చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఫ్రాన్స్ నుంచి తొలి ఐదు రాఫేల్ యుద్ధ విమానాలు ఈ నెల 27న దిగుమతి అవుతున్నాయి. ‘గోల్డెన్ యారోస్’ పేరిట రాఫేల్ యుద్ధ విమానాలతో హర్యానాలోని అంబాలా కేంద్రంగా 17వ స్క్వాడ్రన్ ఏర్పాటు కానుంది. ఫ్రాన్స్ లోని ఇస్ట్రెస్ నుంచి భారత పైలట్లు రాఫేల్ ఫైటర్లను నడపనున్నారు. మధ్యలో ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ ట్యాంకర్ ఎయిర్ క్రాఫ్ట్ గాల్లోనే ఇంధనం నింపుతుంది. ఇండియాకు వచ్చే ముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అల్ ధాఫ్రా వైమానిక స్థావరంలో మాత్రం రాఫేల్స్ ఆగనున్నాయి. 36 రాఫేల్ ఫైటర్లకు 7.8 బిలియన్ యూరోలు (ప్రస్తుత మారకం ప్రకారం రూ. 66,745 కోట్లు) చెల్లించేందుకు 2016లో ఇండియా ఒప్పందం కుదుర్చుకుంద
2020-07-21చైనాలో రూపొందిన ‘కోవిడ్-19’ టీకా విజయవంతంగా 2 దశల ప్రయోగాలను పూర్తి చేసుకుంది. ఎడి5గా వ్యవహరిస్తున్న ఈ టీకా సురక్షితమైనదని, రోగనిరోధకతను ప్రేరేపిస్తోందని ప్రయోగాల్లో తేలింది. ప్రముఖ మెడికల్ జర్నల్ ‘ద లాన్సెట్’ చైనా టీకాపై కూడా సోమవారం ఓ అధ్యయన పత్రాన్ని ప్రచురించింది. ‘కరోనా’ విస్ఫోటనం ప్రారంభమైన వుహాన్ నగరంలోనే మనుషులపై ప్రయోగాలు జరిగాయి. తొలి దశలో 108 మందిపైన ప్రయోగించగా మే నెలలో ఫలితాలు వెల్లడయ్యాయి. రెండో దశలో 508 మందికి ఇవ్వగా.. అందులో మూడింట రెండు వంతులు 18-44 వయసువారు. పావు వంతు 45-54 వయసువారు. 13 శాతం మంది 55 సంవత్సరాలకు పైన వయసున్నవారు.
2020-07-21‘కరోనా’ కష్టకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల గోళ్ళూడగొట్టి పన్నులు వసూలు చేస్తున్నాయి. పెట్రోలు, డీజిల్ ఉత్పత్తులపై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 10 రూపాయలకు పైగా పెంచిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ తాజాగా పన్నులు పెంచింది. ఇప్పటిదాకా లీటరు పెట్రోలుపై ‘31%+ రూ. 2.76’గా ఉన్న పన్ను తాజాగా ‘31%+ రూ. 4’కి పెరిగింది. లీటరు డీజిల్ పైన ‘22.25%+ రూ. 3.07’గా ఉన్న పన్ను ఇప్పుడు ‘22.25%+ రూ. 4’కి పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్ను రేట్లను సవరించడం గత మూడు నెలల్లో ఇది మూడోసారి.
2020-07-20ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ, ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా రూపొందించిన ‘కరోనా’ టీకా ‘ఎ.జడ్.డి.1222’ సురక్షితమైనదని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రాథమిక పరీక్షలలో తీవ్రమైన దుష్ప్రభావాలేమీ తలెత్తలేదని.. యాంటీబాడీల, టి-సెల్ రోగనిరోధక స్పందన బాగుందని తేల్చారు. 1,077 మందిపై చేసిన ప్రాథమిక పరీక్షల ఫలితాలు ప్రతిష్ఠాత్మక మెడికల్ జర్నల్ ‘ద లాన్సెట్’లో సోమవారం వెల్లడయ్యాయి. రోగనిరోధక వ్యవస్థ ‘వైరస్’ను గుర్తు పెట్టుకుంటుందని, దానివల్ల ఈ వ్యాక్సిన్ ఎక్కువ కాలం ప్రజలను కాపాడుతుందని ఆక్స్ఫర్డ్ వర్శిటీకి చెందిన ఆండ్రూ పొల్లార్డ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
2020-07-20హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ‘భారత్ బయోటెక్’.. పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సాయంతో రూపొందించిన ‘కరోనా’ టీకా ‘కోవాక్సీన్’ను మనుషులపై ప్రయోగించడం ప్రారంభమైంది. తొలి రెండు దశలలో ఆరోగ్యంగా ఉన్న 1,125 మంది వాలంటీర్లకు ఈ ‘క్రియారహిత వైరస్’ టీకాను ఇవ్వనున్నారు. తొలి దశలో 18-55 మధ్య వయసు ఉన్న 375 మందికి, రెండో దశలో 12-65 మధ్య వయసున్న 750 మందికి టీకా ఇస్తారు. ఆయా దశల ఫలితాలను విశ్లేషించాక మూడో దశలో పెద్ద సంఖ్యలో ప్రజలపై పరీక్షలు నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా పదులకొద్దీ టీకా నమూనాలు పరీక్షల దశకు చేరుకున్నాయి.
2020-07-20కరోనా వైరస్ నిరోధానికి దేశీయంగా రూపొందిన టీకా ‘కోవాక్సీన్’ను మనుషులపై ప్రయోగించడం ప్రారంభమైంది. మూడు దశల ప్రయోగాలలో తొలి దశ సోమవారం ప్రారంభమైనట్లు ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ రణదీప్ గులేరియా వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లోనే భారత్ బయోటెక్ ‘కోవాక్సీన్’ను రూపొందించింది. నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో కూడా సోమవారం ఇద్దరు వాలంటీర్లకు ఈ టీకాను ఇచ్చారు. మొదటి దశ సమాచార విశ్లేషణకోసం పరిశోధకులకు కనీసం 3 నెలల సమయం పడుతుందని గులేరియా చెప్పారు.
2020-07-20రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్.ఇ.సి) స్థానం నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ సోమవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. తన తొలగింపు ఉత్తర్వులను కొట్టివేస్తూ.. తిరిగి కమిషనర్ గా నియమించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని అమలు చేయాలని నిమ్మగడ్డ కోరారు. సుప్రీంకోర్టు స్టే ఇవ్వనందున తన తీర్పు అమల్లో ఉన్నట్లేనని హైకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. గవర్నరును కలవాలని హైకోర్టే నిమ్మగడ్డకు సూచించింది. ‘కరోనా’ కారణంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేసినందుకు నిమ్మగడ్డపై సిఎం జగన్ కన్నెర్ర చేసిన సంగతి తెలిసిందే.
2020-07-20ఇండియాలో ‘కరోనా’ వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరుతోంది. ఆదివారం రికార్డు స్థాయిలో 40 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 681 మంది మరణించారు. 24 గంటల వ్యవధిలో 40 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. వీటితో కలిపి దేశంలో మొత్తం ‘కరోనా’ బాధితుల సంఖ్య అధికారికంగా 11,18,043కి పెరిగింది. నిన్నటిదాకా 27,497 మంది వైరస్ కారణంగా మరణించారు. మరిన్ని పరీక్షలు నిర్వహిస్తే కేసుల సంఖ్య మరింత భారీగా ఉంటుందనడంలో సందేహం లేదు.
2020-07-20‘కరోనా’ బారిన పడిన తొలి దేశం చైనాలో క్రమంగా అన్నీ కుదుటపడుతున్నాయి. తాజాగా సోమవారం సినిమా థియేటర్లు తెరుచుకున్నాయి. హై రిస్క్ ప్రాంతాలను మినహాయించి మిగిలినచోట్ల థియేటర్లను తెరిచారు. సీటింగ్ సామర్ధ్యాన్ని 30 శాతానికి కుదించారు. 198 థియేటర్ల నుంచి అందిన సమాచారం ప్రకారం.. 50 వేల మంది వీక్షకుల ద్వారా 15.5 లక్షల యువాన్ల ప్రీ సేల్స్ ఆదాయం వచ్చినట్లు ‘మావోయాన్’ సంస్థ తెలిపింది. మళ్లీ థియేటర్లకు వచ్చిన సంతోషంతో ముఖాలకు మాస్కులు ధరించిన వీక్షకులు సెల్ఫీలు తీసుకొని సందడి చేశారు. చైనా సామాజిక మాథ్యమాల్లో ఈ కబుర్లు, హ్యాష్ ట్యాగులు ట్రెండింగ్ అయ్యాయి.
2020-07-20భార్యకు ట్రిపుల్ తలాఖ్ చెప్పిన అబ్దుల్ షమీ అనే హైదరాబాదీని పోలీసులు అరెస్టు చేశారు. 36 ఏళ్ళ ఈ ల్యాబ్ టెక్నీషియన్ 24 సంవత్సరాల భార్యను కట్నం కోసం వేధించినట్లు పోలీసులు తెలిపారు. 2017లో వివాహం అనంతరం వీరికి 2018లో ఓ బాబు పుట్టాడు. ప్రసవం తర్వాత తాను పుట్టింట్లో ఉన్న సమయంలో భర్త తన బంగారు నగలను అమ్మేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దేశమంతా ‘లాక్ డౌన్’ మొదలైన మార్చి 25నే షమీ తన భార్యకు ‘తలాఖ్’ ఇచ్చేసి ఇంటినుంచి పంపించాడు. జూన్ 26న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా గురువారం అరెస్టు చేశారు. ఈ ఉదంతం ఆదివారం వెలుగులోకి వచ్చింది.
2020-07-20