పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ను రద్దు చేయాలని కోరుతూ కేరళ అసెంబ్లీ తీర్మానం చేసింది. సిఎఎ దేశ మౌలిక విలువలకు, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. ఎస్.సి, ఎస్.టి. రిజర్వేషన్లను మరో దశాబ్దం పొడిగించే అంశంపై మంగళవారం ఒక్కరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగానే సిఎఎకి వ్యతిరేక తీర్మానమూ చేశారు. ఈ విషయంలో కేరళే ఫస్ట్.
2019-12-31ఏపీ సిఎం జగన్ రాయలసీమ ప్రజలనూ మోసం చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. హైకోర్టును కర్నూలుకు మార్చాలంటే సుప్రీంకోర్టు అనుమతి కావాలని, జి.ఎన్.రావు కమిటీ అసెంబ్లీని విజయనగరంలో పెట్టాలని చెప్పింది తప్ప భీమిలిలో కాదని పేర్కొన్నారు. మనసులో ఏముందో గాని, అన్ని ప్రాంతాల ప్రజలనూ సిఎం మభ్యపెడుతున్నారని ఆక్షేపించారు. రాజధాని ఎక్కడో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
2019-12-31హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నరు తమిళిసైని కోరారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సహా పలువురు ముఖ్య నేతలు మంగళవారం మధ్యాహ్నం గవర్నరును కలిశారు. అంజనీకుమార్ అవినీతి, అక్రమ వర్తనపై అనేక ఆరోపణలు ఉన్నాయని, విచారణ జరిపించాలని కోరామని తర్వాత ఉత్తమ్ మీడియాకు చెప్పారు.
2019-12-31రాజధాని అమరావతి విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. తమ బిడ్డల భవిష్యత్తును పణంగా పెట్టి రాష్ట్ర రాజధానికోసం భూములు ఇచ్చారని రైతులను ప్రశంసించిన పవన్, ‘‘ధర్మం తప్పిన నాయకుడిని నేల క్షమించదు’’ అని సిఎంకు చెప్పారు. ఎర్రబాలెంలో నిరసన తెలుపుతున్న రైతులను పవన్ పరామర్శించారు. అమరావతిని రాజధానిగా ప్రస్తుత సిఎం జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా ఒప్పుకొన్నారని గుర్తు చేశారు.
2019-12-31జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్.పి.ఆర్) ప్రక్రియను చేపట్టడానికి రాష్ట్రాలు నిరాకరించజాలవని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘ఎన్.పి.ఆర్. అంటే జనగణనే. అదనపు వివరాలు తీసుకునేది సంక్షేమ కార్యక్రమాలకోసమే’’ అని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్.సి.ఆర్)కు అవసరమైన సమాచారాన్ని ఎన్.పి.ఆర్. ప్రశ్నావళిలో కోరుతుండటంతో కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి.
2019-12-31ఆడవాళ్ళు అర్దరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని మహాత్మా గాంధీ అప్పుడెప్పుడో చెప్పారు. కానీ, ఇప్పుడు దేశమంతా హత్యాచారాలు పెరిగాయి. అధికారిక లెక్కల ప్రకారమే రోజుకు 100కు రేప్ కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేరళ ప్రభుత్వం ‘మహిళల అర్దరాత్రి నడక’ చేపట్టి భద్రతకు భరోసా ఇచ్చింది. 29వ తేదీ (2012లో నిర్భయ మరణించిన రోజు) రాత్రి 11 నుంచి 1 గంటవరకు తిరువనంతపురం వీధుల్లో మహిళలు కలియదిరిగారు.
2019-12-30వచ్చే ఐదేళ్లలో ఢిల్లీని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతానని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్ సోమవారం దుర్గాపురి చౌక్ వద్ద టౌన్ హాలు సమావేశంలో మాట్లాడారు. ఇటీవల తీసుకున్న కొన్ని చర్యల వల్ల కాలుష్యం 25 శాతం తగ్గిందని చెప్పారు. ‘‘మళ్ళీ ఎన్నికైతే, నేను ఢిల్లీ నగరాన్ని వచ్చే ఐదేళ్ళలో కాలుష్య రహిత నగరంగా మారుస్తా’’ అని కేజ్రీవాల్ ఉద్ఘాటించారు.
2019-12-30ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి వద్ద సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ‘షార్ట్ సర్క్యూట్’ కారణంగా ఎస్.పి.జి (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు) రిసెప్షన్ ప్రాంతంలో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించిందని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. అగ్నిప్రమాద సమాచారం తెలియగానే 9 ఫైర్ ఇంజన్లు అక్కడికి తరలి వచ్చాయి. ప్రధానమంత్రి నివాస ప్రాంతంలోగానీ, కార్యాలయ ప్రాంతంలో గానీ ప్రమాదం జరగలేదని పిఎంఒ తెలిపింది.
2019-12-30భారత సైన్యం, నావికా, వైమానిక దళాలకు ఉమ్మడి అధిపతిగా జనరల్ బిపిన్ రావత్ నియమితులయ్యారు. కొత్తగా సృష్టించిన త్రివిధ దళాల అధిపతి (సిడిఎస్) పోస్టులో నియమితుడైన తొలి వ్యక్తి బిపిన్ రావత్. ఇప్పటిదాకా ఆయన సైన్యానికి అధిపతిగా పని చేశారు. త్రివిధ దళాలకు విడివిడిగా అధిపతులు ఉంటారు. సి.డి.ఎస్. మూడు విభాగాల మధ్య సమన్వయం చేస్తారు. రక్షణ శాఖలో కొత్తగా ఏర్పాటు చేసిన మిలిటరీ వ్యవహారాల శాఖకు కూడా బిపిన్ రావత్ నేతృత్వం వహిస్తారు.
2019-12-30వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ వృత్తి విద్యా కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. 2020 ఏప్రిల్ 20-24 తేదీల్లో ఎంసెట్, ఏప్రిల్ 30న ఇ-సెట్, అదే నెల 27న ఐ-సెట్, మే 2,3,4 తేదీల్లో పి.జి.ఇ. సెట్, మే 8న లాసెట్, మే 9న ఇ.డి.సెట్ నిర్వహించాలని నిర్ణయించారు. ‘ఎంసెట్’ను కాకినాడ జె.ఎన్.టి.యు, ‘ఇ-సెట్’ను అనంతపురం జె.ఎన్.టి.యు నిర్వహిస్తాయి. ‘ఐ-సెట్’, ‘పి.జి.ఇ.సెట్’లను ఎస్.వి. వర్శిటీ నిర్వహించనుంది.
2019-12-30