అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న తరుణంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేలా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ తీవ్రమైన చర్యలు తీసుకుంటోంది. టీడీపీకి బలమైన స్వరంగా ఉన్న శాసనసభాపక్ష ఉపనేత కె. అచ్చెన్నాయుడును శుక్రవారం ఉదయం రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. అచ్చెన్న కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇఎస్ఐ కొనుగోళ్ళలో పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డారనేది అభియోగం. ‘ఫైబర్ నెట్’, చంద్రన్న కానుక పథకాలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని నిన్ననే (గురువారం) మంత్రివర్గం నిర్ణయించింది.
2020-06-12అమెరికా అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ ‘ఎఫ్-35ఎ’లో కదన రంగానికి వెళ్లిన తొలి మహిళగా ఆ దేశ పైలట్ కెప్టెన్ ఎమిలీ థాంప్సన్ రికార్డుల్లో చేరారు. ఇటీవల యుఎఇలోని అల్ ధఫ్రా వైమానిక స్థావరం నుంచి మధ్యప్రాఛ్యంలోని ఓ ప్రాంతానికి ఆమె ‘ఎఫ్-35ఎ లైటెనింగ్ 2’లో వెళ్ళారు. ఆ ప్రాంతం పేరును అమెరికా ఎయిర్ ఫోర్స్ వెల్లడించలేదు. ఈ విన్యాసంలో ఎమిలీకి సహకరించిన మెయింటెనెన్స్ సిబ్బంది కూడా అంతా మహిళలే. థాంప్సన్ విద్యాభ్యాసం తర్వాత ఎఫ్-16 పైలట్ గా ఏడాదిన్నర శిక్షణ పొందారు. తర్వాత ‘ఎఫ్-35ఎ’కి బదిలీ అయ్యారు. సహచరులు ‘బంజాయ్’గా పిలుచుకునే ఎమిలీ కదన రంగానికి యుద్ధ విమానాన్ని నడపడం ఇదే తొలిసారి.
2020-06-12థాయిలాండ్ లో కస్టమర్లను మోసగించిన ఇద్దరు రెస్టారెంట్ యజమానులకు కోర్టు 723 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. లామ్‌గేట్ ఇన్ఫినిట్ అనే రెస్టారెంట్ యజమానులు అతి తక్కువ ధరలకే నాణ్యమైన సీ ఫుడ్ పెడతామని వోచర్లు అమ్మారు. ప్రమోషన్ ముగిశాక మోసం చేశారు. దీంతో మండిపడ్డ వందలమంది ఖాతాదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యజమానులిద్దరూ గత సెప్టెంబరులో అరెస్టయ్యారు. కొసమెరుపేమంటే.. నిందితులు సుదీర్ఘ శిక్షను అనుభవించే అవకాశం లేదు. థాయ్ కోర్టులు వేర్వేరు ఆరోపణలకు కలిపి విధించే శిక్షలు వందల సంవత్సరాలుగా ఉంటాయి. అయితే, అక్కడి చట్టం ప్రకారం 20 ఏళ్లకు మించి జైలులో ఉంచటానికి వీల్లేదు.
2020-06-12మధ్యప్రదేశ్ రత్లాం జిల్లాలోని నయాపురా ప్రాంతంలో ఓ ‘బాబా’ రోగాలు తగ్గించడానికంటూ భక్తుల చేతిని ముద్దాడుతుంటాడు. ఆ ‘బాబా’ ఈ నెల 4న ‘కరోనా’ వైరస్ సోకి మరణించాడు. ఇప్పుడా ‘బాబా’ ముద్దాడిన చేతులకూ ‘కరోనా’ సోకింది. రత్లాం జిల్లాలో 85 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ కాగా, వారిలో 19 మంది ఈ చేతి ముద్దుల ‘బాబా’ వద్దకు వెళ్లినవాళ్లేనని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ సమాచారం. నోడల్ అధికారి డాక్టర్ ప్రమోద్ ప్రజాపతి ప్రకారం ‘బాబా’ వద్దకు వెళ్లిన 24 మంది వైరస్ బారిన పడ్డారు. వైరస్ వ్యాప్తికి మూఢనమ్మకాలూ ఓ ముఖ్య కారణంగా ఉన్నాయి.
2020-06-12కేంద్ర మానవ వనరుల శాఖ ప్రకటించిన విద్యా సంస్థల ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల వెలుగు కనిపించలేదు. ఓవరాల్ టాప్ 10లో ఒక్క సంస్థకూ చోటు దక్కలేదు. యూనివర్శిటీల కేటగిరిలో హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయం 6వ స్థానంలో ఉండగా, ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ఐఐటి హైదరాబాద్ 8వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ఒక్క సంస్థా ఏ ఒక్క విభాగంలోనూ టాప్ 10లో లేదు. మేనేజ్ మెంట్, కళాశాలల విభాగాల్లో హైదరాబాద్ కూ స్థానం దక్కలేదు. ఫార్మసీలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 5వ స్థానంలో, న్యాయ విద్యలో నల్సార్ 3వ స్థానంలో నిలిచాయి.
2020-06-11జాతీయ విద్యా సంస్థల ర్యాంకుల్లో ఐఐటి మద్రాస్, బెంగళూరు ఐ.ఐ.ఎస్.సి, ఐఐటి ఢిల్లీ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. కేంద్ర మానవ వనరుల శాఖ గురువారం ఈ ర్యాంకులను ప్రకటించింది. ఓవరాల్ ర్యాంకులలో ఈ మూడింటి తర్వాత ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్ పూర్, ఐఐటి కాన్పూర్, ఐఐటి గౌహతి, జె.ఎన్.యు, ఐఐటి రూర్కీ, బనారస్ హిందూ యూనివర్శిటీ (వారణాసి) ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అనుయాయులు నిత్యం ఈసడించుకునే ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ ఓవరాల్ ర్యాంకుల్లో 8వ స్థానాన్ని, యూనివర్శిటీల కేటగిరిలో 2వ స్థానాన్ని దక్కించుకుంది.
2020-06-11గత ప్రభుత్వ హయాంలో సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా అమలు చేసిన ‘చంద్రన్న కానుక’ పథకాల్లో అవినీతి జరిగిందని జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం నిర్ధారించింది. వీటితోపాటు చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ‘ఏపీ ఫైబర్ నెట్’ పైనా సిబిఐ దర్యాప్తు జరిపించాలని కేబినెట్ గురువారం నిర్ణయించింది. మూడు కానుకల పంపిణీలో రూ. 158 కోట్ల మేరకు అవినీతి జరిగిందని ఈ అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నివేదించింది. ఉపసంఘం చేసిన సూచన మేరకే సిబిఐ దర్యాప్తునకు నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు.
2020-06-11ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 16 నుంచి నిర్వహించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు. గురువారం రాష్ట్ర మంత్రివర్గం అసెంబ్లీ సమావేశాలపై చర్చించిన కొద్ది గంటల తర్వాత ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ‘కరోనా’ వ్యాప్తి నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను అతి తక్కువ రోజులకు కుదించాలనే అభిప్రాయం మంత్రివర్గంలో వ్యక్తమైంది. తొలి రోజు గవర్నర్ ప్రసంగం తర్వాత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్, ఆర్థిక సర్వే పత్రాలను ప్రవేశపెట్టనున్నారు. 17,18 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చిస్తారు.
2020-06-11ప్రజాజీవనంపై అపరిమితమైన ఆంక్షలు విధించినా ‘కరోనా’ వ్యాప్తిని ప్రభుత్వాలు అరికట్టలేకపోయాయి. వైరస్ కేసుల సంఖ్యలో ఇండియా రోజుకో దేశాన్ని అధిగమిస్తూ అగ్ర స్థానం దిశగా సాగుతోంది. గురువారం యు.కె.ను దాటి 2,97,001 కేసులతో నాలుగో స్థానానికి ఎగబాకింది. గురువారం రాత్రికి 3 లక్షల మార్కు దాటే అవకాశం ఉంది. ‘కరోనా’ కేసుల్లో ఇండియా కంటే ముందున్న దేశాలు ఇక మూడే.. అమెరికా (20,70,961 కేసులు), బ్రెజిల్ (7,75,581), రష్యా (5,02,436). ప్రపంచం మొత్తం మీద 75 లక్షల కేసులు నమోదు కాగా 4,20,305 మంది మరణించారు. ఇండియాలో మరణాలు 8,321కి పెరిగాయి.
2020-06-11రిజర్వేషన్ హక్కు ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. తమిళనాడులోని వైద్య విద్యా కళాశాలల్లో 50 శాతం సీట్లను ఓబీసీలకు రిజర్వు చేయాలన్న విన్నపంపై.. జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు నాయకత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది. రిజర్వేషన్ ప్రయోజనాలను కల్పించడానికి నిరాకరించడాన్ని రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనగా పరిగణించలేమని ధర్మాసనం పేర్కొంది. ఆలిండియా కోటా కింద తమిళనాడు సరెండర్ చేసిన మెడికల్, డెంటల్ సీట్లలో 50 శాతాన్ని కేంద్రం ఒబిసిలకు కేటాయించకపోవడాన్ని పలు రాజకీయ పార్టీలు సవాలు చేశాయి.
2020-06-11