‘కరోనా’ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారనే అభియోగంతో అరెస్టయిన 20 మంది విదేశీ ‘తబ్లిఘి జమాత్’ పత్రినిధులు నిర్ధోషులను ముంబై కోర్టు తీర్పు చెప్పింది. వారు ఉత్తర్వులను ఉల్లంఘించారనేందుకు ఆధారాలు లేవని అంధేరి లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు పేర్కొంది. ఈ 20 మందిలో 10 మంది ఇండోనేషియా నుంచి, మిగిలిన 10 మంది కిర్గిజిస్తాన్ నుంచి వచ్చినవారు. ‘తబ్లిఘి జమాత్’కు హాజరైన విదేశీయులపై ముంబై పోలీసులు ఏప్రిల్ లో కేసులు నమోదు చేశారు. ఇతర అభియోగాలతోపాటు వారిపైన హత్యాయత్నం అభియోగాన్నీ మోపారు. ఈ అభియోగాలను కోర్టు కొట్టివేసింది.
2020-10-20అమెరికాతో ఆయుధాల తగ్గింపు ఒప్పందం (కొత్త START) కోసం తమ అణ్వాయుధాలను స్తంభింపజేయడానికి సిద్ధమని రష్యా ప్రకటించింది. ‘‘కొత్త స్టార్ట్ ఒప్పందాన్ని ఏడాది పాటు పొడిగించడానికి రష్యా ప్రతిపాదిస్తోంది. అమెరికాతో కలసి ఈ కాలానికి రెండు దేశాల వద్ద ఉన్న అణ్వాయుధాలను స్తంభింపజేయడానికి రాజకీయ నిబద్ధతతో ఉంది’’ అని రష్యా విదేశాంగ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందాన్ని కచ్చితంగా అమలు చేయాలని, అణ్వాయుధాలను స్తంభింపజేయడానికి అమెరికా ఇతరత్రా డిమాండ్లు ఏమీ పెట్టకూడదని రష్యా స్పష్టం చేసింది.
2020-10-20ఇండియాలో ఎఫ్.సి.ఆర్.ఎ, యుఎపిఎ వంటి చట్టాలను సామాజిక కార్యకర్తలు, స్వచ్చంద సంస్థల గొంతులు నొక్కడానికి వినియోగిస్తున్నారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హై కమిషనర్ మిచెల్లి బాచెలెట్ ఆందోళన వ్యక్తం చేశారు. వారి హక్కులను పరిరక్షించాలని ఆమె మంగళవారం దేశ ప్రధాని నరేంద్ర మోదీకి విన్నవించారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్.సి.ఆర్.ఎ), చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) లను ‘అస్పష్టంగా నిర్వచించిన చట్టాలు’గా ఆమె పేర్కొన్నారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇటీవలే ఇండియాలో కార్యకలాపాలను నిలిపివేయడాన్ని ఆమె ప్రస్తావించారు.
2020-10-20హురూన్ చైనా సంపన్నుల జాబితా తాజాగా విడుదలైంది. ‘అలీబాబా’ అధినేత జాక్ మా మరోసారి మొదటి స్థానంలో నిలిచారు. 56 సంవత్సరాల జాక్ మా సంపద ఏకంగా 45 శాతం పెరిగి 58.8 బిలియన్ డాలర్లకు చేరింది. అలీబాబా మంచి ఫలితాలు సాధించడంతోపాటు మా ఫిన్ టెక్ సంస్థ ‘యాంట్’ ఐపిఒ ఈ అసాధారణ పెరుగుదలకు దోహదపడింది. మరో టెక్ దిగ్గజం పోనీ మా (49) తన సంపదను ఏకంగా 50 శాతం పెంచుకొని 57.4 బిలియన్ డాలర్లతో జాక్ మాకు అత్యంత సమీపంలో నిలిచారు. వై.ఎస్.టి. అధినేత జోంగ్ షన్షాన్ (66) తొలిసారి టాప్ 3లోకి ప్రవేశించారు. ఆయన సంపద 53.7 బిలయన్ డాలర్లు.
2020-10-20లాక్ డౌన్ ముగిసినా ‘కరోనా’ ఇంకా ఉన్నదన్న విషయాన్ని అందరూ గమనంలో ఉంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. పండుగలు సమీపిస్తున్నసందర్భంగా మంగళవారం సాయంత్రం ప్రధాని జాతిని ఉద్ధేశించి ప్రసంగించారు. కరోనా కట్టడికోసం లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత ఆయన జాతిని ఉద్ధేశించి ప్రసంగించడం ఇది ఏడోసారి. అమెరికా, యుకె, బ్రెజిల్ వంటి దేశాల్లో ‘కరోనా’ మరణాలు 10 లక్షల జనాభాకు 600కు పైగా నమోదు కాగా, ఇండియాలో మరణాలు 83కి పరిమితమయ్యాయని మోదీ చెప్పారు. పౌరుల ప్రాణాలను కాపాడటంలో సంపన్న దేశాలకంటే ఇండియా విజయవంతమైందని పేర్కొన్నారు.
2020-10-20సుప్రీంకోర్టులో రెండవ సీనియర్ మోస్ట్ జడ్జిపై అపవాదులతో ఆరోపణలు చేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్మోహన్ రెడ్డిని సిఎం పదవి నుంచి తొలగించాలంటూ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం బుధవారం అత్యున్నత న్యాయస్థానం ముందుకు వచ్చింది. న్యాయవాదులు జిఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ సంయుక్తంగా ఈ ‘పిల్’ను దాఖలు చేశారు. మనీ లాండరింగ్, అవినీతి సహా 20కి పైగా తీవ్రమైన స్వభావం గల క్రిమినల్ కేసులను జగన్ ఎదుర్కొంటున్నారని అందులో పేర్కొన్నారు. ఏ ప్రాతిపదికా లేకుండా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణపై ఆరోపణలు చేసినందుకు సిఎంను తొలగించాలని పిటిషనర్లు కోరారు.
2020-10-14బంగ్లాదేశ్ తలసరి జీడీపీలో ఇండియాను దాటిపోతోంది! అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజా ‘ప్రపంచ ఆర్థిక వీక్షణం’లో పేర్కొన్న ముఖ్యాంశాల్లో ఇదొకటి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సరిగ్గా ఈ అంశాన్ని పట్టుకున్నారు. "బీజేపీ ద్వేషపూరిత సాంస్కృతిక జాతీయవాదపు 6 సంవత్సరాల ఘన విజయం" అంటూ ఘాటుగా ట్వీటారు. 2020 తలసరి జీడీపీ ఇండియాలో తిరోగమించి 1888 డాలర్లకు తగ్గుతుండగా, బంగ్లాదేశ్ లో పురోగమించి 1876.5 డాలర్లకు పెరుగుతుందని ఐఎంఎఫ్ పేర్కొంది. అంటే... పేద బంగ్లాదేశ్ కంటే ‘సూపర్ పవర్’ ఇండియా తలసరి జీడీపీ కేవలం 11.5 డాలర్లు ఎక్కువ.
2020-10-142020లో భారత స్థూల దేశీయోత్పత్తి 10.3% తగ్గిపోతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. ‘వరల్డ్ ఎకనమిక్ ఔట్ లుక్’ తాజా సంచికను ఐఎంఎఫ్ మంగళవారం విడుదల చేసింది. 2020లో ఒక్క చైనా మినహా మిగిలిన దేశాలన్నీ తిరోగమనంలోనే ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. చైనా కూడా నామమాత్రపు వృద్ధి రేటు (1.9%)ను నమోదు చేస్తుందని, అమెరికా జీడీపీ 4.3% తగ్గుతుందని అంచనా వేసింది. 2021లో ఇండియా 8.8%, చైనా 8.2%, అమెరికా 3.1% చొప్పున వృద్ధి సాధిస్తాయని, మొత్తంగా ప్రపంచ జీడీపీ ఈ ఏడాది 4.4% తగ్గి వచ్చే ఏడాది 5.2% పెరుగుతుందని అంచనా.
2020-10-13గత ఏడాది ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసినప్పటినుంచీ నిర్బంధంలో ఉన్న ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మంగళవారం విడుదలయ్యారు. జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం పాలనా విభాగపు అధికార ప్రతినిధి రోహిత్ కన్సాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజా భద్రతా చట్టం (పిఎస్ఎ) కింద ఆమె నిర్బంధాన్ని మూడు నెలలు పొడిగిస్తూ జూలైలో ఉత్తర్వులిచ్చారు. మెహబూబా నిర్బంధంపై రెండు రోజుల్లో సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉండగా విడుదల నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.
2020-10-13సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణపై ఆరోపణలతో సీజేకు చేసిన ఫిర్యాదు వివరాలను వెల్లడిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన విలేకరుల సమావేశానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. రాజ్యాంగం నిర్దేశించిన ‘‘హద్దులను జగన్మోహన్ రెడ్డి దాటార’’ని పిటిషనర్ పేర్కొన్నారు. అడ్వకేట్ సునీల్ కుమార్ తరపున అడ్వకేట్ ఆన్ రికార్డ్ ముక్తి సింగ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. జడ్జిలకు వ్యతిరేకంగా విలేకరుల సమావేశాలు నిర్వహించడాన్ని నిరోధించాలని, సిఎంకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని పిటిషనర్ సుప్రీంకోర్టుకు విన్నవించారు.
2020-10-12