‘కరోనా వైరస్’తో కేంద్ర ప్రభుత్వం 21 రోజుల ‘లాక్ డౌన్’ ప్రకటించిన నేపథ్యంలో... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6 నుంచి 9 తరగతుల వరకు విద్యార్ధుల పరీక్షలను రద్దు చేసింది. ఎస్ఎ2 పరీక్షలతో నిమిత్తం లేకుండా అందరూ ఉత్తీర్ణులైనట్టుగా ప్రకటించింది. ఈమేరకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాధికారులకు ఒక మెమో పంపించారు. ఇప్పటికే కొన్ని తరగతులకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొమ్మిదో తరగతికి సగం పూర్తయ్యాయి. ప్రభుత్వ నిర్ణయంతో మిగిలిన పరీక్షలు రాయకుండానే విద్యార్ధులు పాసయ్యారు.
2020-03-26‘దిగ్బంధం’ లేదా ‘నిర్బంధం’లో సరైన ప్రణాళిక, సమన్వయం లేకపోతే ఎలా ఉంటుందో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వద్ద ఇబ్బందులు పడిన వేల మంది ఆంధ్రులను చూస్తే అర్ధమవుతుంది. ‘కరోనా’ భయానికి హైదరాబాద్ లోని హాస్టళ్లను మూసివేయడం వేలాది మందికి పెద్ద కష్టాన్ని తెచ్చి పెట్టింది. తెలంగాణ నుంచి సొంత ప్రాంతాలకు వెళ్లడానికి హైదరాబాద్ పోలీసులు 8 వేల మందికి నిరభ్యంతర పత్రాలు ఇవ్వగా, ఏపీ పోలీసులు సరిహద్దుల్లో నిలిపివేశారు. దీంతో కృష్ణా, కర్నూలు జిల్లాల్లోని సరిహద్దుల వద్ద బుధ, గురువారాల్లో ఉద్రిక్తత నెలకొంది. అసలే ‘కరోనా’ భయం.. ఆపైన చిన్న పిల్లలతో నడిరోడ్డుపై నిలిచిపోవడం.. ఎంత కష్టం?
2020-03-26హైదరాబాద్ దోమల్ గూడ లోని ఇద్దరు డాక్టర్లకు (భార్యాభర్తలు) ‘కరోనా వైరస్’ సోకింది. 41 ఏళ్ల వైద్యుడికి తొలుత వైరస్ సోకగా, ఆయన నుంచి భార్య (36)కూ వ్యాపించింది. వీరితో పాటు తెలంగాణలో మరో వ్యక్తికి కూడా గురువారం ‘కరోనా’ పాజిటివ్ తేలింది. కుత్బుల్లాపూర్ లో 49 సంవత్సరాల ఓ వ్యక్తి ఇటీవల ఢిల్లీ నుంచి వచ్చారు. వైరస్ సోకిన వ్యక్తితో సహచర్యం వల్లనే ఈయనకు వ్యాపించినట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. తాజాగా పాజిటివ్ నిర్ధారణ అయిన ఈ ముగ్గురినీ ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స చేస్తున్నారు. వీరితో కలిపి తెలంగాణలో ‘కరోనా’ కేసుల సంఖ్య 44కు చేరింది.
2020-03-26‘కరోనా’పై పోరాటానికి గాను ప్రధానమంత్రి సహాయ నిధికి రూ. కోటి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ. 50 లక్షల చొప్పున విరాళమిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయన ప్రకటనకు స్పందించిన ప్రముఖ నటుడు రాంచరణ్ కేంద్రానికి, ఇరు రాష్ట్రాలకు కలిపి రూ. 70 లక్షలు ప్రకటించారు. ప్రధాని మోడీ నాయకత్వం ‘కరోనా మహమ్మారి’ నుంచి బయటపడేస్తుందని పవన్ ఆశాభావం వ్యక్తం చేయగా... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలను అందరూ పాటించాలని రాంచరణ్ సూచించారు.
2020-03-26‘కరోనా’పై యుద్ధంలో భాగమైన వైద్య సిబ్బందికి రూ. 50 లక్షల మేరకు బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఆశ వర్కర్లు, పారిశుధ్య సిబ్బందికి (మొత్తం 20 లక్షల మందికి) బీమా వర్తిస్తుందని తెలిపారు. ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన’ పేరిట మంత్రి ప్రకటించిన ప్యాకేజీలోలో ఆహార భద్రత, నగదు బదిలీ అనే రెండు భాగాలున్నాయి. రూ. 15,000 వేతనం ఉన్నవారి పి.ఎఫ్. కంట్రిబ్యూషన్ ను3 నెలలపాటు ప్రభుత్వమే చెల్లిస్తుంది. పిఎం కిసాన్ పథకం కింద మొదటి కిస్తీ (రూ. 2000)ని ఏప్రిల్ నెలలో విడుదల చేస్తారు. ఉపాధి హామీ కూలిని రూ. 182 నుంచి 202కు పెంచారు.
2020-03-26‘కరోనా’ ప్రభావాన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 1.7 లక్షల కోట్ల అంచనాతో ఓ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. 80 కోట్ల మందికి నెలకు 5 కేజీల చొప్పున బియ్యం లేదా గోధుమలు, ఒక కేజీ అపరాలు మూడు నెలల పాటు ఉచితంగా ఇవ్వనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఉదయం ప్రకటించారు. 20 కోట్ల మంది మహిళల జన్ ధన్ బ్యాంకు అకౌంట్లలో నెలకు రూ. 500 జమ చేయనున్నట్టు ఆమె తెలిపారు. దారిద్య్ర రేఖకు దిగున ఉన్న 8.3 కోట్ల మందికి వచ్చే మూడు నెలలూ గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, పేద సీనియర్ సిటిజన్లు, వితంతువులు, వికలాంగులకు రూ. 1000 పరిహారం వంటివి ఈ ప్యాకేజీలో ఉన్నాయి.
2020-03-26‘కరోనా’ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ తిరోగమనాన్ని నిలువరించేందుకు రూ. లక్షన్నర కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఒక ఉద్ధీపన ప్యాకేజీని సిద్ధం చేయనున్నట్టు తాజా వార్త. ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వు బ్యాంకు మధ్య చర్చలు జరుగుతున్నట్టు ‘రాయిటర్స్’ కథనం. ఈ ప్యాకేజీ రూ. 2.3 లక్షల కోట్ల వరకు కూడా ఉండొచ్చని ఓ ప్రభుత్వ అధికారి చెప్పినట్టు ‘రాయిటర్స్’ రాసింది. ప్యాకేజీలో భాగంగా 10 కోట్ల మంది పేదల అకౌంట్లలోకి నేరుగా డబ్బు జమ చేయవచ్చని, దెబ్బ తిన్న వ్యాపారాలను ఆదుకోవడానికి చర్యలు ఉంటాయని చెబుతున్నారు. ఈ వారాంతంలోగా ప్యాకేజీని ప్రకటిస్తారని సమాచాారం.
2020-03-25బ్రిటిష్ రాచరికానికి వారసుడు ప్రిన్స్ చార్లెస్ (71)కు కరోనా వైరస్ నిర్ధారణ అయింది. రాణి ఎలిజబెత్ పెద్ద కొడుకు చార్లెస్. ‘కరోనా’ లక్షణాలు స్వల్పంగా కనిపిస్తున్నాయని, అయినా చార్లెస్ ఆరోగ్యంగానే ఉన్నారని క్లారెన్స్ హౌస్ ప్రకటించింది. గత కొద్ది రోజులుగా చార్లెస్ ఇంటినుంచే పని చేస్తున్నారు. చార్లెస్, ఆయన భార్య కామిలా స్కాట్లాండ్ లోని తమ ఇంట్లో ఇతరులతో కలవకుండా ఉంటున్నారు. చార్లెస్ కు వైరస్ ఎవరినుంచి సంక్రమించిందో తెలుసుకోవడం కష్టమని చెబుతున్నారు అధికారులు. ఇటీవల ఆయన చాలామందిని కలిశారని వారు పేర్కొన్నారు.
2020-03-25ఏప్రిల్ 1 నుంచి చేపట్టాల్సిన జనాభా లెక్కల మొదటి దశ, జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్.పి.ఆర్) సవరణ ప్రక్రియ లను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ‘కరోనా’ కట్టడికోసం ఏప్రిల్ మొదటి పక్షం వరకు దేశం మొత్తం ‘లాక్ డౌన్’ ప్రకటించడంతో ఈ వాయిదా అనివార్యమైంది. జనాభా లెక్కలను రెండు దశలుగా చేపట్టాల్సి ఉంది. తొలి దశలో 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు గృహాల గణన, రెండో దశలో 2021 ఫిబ్రవరి 9 నుంచి 28వరకు జనగణన చేయవలసి ఉంది. జనాభా లెక్కల తొలి దశతో పాటే ఎన్.పి.ఆర్. కోసం సమాచార సేకరన చేయవలసి ఉంది. ‘కరోనా’తో ఇప్పుడు అన్ని కార్యకలాపాలూ వాయిదా పడ్డాయి.
2020-03-25దేశవ్యాప్త దిగ్భంధంతో లక్షల మంది లారీ డ్రైవర్లు, సహాయకులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రాల సరిహద్దులలో లారీలు, ట్రక్కులు నిలిచిపోయి 5 లక్షల మంది చిక్కుకుపోయినట్టు ఇండియన్ ఫౌండేషన్ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఐ.ఎఫ్.టి.ఆర్.టి) అంచనా. ‘‘ట్రక్కును వదలమంటే పోలీసులు తోసేశారు. నేను నీరు తాగే బతుకుతున్నా. అవి కూడా అయిపోయాయి’’ అని హుబ్లి చెక్ పోస్టు వద్ద ఉన్న ఎల్.పి.జి. సిలిండర్ల ట్రక్కు డ్రైవర్ జావెద్ మహ్మద్ చెప్పాడు. రహదారుల ప్రక్కన ఉండే ధాబాలు, రెస్టారెంట్లను మూసివేయడం ఇప్పుడు పెద్ద సమస్య అయింది. ఈ 21 రోజులు డ్రైవర్లు, క్లీనర్ల పరిస్థితి ఏమిటో?
2020-03-25