‘కరోనా లాక్ డౌన్’ కారణంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షలను జూలై 10 నుంచి 15 వరకు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో హిందీ మినహా మిగిలిన సబ్జెక్టులకు రెండేసి పేపర్ల చొప్పున మొత్తం 11 రోజులు పరీక్షలు నిర్వహించేవారు. ఈసారి ఒక్కో సబ్జెక్టుకు ఒకే పరీక్ష (మొత్తం 6 పేపర్లు) నిర్వహించనున్నారు. ఈ మార్పునకు అనుగుణంగా నమూనా ప్రశ్నాపత్రాన్ని త్వరలో విడుదల చేస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం వెల్లడించారు. ఒకేషనల్ విద్యా పరీక్షలతో కలిపి మొత్తం షెడ్యూలు 17వ తేదీతో ముగుస్తుందని ఆయన తెలిపారు.
2020-05-14‘కరోనా’ నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ పేరిట కొత్త ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీ విలువ రూ. 20 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. అయితే, ఇందులో అన్నీ కొత్తవి కావు. ‘కరోనా’పై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు ప్రకటించిన చర్యలు, ఈ కొత్త ప్యాకేజీ కలిపి రూ. 20 లక్షల కోట్లుగా ప్రధాని పేర్కొన్నారు. ఇది భారత జీడీపీలో సుమారు 10 శాతం ఉంటుందని తెలిపారు. ల్యాండ్, లేబర్, లిక్విడిటీ ప్రధానాంశాలుగా... రైతులు, కూలీలు, కుటీర పరిశ్రమలను పరిగణనలోకి తీసుకొని ప్యాకేజీని రూపొందించినట్టు మోడీ చెప్పారు.
2020-05-12వివాదాస్పద ‘ఆరోగ్యసేతు’ మొబైల్ అప్లికేషన్ (యాప్) విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్బంధ విధానాన్ని అమలు చేస్తోంది. ప్రత్యేక రైళ్లలో ప్రయాణించడానికి ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం తప్పనిసరి చేసింది రైల్వే శాఖ. ఇప్పుడు దేశంలో విమానం ఎక్కాలన్నా ఈ యాప్ తప్పనసరి. పౌర విమానయాన శాఖ తాజాగా జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్.ఒ.పి)లో పేర్కొన్న తప్పనిసరి అంశాల్లో ఈ యాప్ కూడా ఉంది. ‘కరోనా వైరస్’ పాజిటివ్ కేసులు దగ్గరగా ఉంటే అలర్ట్ వస్తుందనే పేరిట ‘ఆరోగ్య సేతు’ను కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేసింది. అయితే, ప్రజలపై నిఘాకు మోడీ ప్రభుత్వం ఈ యాప్ ను ఉపయోగించుకుంటోందని ఆరోపణలు ఉన్నాయి.
2020-05-12మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్వస్థతతో ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరారు. 87 సంవత్సరాల మన్మోహన్ సింగ్ ఛాతీలో నొప్పి వస్తోందని చెప్పినట్టు ప్రాథమిక సమాచారం. ‘ఎయిమ్స్’ లోని కార్డియోథొరాసిక్ వార్డులో ఆయన ప్రస్తుతం ప్రొఫెసర్ నితీష్ నాయక్ పర్యవేక్షణలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ రెండు పర్యాయాలు (2004 - 2014) ప్రధానమంత్రిగా పని చేశారు. ప్రస్తుతం రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
2020-05-10దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగాయన్నది తెలుగు నానుడి. ఎస్.బి.ఐ. ఏకంగా నాలుగేళ్లకు నోరు తెరిచింది. సుగంధ ద్రవ్యాల ఎగుమతిదారు ‘రాందేవ్ ఇంటర్నేషనల్’ ఎస్.బి.ఐ. సహా 6 బ్యాంకుల నుంచి రూ. 414 కోట్లు రుణం తీసుకొని ఎగవేసింది. ఎస్.బి.ఐ. రుణం రూ. 173.11 కోట్లను 2016లోనే పారు బకాయిగా వర్గీకరించారు. అప్పటినుంచి ప్రమోటర్లు కనిపించడంలేదన్నది బ్యాంకు మాట. 2018లో ఎన్.సి.ఎల్.టి. ఇచ్చిన ఓ ఉత్తర్వుల ప్రకారం.. ప్రమోటర్లు దుబాయ్ కి పారిపోయారు. ఇప్పటిదాకా నిద్రపోయిన ఎస్.బి.ఐ. ఫిబ్రవరిలో సిబిఐకి ఫిర్యాదు చేయగా ఏప్రిల్ 28న సురేష్ కుమార్, నరేష్ కుమార్, సంగీతలపై కేసు నమోదైంది.
2020-05-09విశాఖపట్నం ‘ఎల్.జి. పాలిమర్స్’ వద్ద స్థానిక ప్రజలు చేపట్టిన ఆందోళన తీవ్రతరమైంది. గ్యాస్ లీకేజీ ఘటనలో మరణించినవారి మృతదేహాలతో ప్రజలు ఫ్యాక్టరీ ఎదుట బైఠాయించారు. విధ్వంసానికి కారణమైన కంపెనీ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పరిహారంతో సరిపెట్టడం ఏమిటని ప్రభుత్వంపైనా మండిపడ్డారు. ఆ సమయంలో రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) గౌతమ్ సవాంగ్ కొద్దిసేపు ఫ్యాక్టరీ లోపలే ఉన్నారు. ప్రమాదం తీరును పరిశీలించడానికి ఆయన శనివారం ఉదయం ఫ్యాక్టరీకి వెళ్ళారు. ఆందోళన జరుగుతుండగానే ఆయన బయటకు వెళ్లిపోయారు.
2020-05-09‘ఎల్.జి. పాలిమర్స్’ తరలింపుపై సిఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలని ఆర్ఆర్ వెంకటాపురం గ్రామస్థులు డిమాండ్ చేశారు. శనివారం ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేపట్టిన యువకులు ‘‘ఫ్యాక్టరీని తరలిస్తారా లేదా? ప్రజలు కావాలా యజమానులు కావాలా? తేల్చుకోండి’’ అని సిఎంను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. మొన్నటి లీకేజీకి మనుషులు, పశువులు మరణించడంతో పాటు చెట్లు మాడిపోయాయని, ఊరు స్మశానం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీలో ఇంకా లిక్విడ్ ట్యాంకర్లు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘జగన్ గారూ.. కె.జి.హెచ్.కు వచ్చి బాడీలను పరామర్శించడం కాదు. మా ఊరు రండి’’ అని డిమాండ్ చేశారు.
2020-05-09‘స్టైరిన్ గ్యాస్’ లీకేజీతో పలువురి మరణానికి, 1000 మందికి పైగా అస్వస్థతకు, చుట్టుప్రక్కల పర్యావరణ విధ్వంసానికి కారణమైన ‘ఎల్.జి. పాలిమర్స్’కు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేపట్టారు. శనివారం ఫ్యాక్టరీ వద్ద పోగైన ఆర్ఆర్ వెంకటాపురం గ్రామస్థులు కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘పాలిమర్స్’ను తక్షణమే తరలించాలని వారు డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ గేటు వద్దకు వెళ్తున్న యువకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంతమంది బారికేడ్ల వద్దనే బైఠాయించారు. గ్రామస్థులలో కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడినుంచి తరలించారు.
2020-05-09‘కరోనా’ మహమ్మారి చైనా, ఐరోపాలలో వ్యాపిస్తున్న కాలంలో తమ రాష్ట్రంలోకి 30 లక్షల మంది యూరోపియన్లు ఏ తనిఖీలు లేకుండా ప్రవేశించారని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో వెల్లడించారు. చైనా నుంచి ఫిబ్రవరి 2న, యూరప్ నుంచి మార్చి 16న ప్రయాణాలను నిషేదించగా.. ఆ మధ్య కాలంలో వైరస్ యూరోపియన్ దేశాలకు వ్యాపించిందని ఆయన శుక్రవారం వివరించారు. అయినా జె.ఎఫ్.కె. ఎయిర్ పోర్టు ఏప్రిల్ వరకు తెరిచే ఉందని గుర్తు చేశారు. డిసెంబర్- మార్చి మధ్య న్యూయార్క్, నేవార్క్, చికాగో లకు వచ్చిన 30 లక్షల యూరోపియన్ల ద్వారా తమ రాష్ట్రంలో వైరస్ వ్యాపించిందని క్యూమో వివరించారు.
2020-05-08‘కరోనా’ ఎవరికైనా వ్యాపిస్తుంది. అయితే, అందరికీ సమానంగా మాత్రం కాదు. పేదలు, అణగారిన వర్గాలను ఎక్కువగా బలి తీసుకుంటోంది ఈ మహమ్మారి. అమెరికాలో జాతులవారీగా మరణాలను పరిశీలించినప్పుడు ఈ విషయం స్పష్టమైంది. న్యూయార్క్ నగరం, రాష్ట్రంలో నల్ల జాతి, లాటిన్ అమెరికన్ ప్రజలు జనాభా నిష్ఫత్తి కంటే ఎక్కువగా మృత్యువాత పడటం పై చార్టులో గమనించవచ్చు. నగరం మినహా మిగిలిన న్యూయార్క్ రాష్ట్రంలో నల్ల జాతీయులు 9% ఉండగా మృతులలో వారు ఏకంగా 18%. న్యూయార్క్ నగరంలో మరణాల రేటు ఆసియన్లలో అతి తక్కువగా ఉంది. జనాభాలో 14%, మృతులలో 7% ఆసియన్లు.
2020-05-08