శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహించి రాజీనామా చేసిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, ఆ ఖాళీలోనే తిరిగి ఎన్నిక కావడంకోసం వైసీపీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లాకు చెందిన పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు. మండలి రద్దుకోసం అసెంబ్లీలో తీర్మానం చేయించిన ముఖ్యమంత్రి జగన్... ఎమ్మెల్సీలుగా ఉన్న మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లకు రాజ్యసభ సభ్యత్వాల రూపంలో పరిహారం ఇచ్చారు. డొక్కాను మాత్రం అదే మండలి సభ్యత్వంకోసం అభ్యర్ధిగా నిలపడం గమనార్హం.
2020-06-25చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించడానికి వర్చువల్ పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కీలకమైన అంశాలపై ప్రతి ఒక్కరూ చర్చలో పాల్గొని వ్యూహరచన చేయడానికి పార్లమెంటు ఒక్కటే సరైన వేదిక అని ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అభిప్రాయపడ్డారు. 1962 ఇండో-చైనా యుద్ధ సమయంలో పార్లమెంటు సమావేశాల ఏర్పాటుకు అటల్ బిహారీ వాజపేయి డిమాండ్ చేయగా నెహ్రూ అంగీకరించారని గుర్తు చేశారు. ముఖ్యమైన అంశాలు ఉన్నా పార్లమెంటరీ కమిటీలు కూడా సమావేశం కావడంలేదని ఆయన ఆక్షేపించారు.
2020-06-25ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐసిఎస్ఇ) పరిధిలో మిగిలిపోయిన పరీక్షలు రద్దయ్యాయి. సిబిఎస్ఇతో పాటు ఐసిఎస్ఇ బోర్డు కూడా పరీక్షల రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు నివేదించింది. ‘కరోనా’ కేసులు, మరణాలు పెరుగుతున్న తరుణంలో పరీక్షలపై స్పష్టమైన వైఖరి తీసుకోవాలని ఐసిఎస్ఇ అధికారులకు బాంబే హైకోర్టు కొద్దిరోజుల కిందట సూచించింది. ఈ విషయమై అనేక మంది తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. కొన్ని రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేయగా... ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు ప్రభుత్వాలు కేంద్ర బోర్డుల పరీక్షల నిర్వహణపైనా చేతులెత్తేశాయి.
2020-06-25సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) 10, 12 తరగతుల పరీక్షలు రద్దయ్యాయి. జూలై 1-15 తేదీల్లో నిర్వహించడానికి ఇంతకు ముందు షెడ్యూలు ప్రకటించిన సిబిఎస్ఇ, ‘కరోనా’ ఉధృతి తగ్గకపోవడంతో ఇప్పుడు రద్దు చేసింది. పదో తరగతి విద్యార్ధులు చివరిగా రాసిన 3 పరీక్షల ఆధారంగా వారి వార్షిక ప్రతిభను అంచనా వేస్తామని సిబిఎస్ఇ గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. పరీక్షలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
2020-06-25వచ్చే సెమిస్టర్ మొత్తం ఆన్ లైన్ తరగతులతోనే పూర్తి చేయాలని ఐఐటి- బాంబే నిర్ణయించింది. దేశంలో ఓ ఐఐటి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే ప్రథమం. ‘కరోనా’ వ్యాప్తి తీవ్రతరమైన నేపథ్యంలో.. అధ్యాపకులకు ఎదురుగా కూర్చొని పాఠాలు వినడానికి విద్యార్ధులను పిలవకూడదని నిర్ణయించినట్టు ఆ సంస్థ డైరెక్టర్ సుభాశిస్ చౌధురి గత రాత్రి ‘పేస్ బుక్’ ద్వారా వెల్లడించారు. ‘‘ఐఐటి బాంబేకి విద్యార్ధులే మొదటి ప్రాధాన్యత... వారి భద్రత, శ్రేయస్సు విషయంలో రాజీ లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్ధులకు ల్యాప్ టాప్, బ్రాడ్ బ్యాండ్ కోసం రూ. 5 కోట్లు అవసరమన్న చౌధురి, విరాళాలకోసం విజ్ఞప్తి చేశారు.
2020-06-25‘కరోనా’ పాజిటివ్ కేసుల్లో దేశ రాజధాని ఢిల్లీ నగరం వాణిజ్య రాజధాని ముంబైని మించిపోయింది. నిన్నటి వరకు ముంబైలో 69,625 కేసులు నమోదు కాగా ఢిల్లీలో 70 వేలు దాటి 70,390కి పెరిగాయి. మహారాష్ట్ర మొత్తంగా చూసినప్పుడు కేసుల సంఖ్య అత్యధికంగా 1,42,900కి చేరింది. దేశవ్యాప్తంగా 4,73,105 పాజిటివ్ కేసులు నమోదు కాగా 14,894 మంది మరణించారు. నిన్న ఒకే రోజు దేశంలో 17 వేల కొత్త కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు దర్పణం పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా 94,30,384 మంది వైరస్ బారిన పడగా 4,82,752 మంది మరణించారు.
2020-06-25తనకు ‘కరోనా’ పాజిటివ్ వచ్చిందనే పేరిట అదుపులోకి తీసుకొని నిజంగానే ‘కోవిడ్19’ తెప్పించాలని కుట్ర చేశారని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. విజయవాడ పరీక్ష ఫలితం (పాజిటివ్)పై అనుమానం వచ్చి హైదరాబాద్ నగరంలో పరీక్ష చేయించుకుంటే నెగెటివ్ వచ్చిందని దీపక్ రెడ్డి గురువారం వెల్లడించారు. ‘కోవిడ్19’ పేరిట తనను హతమార్చే కుట్ర జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. రాజకీయాలను ఈ స్థాయికి దిగజార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
2020-06-252020లో భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు తిరోగమిస్తుందని, మైనస్ 4.5 శాతంగా ఉండొచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజాగా అంచనా వేసింది. జూన్ మాసపు వరల్డ్ ఎకనామిక్ ఔట్ లుక్ (డబ్ల్యుఇఒ)ను ఐంఎంఎఫ్ బుధవారం విడుదల చేసింది. ఏప్రిల్ డబ్ల్యుఇఒతో పోలిస్తే భారత వృద్ధి రేటు అంచనాలో ఏకంగా 6.4 శాతం కోత పెట్టడం గమనార్హం. 2020 అంచనాల్లో ఇంత మార్పు మరే దేశం విషయంలోనూ జరగలేదు. 2020లో అగాథంలో పడిపోయాక 2021లో 6 శాతం వృద్ధితో ఒడ్డుకు చేరుతుందని అంచనా. 2021 వృద్ధి అంచనాలో కూడా ఐఎంఎఫ్ (ఏప్రిల్ డబ్ల్యుఇఒతో పోలిస్తే) 1.4 శాతం కోత పెట్టింది.
2020-06-24ఢిల్లీ అల్లర్ల సందర్భంగా తుపాకితో కాల్పులు జరుపుతూ కెమేరాలకు చిక్కిన షారుఖ్ పఠాన్ బెయిలు దరఖాస్తును హైకోర్టు తోసిపుచ్చింది. బెయిలు దరఖాస్తును ఉపసంహరించుకునేందుకు మాత్రం ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ సురేష్ కుమార్ కేత్ అవకాశం ఇచ్చారు. ఆ దరఖాస్తులోని సామంజసత్వంపై ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేదు. నిందితుడికి నేర చరిత్ర లేదని, తన కాల్పుల కారణంగా ఎవరూ గాయపడినట్టు ఆధారం లేదని పఠాన్ తరఫు న్యాయవాది అస్ఘర్ ఖాన్ విన్నవించారు. అల్లర్ల కేసులో నిందితురాలైన విద్యార్ధిని సఫూరా జర్గర్ (గర్భిణి) నిన్న బెయిలు పొందిన విషయాన్ని గుర్తు చేశారు.
2020-06-24‘కరోనా’ రేఖ పెరుగుతుండగా మోడీ ప్రభుత్వం అభివృద్ధి రేఖను మట్టి కరిపించిందని గత కొంత కాలంగా విమర్శిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తాజాగా మరో వ్యంగ్యాస్త్రం వదిలారు. దేశంలో పెరుగుతున్నది ‘కరోనా’ రేఖ మాత్రమే కాదంటూ ఓ గ్రాఫును బుధవారం సామాజిక మాథ్యమాల్లో షేర్ చేశారు. వైరస్ కొత్త కేసుల పెరుగుదలతో పెట్రోల్, డీజిల్ ధరలను పోలుస్తున్న లైన్ చార్టు అది. అందులో మూడు రేఖలూ దాదాపు ఒకే విధంగా పైపైకి వెళ్ళడం విశేషం. మోడీ ప్రభుత్వం ‘కరోనా’ మహమ్మారికి, పెట్రోల్ - డీజిల్ ధరలకు కళ్ళెం వదిలేసిందని ఆ పోస్టులో రాహుల్ వ్యాఖ్యానించారు.
2020-06-24