‘కరోనా’ సోకి అమితాబ్ బచ్చన్ పెద్ద ఆసుపత్రి పాలయ్యాక ఆయన పాత ట్వీట్ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. ‘కరోనా’ను హోమియోపతితో ఎదుర్కోవచ్చని సూచిస్తూ ఏప్రిల్ 3న అమితాబ్ ఓ ట్వీట్ పెట్టారు. దానిపై అప్పుడే కొంత దుమారం రేగింది. ఇప్పుడాయన అల్లోపతి చికిత్సకోసం ముంబై నానావతి ఆసుపత్రిలో చేరడం ట్విట్టర్లో పెద్ద చర్చనీయాంశమైంది. సెలబ్రిటీలు ప్రజలకు తప్పుడు సూచనలు చేసి తాము మాత్రం పెద్ద అల్లోపతి డాక్టర్లతో చికిత్సలు చేయించుకుంటారని చాలా మంది విమర్శించారు. ‘అమితాబ్ తో సహా ఎవరికీ హోమియోపతి ఇవ్వొద్దు’ అంటూ పలువురు సూచించారు.
2020-07-12‘కోవిడ్ 19’ టీకా ఎక్కువగా అవసరం ఉన్న ప్రజలకు, అవసరం ఉన్న ప్రాంతాలకు కాకుండా ఎక్కువ ఖరీదు కట్టేవారికి మాత్రమే చేరితే... మరింత ప్రాణాంతకమైన సుదీర్ఘమైన మహమ్మారిని చూడవలసి వస్తుందని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ప్రపంచ నేతలను హెచ్చరించారు. టీకాలు, మందులను మార్కెట్ ఆధారిత పరిణామాలకు వదిలేయకుండా సమానంగా పంపిణీ చేయడానికి నాయకులు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని గేట్స్ సూచించారు. అంతర్జాతీయ ఎయిడ్స్ సొసైటీ శనివారం నిర్వహించిన ఆన్ లైన్ ‘కోవిడ్’ సదస్సులో ఆయన మాట్లాడారు.
2020-07-12నిర్లక్ష్యంతో ‘కరోనా’ కేసుల్లో అమెరికాను అగ్రస్థానంలో నిలబెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కనీసం మాస్కు ధరించాలన్న సందేశాన్ని కూడా ప్రజలకు ఇవ్వలేదు. వైరస్ వ్యాప్తిలో రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్ లో సాక్షాత్తు అధ్యక్షుడు జైర్ బోల్సొనారో ‘కరోనా’ బారిన పడటంతో ఇప్పుడు ట్రంప్ మనసు మారినట్లుంది. అమెరికాలో కేసులు 32 లక్షలు దాటిన తర్వాత శనివారం తొలిసారిగా ట్రంప్ ముఖంపైకి మాస్కు వచ్చింది. వాల్టర్ రీడ్ మిలిటరీ ఆసుపత్రిలో వెటరన్లను పరామర్శించడానికి వచ్చిన ట్రంప్, అధ్యక్షుడి సీల్ వేసిన ముదురు రంగు మాస్కు ధరించారు.
2020-07-12మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాక బిజెపి రాజస్థాన్ పైన గురి పెట్టింది. ఎమ్మెల్యేలకు ముడుపులు ఇచ్చి తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బిజెపి ప్రయత్నిస్తోందని నిన్న ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించిన నేపథ్యంలో.. ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వంతో ఆయన చర్చించనున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలపై రాజస్థాన్ సిఐడి మొన్న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అశోక్ సింగ్, భరత్ మలాని అనే వ్యక్తుల టెలిఫోన్ సంభాషణల్లో బిజెపి ప్రణాళిక, సచిన్ పైలట్ ఆకాంక్షల ప్రస్తావన ఉన్నట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
2020-07-12బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ లకు ‘కరోనా’ వైరస్ సోకింది. తనకు ‘కరోనా’ పాజిటివ్ వచ్చిందని శనివారం రాత్రి అమితాబ్ ట్విట్టర్లో వెల్లడించారు. తర్వాత కొద్దిసేపటికే అభిషేక్ కూడా తనకూ పాజిటివ్ తేలిందని ప్రకటించారు. వారిద్దరినీ ఆసుపత్రికి తరలించి జయా బచ్చన్, ఐశ్వర్యా రాయ్ తదితర కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించారు. గత 10 రోజులుగా తనను కలసినవారు కూడా పరీక్షలు చేయించుకోవాలని అమితాబ్ ఈ సందర్భంగా సూచన చేశారు.
2020-07-12‘కరోనా’ వైరస్ కట్టడికోసం ఇరాన్ వివాహాలను నిషేధించింది. పెళ్ళిళ్ళు సహా ఎక్కువమంది పోగయ్యే అన్ని కార్యక్రమాల నిషేధానికి అధ్యక్షుడు హస్సన్ రోహాని శనివారం పిలుపునిచ్చారు. అయితే, దేశ ఆర్థిక వ్యవస్థ గమనం మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రోహాని టీవీ ప్రసంగం ముగిసిన కొద్దిసేపటికే టెహ్రాన్ లోని అన్ని వివాహ వేదికలు, సంతాప కేంద్రాలు మూతబడ్డాయి. చైనా తర్వాత ‘కరోనా’ పడగ విప్పిన తొలి దేశాల్లో ఇరాన్ ఒకటి. అయితే, ఏప్రిల్ మధ్య భాగం నుంచి ‘లాక్ డౌన్’ను ఇరాన్ సడలిస్తూ వచ్చింది. మళ్ళీ కేసులు పెరుగుతుండటంతో తాజా ఆంక్షలు విధించారు.
2020-07-11‘కరోనా’ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి ‘లాక్ డౌన్’ బాట పడుతున్నాయి. అందులో భాగంగా బెంగళూరు నగరాన్ని మరోసారి దిగ్బంధించనున్నారు. ఈ నెల 14వ తేదీ (మంగళవారం) రాత్రి 8 గంటల నుంచి 22వ తేదీ ఉదయం 5 గంటల వరకు ‘లాక్ డౌన్’ విధించాలని నిర్ణయించినట్టు కర్నాటక ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. బెంగళూరు అర్బన్ తోపాటు రూరల్ జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో ‘లాక్ డౌన్’ అమలవుతుందని సిఎంఒ స్పష్టం చేసింది. నిత్యావసరాలకు మాత్రమే మినహాయింపు ఉంటుంది.
2020-07-118 మంది పోలీసులను ఊచకోత కోసిన గ్యాంగ్స్టర్ వికాస్ దూబేను ఉత్తరప్రదేశ్ పోలీసులు శుక్రవారం ఉదయం కాన్పూర్ వద్ద కాల్చి చంపారు. మధ్యప్రదేశ్ నుంచి తరలిస్తున్న సమయంలో రోడ్డుకు అడ్డంగా పశువులు రావడంతో తమ వాహనం అదుపు తప్పి ప్రక్కకు పడిపోయిందని, తప్పించుకోవడానికి దూబే ఓ తుపాకీ లాక్కొని కాల్పులు జరిపాడని, ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపామని పోలీసులు ఓ ‘కథ’నాన్ని వినిపించారు. సరిగ్గా వారం రోజుల క్రితం కాన్పూర్ నగరంలో పోలీసులను చంపిన వికాస్ గ్యాంగ్, నిన్న మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాల్ దేవాలయం వద్ద అరెస్టయిన సంగతి తెలిసిందే.
2020-07-10యూపీలోని కాన్పూర్లో గత వారం ఓ డిఎస్పీ సహా 8 మంది పోలీసులను ఊచకోత కోసిన కరుడుగట్టిన నేరస్తుడు వికాస్ దూబే మధ్యప్రదేశ్ లో అరెస్టయ్యాడు. దూబేను, అతని సహచరులు ఇద్దరిని ఉజ్జయిని మహాకాల్ దేవాలయం వద్ద మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. దూబే సహచరుడు ఒకడిని యూపీలో ‘ఎన్కౌంటర్’ చేసిన నేపథ్యంలో ఈ అరెస్టులపై వివాదం చెలరేగింది. దూబేను ‘ఎన్కౌంటర్’ నుంచి కాపాడటానికే అరెస్టు చూపించారన్నది ప్రధాన ఆరోపణ. 60 క్రిమినల్ కేసులు ఉన్న క్రూరమైన నేరస్తుడు దూబేపై రూ. 5 లక్షల రివార్డు ఉండగా, ‘ఎన్కౌంటర్’ అయిన అతని సహచరుడిపై రూ. 25,000 ఉంది.
2020-07-09భారత ఆర్మీ ‘ఫేస్ బుక్’ సహా 89 మొబైల్ అప్లికేషన్లను నిషేధించింది. ఆయా ‘యాప్’లను స్మార్ట్ ఫోన్లనుంచి తొలగించాలని జవాన్లకు హుకుం జారీ చేసింది. నిషేధిత జాబితాలో సహజంగానే ఎక్కువ భాగం చైనా అప్లికేషన్లు ఉన్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా నిషేధించిన 59 చైనా అప్లికేషన్లకు తోడు ఫేస్ బుక్, ఇన్ట్సాగ్రామ్, ట్రూ కాలర్, టంబ్లర్, రెడ్డిట్ వంటి వివిధ రకాల అప్లికేషన్లను ఆర్మీ నిషేధించింది. పబ్జి గేమ్ అప్లికేషన్, డైలీ హంట్ న్యూస్ అప్లికేషన్ కూడా ఈ నిషేధిత జాబితాలో ఉండటం గమనార్హం.
2020-07-08