‘‘నిర్భయ’’ అత్యాచార ఘటనలో దోషి అక్షయ్ కుమార్ సింగ్ ఉరిశిక్షను సమీక్షించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో జరిగిన సామూహిక మానభంగం కేసులో నలుగురు నిందితులు. వారిలో ముగ్గురు ఇదివరకే తమ ‘ఉరిశిక్ష’ను మార్చాలని కోరారు. అప్పుడూ కోర్టు తిరస్కరించింది. పేదవాడు కావడంవల్లనే అక్షయ్ ఉరిశిక్షకు గురయ్యాడని, మీడియా, రాజకీయ ఒత్తిడివల్లనే తీవ్రమైన శిక్ష విధించారని అతని న్యాయవాది వాదించారు. అయితే, ఇదంతా ఇంతకు ముందే వినిపించారని సుప్రీం కొట్టిపారేసింది.
2019-12-18పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ)పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై దాఖలైన పదులకొద్దీ పిటిషన్లపై ఈ నెల 22న వాదనలను విననుంది. 59 పిటిషన్లకు సంబంధించి కేంద్రానికి నోటీసు జారీ చేసింది. ఒక చట్టాన్ని నోటిఫై చేసిన తర్వాత స్టే ఇవ్వరాదని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ వాదించారు. అయితే, చట్టం ఇంకా అమల్లోకి రాలేదని, మార్గదర్శకాలను ఇంకా ప్రకటించలేదని సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ గుర్తు చేశారు.
2019-12-18అమరావతి గొప్ప రాజధాని అవుతుందనే ఆశతో 30 వేల ఎకరాలకు పైగా ఇచ్చిన రైతుల్లో ఇప్పుడు ఆందోళన నెలకొంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనతో... ప్రస్తుత సచివాలయం చుట్టుప్రక్కల ఉన్న మందడం, కృష్ణాయపాలెం, వెలగపూడి గ్రామాల్లో బుధవారం రైతులు రోడ్డెక్కారు. మందడం వద్ద ధర్నా, రాస్తారోకో చేపట్టారు. దీంతో సచివాలయానికి వెళ్లే రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. వికేంద్రీకరణ కోసం గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశాక రాజధానిని విడదీయడం ఎందుకని రైతులు ప్రశ్నించారు.
2019-12-18పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్ధులకు బాలీవుడ్ నటి అలియా భట్ మద్దతు తెలిపారు. ‘‘విద్యార్ధులనుంచి నేర్చుకోండి’’ అని నటీనటులకు, ఫాలోయర్లకు సూచించారు. ఇండియా ‘‘సావరిన్ సోషలిస్టు సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్’’ అంటూ ప్రజలు నిశ్చియించుకున్నట్టు ప్రకటించిన భారత రాజ్యాంగ పీఠికను అలియా షేర్ చేశారు. సోనాక్షి సిన్హా కూడా రాజ్యాంగ పీఠికను షేర్ చేసినవారిలో ఉన్నారు.
2019-12-18రాజధాని తరలిస్తారా.. ఇక్కడే కొనసాగిస్తారా? అన్న అంశంపై ఎట్టకేలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అరున్నర నెలల తర్వాత నోరు విప్పారు. ఇప్పుడూ స్పష్టంగా చెప్పకుండా ‘‘ఏపీకి మూడు రాజధానులు ఉంటాయేమో’’ అని వ్యాఖ్యానించారు. అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టు, విశాఖపట్నంలో పరిపాలనా నగరం ఉండవచ్చని చెప్పారు. ‘‘అందరికీ క్లారిటీ వచ్చిందనుకుంటా’’ అని కూడా జగన్ వ్యాఖ్యానించారు. విశాఖలో పరిపాలనా రాజధాని పెడితే పెద్దగా ఖర్చు ఉండదని చెప్పారు.
2019-12-1713 సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణపై ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని పశ్చిమ గోదావరి జిల్లాలో అరెస్టు చేశారు. ఆ విద్యార్ధిని ఓ అథ్లెట్. కొద్ది నెలల క్రితం... తరగతులు ముగిశాక పాఠశాల మైదానంలో ప్రాక్టీసు చేస్తుండగా, ఆమెను గదిలోకి తీసుకెళ్లిన టీచర్ లైంగికంగా దాడి చేసినట్టు కథనం. ఆ తర్వాత అనేకసార్లు ఆ టీచర్ లైంగికంగా వేధించి... ఈ విషయం బయటకు రాకూడదని విద్యార్ధినిని బెదిరించినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది.
2019-12-17‘‘నేనొక చెడ్డ పోలీసును’’ అంటున్నారు సూపర్ స్టార్ రజినీ తాజా చిత్రం ‘‘దర్బార్’’లో... చాలా కాలం తర్వాత రజినీకాంత్ పోలీసు పాత్రలో నటించిన ఈ చిత్రం ట్రైలర్ సోమవారం విడుదలైంది. ‘‘పోలీసు అంటే ఉద్యోగం కాదు. జీవించేది కాపాడటానికే’’ అనే పాజిటివ్ వైబ్రేషన్స్, ‘‘నేను ఒరిజినల్ గానే విలన్’’ అనే మాస్ మసాలా డైలాగులు హీరోతో పలికించారు దర్శకుడు మురుగదాస్. రజినీ సరసన నయనతార నటించిన ఈ చిత్రంలో... బాలీవుడ్ నిన్నటి తరం హీరో సునీల్ శెట్టి ప్రతినాయకుడి పాత్ర పోషించడం విశేషం.
2019-12-16జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో జరిగిన ఘటనలను వందేళ్ల క్రితం ‘‘జలియన్ వాలా భాగ్’’లో జనరల్ డయ్యర్ సాగించిన మారణకాండతో పోల్చారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే. విద్యార్ధులను ‘‘యువ బాంబులు’’గా అభివర్ణించిన థాకరే, వారితో ఇలా ప్రవర్తించవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని వారించారు. పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించిన నేపథ్యంలో జామియాలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు విరుచుకుపడ్డారు. లైబ్రరీ, హాస్టళ్లను కూడా వదలకుండా దొరికినవారిని దొరికినట్టు బాదారు.
2019-12-17‘‘రాజద్రోహం కేసులో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషార్రఫ్ కు మరణశిక్ష విధించారు. రాజధాని పేరిట రాష్ట్రద్రోహం చేసిన చంద్రబాబుకు ఏ శిక్ష విధించాలో ప్రజలు చూసుకుంటారు’’... వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గుడివాడ్ అమరనాథ్ మంగళవారం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్య ఇది. రాజధాని అమరావతిని చంద్రబాబు భ్రమరావతిగా మార్చారని మరో ఎమ్మెల్యే సుధాకర్ బాబు విమర్శించారు.
2019-12-17పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ కు ఆ దేశ ప్రత్యేక కోర్టు ఒకటి మరణ శిక్ష విధించింది. 2007లో రాజ్యాంగాన్ని రద్దు చేసి ఎమర్జెన్సీ ప్రకటించిన ఉదంతానికి సంబంధించి ‘‘రాజద్రోహం’’ కేసులో ముగ్గురు సభ్యుల ధర్మాసనం 2-1 మెజారిటీతో మంగళవారం శిక్షను ప్రకటించింది. పాకిస్తాన్ లో ఒక మిలిటరీ పాలకుడికి మరణ శిక్ష పడటం ఇదే తొలిసారి. శిక్ష వివరాలను మరో 48 గంటల్లో ప్రకటిస్తారు.అయితే, ముషార్రఫ్ ఇప్పుడు పాకిస్తాన్లో లేరు. 2016 మార్చిలో వైద్య చికిత్సకోసం అని దుబాయి వెళ్లిన ఆయన అక్కడే ఉండిపోయారు.
2019-12-17