లింగ వివక్ష కారణంగా ఇండియాలో గత 50 సంవత్సరాల్లో 4.58 కోట్ల మంది మహిళలు అంతర్ధానమయ్యారని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక పేర్కొంది. పుట్టుక సమయంలోనే వివక్షతో ప్రపంచ జనాభా నుంచి 14.26 కోట్ల మంది మహిళలు మాయమయ్యారని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యు.ఎన్.ఎఫ్.పి.ఎ) తన ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2020’ నివేదికలో వెల్లడించింది. ఇండియాలో 2013 నుంచి 2017 వరకు ఏటా 4,60,000 మంది అమ్మాయిలు జనాభా నుంచి మాయమయ్యారని, వారిలో మూడింట రెండొంతుల మంది పుట్టక ముందే గిడుతుండగా మిగిలిన ఒక వంతు పసిగుడ్డుగా ఉన్నప్పుడే కాటికి చేరుతున్నారని ఈ నివేదిక వివరించింది.
2020-06-30విశాఖపట్నంలో మరో గ్యాస్ లీకేజీ ఘటన కలకలం రేపింది. సోమవారం రాత్రి సాయినార్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో బెంజిమిడాజోల్ గ్యాస్ లీకై ఇద్దరు ఉద్యోగులు (రావి నరేంద్ర, గౌరీశంకర్) మరణించారు. మరో నలుగురు గ్యాస్ పీల్చి తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. పరవాడలోని జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీ (జె.ఎన్.పి.సి)లో ఈ ఫ్యాక్టరీ ఉంది. రెండు నెలల క్రితం వెంకటాపురం ఎల్.జి. పాలిమర్స్ ఫ్యాక్టరీ నుంచి పాలీస్టైరీన్ ఆవిరై సమీప గ్రామాలను ముంచెత్తిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో గ్యాస్ పీల్చిన బాధితులు దీర్ఘకాల వ్యాధులకు గురవుతున్నారు. ఇంతలోనే మరో లీకేజీ విశాఖను ఆందోళనకు గురి చేసింది.
2020-06-30‘టిక్ టాక్’, హలో, షేర్ ఇట్, యుసి బ్రౌజర్, క్యామ్ స్కానర్, లైకీ, న్యూస్ డాగ్, వీబో, ఎంఐ కమ్యూనిటీ సహా చైనా కంపెనీలు రూపొందించిన 59 మొబైల్ అప్లికేషన్లను భారత ప్రభుత్వం సోమవారం నిషేధించింది. ఐటి చట్టంలోని సెక్షన్ 69A కింద ఈ అధికారాన్ని ఉపయోగించింది. ఆండ్రాయిడ్, ఐఒఎస్ వేదికలపై కొన్ని మొబైల్ అప్లికేషన్లు వినియోగదారుల సమాచారాన్ని దేశం వెలుపలి సర్వర్లకు రహస్యంగా బదలాయిస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చాయని కేంద్ర ఐటి శాఖ తెలిపింది. జాతీయ భద్రతకు వ్యతిరేక శక్తులు ఈ డేటాను వినియోగించడం.. ఇండియా సార్వభౌమాధికారం, సమగ్రతపై ప్రభావం చూపుతుందని పేర్కొంది.
2020-06-29అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టుకోసం ఇరాన్ ప్రభుత్వం వారంట్ జారీ చేసింది. ట్రంప్ ను బంధించడానికి ఇంటర్ పోల్ సాయం కోరింది. ఈ ఏడాది జనవరి 3న ఇరాన్ సైనిక జనరల్ ఖాసిం సులేమానీని డ్రోన్ దాడితో అమెరికా హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ట్రంప్, మరో 30 మందిపై ‘హత్య, ఉగ్రవాదం’ అభియోగాలు మోపింది ఇరాన్. ట్రంప్ అధ్యక్ష పదవీ కాలం ముగిసినా ప్రాసిక్యూషన్ ప్రయత్నాలు కొనసాగుతాయని టెహ్రాన్ ప్రాసిక్యూటర్ అలీ అల్ ఖసిమెహర్ సోమవారం చెప్పారు. ఈ చర్యను ‘ప్రచార విన్యాసం’గా కొట్టిపారేశారు ఇరాన్ లోని అమెరికా రాయబారి బ్రియాన్ హుక్.
2020-06-29చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో యుద్ధ సామాగ్రి దిగుమతులకోసం భారత ప్రభుత్వం త్వరపడుతోంది. ఫ్రాన్స్ నుంచి తొలి దశలో 6 రఫేల్ యుద్ధ విమానాలు జూలై 27 నాటికి వస్తాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ రాసింది. ఈ నెల 15న చైనా, ఇండియా సైనికుల ఘర్షణకు ముందే (జూన్ 2న) భారత రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీతో ఫోన్లో మాట్లాడారు. లడఖ్ లోని గాల్వన్ లోయ, పాంగాంగ్ సరస్సు ప్రాంతాల్లో ఇండియా గస్తీ నిర్వహించే ప్రాంతాల్లోకి చైనా సైన్యం మే నెలలోనే చొరబడిన విషయం తెలిసిందే. ‘కరోనా’ కారణంగా రఫేల్ రాకలో జాప్యం జరగకుండా ఇండియా జాగ్రత్తపడింది.
2020-06-29తైవాన్ ఓ ‘వికృత ప్రజాస్వామ్యం’. ఆ దేశంలో పార్లమెంటును ఆక్రమించుకోవడం అసాధారణమేమీ కాదు. సోమవారం మరోసారి అదే దృశ్యం కనిపించింది. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందంటూ ప్రతిపక్ష కొమింటాంగ్ పార్టీ (కెఎంటి) ఎంపీలు రాత్రి పార్లమెంటును ఆక్రమించి ప్రధాన ద్వారానికి గొలుసులు కట్టేశారు. సోమవారం ఉదయం అధికార డీపీపీ సభ్యులు చొరబడి ప్రతిపక్ష సభ్యులపై దాడికి దిగారు. ‘‘ఇది చాలా ప్రమాదకరం. మీ సహచర సభ్యులతో ఇలా ప్రవర్తించకూడదు’’ అంటూ కెఎంటి యువ నేత వేన్ చియాంగ్ అధికార పార్టీ హింసను ఖండించారు. ఈయన తైవాన్ నియంత (తొలి అధ్యక్షుడు) చియాంగ్ కై షేక్ మనవడు.
2020-06-29విజయవాడ, హైదరాబాద్ నగరాల మధ్య హైస్పీడ్ రైలు మార్గం నిర్మాణానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని తెలంగాణ మంత్రి కె. తారకరామారావు చెప్పారు. సోమవారం హుజూర్ నగర్ పర్యటనలో భాగంగా జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ ముఖ్యమైన ఆర్థిక కేంద్రంగా విజయవాడ ఉందని, హైదరాబాద్ దేశంలోనే ముఖ్యమైన మెట్రో నగరాల్లో ఒకటి అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ రెండు నగరాల మధ్య జాతీయ రహదారికి సమాంతరంగా హైస్పీడ్ రైలు మార్గం నిర్మాణమైతే మధ్య ప్రాంతాలన్నీ మరింత అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
2020-06-29జమ్మూ- కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ మసూద్ అహ్మద్ భట్ సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ ఇద్దరూ లష్కర్ ఇ తాయిబా ఉగ్రవాదులని కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సి.ఆర్.పి.ఎఫ్. జవాన్లు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. మసూద్ మరణంతో దోడా జిల్లా ఉగ్రవాద రహిత ప్రాంతంగా మారినట్టేనని పోలీసు అధికారులు ప్రకటించారు. ఎన్కౌంటర్ స్థలంలో ఒక ఎ.కె-47 రైఫిల్, రెండు పిస్టళ్ళు స్వాధీనం చేసుకున్నట్టు ఆర్మీ అధికారులు చెప్పారు.
2020-06-29కరాచిలోని పాకిస్తాన్ స్టాక్ ఎక్సేంజిపై సోమవారం ఉదయం ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలోనూ, ఎదురు కాల్పులలోనూ ఐదుగురు మరణించారు. సోమవారం స్టాక్ ఎక్సేంజి ప్రారంభమయ్యాక ఉగ్రవాదుల గ్రూపు ఒకటి తుపాకులు, గ్రనేడ్లతో దాడి చేసింది. ప్రధాన ద్వారం వద్ద సెక్యూరిటీ గార్డును కాల్చి చంపి లోపలికి చొరబడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మరో ఇద్దరు పౌరులు మరణించగా.. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్టు ప్రాథమిక సమాచారం.
2020-06-29పాత సచివాలయాన్ని కూల్చివేసి కొత్త భవనాలను నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయ భవనాల కూల్చివేత నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. సుదీర్ఘ వాదనల తర్వాత హైకోర్టు సోమవారం తీర్పు చెప్పింది. మంత్రివర్గ నిర్ణయాన్ని తప్పు పట్టలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయంగా ఉన్న భవనాలను కూల్చివేయాలని తెలంగాణ సిఎం కేసీఆర్ తొలినుంచీ పట్టుదలతో ఉన్నారు. గత ఆరేళ్ళుగా ఆయన సచివాలయానికి హాజరు కావడంలేదు. అధికారిక నివాసం నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారు.
2020-06-29