మోదీ ప్రభుత్వాన్ని మరో వివాదం చుట్టుముట్టింది. ఇజ్రాయెలీ కంపెనీ ఎన్.ఎస్.ఒ. నిఘా సాఫ్ట్ వేర్ ‘పెగాసస్’ను ఉపయోగించి 2018-2019 మధ్య భారీ స్థాయిలో గూఢచర్యానికి పాల్పడ్డట్టు వార్తలు వచ్చాయి. ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులతో పాటు తన సొంత మంత్రులు, సంఘపరివారంలోని సహచరులను కూడా వదల్లేదు. ఫోన్లలో స్పైవేర్ ను చొప్పించి సమాచారాన్ని, సంభాషణలను సేకరించారు. రాహుల్ గాంధీ, కొత్త ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్, మరో మంత్రి ప్రహ్లాద్ పటేల్, సన్నిహిత మంత్రి స్మృతి ఇరానీ, వి.హెచ్.పి. నేత ప్రవీణ్ తొగాడియా, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బాధిత జాబితాలో ఉన్నారు.
2021-07-19తనతో సెల్ఫీ దిగాలనుకునేవారు రూ. 100 చెల్లించాలని మధ్యప్రదేశ్ మంత్రి ఉషా ఠాకూర్ షరతు విధించారు. ఆ మొత్తం పార్టీ (బిజెపి) స్థానిక విభాగంలో డిపాజిట్ చేయాలని సూచించారు. ‘‘మిత్రులారా, మీకు తెలుసు.. సెల్ఫీలు దిగడం వల్ల చాలా కాలహరణం జరుగుతోంది. కొన్ని గంటలు ఆలస్యమవుతోంది.. సెల్ఫీలు దిగాలనుకునే ఎవరైనా స్థానిక పార్టీ విభాగం ట్రెజరర్ వద్ద 100 రూపాయలు డిపాజిట్ చేయాలి. ఆ మొత్తాన్ని పార్టీకోసం వినియోగిస్తాం’’ అని ఠాకూర్ చెప్పారు.
2021-07-18‘‘ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్.. జాగ్రత్తగా ఉండండి’’ అంటూ బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా నియంత్రణలను సోమవారం ఎత్తివేస్తున్న నేపథ్యంలో.. ఐసోలేషన్ నుంచే ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మంత్రివర్గ సహచరుడు సాజిద్ జావిద్ కు కరోనా సోకడంతో ప్రధాని బోరిస్, ఆర్థిక మంత్రి రిషి సునక్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. జాగ్రత్తలు పాటించాలని, అవసరమైనప్పడు ఐసోలేషన్ లోకి వెళ్లాలని, చెప్పినప్పుడు టీకా వేయించుకోవాలని ప్రధాని ప్రజలకు విన్నవించారు.
2021-07-18టోక్యో ఒలింపిక్స్లో ఆదివారం తొలి కోవిడ్ కేసు నమోదైంది. దక్షిణాఫ్రికా ఫుట్ బాల్ ఆటగాళ్ళు థాబిసో మొన్యానే, కమొహెలో మహ్లాత్సిలతో పాటు ఒక వీడియో అనలిస్టుకు కరోనా సోకినట్టు పరీక్షలలో నిర్థారణ అయింది. దీంతో టీమ్ మొత్తాన్ని క్వారంటైన్లో ఉంచారు. సాకర్ విభాగంలో దక్షిణాఫ్రికా జట్టు తొలిగా వచ్చే గురువారం ఆతిథ్య దేశం జపాన్ తోనే తలపడాల్సి ఉంది. దక్షిణ కొరియాకు చెందిన ఒలింపిక్స్ కమిటీ సభ్యుడొకరికి కూడా కరోనా సోకినట్టు కమిటీ నిర్థారించింది.
2021-07-18గాంధీనగర్ రైల్వే స్టేషన్ పైన నిర్మించిన ఐదు నక్షత్రాల హోటల్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ తరహా హోటల్ నిర్మాణం ఇండియాలో మొదటిగా మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లోనే చేపట్టారు. ఈ విలాసవంతమైన హోటల్ ను రైల్వే శాఖ, గాంధీనగర్ రైల్వే- అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జి.ఎ.ఆర్.యు.డి) సంయుక్తంగా చేపట్టాయి. దీంతోపాటు ప్రధాని అహ్మదాబాద్ సైన్స్ సిటీనీ, కొత్త రైళ్ళను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
2021-07-16కరోనా మూడో వేవ్ ఆగస్టు చివరినాటికి ప్రారంభమై.. దేశం రోజుకు లక్ష కేసులను చూసే అవకాశం ఉందని ఐసిఎంఆర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సమీరన్ పాండా చెప్పారు. శుక్రవారం ఆయన ఇండియా టుడే ప్రతినిధితో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో, వైరస్ మరింతగా వ్యాప్తి చెందేలా మారకపోతే, మొదటి వేవ్ తరహా పరిస్థితి రావచ్చని పేర్కొన్నారు. వైరస్ మరింతగా మార్పు చెందితే మాత్రం, పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు. ప్రొ: పాండా ఐసిఎంఆర్ ఎపిడెమియాలజీ, అంటు వ్యాధుల విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు.
2021-07-16చైనా జాతీయులు, ప్రాజెక్టులపై ఉగ్రవాద దాడులకు పాల్పడినవారు ఎవరైనా, తమంతట తాము చైనా శత్రువుల శిబిరంలోకి చేరినట్టేనని ఆ దేశ ప్రభుత్వ అనుబంధ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ హెచ్చరించింది. అలాంటివారి నిర్మూలనకోసం పాకిస్తాన్ చేసే ప్రయత్నాలకు చైనా ధృఢంగా మద్ధతు ఇస్తుందని శుక్రవారం తన సంపాదకీయంలో పేర్కొంది. ఉత్తర పాకిస్తాన్లో ఉగ్రవాద దాడిలో 9 మంది చైనీయులు సహా 12 మంది మరణించిన నేపథ్యంలో ఈ సంపాదకీయం వెలువడింది.
2021-07-16ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్... అదీ ట్వంటీ20 అంటే నరాలు తెగే ఉత్కంఠ. 2021 టి20 ప్రపంచ కప్ కోసం ఈ రెండు దేశాలూ ఒకే గ్రూపులో పోటీపడనున్నాయి. గ్రూపు 2లో ఇండియా, పాకిస్తాన్ తో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్ న్యూజీలాండ్, ఆఫ్ఘనిస్తాన్ ఎంపికయ్యాయి. గ్రూపు 1లో ప్రస్తుత ఛాంపియన్ వెస్ట్ ఇండీస్, గత విజేతలు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఉన్నాయి. టి20 ప్రపంచ కప్ పోటీలు ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు యుఎఇ, ఒమన్ దేశాల్లో జరగనున్నాయి.
2021-07-16తమ ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం... గత నెలలో పాకిస్తాన్ నుంచి 10,000 మంది ‘జిహాదీ’ ఫైటర్లు ఆప్ఘనిస్తాన్ లోకి ప్రవేశించారని ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని ఆరోపించారు. శుక్రవారం తాష్కెంట్ లో జరిగిన మధ్య ఆసియా, దక్షిణాసియా అనుసంధాన సదస్సులో ఆయన పాల్గొన్నారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు కొద్ది అడుగుల దూరంలో కూర్చొని ఆ దేశంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఘని. కొద్ది నిమిషాల తర్వాత స్పందించిన ఇమ్రాన్ ఖాన్, ఆఫ్ఘనిస్తాన్ ఘర్షణల్లో ‘ప్రతికూల పాత్ర’ పోషిస్తున్నామన్న ఆరోపణలు బాధించాయన్నారు.
2021-07-16భారతీయ ఫొటో జర్నలిస్టు, పులిట్జర్ బహుమతి గ్రహీత డానిష్ సిద్ధిఖి ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల దాడిలో మరణించారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ భద్రతా దళాల వాహన శ్రేణిలో వెళ్తుండగా పాకిస్తాన్ సరిహద్దు పోస్టు వద్ద తాలిబన్లు దారికాచి దాడి చేసినట్టు సమాచారం. సిద్ధిఖి రాయిటర్స్ వార్తా సంస్థకు ఇండియాలో చీఫ్ ఫొటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా ఆయన ఆప్ఘనిస్తాన్ వెళ్లారు. ఇటీవల కోవిడ్ సెకండ్ వేవ్ సందర్భంగా ఇండియాలో సామూహిక శవదహనాలపై ఆయన తీసిన ఫొటోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.
2021-07-16