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలతో డీలా పడింది. మూడో శక్తినంటూ ముందుకొచ్చిన జనసేన కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. లోక్ సభ స్థానాల్లో శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ మినహా మిగిలిన అన్ని చోట్లా టీడీపీ ఓటమి పాలైంది. వైసీపీ ఆ 22 స్థానాలను సాధించింది.
2019-05-24లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఉత్తరాది, పశ్చిమ రాష్ట్రాల్లోనే కాకుండా తూర్పున, దక్షిణాన కన్నడనాట ఎలా స్వీప్ చేసిందో ఈ మ్యాప్ కళ్ళకు కడుతోంది. యూపీలో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడమే కాకుండా 2014లో సాధించిన 282 సీట్లకు మరో 20 జోడించే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం బిజెపి గెలిచిన, ఆధిక్యంలో ఉన్న సీట్లు 302. ఎన్నికలు జరిగిన 542 సీట్లలో ఇవి 55.72 శాతం. కాంగ్రెస్ఆ ధిక్యంలో ఉన్నవి కేవలం 9.41 శాతం (51 సీట్లు). ఎన్డీయే మొత్తంగా 325 సీట్లు, యూపీఎ 87 సీట్లు సాధించే అవకాశాలున్నాయి.
2019-05-23వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఆయన ప్రత్యర్ధి కంటే 91 వేలకు పైగా ఓట్ల ఆధిక్యాన్ని నమోదు చేశారు. 2014 ఎన్నికల్లో జగన్ మెజారిటీ 75,243 ఓట్లు కాగా ఈసారి అది మరింత పెరిగింది.
2019-05-23ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక సునామీలో తెలుగుదేశం కొట్టుకుపోగా.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా ఆ వాడిని చవి చూశారు. కుప్పం నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించినా మెజారిటీ బాగా తగ్గిపోయింది. ఇక్కడ 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు 47,121 ఓట్ల మెజారిటీ లభించింది. ఈసారి అది 29,903 ఓట్లకు తగ్గిపోయింది. మరోవైపు ఆయన తనయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఓటమి అంచున ఉన్నారు. మంగళగిరిలో లోకేష్ పైన ఆయన ప్రత్యర్ధి 9 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
2019-05-23ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్రలో ఘన విజయం అంటే గుర్తొచ్చే మొదటి పేరు ఎన్టీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994 ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీపై టీడీపీ 216 సీట్లు, మిత్రపక్షాలు 34 సీట్లు సాధించాయి. కాంగ్రెస్ చరిత్రలో అతి తక్కువగా 26 సీట్లకు పరిమితమైన సందర్భం అది. టీడీపీ, మిత్రపక్షాలకు కలిపి వచ్చిన 250 సీట్లు మొత్తం అసెంబ్లీ సీట్ల (294)లో 85.03 శాతం. ఇప్పుడు జగన్ 150 సీట్లు (175 సీట్లలో) సాధిస్తే అప్పటి ఎన్టీఆర్-వామపక్షాల ఉమ్మడి విజయాన్ని ఒంటరిగా (85.71 శాతం విజయంతో) అధిగమించినట్టే!.
2019-05-23ఏపీలో జగన్ జన సునామీతో ఘన విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 150 అసెంబ్లీ సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని 175 సీట్లలో ఇవి 85.71 శాతం. 2004లో జగన్ తండ్రి రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన సీట్లు 185. ఉమ్మడి ఏపీ అసెంబ్లీలోని మొత్తం 294 సీట్లలో అవి 62.92 శాతం. మిత్రపక్షాలతో కలిపితే సాధించిన మొత్తం సీట్లు 76.87 శాతం. ఇప్పుడు జగన్ ఒంటరిగా పోటీ చేసి అంతకంటే మంచి ఫలితం సాధిస్తుండటం విశేషం.
2019-05-23జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం జిల్లా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఆధిక్యంలోకి వచ్చారు. ఓట్ల లెక్కింపు తొలి రౌండ్ లో వెనుకబడిన పవన్ రెండో రౌండ్ పూర్తయ్యేసరికి ముందుకొచ్చారు. అయితే, భీమవరంలో మాత్రం వెనుకంజలోనే కొనసాగుతున్నారు. అదే సమయంలో మంగళగిరిలో నారా లోకేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధి కంటే 2816 ఓట్లు వెనుకంజలో ఉన్నారు. మైలవరంలో మంత్రి దేవినేని ఉమ 350 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.
2019-05-232019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు... తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే మరో ఘోరమైన ఓటమిని నమోదు చేయబోతున్నాయా? ఇప్పటివరకు ఆధిక్యతలను చూస్తే అదే అనిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 294 అసెంబ్లీ సీట్లకు గాను 2004 ఎన్నికల్లో టీడీపీ 47 చోట్ల మాత్రమే గెలిచింది. అప్పటి గెలుపు 15.99 శాతం. 2019 ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం టీడీపీ కేవలం 29 సీట్లలో ఆధిక్యంలో ఉంది. విభజిత ఆంధ్రలోని 175 అసెంబ్లీ సీట్లలో ఇవి కేవలం 16.57 శాతం.
2019-05-23మూడో ప్రత్యామ్నాయం అంటూ ముందుకొచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ వెనుకంజ వేశారు. తాజా సమాచారం ప్రకారం... సొంత జిల్లా పశ్చిమగోదావరిలో పోటీ చేసిన భీమవరంలోనూ, విశాఖపట్నం జిల్లా గాజువాకలోనూ కొనసాగుతున్నారు. తెలుగు సినిమా రంగంలో అగ్రస్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ కు ఇది మింగుడు పడని విషయం. విశాఖపట్నం లోక్ సభ నియోజకవర్గంలో పోటీ చేసిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మినహా మరెవరూ గట్టి పోటీ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.
2019-05-23ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత అసాధారణ స్థాయిలో బయటపడింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘన విజయాన్ని నమోదు చేసే దిశగా సాగుతున్నారు. ఉదయం 10.20 గంటల సమయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 133 అసెంబ్లీ సీట్లలో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లలో ముందంజ వేసింది. లోక్ సభ నియోజకవర్గాల్లో కేవలం రెంటిలో మాత్రమే టీడీపీ ఆధిక్యంలో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏకంగా 22 నియోజకవర్గాల్లో ఆధిక్యాన్ని చాటుతోంది.
2019-05-23