ఇటలీలోని లోడి ప్రావిన్స్‌లో ఓ హైస్పీడ్ రైలు పట్టాలు తప్పింది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో..రైలులోని ఇద్దరు కండక్టర్లు మృతి చెందగా, 28 మంది గాయపడ్డారు. దేశానికి ఉత్తరాన మిలన్‌కు ఆగ్నేయంగా 30 మైళ్ల దూరంలో ఉన్న కాసాల్‌పుస్టెర్లెంగో పట్టణం వద్ద ఈ ప్రమాదం జరిగింది. మిలన్ నుంచి సాలెర్నో వెళ్తుండగా లివ్రాగా స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. దీంతో, ఆ హైస్పీడ్ రైలు లైనులో ట్రాఫిక్ తాత్కాలికంగా నిలిచిపోయింది.
2020-02-06ప్రముఖ గాయకుడు కె.జె. ఏసుదాసు సోదరుడు కె.జె. జస్టిన్ (62) కొచ్చిలోని వల్లర్పాడం నీటి కయ్యిలో మరణించి కనిపించారు. ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. తన కుమారుడు మరణించినప్పటి నుంచి జస్టిన్ నిస్పృహతో ఉన్నారని, తీవ్ర ఆర్థిక సంక్షోభాన్నీ ఎదుర్కొంటున్నారని కథనాలు వచ్చాయి. అయితే, మరణానికి స్పస్టమైన కారణం మాత్రం తెలియాల్సి ఉంది. ఆయన భౌతిక కాయానికి ఎర్నాకుళం సాధారణ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరుగుతోంది.
2020-02-06‘కరోనా వైరస్’ రూపంలో వ్యాపించిన కొత్త తరహా న్యూమోనియా మహమ్మారి చైనాలో ఇప్పటిదాకా 563 మందిని బలి తీసుకుంది. హాంకాంగ్ నగరంలో ఒకరు, చైనా వెలుపల ఫిలిప్పీన్స్ లో మరొకరు మరణించిన సంగతి తెలిసిందే. వైరస్ సోకిన వ్యక్తుల సంఖ్య చైనాలోనే 28 వేలకు పైగా ఉంది. బుధవారం ఒక్క రోజే చైనాలో 72 మంది చనిపోయారు. చైనాలో కొన్ని నగరాలనే ఇతర ప్రాంతాలతో సంబంధం లేకుండా మూసివేశారు. అనేక ఫ్యాక్టరీలు, వ్యాపారాలు తాత్కాలికంగా మూతబడ్డాయి.
2020-02-06అనంతపురం ‘కియా’ పరిశ్రమను తమ రాష్ట్రానికి తరలిస్తామని కంపెనీ సంప్రదించలేదని తమిళనాడు ప్రభుత్వ అధికారి ఒకరు తేల్చి చెప్పారు. ‘‘మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు. మేమూ వారితో మాట్లాడలేదు. లాజిస్టిక్స్ పరంగా ఉత్పత్తిని మార్చడం అసాధ్యం. విస్తరణ చేపట్టినప్పుడు మాత్రమే వేరొక ప్రాంతంపై ఆలోచించగలరు’’ అని తమిళనాడు అధికారి మీడియాకు తెలిపారు. ‘హ్యూండాయ్’ వేదికగా ప్రాథమిక చర్చలు జరిగాయని ‘రాయిటర్స్’ రాసిన విషయం తెలిసిందే.
2020-02-06అనంతపురం ‘కియా’ కార్ల ఫ్యాక్టరీ తరలిపోవచ్చన్న ‘రాయిటర్స్’ కథనంతో అధికార వైసీపీ ఉలికిపడింది. ప్రభుత్వ ప్రతిష్ఠకు సంబంధించిన అంశం కావడంతో..పలువురు స్పందించారు. ప్రభుత్వం నుంచి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ, మంత్రి బుగ్గన ఆ కథనాన్ని ఖండించారు. కియాను బెదిరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మాధవ్ ఫ్యాక్టరీ మరింత విస్తరిస్తుందని చెప్పుకొచ్చారు. పార్లమెంటు లోపల మిథున్ రెడ్డి, బయట విజయసాయిరెడ్డి కూడా వివరణ ఇచ్చారు.
2020-02-06‘కియా’ కార్ల పరిశ్రమ ఏపీ నుంచి తరలిపోవచ్చన్న కథనం పార్లమెంటులోనూ దుమారం రేపింది. ఏపీ ప్రభుత్వ వైఖరివల్ల రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. విదేశీ పెట్టుబడులకు ఇది అవరోధం అవుతుందని, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. నాయుడు మాట్లాడే సమయంలో వైసీపీ సభ్యులు కేకలు వేశారు. ఈ సమాచారం తప్పని ఎంపీ మిథున్ రెడ్డి ఖండించారు. తాను ఈరోజు ఉదయమే ‘కియా’ ఎండీతో మాట్లాడానని చెప్పారు.
2020-02-06వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచుతూ రిజర్వు బ్యాంకు నిర్ణయం తీసుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో చివరి ద్వైమాస ద్రవ్య పరపతి విధానాన్ని గురువారం ప్రకటించింది. దాని ప్రకారం రెపో రేటు 5.15 శాతంగా, రివర్స్ రెపో రేటు 4.90 శాతం వద్ద యధాతథంగా ఉన్నాయి. గత డిసెంబరులో ప్రకటించిన ఈ రేట్లు...గత దశాబ్దంలోనే కనిష్ఠం. మానెటరీ పాలసీ కమిటీ (ఎంపిసి)లోని సభ్యులు 6-0తో యధాతథ స్థితికి ఓటు వేశారు.
2020-02-06తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి నివాసంలో ఆదాయ పన్ను అధికారులు సోదాలు చేపట్టారు. కడప ద్వారకా నగర్ లోని నివాసంతో పాటు హైదరాబాద్ పంజాగుట్టలోని ఆర్.కె. ఇన్ఫ్రా కార్యాలయంలో కూడా సోదాలు చేస్తున్నట్టు సమాచారం. కాంట్రాక్టర్ అయిన శ్రీనివాసులురెడ్డి పన్ను ఎగవేశారన్న సమాచారంతోనే ఈ సోదాలు చేపట్టినట్లు ఓ కథనం. తెలుగు రాష్ట్రాలతో పాటు జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో శ్రీనివాసులు రెడ్డి కంపెనీ కాంట్రాక్టులు చేస్తోంది.
2020-02-06చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో ‘అన్హుయి’ ప్రావిన్సు ఒకటి. వైరస్ భయంతో చాలాచోట్ల మానవ సంచారం పరిమితమైంది. ఈ నేపథ్యంలో ‘అన్హుయి’ ప్రావిన్సులోని ‘చుజౌ పవర్ గ్రిడ్’ మనుషులకు బదులు ‘తెలివైన రోబో’లను వినియోగించింది. నగరంలోని 60 విద్యుత్ సబ్ స్టేషన్లకు కాపలాగా ఈ రోబోట్లను పంపింది.
2020-02-06ఇండియాలో రెండో అతిపెద్ద కార్ల ఉత్పత్తిదారు హ్యూండాయ్ మోటార్స్. ‘కియా’ సోదర సంస్థ అయిన హ్యూండాయ్ మోటార్స్ ఉత్పత్తి కేంద్రాలన్నీ తమిళనాడులో ఉన్నాయి. ఇప్పుడు ఆ కంపెనీలోనే ‘కియా’ తరలింపు చర్చలు ప్రారంభమైనట్లు ‘రాయిటర్స్’ కథనం. ఆటో స్పేర్ పార్ట్స్ పరిశ్రమలు కూడా తమిళనాడులోనే ఎక్కువ. అక్కడికే తరలిస్తే లాజిస్టిక్స్ వ్యయం తగ్గుతుందని ‘కియా’ భావిస్తున్నట్టు ఆ కథనంలో పేర్కొన్నారు.
2020-02-06