అల్జీరియా కోర్టు ఒకటి మంగళవారం అసాధారణ తీర్పు చెప్పింది. అవినీతి కేసుల్లో ఇద్దరు మాజీ ప్రధానమంత్రులకు సుదీర్ఘ శిక్ష విధించింది. మాజీ ప్రధానుల్లో అహ్మద్ ఓయాహియాకు 15 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 16 వేల డాలర్ల ఫైన్ విధించింది. అబ్దేల్మలెక్ సెల్లాల్ కు 12 సంవత్సరాల జైలు శిక్ష, 8 వేల డాలర్ల ఫైన్ విధించారు. అల్జీరియాను సుదీర్ఘ కాలం ఏలిన మాజీ అధ్యక్షుడు అబ్దేలాజిజ్ బౌటెఫ్లికా కింద ఈ మాజీ ప్రధానులిద్దరూ పని చేశారు. బౌటెఫ్లికా కూడా అవినీతిపై ప్రజాగ్రహంతోనే దిగిపోయారు.
2019-12-10‘‘నా వయసు 70 అయినా ఏం ఢోకా లేదు. 25 ఏళ్ల కుర్రాడిలా ఆలోచిస్తాను’’ అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. శాసనసభలో మంత్రి కొడాలి నాని, ఇతరులు పలుమార్లు చంద్రబాబు వయసు గురించి ప్రస్తావించడంతో ఆయన ఈ విధంగా స్పందించారు. నవ్వుతూనే ‘‘నేను మాట్లాడితే 15 మంది మంత్రులు లేస్తున్నారు. మీరు 150 మంది మాట్లాడినా నేను సమాధానం చెబుతా’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
2019-12-10ఇండియన్లలో 56.1 శాతం మంది డిస్కౌంట్ల కుంభకోణాల్లో బాధితులవుతన్నారని మెకాఫీ సెక్యూరిటీ సంస్థ పేర్కొంది. క్రిస్టమస్ షాపింగ్ ఊపందుకుంటున్న వేళ..సంస్థ ఓ అధ్యయన నివేదికను విడుదల చేసింది. మోసపూరిత యాప్స్, నకిలీ వెబ్ సైట్లను క్లిక్ చేయడం ద్వారా డిస్కౌంట్ల దోపిడీకి గురవుతున్నారని ఈ సంస్థ తేల్చింది. 60.7 శాతం నకిలీ చారిటీల బారిన పడుతున్నారని, 78.6 శాతం మంది సీజనల్ ట్రావెల్ కుంభకోణాలతో నష్టపోతున్నారని మెకాఫీ పేర్కొంది.
2019-12-10గత ఏడాది దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా పంట నష్టానికి కారణమైన ఫాల్ ఆర్మీ వార్మ్ (కత్తెర పురుగు) ఈ ఏడాది (2019-20లో) ఉత్తరాదిలోనూ బీభత్సం చేస్తోంది. దేశం మొత్తంగా 7,18,226 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. 2018-19లో దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్రలో 5,06,107 హెక్టార్లలో పంట దెబ్బ తిన్నది. అప్పుడు తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రభావాన్ని చూపింది. ఈసారి తమిళనాడు ఈ మహమ్మారి నుంచి తప్పించుకోగా మహారాష్ట్రకు ముప్పు పెరిగింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లకు కొత్తగా ముంచుకొచ్చింది.
2019-12-10పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తున్నందున ‘‘ప్రధానమంత్రి పోలవరం’’గా ప్రకటించి... ఆమేరకు ప్రాజెక్టు స్థలంలో శిలాఫలకం వేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు. మంగళవారం ఈ అంశంపై రాజ్యసభలో మాట్లాడుతూ... పోలవరం మోదీ వరం అయినా ఎక్కడా కేంద్రానికి క్రెడిట్ ఇవ్వడంలేదని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో తెలుగులోనే మాట్లాడిన జీవీఎల్... రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న రూ. 2377 కోట్ల అదనపు వ్యయంపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.
2019-12-10రాష్ట్రంలో ఉల్లిపాయలు చౌకగా కేజీకి రూ. 25 చొప్పున అమ్ముతున్నందువల్లనే ప్రజలు క్యూలలో ఉంటున్నారని ఏపీ సీఎం జగన్ చెప్పారు. ‘‘ఈయన (చంద్రబాబు) హెరిటేజ్ షాపులో రూ. 200కు అమ్ముతున్నారు. మేం చౌకగా అమ్ముతున్నాం కాబట్టే క్యూలు ఉన్నాయి. అయినా ఆయన శవాల మీద రాజకీయం చేస్తారు’’ అని జగన్ మండిపడ్డారు. దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేనంత తక్కువ ధర (రూ. 25)కు ప్రజలకు ఉల్లిపాయలు అందిస్తున్నామని, వచ్చే శుక్రవారం నుంచి రైతు బజార్లతోపాటు మార్కెట్ యార్డుల్లోనూ ఉల్లి అమ్ముతామని చెప్పారు.
2019-12-10కేంద్ర ప్రభుత్వ ప్రధాన నినాదం ‘‘మేకిన్ ఇండియా’’. ఆచరణలో అడుగులు ముందుకు పడటంలేదు. రాజకీయంగా ప్రత్యర్ధిగా భావించే చైనా నుంచి అనేక ఉత్పత్తులను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాం. ఉదాహరణకు... 2018లో ఇండియా దిగుమతి చేసుకున్న ‘బల్క్ డ్రగ్స్’లో 66.53 శాతం చైనా నుంచే వచ్చాయి. 2016 దిగుమతుల్లో చైనా వాటా 56.62 శాతంగా ఉంటే తర్వాత సంవత్సరమే 68.62 శాతానికి పెరిగింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే మంగళవారం లోక్ సభలో వెల్లడించింది.
2019-12-10ఉల్లిపాయల ధరలు సాధారణ ప్రజలు భరించలేని విధంగా ఉన్నాయని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. ఒక గృహిణిగా చూసినప్పుడు కేజీ ఉల్లి ధర రూ. 160 అంటే చాలా భారంగా అనిపిస్తుందని భువనేశ్వరి చెప్పారు. ధరల నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. మంగళవారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటైన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
2019-12-10అధికారంలోకి వస్తే ‘‘సన్న బియ్యం’’ ఇస్తామని తాను చెప్పినట్టు గతంలో ‘‘సాక్షి’’ పత్రిక రాసింది తప్పని ఏపీ సిఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. సాక్షాత్తు ‘‘సాక్షి’’ యజమాని అయిన జగన్, ఈ మాట చెప్పడం విశేషం. సన్నబియ్యంపై జగన్ మాట తప్పారని విమర్శిస్తున్న టీడీపీ.. అందుకు సాక్ష్యంగా ‘‘సాక్షి’’ పాత క్లిప్పింగ్ చూపిస్తోంది. ఈ నేపథ్యంలో సిఎం తమ సొంత పత్రికే తప్పు రాసిందని మంగళవారం అసెంబ్లీలో చెప్పారు. నాణ్యమైన బియ్యానికి, సన్న బియ్యానికి తేడా తెలియక అయోమయంలో రాశారని వ్యాఖ్యానించారు.
2019-12-10ప్రజా పంపిణీ వ్యవస్థలో ‘‘సన్న బియ్యం’’ పంపిణీ చేస్తామని తాము ఎన్నికల ప్రణాళికలో చెప్పలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. హామీని ఉల్లంఘించారని తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి మంగళవారం అసెంబ్లీలో స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వం సరఫరా చేసిన సరుకు కంటే నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయడంకోసం తమ ప్రభుత్వం రూ. 1400 కోట్లు అధికంగా ఖర్చు చేయబోతోందని సిఎం చెప్పారు.
2019-12-10