సౌదీ అరేబియాలోని జెడ్డాలో పని చేస్తున్న కేరళకు చెందిన నర్సుకు కరోనా వైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. అల్ హయత్ ఆసుపత్రిలో పని చేస్తున్న 100 మంది నర్సులకు గురువారం పరీక్షలు నిర్వహించారు. వారిలో ఎక్కువ మంది కేరళ నుంచి వెళ్లినవారు. వైరస్ సోకిన నర్సుకు అసీర్ నేషనల్ హాస్పిటల్ లో చికిత్స చేస్తున్నారని, ఆమె కోలుకుంటున్నారని భారత విదేశీ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ తెలిపారు.
2020-01-23బుధవారం శాసనసభలో రాష్ట్ర మంత్రులు గూండాల్లా వ్యవహరించారని, ఛైర్మన్ అంతు చూస్తామని బెదిరించారని ప్రతిపక్ష నేత లోకేష్ ఆరోపించారు. మంత్రుల ప్రవర్తన చూడాలంటూ తాను ఫోన్లో తీసిన వీడియోలను లోకేష్ గురువారం విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి బహిరంగ లేఖ రాశారు. ‘‘మండలి సభ్యుడిగా ఫోన్లో వీడియోలు తీయకూడదు. కానీ, ఇతర ఎమ్మెల్సీల భద్రత కోసం తప్పనిసరై తీశాను’’ అని లోకేష్ వివరణ ఇచ్చారు.
2020-01-23భారత రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘సీట్ ఆఫ్ గవర్నెన్స్’ అని మాత్రమే ఉందని, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడి నుంచే పాలన నడుస్తుందని చెప్పారు. జయలలిత ఊటీ నుంచి పాలనను నిర్వహించేవారని, హుద్ హుద్ తుపాను వచ్చినప్పుడు చంద్రబాబునాయుడు విశాఖ నుంచే 10 రోజులు పాలించారని గుర్తు చేశారు. పరిపాలనా వికేంద్రీకరణ కోసం ప్రజలు తమకు అధికారమిచ్చారని అసెంబ్లీలో ఉద్ఘాటించారు.
2020-01-23ఆంధ్రప్రదేశ్ ఎగువ సభ (శాసన మండలి) కార్యకలాపాలపై దిగువ సభ (శాసనసభ)లో వీడియో ప్రదర్శించడాన్ని ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ తప్పు పట్టారు. ఎగువ సభ కార్యకలాపాలపై దిగువ సభలో వ్యాఖ్యానాలు చేయడం ఏమిటని ఆయన గురువారం ఓ టీవీ ఛానల్ చర్చలో ప్రశ్నించారు. శాసన మండలి ఛైర్మన్ తెలుగు ఉచ్ఛారణలో ఒక దోషం ఉంటే దాన్ని పట్టుకొని విమర్శిస్తున్నారని కూడా రవిశంకర్ వ్యాఖ్యానించారు.
2020-01-23సెలక్ట్ కమిటీ రాజధాని బిల్లులపై ప్రజాభిప్రాయం తీసుకుంటుందనే శాసన మండలిని రద్దు చేస్తామంటున్నారని తెలుగుదేశం పక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. మండలిని ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారనేది ముఖ్యమైన అంశమని యనమల నొక్కి చెప్పారు. శాసనసభలో ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయకుండానే బయటకు పంపుతున్నారని, సంఖ్యాబలం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని యనమల విమర్శించారు.
2020-01-23శాసన మండలి అవసరమా? అని ప్రశ్నించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత యనమల రామక్రిష్ణుడు తీవ్రంగా మండిపడ్డారు. ‘‘క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న మీలాంటి వారు అసెంబ్లీలోనే ఉండకూడదు’’ అని వ్యాఖ్యానించారు. గురువారం శాసనసభ వాయిదా పడిన తర్వాత యనమల విలేకరుల సమావేశం నిర్వహించారు. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపే అధికారం మండలికి ఉందన్న యనమల, సిఎం అహంకారపూరితంగా మండలిని శాసించే ప్రయత్నం చేశారని విమర్శించారు.
2020-01-23ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడంకోసం మేధావులతో ఏర్పాటు చేసుకున్న శాసన మండలి చట్టాలను అడ్డుకునే వేదికగా మారిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులతో పాటు ఇంగ్లీషు మీడియం బిల్లునూ అడ్డుకున్నదని మండలిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘వాళ్ళ పిల్లలు ఇంగ్లీషు మీడియంకు పోవాలి. పేదల పిల్లలు వద్దు’ అని వ్యాఖ్యానించారు. ఎస్.సి, ఎస్.టి.లకు ప్రత్యేక కమిషన్ల ఏర్పాటు అంశాన్నీ ఆలస్యం చేసిందన్నారు.
2020-01-23రూల్ 154 ప్రకారం విచక్షణాధికారంతో ‘వికేంద్రీకరణ’ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపుతున్నానని శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ నిన్న చేసిన ప్రకటనను అధికారపక్షం తప్పు పట్టింది. ఆయన ప్రకటన వీడియోను సిఎం జగన్మోహన్ రెడ్డి గురువారం శాసనసభలో ప్రదర్శించారు. ‘‘సందిగ్ధత ఉంది. అయినా కాలయాపన చేయకూడదన్నది నా ఉద్ధేశం’’ అని ఛైర్మన్ తడబడుతూ మాట్లాడిన తీరును బహిర్గతం చేశారు. గ్యాలరీలో కూర్చున్న చంద్రబాబు ఒత్తిడితోనే చైర్మన్ అలా చేశారని సిఎం ఆరోపించారు.
2020-01-23శాసన మండలిని కొనసాగించాలా.. వద్దా? అనే అంశంపై సోమవారం మరింత చర్చించి నిర్ణయం తీసుకోవాలని శాసనసభ భావించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాం అసెంబ్లీ సమావేశాలను పొడిగించారు. సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన శాసన మండలి... చట్టాలను అడ్డుకుంటోందని అంతకు ముందు ముఖ్యమంత్రి ఆరోపించారు.
2020-01-23పేద రాష్ట్రానికి ఏటా రూ. 60 కోట్ల వ్యయం చేసే మండలి అవసరమా? అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. రాజధాని తరలింపు బిల్లును నిన్న మండలి నిలువరించిన నేపథ్యంలో... గురువారం అసెంబ్లీలో చర్చను చేపట్టారు. మేధావులు శాసనసభకు ఎన్నిక కాలేరన్న కారణంగా ఒకప్పుడు శాసన మండలిని ఏర్పాటు చేశారని, అయితే.. అన్ని రంగాల మేధావులూ ప్రస్తుత శాసనసభలోనే ఉన్నారని జగన్ చెప్పారు. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండలి ఉందని నొక్కి చెప్పారు.
2020-01-23