నాణ్యమైన బియ్యం ఇంటివద్దకే పంపిణీ చేసే కార్యక్రమాన్ని వచ్చే సెప్టెంబరు 1న రాష్ట్రమంతా ప్రారంభించాలని సిఎం జగన్ అధికారులను ఆదేశించారు. బియ్యం పంపిణీ చేసే సంచీ, అందుకు ఉపయోగించే వాహనం నమూనాలను పై చిత్రంలో చూడొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి 13,370 వాహనాలను అందుబాటులో ఉంచనున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ చెప్పారు. ప్రతి గోనె సంచీ పైన బార్ కోడ్, గోదాముల నుంచి వచ్చేటప్పుడు స్ట్రిప్ సీల్ ఉంటాయని ఆయన తెలిపారు. కోర్టులు వద్దు వద్దంటున్నా వీటికీ వైసీపీ రంగులు పడ్డాయి.
2020-05-08అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించిన తొలి దశ పనులు పున:ప్రారంభమయ్యాయి. మందిరం శంకుస్థాపన కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ‘కరోనా లాక్ డౌన్’ నుంచి రామమందిరం పనులకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మినహాయింపు ఇవ్వడంతో.. స్థలంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తున్నారు. మెటల్ బారికేడ్లను, సి.ఆర్.పి.ఎఫ్. క్యాంపును తొలగించారు. స్థలాన్ని చదును చేయడం ప్రారంభమైంది. స్థానిక పిడబ్ల్యుడి అధికారుల బృందం ఎల్&టి ఇంజనీర్లతో కలసి పని చేస్తోంది. కంపెనీ ‘నో ప్రాఫిట్, నో లాస్’ ప్రాతిపదికన మందిర నిర్మాణంలో భాగమవుతున్నట్టు చెబుతున్నారు.
2020-05-08విశాఖపట్నం ఎల్.జి. పాలిమర్స్ నుంచి ‘స్టైరిన్’ లీకైన ఘటనలో అస్వస్థతకు గురైన 554 మందికి ప్రస్తుతం చికిత్స జరుగుతోందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) చెప్పారు. 128 మంది చికిత్స పూర్తై శుక్రవారం డిశ్చార్జి అయ్యారని పేర్కొన్నారు. నిన్న ముఖ్యమంత్రి పరామర్శించే సమయానికి 375 మంది బాధితులు ఆసుపత్రుల్లో ఉన్నట్టు నాని చెప్పారు. ఇంకా చికిత్స పొందుతున్నవారిలో కెజిహెచ్ లో 305 మంది, ప్రైవేటు ఆసుపత్రులలో 121 మంది ఉన్నారని తెలిపారు. కె.జి.హెచ్.లో చికిత్స పొందుతున్నవారిలో 52 మంది చిన్న పిల్లలు ఉన్నట్టు నాని వెల్లలడించారు.
2020-05-08అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ బారిన పడి మరణించినవారి సంఖ్య 75 వేలు దాటింది. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 12,56,972కు పెరిగింది. అందులో 75,670 మంది మరణించారు. న్యూయార్క్ రాష్ట్రంలోనే 26,144 మంది మరణించారు. యు.కె.లో మృతుల సంఖ్య 30 వేలు దాటింది. అక్కడ ‘కరోనా’ కేసుల సంఖ్య 2,07,977కు పెరిగితే.. 30,689 మంది చనిపోయారు. ఈ రెండు దేశాల్లోనే మరణాలు 1.06 లక్షలు. ఇటలీలో 29,958 మంది, స్పెయిన్లో 26,070 మంది, ఫ్రాన్స్ లో 25,990 మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 38,46,949 మందికి కరోనా సోకితే 2,69,584 మంది మరణించారు. అందులో ఈ 5 దేశాల వాటా 70 శాతం.
2020-05-08‘లాక్ డౌన్’లో నేరపూరిత నిర్లక్ష్యానికి గురైన వలస కార్మికులు అనేకమంది ఇళ్ళకు తిరిగి వెళ్ళే క్రమంలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ నగరంలో వలస కార్మికులను ఓ గూడ్సు రైలు ఛిద్రం చేసింది. కార్మికులు పట్టాలపై నిద్రిస్తుండగా శుక్రవారం వేకువజామున ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో 16 మంది చనిపోయారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ వలస కార్మికులు 850 కిలోమీటర్ల దూరంలోని తమ సొంత ప్రాంతాలకు కాలినడకన బయలుదేరారు. మహారాష్ట్రలోని జనా నుంచి భుసవాల్ వెళ్ళే క్రమంలోనే ప్రాణాలు కోల్పోయారు.
2020-05-08భోపాల్ విషాదం అత్యంత ఘోరమైనది. లక్షల మంది ‘మిసైల్ ఐసోసైనేట్’ గ్యాస్ పీల్చారు. ప్రమాదం జరిగినరోజు 2,259 మంది చనిపోతే మరికొన్ని వేలమంది తర్వాత కొద్ది వారాల్లో మరణించారు. ఆ తర్వాత పెద్ద గ్యాస్ లీకేజి ప్రమాదం విశాఖ ‘ఎల్.జి. పాలిమర్స్’దే. సుమారు 15 వేల మంది ప్రజలు ‘స్టైరిన్’ గ్యాస్ ప్రభావానికి లోనయ్యారు. గ్యాస్ వాసనతోనే మేలుకొని చాలామంది దూరంగా పారిపోగా 1000 మంది ఆసుపత్రుల పాలయ్యారు. ప్రమాద స్థలం నుంచి 5 మైళ్ళ దూరం 5 గ్రామాలకు గ్యాస్ వ్యాపించింది. తక్షణం 10 మంది మరణించారు. గ్యాస్ ఎక్కువగా పీల్చిన 350 మంది తీవ్రంగా జబ్బుపడ్డారు. గ్యాస్ పీల్చిన పశువులు, పక్షులు చాలా చనిపోయాయి.
2020-05-071984 భోపాల్ ప్రమాదంలో లీకైన ‘మిథైల్ ఐసోసైనేట్(ఎంఐసి)’తో పోలిస్తే విశాఖపట్నంలో లీకైన ‘స్టైరిన్’ తక్కువ విషపూరితం. అయితే, ఇది కొన్ని విషయాల్లో దానికంటే తీవ్రమైనదని నిపుణులు చెబుతున్నారు. భోపాల్ గ్యాస్ తీవ్రమైన ప్రభావంతో మనిషులను చంపేస్తే.. ‘స్టైరిన్’ మనిషిలోని అనేక అవయవాలను చంపేస్తుంది. అంధత్వం నుంచి వ్యంధ్యత్వం వరకు మనిషికి చావుకంటే భయంకరమైన అనుభవాన్ని మిగిలుస్తుందని వైద్య నిపుణుల మాటలను బట్టి తెలుస్తోంది. ‘స్టైరిన్’ కేన్సర్ కారకం కూడా! ఊపిరితిత్తులతో మొదలై కిడ్నీల వరకు ప్రభావం చూపుతుంది.
2020-05-07విశాఖలో విషవాయువు లీకేజీతో 11 మంది మృతికి, వందల మంది అస్వస్థతకు కారణమైన ‘ఎల్.జి. పాలిమర్స్’ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘ప్రతిష్ఠాత్మక బహుళజాతి కంపెనీ’గా ప్రశంసించారు. బాధితులను పరామర్శించడానికి విశాఖ వెళ్ళిన జగన్, విలేకరుల సమావేశంలో ఒకటికి రెండు సార్లు ‘ఎల్.జి. ప్రతిష్ఠాత్మక’ కంపెనీ అని కొనియాడారు. అలాంటి కంపెనీలో ప్రమాదం జరగడం ‘బాధాకరం’ అని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందే ‘ఎల్.జి. పాలిమర్స్’ కంపెనీ యాజమాన్య ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలసి ప్రమాదం జరిగిన తీరును వివరించారు.
2020-05-07విశాఖ ఎల్.జి. పాలిమర్స్ ‘స్టైరిన్’ లీకేజీ ఘటనపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు సిఎం జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ కార్యదర్శి, విశాఖ జిల్లా కలెక్టర్, విశాఖపట్నం పోలీసు కమిషనర్ ఈ కమిటీలో ఉన్నారు. ప్రమాదం జరిగినప్పుడు అలారం మోగాలి కదా? అనే ప్రశ్న తన మదిని తొలిచిందని, ఏం జరిగిందనేది విచారణలో తెలుస్తుందని జగన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలో ఈ కమిటీ సూచిస్తుందని, ఆ నివేదిక ఆధారంగా ఎల్.జి. విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
2020-05-07విశాఖ ఎల్.జి. పాలిమర్స్ విషవాయు ప్రభావంతో మరణించినవారి కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కంపెనీ నుంచి ఎంత రాబట్టగలమో చూస్తామని, వాళ్ళు ఎంత ఇచ్చినా ప్రభుత్వం నుంచి మాత్రం రూ. కోటి చొప్పున పరిహారం ఇస్తామని ఆయన చెప్పారు. వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నవారికి రూ. 10 లక్షలు ప్రకటించారు. గురువారం వేకువజామున ‘స్టైరిన్’ ద్రావకం లీకై ఆవిరి చుట్టుప్రక్కలకు వ్యాపించడంతో 11 మంది మరణించారు. గాయపడి చికిత్స పొందుతున్నవారిని సిఎం విశాఖ కె.జి.హెచ్.లో పరామర్శించారు.
2020-05-07