తెలంగాణలో రైతులకు ఇస్తున్నంత సాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందా? అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. శనివారం హైదరాబాదులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘‘అక్కడ రైతు భరోసా అని రూ. 12,500 ఇస్తున్నారు. ఇక్కడ ఐదెకరాల రైతుకు 50,000 ఇస్తున్నాం. ఇక్కడ కుంట భూమి ఉన్న రైతు చనిపోయినా రూ. 5 లక్షలు ఇంటికొస్తున్నాయి. అక్కడ (ఏపీలో) వస్తుందా?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇలా తెలంగాణలో 25 పథకాలున్నాయని, మరే రాష్ట్రంలోనూ లేవని ఉద్ఘాటించారు.
2019-11-02సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రిలోగా డ్యూటీలో చేరితే ఉద్యోగాలకు ఢోకా ఉండదని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అల్టిమేటమ్ జారీ చేశారు. ఆలోగా రాకపోతే ఉద్యోగ భద్రతకు తాను హామీ ఇవ్వలేనని, ఆర్టీసీ మొత్తం రూట్లలో ప్రైవేటు బస్సులకు అనుమతి ఇస్తామని హెచ్చరించారు. 5,100 ప్రైవేటు బస్సు రూట్లకు అనుమతి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకోగా, 5వ తేదీలోపు సమ్మె విరమించకపోతే మరో 5000 రూట్లనూ ప్రైవేటు బస్సులకు ఇస్తామని స్పష్టం చేశారు.
2019-11-02తెలంగాణలోని 5,100 రూట్లలో 5,100 ప్రైవేటు బస్సులకు అనుమతి ఇవ్వాలని ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆర్టీసీలో 2,100 ప్రైవేటు అద్దె బస్సులు నడుస్తున్నాయని, ఆర్టీసీ వద్ద ఉన్న 8,200 బస్సులలో 2,609 కాలం చెల్లినవని, మరికొద్ది నెలల్లో మరో 3-4 వందల బస్సులకు కాలం చెల్లుతుందని, వాటన్నిటి స్థానంలో ప్రైవేటు బస్సులకు రూటు పర్మిట్లు ఇస్తామని కేసీఆర్ చెప్పారు. కొత్త బస్సులు కొనే పరిస్థితి ఆర్టీసీకి లేదని స్పష్టం చేశారు.
2019-11-02వాయుకాలుష్యం ఢిల్లీలో సామాన్యుల జీవనాన్ని దుర్భరం చేస్తోంది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో గళమెత్తుతున్నారు. #DelhiBachao అనే నినాదం ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండింగ్ అంశం. ఢిల్లీ సుందర దృశ్యాలు వాయు కాలుష్యం మాటున ఎలా మరుగునపడిందీ తమ సెల్ ఫోన్లలో చిత్రించి పోస్టు చేస్తున్నారు. అందులో ఒకానొక ఫొటో ఇది. దానికి ఒక నెటిజెన్ పెట్టిన క్యాప్షన్ ‘‘ఒకానొక సమయంలో ఇక్కడ ఇండియా గేట్ ఉండేది’’. మరో మహిళా జర్నలిస్టు తన వీడియో పోస్టుకు ‘‘హలో ఇండియా గేట్, ఎక్కడున్నావ్’’ అని క్యాప్షన్ పెట్టారు.
2019-11-02గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఐఎఎస్ అధికారి సతీష్ చంద్రకు, సిఎం జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత పాత సిఎంఒ అధికారులను తప్పించిన సిఎం జగన్, తర్వాత వారిలో ఒక్కరికే పోస్టింగ్ ఇచ్చారు. మిగిలిన ముగ్గురిలో సతీష్ చంద్రను ఇంత కాలానికి ఉన్నత విద్య, నైపుణ్య శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ముఖ్య కార్యదర్శిగా పని చేసిన జి. సాయిప్రసాద్, కార్యదర్శిగా పని చేసిన ఎ. రాజమౌళి లకు ఇప్పటికీ పోస్టింగ్ ఇవ్వలేదు.
2019-11-02ఇసుక సంక్షోభంపై పవన్ కళ్యాణ్ శనివారం విశాఖలో తలపెట్టిన ‘లాంగ్ మార్చ్’ను రాష్ట్ర మంత్రులు కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్ తప్పు పట్టారు. అది ‘రాంగ్ మార్చ్’ అని అనిల్ వ్యాఖ్యానించారు. మంగళగిరిలో నివాసం ఏర్పాటు చేసుకున్న పవన్ కళ్యాణ్ ప్రకాశం బ్యారేజీ మీదుగా వెళ్లేప్పుడు ఓసారి నదిని చూస్తే ‘వరదలు ఉన్నప్పుడు ఇసుక ఎలా తీస్తారు’ అన్న ప్రశ్న తలెత్తేదని అనిల్ పేర్కొన్నారు. వరదల సమయంలో ఇసుక తీయడానికి ప్రయత్నిస్తే ప్రమాదాలు జరగవచ్చని, అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారని కన్నబాబు ప్రశ్నించారు.
2019-11-02‘‘టాటా ట్రస్ట్స్’’ నిర్వహణలో ఉన్న 6 ట్రస్టుల గుర్తింపును ఆదాయ పన్ను శాఖ రద్దు చేసింది. ట్రస్టుల కార్యకలాపాలు ‘ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్’కు అనుగుణంగా లేనందున ఈ చర్య తీసుకున్నట్టు ఐటీ శాఖ రద్దు ఉత్తర్వులలో తెలిపింది. దీంతో.. టాటా సంస్థలు రూ. 12 వేల కోట్ల మేరకు పన్ను చెల్లించాల్సి వస్తుందని అంచనా. రద్దయిన సంస్థలలో... జంషెడ్జీ టాటా ట్రస్టు, ఆర్.డి. టాటా ట్రస్టు, టాటా ఎడ్యుకేషన్ ట్రస్టు, టాటా సోషల్ వెల్ఫేర్ ట్రస్టు, సార్వజనిక్ సేవా ట్రస్టు, నవాజ్ బాయి రతన్ టాటా ట్రస్టు ఉన్నాయి.
2019-11-02జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి బాగాలేదని, ప్రజలు అస్థిర పరిస్థితుల్లో జీవిస్తున్నారని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ వ్యాఖ్యానించారు. ఇండియా పర్యటనకు వచ్చే సమయంలో తనతో ఉన్న పాత్రికేయులతో ఆమె మాట్లాడారు. శుక్రవారం సాయంత్రం ఇండియా ప్రధాని నరేంద్ర మోదీతో చర్చల సందర్భంగా ఈ అంశాన్ని లేవనెత్తుతానని కూడా ఏంజెలా చెప్పారు. జమ్మూ కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని ఉపసంహరించి రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ప్రజలు ఆంక్షల మధ్య నివసిస్తున్న సంగతి తెలిసిందే.
2019-11-01ఢిల్లీ తీస్ హజారీ కోర్టులో పోలీసులు, లాయర్ల మధ్య శనివారం ఘర్షణ జరిగింది. ఇది హింసాత్మకంగా మారడంతో ఒక లాయర్ గాయపడ్డారు. మండిపడ్డ లాయర్లు పోలీసు వాహనానికి నిప్పంటించారు. కాల్పులు కూడా జరిగినట్టు చెబుతున్నారు. గాయపడిన లాయర్ ను ఆసుపత్రికి తరలించారు.
2019-11-02వచ్చే ఐదేళ్లలో ఇండియాలో పర్యావరణ అనుకూల పట్టణ రవాణాపై 1 బిలియన్ యూరోల మేరకు పెట్టుబడి పెట్టనున్నట్టు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ చెప్పారు. భారతీయ కరెన్సీలో శనివారం నాటి మారకం విలువ ప్రకారం ఆ మొత్తం రూ. 7,914 కోట్లు. అందులో ఐదో వంతు (200 మిలియన్ యూరోలు) తమిళనాడులో బస్సులను సంస్కరించడానికి వినియోగించనున్నట్టు ఏంజెలా శనివారం చెప్పారు. ఢిల్లీ కాలుష్యంపై మాట్లాడుతూ...డీజిల్ బస్సులను మార్చి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాల్సి ఉంటుందని చెప్పారు.
2019-11-02