2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఫోన్ లోనూ గూఢచర్య సాఫ్ట్ వేర్ ను చొప్పించారా? వాట్సాప్ ద్వారా ‘స్పై వేర్’ చొప్పించిన అంశంపై ప్రియాంకా గాంధీకి కూడా ఆ సంస్థ నుంచి అలర్ట్ వచ్చిందని ఆదివారం కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. దేశంలో 1400 మంది రాజకీయ, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టుల ఫోన్లలోకి వాట్సాప్ ద్వారా ఇజ్రాయెలీ స్పైవేర్ ను చొప్పించినట్టు ఇటీవల వెల్లడైంది. చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమైన హ్యాకింగ్ లో బీజేపీ పాత్ర ఉందని కాంగ్రెస్ ఆరోపించింది.
2019-11-03వెస్ట్ ఇండీస్, ఇండియా మహిళా క్రికెట్ జట్ల మధ్య రెండో అంతర్జాతీయ వన్డే ఆదివారం ఆంటిగ్వాలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ మిథాలి రాజ్ తొలుత బౌలింగ్ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఏడేళ్ళ తర్వాత భారత మహిళా క్రికెట్ జట్టు వెస్టిండీస్ లో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడుతోంది. ఆదివారం పోటీని ఇండియాలో ‘ఫాన్ కోడ్ (FanCode) అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించవచ్చని నిర్వాహక బోర్డు తెలిపింది. ఈ పోటీల డిజిటల్ ప్రసార హక్కులను ఆ సంస్థ కొనుగోలు చేసింది.
2019-11-03కాలుష్య కాసారంగా మారిన ఢిల్లీలో ఆదివారం జరిగిన ఇండియా-బంగ్లాదేశ్ టి20 అంతర్జాతీయ మ్యాచ్ లో ఓ అసాధారణ ఫలితం వచ్చింది. ఇండియాపై టి20లో తొలిసారిగా బంగ్లాదేశ్ గెలుపొందింది. 7 వికెట్లు మిగిలి ఉండగానే... మహ్మదుల్లా సిక్సర్ తో బంగ్లాదేశ్ ఘన విజయం నమోదైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 148 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 154 పరుగులు సాధించింది. బంగ్లాదేశ్ జట్టులో రహీమ్ 43 బంతుల్లో 60 పరుగులు చేసి బలమైన పునాధి వేశారు.
2019-11-03‘‘మీరు ఎక్కువ చిందులు వేస్తే ఏం చేయాలో నాకు తెలుసు. చాలా బలమైన వ్యక్తులు తెలుసు. ఈ దేశాన్ని పాలించే వ్యక్తులు నేనంటే ఇష్టపడేవారు. ప్రత్యేకించి ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలకు వివరిస్తా’’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధినేతలను హెచ్చరించారు. ఆదివారం విశాఖ ‘‘లాంగ్ మార్చ్’’లో మాట్లాడుతూ ‘‘వీళ్ళను ఇప్పటికిప్పుడు దింపి అధికారంలోకి రావాలని నాకు లేదు. కాకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను’’ అని హెచ్చరించారు. కూల్చివేతలతో మొదలు పెట్టిన ప్రభుత్వం కూలిపోతుందనీ పవన్ వ్యాఖ్యానించారు.
2019-11-03తనను విమర్శించిన వైసీపీ మంత్రులపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యక్షంగా కన్నబాబును, పరోక్షంగా అవంతి శ్రీనివాస్ ను హెచ్చరించారు. ‘‘కన్నబాబును మేమే రాజకీయాల్లోకి తెచ్చాం. నాగబాబుగారు తెచ్చారు. ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఇక్కడ (విశాఖలో) ఒకరు (అవంతి శ్రీనివాస్) మాట్లాడుతున్నారు. మీ బతుకులు మాకు తెలియవా? మీరు ఎక్కడినుంచి వచ్చారు...ఏం మాట్లాడుతారు. ఓడిపోయామనా?’’ అని పవన్ మండపడ్డారు. ఓడిపోయినవారికి హక్కు లేదంటే అంబేద్కర్, కాన్షీరాం ఓడిపోయారు.
2019-11-03వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన... పోయిన తెలుగుదేశం పార్టీ బెటర్ అనుకునేలా ఉందని జనసేన నాయకుడు, పవన్ సోదరుడు నాగబాబు అభిప్రాయపడ్డారు. ఇందుకు ఆయన ఓ తండ్రీ కొడుకుల కథ చెప్పారు. ‘‘ఓ తండ్రి ఊళ్లోవాళ్లని తిడుతూ ఉండేవాడు. చనిపోయే సమయంలో కొడుకును పిలిచి తనకు మంచి పేరు తేవాలని కోరాడు. కొడుకు ఆలోచించి ఊళ్లో జనాన్ని తన్నడం మొదలుపెట్టాడు. అప్పుడు జనం... వీడికంటే వాళ్ల బాబే బెటర్ అనుకున్నారు. అలాగే... టీడీపీ తిడితే ఇప్పుడు వైసీపీ కొడుతోంది’’ అని నాగబాబు చెప్పారు.
2019-11-03భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో విశాఖపట్నంలో ‘లాంగ్ మార్చ్’ నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి అల్టిమేటమ్ జారీ చేశారు. ‘‘వైసీపీకి, నన్ను విమర్శించిన ప్రతి మంత్రికీ చెబుతున్నా... రెండు వారాలు టైం ఇస్తున్నా. ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులు ఒక్కొక్కరికి రూ. 50 వేలు పరిహారం ఇవ్వండి. చనిపోయిన 36 మందికి 5 లక్షలు ఇవ్వండి. రెండు వారాల్లో స్పందన రాకపోతే నేను అమరావతి వీధుల్లో నడుస్తా. పోలీసులను పెడతారో... ఆర్మీని తెప్పించుకుంటారో మీ ఇష్టం’’ అని పవన్ హెచ్చరించారు.
2019-11-03పరిధి దాటితే తాట తీస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. ఆదివారం విశాఖపట్నంలో నిర్వహించిన భవన నిర్మాణ కార్మికుల ‘లాంగ్ మార్చ్’లో పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘‘విజయసాయిరెడ్డి మాట్లాడితే టీమ్ బి, దత్తపుత్రుడు, డిఎన్ఎ అంటున్నారు. మా డిఎన్ఎ గురించి మాట్లాడే హక్కు ఏ వైసీపీ నాయకుడికీ లేదు. విజయసాయిరెడ్డిని అడుగుతున్నా... ఏ డిఎన్ఎ ఉందని మీ అమ్మాయి పెళ్లికి నన్ను పిలిచారు?’’ అని పవన్ విరుచుకుపడ్డారు.
2019-11-03ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ తిరుగు బాణం వదిలారు. ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉన్నందున నష్టాల్లో ఆ మేరకు భాగం పంచుకోవాలని కోరనున్నట్టు శనివారం చెప్పారు. కేంద్రం ఇటీవల చేసిన చట్టం ప్రైవేటు బస్సులకు అవకాశం కల్పిస్తోందని, ఆ చట్టాన్ని ఆమోదించిన తెలంగాణ బీజేపీ ఎంపీలు తమను ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు. ఆర్టీసీని విలీనం చేయడం విపరిణామాలకు దారి తీస్తుందని, మరో 90 కార్పొరేషన్లు అదే డిమాండ్ చేస్తాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
2019-11-02జమ్మూ కాశ్మర్ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 రద్దయ్యాక ఆ రాష్ట్రం అక్టోబర్ 31వ తేదీనుంచి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం శనివారం కాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాల కొత్త మ్యాప్ విడుదల చేసింది. దాంతోపాటు సవరించిన ‘ఇండియా పొలిటికల్ మ్యాప్’ను కూడా విడుదల చేసింది. అవిభాజ్య కాశ్మీర్ రాష్ట్రంలో 28 జిల్లాలు ఉండగా విభజిత లడఖ్ ప్రాంతంలో కేవలం రెండు (లేహ్, కార్గిల్) ఉన్నాయి. మిగిలిన జిల్లాలు కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో భాగమయ్యాయి.
2019-11-02