నిన్న ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారమే సమీక్షలను ప్రారంభించారు. తొలి రోజున మధ్యాహ్న భోజన పథకంపై అక్షయపాత్ర ట్రస్ట్, ప్రభుత్వ అధికారులతో సమీక్ష నిర్వహించారు. శనివారం ఆర్థిక, ఆదాయార్జన శాఖల అధికారులతో సమావేశం కానున్నారు. జూన్ 3న విద్యా, జలవనరుల శాఖలపైన సమీక్ష ఉంటుంది. 4వ తేదీన వ్యవసాయ, గృహనిర్మాణ విభాగాలను, 6వ తేదీన రాజధాని నిర్మాణంలో కీలకమైన సి.ఆర్.డి.ఎ.ని జగన్ సమీక్షిస్తారు.
2019-05-31సామాజిక పింఛను మొత్తాన్ని రూ. 2000 నుంచి రూ. 2,250కు పెంచుతూ, పింఛనుకు అర్హత వయసును 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ప్రమాణ స్వీకార వేదికపైనుంచే పింఛను పెంపు ఫైలుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంతకం చేయగా.. శుక్రవారం జీవో విడుదలైంది. పెంచిన పింఛను మొత్తం జూలై 1 నుంచి లబ్దిదారులకు అందుతుంది.
2019-05-31రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శిగా ఉన్న సొలోమన్ ఆరోకియ రాజ్ ముఖ్యమంత్రి కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఇకపైన ఆయన సిఎంకు కార్యదర్శిగా వ్యవహరిస్తూనే పరిశ్రమల శాఖ కార్యదర్శి బాధ్యతలను అదనంగా నిర్వర్తిస్తారని ప్రభుత్వం గురువారం రాత్రి జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది. జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన వెంటనే పాత సిఎంఒ అధికారులను బదిలీ చేశారు. గురువారమే ధనంజయరెడ్డిని సిఎం అదనపు కార్యదర్శిగా, కృష్ణమోహన్ రెడ్డిని ఒ.ఎస్.డి.గా నియమించారు.
2019-05-30సిఎం కార్యాలయ అధికారులు, డీజీపీ మార్పు తర్వాత జగన్ ప్రభుత్వం కీలక శాఖల్లోనూ తొలిరోజే అధికారులను మారుస్తోంది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా షంషేర్ సింగ్ రావత్ (ఎస్ఎస్ రావత్)ను నియమిస్తూ గురువారమే జీవో ఆర్.టి. నెం. 1181 జారీ అయింది. సామాజిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న రావత్ ఆ బాధ్యతలను కూడా అదనంగా నిర్వర్తిస్తారని పేర్కొన్నారు.
2019-05-30ఎన్నికలకు ముందు ఇంటెలిజెన్స్ విభాగం నుంచి ఉధ్వాసనకు గురైన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును కొత్త ప్రభుత్వం ఏసీబీ డైరెక్టర్ జనరల్ స్థానం నుంచి కూడా తప్పించింది. గురువారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఏబీ వెంకటేశ్వరరావును జిఎడికి రిపోర్టు చేయవలసిందిగా ఉత్తర్వులు (జీవో ఆర్.టి. నెం. 1182) జారీ అయ్యాయి. ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా ఉన్న కుమార్ విశ్వజిత్ కు ఏసీబీ (పూర్తి అదనపు) బాధ్యతలు అప్పగించారు.
2019-05-30అంగారక గ్రహంపైన బంకమన్ను ఉండే ప్రాంతంలో అన్వేషణ జరుపుతున్న ‘క్యూరియాసిటీ’ రోవర్ తాజాగా ఆ గ్రహంపైన మేఘాల కదలికలను తన కెమేరాలలో బంధించింది. ఈ రోవర్ తన బ్లాక్ అండ్ వైట్ నేవిగేషన్ కెమేరాలను ఉపయోగించి మే 7, 12 తేదీల్లో తీసిన చిత్రాల్లో మేఘాలు కనిపించాయి. అరుణ గ్రహ ఉపరితలంనుంచి 31 కిలోమీటర్ల ఎత్తున ఈ మేఘాలు ఉన్నట్టు ‘నాసా’ గుర్తించింది. ఈ రోవర్ నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘ఇన్ సైట్’ ల్యాండర్ గతంలో తీసిన చిత్రాలను వీటితో పోల్చి చూస్తున్నారు.
2019-05-30 Read Moreనిన్న 57 మంది మంత్రులతో సహా ప్రమాణ స్వీకారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వారికి శాఖలను కేటాయించారు. ఇదివరకు ప్రభుత్వంలో నెంబర్ 2గా హోం శాఖ బాధ్యతలు నిర్వర్తించిన రాజ్ నాథ్ సింగ్ కు రక్షణ శాఖను అప్పగించారు. సుష్మాస్వరాజ్ కు ఈ మంత్రివర్గంలో చోటు ఇవ్వనందున గతంలో ఆమె నిర్వర్తించిన విదేశాంగ శాఖ బాధ్యతలను మాజీ అధికారి ఎస్. జయశంకర్ కు అప్పగించారు. (పూర్తి జాబితాకోసం ఎడమకు స్వైప్ చేయండి)
2019-05-31 Read Moreకేంద్ర ప్రభుత్వంలో కీలకంగా భావించే హోం, ఆర్థిక శాఖలను అమిత్ షా, నిర్మలా సీతారామన్ లకు కేటాయించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వీరిలో అమిత్ షా కొత్తగా కేంద్ర మంత్రివర్గంలో చేరగా.. నిర్మల కొంత కాలంగా రక్షణ శాఖ బాధ్యతలు చూస్తున్నారు. బిజెపి అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా హోం మంత్రిత్వ శాఖను ఎంచుకోవడం వ్యూహాత్మకమే. కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో బీజేపీ ఎజెండాకు కీలకమైన అంశాలు హోం శాఖ పరిధిలోకే వస్తాయి.
2019-05-31ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేయగానే డీజీపీ ఆర్పీ ఠాకూర్ పై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో డీజీపీగా గౌతం సవాంగ్ నియమితులయ్యారు. సవాంగ్ ప్రస్తుతం విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ డీజీగా ఉన్నారు. ఠాకూర్ ను ప్రాధాన్యత లేని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ శాఖ డీజీ పోస్టుకు పంపారు. ఎన్నికలకు ముందు, ఆ సమయంలో ఠాకూర్ పైన జగన్ సహా వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
2019-05-30నూతన ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇద్దరు అధికారులు గురువారం నియమితులయ్యారు. ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ కె. ధనంజయరెడ్డిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అదనపు కార్యదర్శిగా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టరుగా ఉద్యోగ విరమణ చేసిన పి. కృష్ణమోహన్ రెడ్డిని ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారి (ఒ.ఎస్.డి)గా నియమిస్తూ మరో జీవో జారీ అయింది.
2019-05-30