కేరళలో కొత్తగా 12 మందికి ‘కరోనా వైరస్’ నిర్ధారణ అయింది. ఆ 12 మందీ గల్ఫ్ దేశాలనుంచి తిరిగి వచ్చినవారే. కన్నూరుకు చెందిన ముగ్గురు, కాసర్ గోడ్ ప్రాంతంవారు ఆరుగురు, ఎర్నాకుళం వాసులు ముగ్గురు కొత్తగా ‘కరోనా’ బాధితుల జాబితాలో చేరారు. వీరితో కలిపి కేరళలో మొత్తం ‘కరోనా’ సోకినవారి సంఖ్య శనివారం 52కు పెరిగింది. మొట్టమొదటి కేసు నమోదైన కేరళలో ‘కరోనా’ నిరోధానికి గట్టి చర్యలే తీసుకున్నారు. తొలి దశలో ‘కరోనా’ సోకినవారికి వ్యాధి నయమై ఇళ్ళకు వెళ్లారు. అయితే, గల్ఫ్ దేశాల నుంచి రాకపోకలు ఎక్కువ కావడం కేరళకు పెద్ద సమస్య. ఆయా దేశాల్లో లక్షలమంది మలయాళీలు నివసిస్తున్నారు.
2020-03-21‘కరోనా వైరస్’ కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జన సంచారాన్ని పరిమితం చేసే అనేక చర్యలు చేపడుతున్నాయి. అందులో భాగంగా ఢిల్లీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఏకంగా ఒక్క రోజుకు కుదించారు. ఇంతకు ముందు నిర్ణయం ప్రకారం ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు 5 రోజులు జరగాల్సి ఉంది. తాజా పరిణామాల మధ్య.. సోమవారం ఒక్క రోజే బడ్జెట్ ను ప్రవేశపెట్టి ఆమోదించాలని నిర్ణయించారు. అవసరమైతే మొత్తం ఢిల్లీని మూసేస్తామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ శనివారం ప్రకటించారు.
2020-03-21ఇండియాలో ‘ఆంక్షలు’ పేదలపై అధిక ప్రభావాన్ని చూపితే వీఐపీలు ‘ప్రత్యేక హక్కులు’ అనుభవిస్తుంటారు. ఇప్పుడు ‘కరోనా’పై పోరాటాన్ని కూడా నీరుగారుస్తున్నాయి ఆ ‘వీఐపీ హక్కు’లు. బాలీవుడ్ గాయని కనికా కపూర్ లండన్ నుంచి వస్తే అధికార గణం పట్టించుకోలేదు. ఆమెకు ‘కరోనా పాజిటివ్’ తేలడంతో.. పార్టీలలో కలసిమెలసి తిరిగిన మాజీ సీఎం వసుంధర రాజె, ఆమె కుమారుడు-ఎంపీ దుష్యంత్ సింగ్ సహా అనేకమందికి ‘సెల్ఫ్ క్వారంటైన్’ తప్పలేదు. హైదరాబాద్ విమానాశ్రయంలో దిగినవారిని ‘క్వారంటైన్’కు తరలిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, అమెరికా నుంచి వచ్చిన తమ ఎమ్మెల్యే కోనప్పను మాత్రం ‘సెల్ఫ్ క్వారంటైన్’లోనూ ఉంచలేదు.
2020-03-21‘‘బిల్ గేట్స్, జాక్ మా వంటి వారు ‘కరోనా’పై పోరాటంలో తమ దేశానికే కాకుండా ఇతర దేశాలకు పెద్ద మొత్తంలో సాయం చేస్తున్నారు. మరి ఇండియన్ బిలియనీర్లు బాల్కనీలో నిలబడి చప్పట్లు చరిచి చేతులు దులుపుకుంటారా?’’.. సామాజిక మాథ్యమాల్లో ఎదురవుతున్న ప్రశ్న ఇది. రూ. లక్షల కోట్లలో ఏటా పొందే రాయితీలు, బ్యాంకు రుణాల మాఫీతో పాటు.. ఈ ఏడాది పన్ను తగ్గింపు ద్వారా మరో రూ. 1,46,000 కోట్ల అదనపు లబ్ది పొందారు భారత పారిశ్రామికవేత్తలు. కానీ, ‘కరోనా వైరస్’ వంటి మహమ్మారిని నిరోధించే చర్యల్లో భాగం కావడంలేదనే విమర్శలను ఎదుర్కొంటున్నారు.
2020-03-21కరోనా వైరస్ ఇటలీని అతలాకుతలం చేస్తోంది. శుక్రవారం ఒక్క రోజే ఆ దేశంలో 627 మంది మరణించారు. వీరితో కలిపి ఇటలీ ‘కరోనా’ మృతుల సంఖ్య 4,032కు పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ‘కరోనా’తో మరణించినవారిలో ఇటాలియన్లు 36.17 శాతం. మరణాల్లో గురువారమే చైనాను మించిన ఇటలీ, మరింత ప్రమాదం దిశగా సాగుతోంది. దేశంలో ‘కరోనా’ సోకినవారు 47,021 కాగా.. వారిలో 8.57 శాతం చనిపోయారు. ప్రధాన దేశాల్లో ఇదే అత్యధిక మరణాలు రేటు. చైనాలో 81,250 కేసులకు గాను 3253 మరణాలు (4.0 శాతం), ఇరాన్ లో 19,644 కేసులకు గాను 1433 (7.29 శాతం), స్పెయిన్ లో 19,980 కేసులకు గాను 1002 మరణాలు (5.01 శాతం) సంభవించాయి.
2020-03-20ప్రపంచ వ్యాప్తంగా ‘కరోనా వైరస్’ కారణంగా మరణించినవారి సంఖ్య శుక్రవారం 11,147కి పెరిగింది. వైరస్ సోకినవారి సంఖ్య 2,65,495కు చేరుకోగా.. అందులో 87,363 మంది కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొత్త కేసులు గురువారం 27,800, శుక్రవారం 22,800 నమోదయ్యాయి. చైనాలో కేసులు 81,250కి పరిమితం కాగా ఇటలీలో 47,021కి, స్పెయిన్ లో 20,410కి పెరిగాయి. కేసుల సంఖ్యలో ఇరాన్ (19,644)ను మంచిపోయింది జర్మనీ (19,711). వెయ్యికి పైగా మరణాలు సంభవించిన దేశాల్లో ఇటలీ, చైనా లకు తోడు ఇరాన్, స్పెయిన్ చేరాయి. అమెరికాలోనూ కరోనా సోకినవారి సంఖ్య 16,018కి పెరిగింది.
2020-03-20రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ హైదరాబాద్ నుంచి పని చేయడం ప్రారంభించారు. శుక్రవారం అక్కడి కార్యాలయం నుంచే విజయవాడలోని కమిషన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. రెండు రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రిపైనే నేరుగా ఆరోపణలు చేస్తూ.. తనకు, తన కుటుంబానికి ముప్పు ఉందని కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రమేష్ కుమార్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాను హైదరాబాద్ లోనే ఉండాలనుకుంటున్నట్టు రమేష్ కుమార్ ఆ లేఖలోనే తెలిపారు. అయితే, శుక్రవారం నాటి ప్రకటనలో మాత్రం.. ‘కరోనా’ వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరాన్ని పాటిస్తున్నానని పేర్కొన్నారు.
2020-03-20ఆపత్సమయాల్లో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం ఎలా వ్యవహరించాలో కేరళ సిఎం పినరయి విజయన్ మరోసారి చూపించారు. ‘కరోనా వైరస్’పై పోరాటానికి స్థానిక సంస్థల ప్రతినిధులను సిద్ధం చేసే ప్రయత్నంలో ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితలను భాగస్వామిని చేశారు. గురువారం వారిద్దరూ కలసి మీడియా సమక్షంలో కేరళ విద్యా శాఖ ఛానల్ ‘విక్ట్రెస్’ ద్వారా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉద్ధేశించి ప్రసంగించారు. ‘కరోనా’పై అవగాహన పెంచడంలో, ‘హోమ్ క్వారంటైన్’లో ఉన్న 26,000 మందిని పర్యవేక్షించడంలో కేరళ స్థానిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
2020-03-20‘ఒక ప్రదేశంలో కరోనా వైరస్ జీవితం 12 గంటలు! జనతా కర్ఫ్యూ 14 గంటలు! కరోనా బతికి ఉన్న బహిరంగ ప్రదేశాలు 14 గంటల తర్వాత వైరస్ లేని ప్రాంతాలుగా మారతాయి!’.. ‘వాట్సాప్’లో నిన్నటినుంచీ విస్తృతంగా తిరుగుతున్న సందేశమిది. ప్రధాని మోడీ పిలుపును జయప్రదం చేయడానికి ఆయన అంతర్జాల భక్తజనం కంకణం కట్టుకోవడం సహజమే! అయితే, ఆ 14 గంటల్లోనే ‘కరోనా’ చచ్చిపోతుందని చేసే ప్రచారం అశాస్త్రీయమని నిపుణులు తప్పుపడుతున్నారు. ఆదివారం ప్రజలు ఇళ్ళలోనే ఉంటారు. ఇప్పుడు ‘కరోనా’ భయం తోడైంది. మోడీ ఆ రోజును ఎంచుకోవడం వ్యూహాత్మకమే! భవిష్యత్ ఆంక్షలకు ఇదో ట్రైలర్ మాత్రమే!!
2020-03-20‘కరోనా వైరస్’ వ్యాపిస్తున్నందున తెలంగాణలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. రేపు (మార్చి 21న) జరగాల్సిన పరీక్షను నిర్వహించి.. 23వ తేదీనుంచి 30 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలకు మళ్లీ షెడ్యూలు ప్రకటించాలని సూచించింది. తెలంగాణలో పాఠశాలలను మూసివేసినా పదో తరగతి పరీక్షలను మాత్రం కొనసాగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అత్యవసరంగా విచారణ చేపట్టిన హైకోర్టు.. పిటిషనర్ వాదనతో ఏకీభవించి పరీక్షల వాయిదాకు ఆదేశించింది.
2020-03-20