జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్.పి.ఆర్) కోసం సమాచార సేకరణ ప్రక్రియను ఏప్రిల్ 1న ప్రారంభించాలని కేంద్రం నిర్దేశించగా, బిజెపి మిత్రపక్షం అన్నా డిఎంకె మాత్రం తాము ఇంకా నోటిఫై చేయలేదని చెబుతోంది. 2010 పశ్నావళిలో లేని మూడు అదనపు ప్రశ్నలపై తాము వివరణ కోరామని, దానికి కేంద్రం నుంచి ఇంకా సమాధానం రాలేదని తమిళనాడు రెవెన్యూ శాఖ మంత్రి ఆర్.బి. ఉదయకుమార్ చెప్పారు. మాతృభాష, తల్లిదండ్రులు పుట్టిన తేదీలు, పుట్టిన స్థలాలు, ఆధార్, ఓటర్ ఐడి తదితర అంశాలపై సమాధానం వచ్చాకే ఎన్.పి.ఆర్.పై నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు.
2020-03-12‘కరోనా’తో ఇండియాలో తొలి మరణం నమోదైంది. కర్నాటకలోని కాలాబురగి ప్రాంతానికి చెందిన మహ్మద్ హుస్సేన్ సిద్ధిఖ్ (76) మంగళవారం రాత్రి మరణించగా, ఆయనకు ‘కరోనా’ సోకినట్టు గురువారం నిర్ధారించారు. సౌదీ అరేబియా నుంచి ఫిబ్రవరి 29న తిరిగొచ్చిన సిద్ధిఖ్, ఈ నెల 5న కాలాబురగిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడి నుంచి 9న చికిత్సకోసం కుటుంబంతో సహా హైదరాబాద్ వచ్చారు. మంగళవారం రాత్రి తిరుగు ప్రయాణంలో మరణించారు. హైదరాబాద్ రావడానికి ఎందుకు అనుమతించారో.. అక్కడినుంచి తిరిగి ఎందుకు ప్రయాణమయ్యారో తెలియాల్సి ఉంది.
2020-03-12స్థానిక ఎన్నికల్లో హింస జగన్ మనస్తత్వాన్ని బయటపెట్టిందని బిజెపి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ దేవధర్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విజయవాడలో జనసేన, బిజెపి ఉమ్మడి దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నది ఎన్నికల కాదని.. ఎంపికలు మాత్రమేనని దేవధర్ విమర్శించారు. అయితే, ఈ అంశంపై విమర్శలు చేసే హక్కు తెలుగుదేశం పార్టీకి లేదని, వాళ్ళు స్థానిక సంస్థలకు ఎన్నికలే జరపలేదని పేర్కొన్నారు.
2020-03-12స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర పార్టీల వారిని భయపెట్టి ఓట్లకు కూడా రానివ్వకుండా చేయాలనే హింసకు దిగుతున్నారని అధికార పార్టీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణ చేశారు. గతంలో పోలింగ్ సమయాల్లో అక్కడక్కడా ఘర్షణలు జరగడం చూశామని, కానీ నామినేషన్లే వేయనీయకుండా దాడులు చేయడం ఇప్పుడే చూస్తున్నానని పవన్ పేర్కొన్నారు. నామినేషన్లు వేసిన అభ్యర్ధుల వద్దకు జనసేన, బీజేపీ నేతలం ఉమ్మడిగా వెళ్తామని చెప్పారు. గురువారం పవన్ బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సునీల్ దేవధర్ లతో కలసి విలేకరులతో మాట్లాడారు.
2020-03-12‘‘రాష్ట్ర నాయకులను పంపితే.. ఎందుకు వెళ్లారని బుద్ధి ఉన్నవాడెవడైనా అడుగుతాడా? ఈ లెక్కన జగన్ కూడా పులివెందులలో ఉండాలి’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. బొండా ఉమ, బుద్ధా వెంకన్న మాచర్ల ఎందుకు వెళ్లారన్న వైసీపీ నేతలపైన, గురువారం రాజ్ భవన్ వద్ద ఈ ప్రశ్న అడిగిన విలేకరిపైనా చంద్రబాబు విరుచుకుపడ్డారు. జరిగిన ఘటనలపైన నిజ నిర్ధారణకోసం అన్ని జిల్లాలకూ నాయకులను పంపుతామని స్పష్టం చేశారు. దాడులపై మాట్లాడుతూ ‘‘రాజశేఖరరెడ్డిని చూశా. ఇంకా చాలామంది రౌడీలను చూశా’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
2020-03-12స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వకుండా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చేసిన అక్రమాలు, దాడులపై ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్ర గవర్నరుకు ఫిర్యాదు చేశారు. గురువారం సాయంత్రం చంద్రబాబు రాజ్ భవన్లో గవర్నర్ హరిచందన్ బిశ్వబూషణ్ ను కలసి రాష్ట్రంలో శాంతిభద్రతలు, ఎన్నికల కమిషన్ విఫలమయ్యాయని నివేదించిన చంద్రబాబు... జోక్యం చేసుకోవాలని కోరారు. చాలా చోట్ల పోలీసు అధికారులు అధికార పార్టీ తరపున తమ పార్టీ అభ్యర్ధులను బెదిరించారని ఆయన ఫిర్యాదు చేశారు.
2020-03-12టి.ఆర్.ఎస్. రాజ్యసభ అభ్యర్ధులుగా సిటింగ్ సభ్యుడు కె. కేశవరావు, మాజీ స్పీకర్ (ఉమ్మడి ఏపీ అసెంబ్లీ) కె.ఆర్. సురేష్ రెడ్డి పేర్లను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ సీట్లూ.. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం టి.ఆర్.ఎస్.కే దక్కుతాయి. కేకే, కేఆర్ శుక్రవారం నామినేషన్లను దాఖలు చేయనున్నారు. తమ పేర్లను ప్రకటించినందుకు వారిద్దరూ ముఖ్యమంత్రిని కలసి కృతజ్ఞతలు తెలిపారు.
2020-03-12ఇటలీ నుంచి తిరిగి వచ్చిన నెల్లూరు విద్యార్ధికి ‘కరోనా’ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ నెల ఆరో తేదీన ఇటలీ నుంచి తిరిగి వచ్చిన ఆ విద్యార్ధి పొడి దగ్గుతో ఈ నెల 9న నెల్లూరు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో చేరాడు. తనని విడిగా ఏర్పాటు చేసిన వార్డులో ఉంచి రక్త నమూనాలను తిరుపతి స్విమ్స్ లోని వైరాలజీ లేబొరేటరీకి పంపారు. గురువారం నిర్ధారణ అయింది. అతను ఆరోగ్యంగానే ఉన్నాడని, 14 రోజుల ‘క్వారంటైన్’ తర్వాత ఇంటికి పంపుతామని ప్రభుత్వం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. అతనితో సహచరించిన ఐదుగురిని గుర్తించి విడిగా ఉంచామని పేర్కొంది.
2020-03-12స్థానిక ఎన్నికల్లో ఫ్యాక్షనిజం కనిపించిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఫ్యాక్షనిస్టులు వేరేవాళ్ళను టెండర్లు వేయనీయకుండా పేపర్లను లాక్కున్నట్టే.. ఎన్నికల్లో తాము ఒక్కరే ఉండాలని ఇతరుల నామినేషన్ పత్రాలను చించేశారని ధ్వజమెత్తారు. గురువారం ఆయన విజయవాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలసి దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు. పొగరుబోతు ఎద్దుకు ముకుతాడు వేసినట్టే ఈ ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని కన్నా ప్రజలకు విన్నవించారు.
2020-03-12‘‘మా ప్రాణాలు కాపాడాలని పోలీసు వ్యవస్థను చేతులెత్తి వేడుకుంటున్నాం. మాకేమి జరిగినా పోలీసు వ్యవస్థే బాధ్యత వహించాలి’’ అని విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. బుధవారం మాచర్లలో వైసీపీ నేతల దాడికి గురైన బొండా, గురువారం విజయవాడలో నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావును కలసి భద్రతకోసం విన్నవించారు. దాడిలో ధ్వంసమైన కారుతోనే ఆయన కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. ఓ పథకం ప్రకారం.. తమకు భద్రత తొలగించి హతమార్చే ప్రయత్నం జరుగుతోందని ఉమ ఆరోపించారు.
2020-03-12