ఆంధ్రా, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదంపై వాదనలను వినేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ కాస్తంత ఇబ్బంది పడ్డారు. తాను రెండు రాష్ట్రాలకు చెందినవాడినన్న జస్టిస్ రమణ, జల వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఉభయ రాష్ట్రాలకూ హితవు పలికారు. ఈ అంశాన్ని చట్టపరంగా కాకుండా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటామంటే సహకరిస్తామని సిజెఐ పేర్కొన్నారు. లేదంటే మరో ధర్మాసనానికి ఈ అంశాన్ని బదిలీ చేస్తానని చెప్పారు. కృష్ణా జలాల పంపకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ పిటిషన్ దాఖలు చేసింది.
2021-08-02ఒలింపిక్స్ పతకాల పట్టికలో చివరి నుంచి ఎన్నో స్థానమో చూసుకోవలసిన దుస్థితిలో ఉన్న ఇండియాకు... మహిళల, పురుషుల హాకీ జట్లు కొత్త ఆశల్ని చిగురింపజేశాయి. రెండు జట్లూ సెమీ ఫైనల్స్ చేరిన తరుణంలో ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను అంతా గుర్తు చేసుకుంటున్నారు. హాకీ జట్లకు ఆ రాష్ట్రమే రాజపోషకునిగా నిలిచింది మరి. ఐదేళ్ల పాటు హాకీ జట్లను పోషించనున్నట్టు నవీన్ పట్నాయక్ 2018లో ప్రకటించారు. 2016 రియో ఒలింపిక్స్ లో ఘోరంగా ఓడిన మహిళల జట్టు, క్వార్టర్స్ దాటని పురుషుల జట్టు ఇప్పుడు పురోగమించడంలో ఆ పేద రాష్ట్రం పోషణ ఉంది.
2021-08-02టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళల హాకీ జట్టు సోమవారం ఓ చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచ నెంబర్ 2గా ఉన్న ఆస్ట్రేలియా మహిళల జట్టును క్వార్టర్ ఫైనల్ లో 1-0తో ఓడించి సెమీఫైనల్స్ కు చేరుకుంది. గుర్జీత్ కౌర్ చేసిన ఏకైక గోల్... చరిత్రలోనే తొలిసారి భారత మహిళా హాకీ జట్టును ఒలింపిక్స్ సెమీఫైనల్స్ కు చేర్చింది. 2016 రియో ఒలింపిక్స్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని మహిళల హాకీ జట్టు, ఇప్పుడు పతకం దిశగా పయనిస్తోంది. చక్ దే ఇండియా.
2021-08-02లడఖ్ సరిహద్దుల్లో చైనా చొరబాట్లకు సంబంధించి మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ‘‘మోదీ, ఆయన సేవకులు వేల కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనాకు అప్పగించారు’’ అంటూ సోమవారం పొద్దున్నే ఓ ఘాటైన ట్వీట్ చేశారు. ఆ భూభాగాన్ని ఎప్పుడు వెనుకకు తీసుకుంటామని రాహుల్ ప్రశ్నించారు. గత ఏడాది సరిహద్దు ఘర్షణల తర్వాత 11 విడతలుగా చర్చలు జరిగాయి. కొద్ది నెలల విరామం తర్వాత సోమవారం జరిగిన 12వ దఫా చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే ముగిశాయని వచ్చిన వార్తా కథనాన్ని రాహుల్ షేర్ చేశారు.
2021-08-02భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు టోక్యో ఒలింపిక్స్ లో కాంశ్య పతకాన్ని గెలుచుకున్నారు. ఈ ఒలింపిక్స్ లో ఇండియాకు ఇది రెండో పతకం కాగా, రెండు ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన ఏకైక భారతీయ మహిళగా సింధు రికార్డు నెలకొల్పారు. 2016 రియో ఒలింపిక్స్ లో సింధు రజత పతకం సాధించారు. ఈసారి మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ లో ఓటమి పాలైన సింధు, కాంశ్య పతకం కోసం జరిగిన పోటీలో చైనాకు చెందిన బింగ్ జియావోను వరుస సెట్లలో ఓడించారు. చైనాకే చెందిన యూ ఫెయి ఈ విభాగంలో స్వర్ణాన్ని సాధించారు.
2021-08-01అస్సాం-మిజోరాం సరిహ్దదు ఘర్షణ మరింత జఠిలంగా మారుతోంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, నలుగురు అస్సాం సీనియర్ పోలీసు అధికారులపై మిజోరాం పోలీసులు హత్యాయత్నం, కుట్ర కేసులు నమోదు చేశారు. రెండు రాష్ట్రాల సరిహద్దు వద్ద ఈ నెల 26న జరిగిన ఘర్షణలో అస్సాం పోలీసులు ఆరుగురు చనిపోయారు. అస్సాం పోలీసులు 200 మంది తమ పోలీసు పోస్టుపై దాడికి వచ్చారని పేర్కొంటూ సోమవారమే మిజోరాంలో కేసు నమోదు చేసినట్టు చెబుతున్నారు. మరోవైపు అస్సాం పోలీసులు కూడా ఈ ఘటనపై బుధవారం కేసు నమోదు చేశారు.
2021-07-30ఈశాన్య భారతం నుంచి వచ్చిన ఓ పేదరాలు మీరాబాయ్ చాను టోక్యో ఒలింపిక్స్ తొలిరోజు సాధించిన రజత పతకంతో ‘విక్టరీ పంచ్’ అంటూ హడావుడి చేశారు కేంద్ర పెద్దలు. మరో ఏడు రోజులు గడిచాయి. ఇప్పటికీ ఆ ఒక్కటే! ఫలితంగా ఇండియా స్థానం రోజురోజుకూ దిగజారి శుక్రవారం 52కి (63 దేశాల్లో) చేరింది. కేవలం 70 వేల జనాభా ఉన్న బెర్ముడా, ఓ చిన్న దీవుల దేశం ఫిజి కూడా బంగారు పతకాలు సాధించి... 138 కోట్ల జన భారతాన్ని వెక్కిరిస్తున్నాయి. పతకం సాధించాక ప్రచారంకోసం బహుమానాలు ప్రకటించే వికృత క్రీడాకారులు మన నేతలు. వారితో క్రీడాభారతం ఆవిష్కృతమవుతుందా?
2021-07-30వివాదాస్పదుడైన గుజరాత్ కేడర్ ఐపిఎస్ అధికారి రాకేశ్ ఆస్తానాను ఢిల్లీ పోలీసు కమిషనర్ గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ గురువారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయవలసిన ఆస్తానాకు కేంద్ర ప్రభుత్వం ఒక ఏడాది పాటు పొడిగింపు ఇచ్చి మరీ కీలక పోస్టు కట్టబెట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సన్నిహితుడైన ఆస్తానా సిబిఐ డైరెక్టర్ పోస్టుకోసం ప్రయత్నించి విఫలమయ్యారు. రిటైరయ్యేవారిని కీలక పోస్టుల్లో నియమించరాదన్న తీర్పును సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ ప్రస్తావించడంతో ఆస్తానా అవకాశం కోల్పోయారు.
2021-07-29ఆలిండియా కోటా (ఎఐక్యు)లోని మెడికల్, డెంటల్ డిగ్రీ, పీజీ కోర్సులలో ఓబీసీలకు 27 శాతం, ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఓ ‘మైలురాయి’గా అభివర్ణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏటా వేలాది మంది లబ్ది పొందుతారని పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న అంశాలకు ప్రభావవంతమైన పరిష్కారాలను చూపించాలని ఈ నెల 26న జరిగిన ఓ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంబంధిత మంత్రిత్వ శాఖలను ఆదేశించినట్లు ఆరోగ్య శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
2021-07-2920 ఓవర్లలో 81 పరుగులు... అది టెస్టు మ్యాచ్ కాదు. వన్డే కూడా కాదు. ట్వంటీ20 మ్యాచ్!!! టి20లో రన్ రేట్ 4 అంటే విస్మయమే మరి. శ్రీలంకతో గురువారం ఆడిన మూడవ టి20 మ్యాచ్ లో ఇండియా సాధించిన పరుగులివి. అందుకోసం ఏకంగా 8 వికెట్లు కోల్పోవడం గమనార్హం. టి20 ఫార్మాట్ క్రికెట్లో ఇండియాకు ఇది మూడో అత్యల్ప స్కోరు. జట్టులో కులదీప్ యాదవ్ సాధించిన 23 పరుగులే అత్యధిక స్కోరు. శ్రీలంక జట్టులో వానిందు హాసరంగ నాలుగు వికెట్లు, కెప్టెన్ దాసున్ షాణక రెండు వికెట్లు తీశారు. భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిస్తే తప్ప టి20 సిరీస్ చేజారినట్టే.
2021-07-29