స్పెయిన్ యువరాణి మారియా తెరెసా (86) ‘కరోనా వైరస్’ కారణంగా మరణించారు. ఆమె గురువారం పారిస్ నగరంలో మరణించగా శుక్రవారమే అంత్యక్రియలు నిర్వహించారు. మరణ వార్తను ఆలస్యంగా వెల్లడించారు. మారియా ‘కరోనా’ సోకి మరణించినట్టు ఆమె సోదరుడు సిక్స్టో ఎన్రిక్ డి బోర్బన్ ‘ఫేస్ బుక్’లో ఈరోజు వెల్లడించారు. స్పెయిన్ రాజు ‘ఫెలిపె-6’ కి మారియా కజిన్. 1933 జూలై 28న జన్మించిన మారియా పారిస్ నగరంలో చదువుకొని అక్కడే ప్రొఫెసర్ గా పని చేశారు. ముక్కుసూటి మనస్తత్వం, విమర్శనాత్మక ధోరణి వల్ల మారియాను ‘రెడ్ ప్రిన్సెస్’ అని పిలిచేవారు.
2020-03-29ప్రపంచవ్యాప్తంగా ‘కరోనా’ వైరస్ సోకి మరణించినవారి సంఖ్య 30 వేలు దాటింది. ఆదివారం వేకువ జామున 4.00 గంటల సమయానికి ‘కరోనా’ కేసుల సంఖ్య 6,57,691కి పెరిగింది. అందులో 30,475 మంది (4.63%) మరణించారు. అమెరికాలో అత్యధికంగా 1,21,117 కేసులు నమోదు కాగా, కేసుల సంఖ్యలో (92,472) రెండో స్థానంలో ఉన్న ఇటలీలో మరణాలు అత్యధికంగా (10,023) నమోదయ్యాయి. స్పెయిన్ కూడా కేసుల సంఖ్యలో చైనాను సమీపిస్తోంది. చైనాలో ‘కరోనా’ పాజిటివ్ కేసులు 81,999 కాగా, స్పెయిన్ లో ఇప్పటిదాకా 72,469 నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా గత 36 గంటల్లోనే లక్ష కేసులు నమోదయ్యాయి.
2020-03-29‘లాక్ డౌన్’తో వలస కార్మికులు కష్టాల పాలవడమే కాదు.. ప్రాణాలూ కోల్పోతున్నారు. శనివారం వేకువ జామున ముంబై- అహ్మదాబాద్ రహదారిపై ఓ ట్రక్కు తొక్కేయడంతో నలుగురు మరణించారు. మరో ముగ్గురు వలస కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. దేశమంతా ఆంక్షలు విధించడంతో మహారాష్ట్ర నుంచి ఏడుగురు కూలీలు రాజస్థాన్ లోని సొంత గ్రామాలకు కాలి నడకన బయలుదేరారు. వారిని గుజరాత్- మహారాష్ట్ర సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకొని వెనుకకు పంపారు. తిరిగి వసాయిలోని తమ నివాసాలకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ‘లాక్ డౌన్’తో ఉపాధి కోల్పోయి సొంత ప్రాంతాలకు వందల కిలోమీటర్లు కాలినడకన బయలుదేరిన వేలాది మందిలో ఈ ఏడుగురూ ఉన్నారు.
2020-03-28‘కరోనా’ మహమ్మారి ఇటలీపై తీవ్రంగా విరుచుకుపడింది. శనివారం సాయంత్రానికి (స్థానిక కాలమానం) ఆ దేశంలో వైరస్ సోకి మరణించినవారి సంఖ్య 10,023కు పెరిగింది. మరణాల రేటు 10.84 శాతానికి పెరగడం ఆందోళనకరం. అంటే సుమారుగా వైరస్ సోకిన ప్రతి 9 మందిలో ఒకరు చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన ‘కరోనా’ మరణాల్లో 33.58 శాతం ఇటలీలోనే సంభవించాయంటే.. ఆ దేశంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్దం చేసుకోవచ్చు. ఇటలీలో ఇప్పటిదాకా 92,472 మందికి వైరస్ సోకింది. వారిలో కోలుకున్నది 12,384 మంది (13.39 శాతం) మాత్రమే. ఇంకా 70,065 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
2020-03-28మార్చి 24 రాత్రి 12 గంటలకు దేశమంతటినీ దిగ్బంధించనున్నట్టు 4 గంటల వ్యవధి కూడా ఇవ్వకుండా (8 గంటల తర్వాత) ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. తల దాచుకోవడానికి గూడు, ప్రయాణానికి సదుపాయం లేని లక్షల మంది వలస కార్మికులకు ఈ దిగ్బంధం పెనుశాపమైంది. మండుటెండల్లో.. మాడే కడుపులతో.. మంచినీళ్ళూ మృగ్యమై.. భార్యా పిల్లలతో వందల కిలోమీటర్లు నడిచి సొంత ప్రాంతాలకు చేరుతున్న శ్రామికుల వెతలు వర్ణనాతీతం. ‘కరోనా’ అనే ప్రకృతి వికృతానికి పాలకులు జోడించిన ఉత్పాతమిది. ఆకలితో అలసిన గుంపులకు ఆ మహమ్మారి ముప్పు మరింత ఎక్కువ. అధికారానికి ఇంగితజ్ఞానం అవసరమని రుజువుచేస్తున్న దృశ్యాలివి.
2020-03-28కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే యుద్ధంలో టాటా గ్రూపు సంస్థలు భాగమయ్యాయి. టాటా ట్రస్టులు, టాటా సన్స్, టాటా గ్రూపు కంపెనీలన్నీ కలిపి ఇందుకోసం రూ. 500 కోట్లు కేటాయించాయి. వైరస్ నుంచి రక్షణకోసం వైద్య సిబ్బందికి వ్యక్తిగత సాధనాలు, రోగులకు అవసరమైన శ్వాస పరికరాలు, పరీక్షలను పెంచడానికి టెస్టింగ్ కిట్లు, చికిత్సా సదుపాయాల ఏర్పాటు, సిబ్బంది శిక్షణ కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్టు టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ రతన్ టాటా శనివారం వెల్లడించారు. మానవ జాతి ఎదుర్కొంటున్న కఠిన పరీక్షల్లో ‘కరోనా’ ఒకటి అని రతన్ టాటా పేర్కొన్నారు.
2020-03-28‘కరోనా వైరస్’తో తెలంగాణలో తొలి మరణం శనివారం నమోదైంది. హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ ప్రాంతంలో ఓ వృద్ధుడు కరోనా బారిన పడి మరణించారు. ఆయన కుటుంబ సభ్యులను ‘క్వారంటైన్’లో ఉంచారు. శనివారం తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 65కు పెరిగింది. కుత్బుల్లాపూర్ లో ఒకే కుటుంబంలోని నలుగురికి వైరస్ సోకినట్టు మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఢిల్లీలో ప్రార్ధనా మందిరాలకు వెళ్లి వచ్చినవాళ్లకు, వారి ద్వారా కుటుంబ సభ్యులకు వైరస్ సోకిందన్న మంత్రి.. ఎవరూ ప్రార్ధనా మందిరాలకు వెళ్లవద్దని కోరారు. హైదరాబాద్ నగరంలో రెడ్ జోన్లు లేవని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు కొనసాగుతాయని ఆయన తెలిపారు.
2020-03-28‘కరోనా’ పర్యవసానాలు ఊహించనలవి కాకుండా ఉన్నాయి. హోం క్వారంటైన్లో ఉన్న ఓ వ్యక్తి రాత్రిపూట నగ్నంగా బయటకు పరుగెత్తి.. ఇంటి బయట నిద్రిస్తున్న ఓ (90 ఏళ్ల) వృద్ధురాలి గొంతు కొరికి చంపాడు. తమిళనాడులోని థేని జిల్లాలో శుక్రవారం రాత్రి ఈ దారుణం జరిగింది. వారం రోజుల క్రితం శ్రీలంక నుంచి తిరిగొచ్చిన ఈ దుస్తుల వ్యాపారి (34 సంవత్సరాలు) ‘హోం క్వారంటైన్’లో మానసికంగా కుంగిపోయాడని చెబుతున్నారు. ఆ స్థితిలో శుక్రవారం రాత్రి నగ్నంగా బయటకు పరుగెత్తాడు. నాచియమ్మళ్ అనే వృద్ధురాలు తన ఇంటి బయట నిద్రిస్తుండగా ఆమె గొంతు కొరికాడు. చుట్టుప్రక్కల వారు ఆమె కేకలు విని బయటకు వచ్చి అతనిని పోలీసులకు అప్పగించారు. గాయపడిన వృద
2020-03-28‘కరోనా’ తొలి కేసు నమోదైన దాదాపు రెండు నెలల తర్వాత కేరళలో శనివారం ఓ వ్యక్తి వైరస్ కారణంగా చనిపోయారు. కొచ్చిలో ఓ 69 సంవత్సరాల వ్యక్తి ‘కోవిడ్19’తో మరణించినట్టు కేరళ ప్రభుత్వం నిర్ధారించింది. ఇండియాలో మొదటి ‘కరోనా’ కేసు జనవరి 30న కేరళలో నమోదైంది. మార్చి 1 వరకు కేరళలో మాత్రమే 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 26 రోజుల్లో దేశవ్యాప్తంగా 900 కేసులు, 20 మరణాలు నమోదయ్యాయి. కేసుల సంఖ్యలో మహారాష్ట్రతో సమానంగా ఉన్నా... నిన్నటిదాకా కేరళలో ఒక్కరు కూడా మరణించలేదు. అదే సమయంలో మహారాష్ట్రలో ఐదుగురు, గుజరాత్ లో ముగ్గురు చనిపోయారు.
2020-03-28తాజా సమాచారం ప్రకారం ఇండియాలో 902 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. వారిలో 83 మంది కోలుకోగా 20 మంది చనిపోయారు. గురువారం రాత్రి వరకు 627 కేసులు నమోదు కాగా, శుక్రవారం ఒక్క రోజే 160 మందికి వైరస్ నిర్ధారణ అయింది. శనివారం ఉదయానికి మరో 15 కేసులు నమోదయ్యాయి. తాజాగా పెరిగిన కేసుల్లో ఎక్కువ భాగం స్థానికంగా వ్యాపించినవే కావడం ఆందోళన కలిగించే పరిణామం. విదేశాల నుంచి వచ్చినవారి వల్ల కొందరికి, వారి నుంచి మరికొందరికి వ్యాపించినట్టు వార్తలు వస్తున్నాయి. కరోనా కేసుల్లో మహారాష్ట్ర, కేరళ ముందున్నాయి. మహారాష్ట్రలో ఐదుగురు చనిపోగా కేరళలో మరణాలు లేవు.
2020-03-28