ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలల ప్రారంభాన్ని ప్రభుత్వం మరోసారి వాయిదా వేసింది. ‘కరోనా’ వ్యాప్తి తీవ్రంగానే ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత నిర్ణయం ప్రకారం పాఠశాలలు అక్టోబర్ 5న ప్రారంభం కావలసి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియా కాన్ఫరెన్స్ ద్వారా కరోనా ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష జరిపారు.
2020-09-29లెక్కకు మిక్కిలి బిరుదులు గల అసమాన గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం చెన్నైలో కన్ను మూశారు. కరోనా నుంచి కోలుకున్నా... ఇతర ఆరోగ్య సమస్యలు ఆయనను కబళించాయి. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళం, హిందీలతో పాటు 16 భాషలలో 40 వేలకు పైగా పాటలు పాడి రికార్డులు బద్దలు కొట్టిన శిఖర సమానుడు బాలు. గత కాలపు సూపర్ స్టార్లు మొదలుకొని నేటి యువ హీరోల వరకు కొన్ని వందల మందికి పాటలు పాడటంతో పాటు కమల్ హాసన్ వంటి అద్భుత నటులకు గాత్రదానం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. మాటలు, పాటల్లో మిమిక్రీని జోడించి వైవిధ్యభరితంగా అలరించిన గొప్ప కళాకారుడు. భౌతికంగా దూరమైనా ఆయన స్వరం అజరామరం.
2020-09-26ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సభ్యత్వం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి బలంగా గళమెత్తారు. ‘ఐరాస’ నిర్ణయాత్మక విభాగాల నుంచి ఇండియాను ఎంత కాలం వెలుపల ఉంచుతారని ప్రశ్నించారు. మోదీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐరాస సాధారణ అసెంబ్లీని ఉద్ధేశించి హిందీలో ప్రసంగించారు. ‘ఐరాస’లో సంస్కరణలు తక్షణ అవసరమని ఉద్ఘాటించారు. ‘‘ఈ దేశం వందలాది భాషలు, అనేక జాతులు, అనేకానేక భావజాలాలు కలిగిన దేశం. శతాబ్దాలుగా ప్రపంచంలో ప్రముఖ ఆర్థిక వ్యవస్థ. ఈ దేశంలో జరుగుతున్న మార్పులు ప్రపంచంలోని ఎక్కువ భాగాన్ని ప్రభావితం చేస్తున్నవేళ ఇంకా ఎంత కాలం వేచి చూడాలి’’ అని మోదీ ప్రశ్నించారు.
2020-09-27కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకమంటూ కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకున్న శిరోమణి అకాలీదళ్, తాజాగా ఎన్.డి.ఎ.కి కూడా టాటా చెప్పింది. ఈ మేరకు ఎస్.ఎ.డి. కోర్ కమిటీ శనివారం ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు పార్టీ అధినేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ కార్యాలయం ఒక ట్వీట్ లో పేర్కొంది. బిజెపి నేతృత్వంలోని ఎన్.డి.ఎ.లో అకాలీదళ్ చిరకాల, విశ్వసనీయ భాగస్వామిగా వ్యవహరించింది. వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్, కనీస మద్ధతు ధరకు భరోసా ఇచ్చే మార్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మొండిగా నిరాకరించిందని, పంజాబీలు- సిక్కుల సమస్యల పట్ల నిర్లక్ష్యం చూపుతోందని అకాలీదళ్ ఆరోపించింది.
2020-09-26అత్యంత వివాదాస్పదమైన వ్యవసాయ రంగ బిల్లులను ఆదివారం రాజ్యసభ ‘ఆమోదించింది’. రైతులను పరాధీనులను చేసే దుర్మార్గమైన అంశాలు ఈ రెండు బిల్లుల్లో ఉన్నాయంటూ ప్రతిపక్షాలు అడ్డుపడినా ‘మూజువాణి’ ఓటుతో అధికార పక్షం ఆమోదపు తంతును ముగించింది. రైతు ఉత్పత్తుల వాణిజ్యం (ప్రోత్సాహం, సౌలభ్యం) బిల్లు, రైతుల (సాధికారత, రక్షణ) ధరల భరోసా ఒప్పందం మరియు వ్యవసాయ సేవల బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల సూచనను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఓటింగ్ నిర్వహించాలని పట్టుపట్టినా వినలేదు. ఆందోళనకు దిగిన ప్రతిపక్ష సభ్యులు బిల్లు ప్రతులను చించి విసిరేశారు.
2020-09-20సూర్యుడి నుంచి రెండవది, భూమి కంటే ముందున్న గ్రహం వీనస్ పైన సూక్ష్మజీవుల ఆనవాళ్ళు ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. వీనస్ ఉపరితలానికి 50 నుంచి 60 కిలోమీటర్ల ఎత్తులోని మేఘాల్లో అరుదైన ఫాస్ఫీన్ గ్యాస్ తక్కువ స్థాయిలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భూమిపైన ఆక్సిజన్ రహిత ప్రాంతాల్లో నివశించే సూక్ష్మజీవులు ఫాస్ఫీన్ అణువులను ఉత్పత్తి చేస్తాయని, కాబట్టి వీనస్ మేఘాల్లో కూడా సూక్ష్మజీవులు ఉండవచ్చని భావిస్తున్నారు. వీనస్ ఉపరితలంపై ఉండే సగటు ఉష్టోగ్రత 464 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఏ జీవీ బతికే అవకాశం లేదు. అయితే, వీనస్ మేఘాల్లో (సుమారు 30 డిగ్రీలు) జీవం మనుగడ సాగించగలదని చెబుతున్నారు.
2020-09-14ఢిల్లీ అల్లర్లలో సహ కుట్రదారులంటూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, స్వరాజ్ అభియాన్ నాయకుడు యోగేంద్ర యాదవ్, ఆర్థికవేత్త జయతి ఘోష్, ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ అపూర్వానంద్, డాక్యుమెంటరీ నిర్మాత రాహుల్ రాయ్ లపై పోలీసులు అభియోగం మోపారు. కేంద్ర హోం శాఖ అధీనంలో ఉండే ఢిల్లీ పోలీసులు ఈమేరకు తాజాగా అనుబంధ చార్జ్ షీట్ నమోదు చేశారు. ఢిల్లీ అల్లర్లపై ఆ రాష్ట్ర పోలీసుల తీరు తొలినుంచీ వివాదాస్పదంగానే ఉంది. అసలు కుట్రదారులను వదిలేసి సిఎఎ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నవారిని కేసుల్లో ఇరికించారనే ఆరోపణలు వచ్చాయి.
2020-09-122020-21 సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ పతనం లోతెంత? పలు రేటింగ్, పరిశోధనా సంస్థలు జీడీపీ 10.5 శాతం నుంచి 14.8 శాతం వరకు తిరోగమిస్తుందని అంచనా వేశాయి. తాజాగా ‘క్రిసిల్’ దేశ స్థూల ఉత్పత్తి 9 శాతం క్షీణిస్తుందని అంచనా కట్టింది. మే నెలలో ఈ సంస్థ అంచనా - 5 శాతంగా ఉంది. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్ - జూన్) కాలానికి జీడీపీ 23.9 శాతం క్షీణించినట్లు ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించిన నేపథ్యంలో... పూర్తి ఆర్థిక సంవత్సరానికి అనేక సంస్థలు తమ అంచనాలను సవరించాయి. గోల్డ్ మన్ శాచ్ జీడీపీ 14.8 శాతం క్షీణిస్తుందని పేర్కొంది.
2020-09-10తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధమైన ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖకు డీజీపీ గౌతమ్ సవాంగ్ కార్యాలయం నుంచి లేఖ వెళ్లింది. అంతర్వేది ఆలయంలో 60 ఏళ్లుగా కళ్యాణోత్సవాల్లో భాగమైన 40 అడుగుల రథం శనివారం అర్ధరాత్రి తర్వాత తగలబడింది. దీనిపై హిందూ మత సంస్థలు ఆందోళనకు దిగాయి. రథం దగ్ధం వెనుక కుట్ర ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేశాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా పలువురు సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.
2020-09-10సోషల్ మీడియాను గరిష్టంగా ఉపయోగించుకున్న నేత నరేంద్ర మోడీ. ఆయన ఫొటోలు, వీడియోలకు లక్షల్లో లైకులు (ఇష్టాలు) సర్వ సాధారణం! అయితే, ఇప్పుడు పరిస్థితి తిరగబడినట్లు అనిపిస్తోంది. ‘మన్ కీ బాత్’ పేరిట ఆయన ఈ వారం చేసిన ఉపన్యాసపు వీడియోకి బిజెపి యూట్యూబ్ ఛానల్లో పది లక్షలకు పైగా ‘డిస్ లైక్’ (అయిష్టత)లు వ్యక్తమై సరికొత్త చర్చకు దారి తీశాయి. నిన్న ఇండో-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో ప్రసంగానికి కేవలం 11 వేల ఇష్టాలు వ్యక్తం కాగా, 95 వేలకు పైగా నెటిజన్లు అయిష్టత వ్యక్తం చేశారు. ఇప్పుడే ఐపిఎస్ ప్రొబేషనరీలను ఉద్ధేశించి ప్రధాని చేసిన ప్రసంగానికి కూడా ఇష్టాలకంటే భారీగా అయిష్టాలు వ్యక్తమయ్యాయి.
2020-09-04