తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీకి ‘కరోనా’ పాజిటివ్ తేలింది. ఆయనను అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ఇంతకు ముందే తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలకు ‘కరోనా’ సోకిింది. ఆ ముగ్గురూ కూడా అధికార టిఆర్ఎస్ పార్టీవారే! హైదరాబాద్ నగరం ఇప్పుడు ‘కరోనా’ హాట్ స్పాట్ గా మారిపోయింది. గత కొద్ది రోజులుగా పరీక్షిస్తున్న నమూనాలలో 30 శాతం పైగా ‘పాజిటివ్’ తేలడం ఆందోళనకర పరిణామం. దేశంలో మరెక్కడా ఈ స్థాయిలో ‘కరోనా’ కేసులు బయటపడటంలేదు. నెంబర్లలో చూసినప్పుడు ముంబై, ఢిల్లీ ముందున్నా... హైదరాబాద్ నగరంలో తక్కువ పరీక్షలతోనే ఎక్కువ పాజిటివ్ కేసులు తేలాయి.
2020-06-29తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఇండియాలో సమావేశాలు జరుగుతున్నాయని నేపాల్ ప్రధానమంత్రి కె.పి. శర్మ ఓలి ఆరోపించారు. దివంగత కమ్యూనిస్ట్ నాయకుడు మదన్ భండారి జ్ఞాపకార్థం తన అధికారిక నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓలి మాట్లాడారు. తన ప్రభుత్వానికి పార్లమెంటులో మెజారిటీ ఉందన్న ఓలి, పడగొట్టే ప్రయత్నాలు విఫలమవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఇండియాలోని లింపియాధురా- కాలాపాని- లిపులేఖ్ ప్రాంతాలను తమవిగా చూపుతూ నేపాల్ ప్రభుత్వం కొత్త మ్యాప్ ను ప్రచురించడంపై ఇండియా గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో తన ప్రభుత్వ కూల్చివేతకు ఇండియాలో కుట్ర జరుగుతోందని ఓలి ఆరోపించారు.
2020-06-28తమిళనాడులోని ట్యుటికోరిన్ పట్టణంలో పోలీసు కస్టడీలో మరణించిన తండ్రీ కొడుకుల కేసును సిబిఐకి అప్పగించనున్నట్లు సిఎం పళనిస్వామి ఆదివారం ప్రకటించారు. ‘లాక్ డౌన్’లో ఎక్కువ సమయం షాపును తెరిచి ఉంచారనే కారణంతో జె. జయరాజ్ (59), ఆయన కుమారుడు బెనిక్స్ (31)లను కస్టడీలోకి తీసుకొని హింసించినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై తమిళనాట తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే ఆఫ్రికన్ అమెరికన్ ను పోలీసులు చంపిన తీరుతో ఈ ఘటను పోలిక వచ్చింది. హైకోర్టు అనుమతి తీసుకొని ఈ కేసును సీబీఐకి అప్పగిస్తామని సిఎం చెప్పారు.
2020-06-28చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో.. ప్రభుత్వం ఇచ్చిన రెండు ఉత్తర్వులు కాశ్మీరాన మళ్ళీ కలకలం రేపాయి. రెండు నెలలకు సరిపడా ఎల్.పి.జి. సిలిండర్ల స్టాకు ఉంచాలని, కార్గిల్ కు సమీపంలోని గండేర్ బల్ ప్రాంతంలోని పాఠశాల భవనాలను భద్రతా దళాలకోసం ఖాళీ చేయాలని వేర్వేరుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ‘చాలా అత్యవసర అంశం’గా పేర్కొంటూ లెఫ్టినెంట్ గవర్నర్ జిసి ముర్ము సలహాదారు ఒకరు ఈ నెల 23న ఈ ఉత్తర్వులు ఇచ్చారు. గత ఏడాది పాకిస్తాన్ లోని బాలాకోట్ వద్ద ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు, కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసినప్పుడు ఇలాంటి ఉత్తర్వులే ఇచ్చారు.
2020-06-28మాజీ ప్రధాని పి.వి. నరసింహరావు శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదివారం ప్రారంభించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పి.వి. జ్ఞానభూమిలో నివాళులు అర్పించిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు. పి.వి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తర్వాత ప్రధానమంత్రిగా పని చేశారు. కాంగ్రెస్ నాయకుడే అయినా తెలంగాణ దిగ్గజ నాయకుడు కాబట్టి ఏడాది పొడవునా జయంతి ఉత్సవాలను నిర్వహించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం జ్ఞానభూమిలో కేసీఆర్, మంత్రులతో పాటు కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పీవీకి నివాళులు అర్పించారు.
2020-06-28ఇండియా సరిహద్దుల్లోకి చైనా మార్షల్ ఆర్ట్స్ ఫైటర్లను, పర్వతారోహణలో అనుభవం ఉన్న దళాలను పంపింది. చైనా సైన్యంలోని ఎవరెస్టు ఒలింపిక్ టార్చ్ ర్యాలీ టీమ్ సభ్యులు, మిశ్రమ మార్షల్ ఆర్ట్స్ క్లబ్ ఫైటర్లు సహా ఐదు మిలీషియా డివిజన్లు ఈ నెల 15న టిబెట్ రాజధాని లాసాలో తనిఖీకి హాజరైనట్లు మిలిటరీ పత్రిక వెల్లడించింది. ఈ కొత్త దళాల సభ్యులు వందల సంఖ్యలో బారులుతీరిన దృశ్యాలు సీసీటీవీలో ప్రసారమయ్యాయి. అదే రోజు రాత్రి అక్కడికి 1300 కి.మీ. దూరంలోని గాల్వన్ లోయలో ఘర్షణ జరిగింది. ఫైట్ క్లబ్ సభ్యుల రాకతో తమ దళాల శక్తి పెరిగిందని టిబెట్ కమాండర్ వాంగ్ హైజియాంగ్ ధీమా వ్యక్తం చేశారు.
2020-06-28చైనాతో ఘర్షణ నేపథ్యంలో ఇండియా గగనతల రక్షణ వ్యవస్థలను తూర్పు లడఖ్ ప్రాంతానికి తరలించింది. దేశీయంగా రూపొందించిన ఆకాష్, ఇజ్రాయిల్ తయారీ స్పైడర్ (SpyDer), సోవియట్ రష్యా తయారీ పెచోరా, ఒఎస్ఎ-ఎకె క్షిపణి వ్యవస్థలను ఆ ప్రాంతంలో మోహరించింది. ఈ ఎస్ఎఎం వ్యవస్థలు ప్రత్యర్ధి యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను కూల్చగలవు. ఈ నెల 15 రాత్రి గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో 23 మంది భారత సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. ‘‘చైనా ఎలాంటి బెదిరింపు చర్యలకు పాల్పడ్డా స్పందించడానికి మేము పూర్తి సన్నద్ధంగా ఉన్నాం’’ అని భారత అధికార వర్గాలు తెలిపాయి.
2020-06-28శాంతిని కోరుకుంటూనే బలగంతోనూ స్పందించగలమని తూర్పు లడఖ్ లో చూపించామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. దేశంకోసం పోరాడిన సైనికులను ఆదివారం ‘మన్ కీ బాత్’లో మోడీ కొనియాడారు. ‘‘2020 శుభప్రదం కాదని చాలా మంది భావిస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి ఎదురవుతుందని 6-7 నెలల క్రితం మనకు తెలుసా? అనేక ఇతర ఇబ్బందులను మనం ఎదుర్కొంటున్నాం - తుపానులు, భూకంపాలు, మిడతల దాడులు, అవి అంత ఇబ్బంది కాకపోయినా పొరుగు దేశాలనుంచి కూడా’’ అని మోడీ వ్యాఖ్యానించారు. ఈ ఏడాదే కొత్త శిఖరాలను అధిరోహిస్తామని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు.
2020-06-28ప్రపంచవ్యాప్తంగా ‘కరోనా’ వైరస్ పాజిటివ్ కేసులు శనివారం కోటి దాటాయి. ‘వరల్డోమీటర్స్’ గణాంకాల ప్రకారం కేసుల సంఖ్య 1,00,80,224కి పెరిగింది. ఈ మహమ్మారి బారిన పడి 5,01,262 మంది మరణించారు. చైనాలో అధికారికంగా తొలి ‘కరోనా’ కేసు నమోదై నిన్నటికి 180 రోజులు. వుహాన్ నుంచి వ్యాపించి కొద్ది కాలంలోనే ప్రపంచమంతటికీ విస్తరించిన ‘కరోనా’తో ప్రజాజీవనం స్తంబించిపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థే అతలాకుతలమైంది. అగ్రరాజ్యం అమెరికాలో 25,96,537 మందికి వైరస్ సోకగా 1,28,152 మంది చనిపోయారు. అత్యధిక జనాభా ఉన్న ఇండియా వైరస్ వ్యాప్తిలో వేగంగా అమెరికావైపు దూసుకెళ్తోంది.
2020-06-28పదేళ్ల సూర్యగమనాన్ని ‘నాసా’ ఓ గంట టైం- లాప్స్ వీడియో రూపంలో విడుదల చేసింది. సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ (ఎస్.డి.ఒ) దశాబ్దంపాటు భూమి చుట్టూ తిరుగుతూ తీసిన సూర్యుడి చిత్రాలతో ఈ వీడియో రూపొందింది. ఈ అబ్జర్వేటరీలో ఉన్న మూడు పరికరాలు ప్రతి 0.75 సెకండ్లకు ఒకటి చొప్పున మొత్తం 42.5 కోట్ల హై రిజొల్యూషన్ చిత్రాలను తీశాయి. 2010 జూన్ 2 నుంచి 2020 జూన్1 వరకు 20 మిలియన్ గిగాబైట్ల సమాచారాన్ని పొందుపరిచాయి. ఇది సూర్యుడిపై అధ్యయనంలో కీలక పాత్ర పోషించింది. గంటకు ఒక ఫొటో చొప్పున ఉపయోగించి పదేళ్ళ సూర్యగమనాన్ని 61 నిమిషాల వీడియోగా ‘నాసా’ సంక్షిప్తీకరించింది.
2020-06-28