గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని ఓ వారం పాటు ‘స్వీయ నిర్బంధం’లో ఉండాలని నిర్ణయించుకున్నారు. నిన్న (ఏప్రిల్ 14న) తనను కలసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడావాలాకు ‘కరోనా’ నిర్ధారణ కావడంతో సిఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వారం రోజులూ సిఎం ఎవరినీ కలవకుండా.. వీడియో కాన్ఫరెన్సులు, వీడియో కాలింగ్ ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపిస్తారని సిఎంఒ కార్యదర్శి అశ్వనికుమార్ బుధవారం చెప్పారు. సిఎం ఆరోగ్యం సాధారణంగానే ఉందని స్పష్టం చేశారు.
2020-04-15‘కరోనా’ వ్యాప్తి కారణంగా ఐపిఎల్ 2020 సీజన్ క్రీడోత్సవాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. బుధవారం నుంచి జరగవలసిన టోర్నీని వాయిదా వేస్తున్నట్టు బిసిసిఐ ప్రముఖుడొకరు చెప్పారు. తొలి షెడ్యూలు ప్రకారం ఐపిఎల్ మార్చి 29న ప్రారంభం కావలసి ఉండగా.. ‘లాక్ డౌన్’ కారణంగా ఏప్రిల్ 15కు వాయిదా వేశారు. 21 రోజుల ‘లాక్ డౌన్’ను మరో 19 రోజులు (మే 3 వరకు) పొడిగించిన నేపథ్యంలో ఐపిఎల్ నిర్వహణ అసాధ్యమైంది. సెప్టెంబరు-అక్టోబరు కాలంలో ఐపిఎల్ నిర్వహణపై బిసిసిఐ పరిశీలన చేయవచ్చని చెబుతున్నారు.
2020-04-15రాష్ట్రంలోని పాఠశాలల్లో మాతృ భాషా మాధ్యమాన్ని రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి సర్కారుకు హైకోర్టు గట్టి పాఠం చెప్పింది. అన్ని ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం మాత్రమే ఉండాలంటూ.. గత నవంబరులో విద్యా శాఖ జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 81, 85 లను హైకోర్టు బుధవారం రద్దు చేసింది. ఏ మాధ్యమంలో చదవాలన్నది పిల్లలు, వారి తల్లిదండ్రుల ఇష్టమని కోర్టు స్పష్టం చేసింది. తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేయవద్దని ఎంతమంది సూచించినా ప్రభుత్వం వినలేదు. పైగా.. పేదల పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదవడానికి వారంతా వ్యతిరేకులని ఎదురుదాడి చేసింది.
2020-04-15ఆంధ్రాలో ప్రభుత్వ పథకాలకు సొంత పేర్లు, భవనాలకు పార్టీల రంగులు సర్వసాధారణం. అమెరికాలో కూడానా?! ‘కరోనా’ పరిహారం చెక్కులపై ట్రంప్ పేరు ముద్రించాలని అధికార యంత్రాంగానికి మంగళవారం ఆదేశాలు అందాయి. ఈ కారణంతోనే.. లక్షల మంది ప్రజలకు చెక్కుల పంపిణీ ఆలస్యం కానుంది. అమెరికాలో ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) పంపిణీ కార్యక్రమంలో అధ్యక్షుడి పేరు పెట్టడం ఇదే మొదటిసారి కానుంది. చెక్కులపై సాధారణంగా అధికారులే సంతకాలు పెడుతుంటారు. ఈసారి తానే సంతకం చేయాలని ట్రంప్ ఉత్సాహపడ్డారు.
2020-04-15‘లాక్ డౌన్’ సమయంలో రంజాన్ ఇఫ్తార్ విందులకూ మినహాయింపు ఉండదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ మత కార్యక్రమాలూ జరగకుండా ‘లాక్ డౌన్’ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని ఆయన చెప్పారు. రంజాన్ మాసం ఈ నెల 23న ప్రారంభం కానుండగా.. ‘లాక్ డౌన్’ను మే 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. దేశంలో ఏ మత కార్యక్రమాలు, పాఠశాలలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలూ నిర్వహించకూడదని కిషన్ రెడ్డి బుధవారం ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ‘లాక్ డౌన్’ మినహా ‘కరోనా’ కట్టడికి మరో మార్గం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
2020-04-15హిందూ పేషెంట్లకు ఒక వార్డు.. ముస్లిం పేషెంట్లకు మరో వార్డు.. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో జరిగిన ఏర్పాటు ఇది. పైగా.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకే వేర్వేరు వార్డులు ఏర్పాటు చేశామని చెప్పారు ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గణ్వంత్ హెచ్. రాథోడ్. కరోనా వైరస్ పేషెంట్లు, అనుమానిత కేసుల కోసం 1200 బెడ్లను ఈ ఆసుపత్రిలో సిద్ధం చేశారు. మత విశ్వాసాల ఆధారంగా పేషెంట్లను వేర్వేరుగా ఉంచడం ఇక్కడి ఉన్మాద స్థితిని సూచిస్తోంది. అయితే... ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా అయిన నితిన్ పటేల్ ఈ విషయం తనకు తెలియదని చెబుతున్నారు.
2020-04-15‘కరోనా’పై పోరాటంలో ముందున్న డాక్టర్లు, నర్సులు పెద్ద సంఖ్యలో ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ముంబైలోని భాటియా ఆసుపత్రిలో మంగళవారం మరో 10 మంది వైద్య సిబ్బందికి ‘కరోనా’ పాజిటివ్ తేలింది. వీరితో కలిపి ఆ ఆసుపత్రిలో బాధితుల సంఖ్య 35కు పెరిగింది. నగరంలోని వోక్హార్ట్ హాస్పిటల్ లో ఇంతకు ముందే 52 మంది వైద్య సిబ్బందికి ‘కరోనా’ సోకింది. ముంబై నగరంలోని వివిధ ఆసుపత్రులలో మొత్తం 137 మంది వైద్య సిబ్బంది ఇప్పటిదాకా ‘కరోనా’ బారిన పడ్డారు. నగరంలోని ‘కరోనా’ పాజిటివ్ కేసుల్లో 8 శాతం వైద్య సిబ్బందే ఉండటం గమనార్హం.
2020-04-15‘కరోనా’ మహమ్మారి బారిన పడిన నగరాల్లో ముంబై మొదటి స్థానంలో ఉంది. మంగళవారానికి ముంబై మెట్రోపాలిటన్ ఏరియాలో 127 మంది వైరస్ ధాటికి మరణించారు. దేశం మొత్తం మరణాల్లో ఇది 33.24 శాతం. మంగళవారం నాటికి దేశం మొత్తంగా 382 మంది చనిపోగా.. అందులో 67.26 శాతం మరణాలు 6 నగరాల్లో సంభవించాయి. ముంబై మెట్రోపాలిటన్ ఏరియాలో 127, పూణెలో 38, ఇండోర్ నగరంలో 37, ఢిల్లీలో 30, అహ్మదాబాద్ లో 13, హైదరాబాద్ నగరంలో 12 మంది మరణించారు.
2020-04-15ఇండియాలో ‘కరోనా’ వైరస్ సోకినవారిని పరీక్షించడంలో ఆలస్యం నివారించదగ్గ మరణాలకు కారణమవుతోంది. ‘కరోనా’ హాట్ స్పాట్ గా ఉన్న ముంబై నగరంలో తొలి 50 మృతుల వివరాలను పరిశీలించి నిపుణులు తేల్చిన విషయం ఇది. ముంబై తొలి 50 మృతుల్లో 26 మంది ఆసుపత్రిలో చేరిన కొద్ది గంటలు లేదా ఒక రోజు లోపే మరణించారు. 11 మంది పరీక్షల ఫలితాలు వారు చనిపోయాకే వచ్చాయి. మరో 14 మంది చనిపోవడానికి కొద్ది గంటల ముందే రోగ నిర్ధారణ జరిగింది. ఆసుపత్రిలో చేరాక ఐదు రోజులు లేదా అంతకంటే ఎక్కువ బతికి ఉన్నది కేవలం 9 మంది (20 శాతం లోపే).
2020-04-15 Read More‘కరోనా’ మహమ్మారి అమెరికాను అతలాకుతలం చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఆ దేశంలో 6,05,193 మందికి వైరస్ సోకగా.. మృతుల సంఖ్య 25,981కి పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ‘కరోనా’తో 1,26,539 మంది మరణించారు. వారిలో అమెరికన్లు 20.53 శాతం. ప్రపంచవ్యాప్తంగా 19,79,477 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో అమెరికా వాటా ఏకంగా 30.73 శాతం. ఒక్క న్యూాయార్క్ నగరంలోనే 7,905 మంది ‘కరోనా’తో మరణించారు. లెక్కల్లోకి రాని మరణాలు అనేకం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దిక్కుతోచని పరిస్థితుల్లో బాధ్యత వహించడానికి ఇష్టపడని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ ఆరోగ్య సంస్థపై ఆరోపణలు చేస్తున్నారు.
2020-04-15