సంచలన విజయం సాధించిన కె.జిఎఫ్. సినిమా సీక్వెల్ వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కాబోతోంది. ఆ సినిమా ‘ఫస్ట్ లుక్’ శనివారం విడుదలైంది. ‘‘ఓ సామ్రాజ్యపు పునర్నిర్మాణం’’ అనే నినాదంతో రూపొందిన రెండో భాగంపై దేశమంతా ఆసక్తి నెలకొంది. కన్నడ స్టార్ యశ్ నటించిన ఈ సినిమా మొదటి భాగం దక్షిణాది భాషాలతో పాటు హిందీలోనూ విడుదలై 2019లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. రెండో భాగంలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ నటించడంతో అంచనాలు పెరిగాయి.
2019-12-21పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హింసాత్మకంగా మారాయి. మృతుల సంఖ్య శనివారం 16కి పెరిగింది. రాంపూర్ పట్టణంలో శనివారం పోలీసులు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మరణించారు. సంభాల్ పట్టణంలో మహ్మద్ బిలాల్ (27) అనే రోజు కూలీ, షెహ్రోజ్ (22) అనే ట్రక్కు డైవర్ బుల్లెట్ గాయాలతో మరణించారు. అయితే, పోలీసులు యథావిధిగా కాల్పులు జరిపిన విషయాన్ని తోసిపుచ్చుతున్నారు.
2019-12-21ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో పోలీసు లాఠీచార్జీ వల్ల తలెత్తిన తొక్కిసలాటలో 8 సంవత్సరాల బాలుడు మరణించాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నగరంలోనూ...పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. ఆందోళనకారులకు, పోలీసులకు ఘర్షణ తలెత్తింది. జనాన్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. అదే సమయంలో తన స్నేహితుడితో కలిసి రోడ్డుపై ఆడుకుంటున్న బాలుడు ఆ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డాడు.
2019-12-21హైదరాబాద్ సామూహిక మానభంగం కేసులో కాల్చివేతకు గురైన నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఆ మృతదేహాలు ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఉన్నాయి. 23వ తేదీ సాయంత్రం లోగా రీ పోస్టుమార్టం చేయాలని, ఆ ప్రక్రియను వీడియో తీసి కోర్టుకు అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ‘‘ఎన్ కౌంటర్’’ జరిగిన రోజే మహబూబ్ నగర్ లో పోస్టుమార్టం జరిగినా సుప్రీంకోర్టు ఆదేశాలతో మృతదేహాలను భద్రపరిచారు.
2019-12-21చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం చేసేందుకు రూపొందించిన ‘‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ప్రారంభించారు. తన జన్మదినం సందర్భంగా అనంతపురం జిల్లా ధర్మవరం వేదికగా ఈ పథకానికి అంకురార్పణ చేసిన సిఎం, 80 వేల చేనేత కుటుంబాల అకౌంట్లకు రూ. 24 వేల చొప్పున లాంఛనంగా జమ చేశారు. మొత్తం రూ. 196 కోట్లు రెండు గంటల్లో అకౌంట్లలో జమ అవుతాయని ప్రకటించారు.
2019-12-21వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి నోరు జారారు. రాష్ట్ర అసెంబ్లీలో 225 స్థానాలు ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ‘‘గత ఎన్నికల్లో 151 స్థానాలు ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో 225 స్థానాలకు గాను 224 ఇవ్వాలి’’ అని ప్రజలకు విన్నవించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 స్థానాలు ఉన్నాయి. విభజన చట్టం ప్రకారం... ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. అలా జరిగితే అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 225కు పెరుగుతుంది. అయితే, కేంద్రం అందుకు సానుకూలంగా లేదు.
2019-12-21నాగ్ పూర్- ముంబై ‘ఎక్స్ ప్రెస్ వే’కు బాల్ థాకరే పేరు పెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రహదారి పూర్తి పేరు ఇలా ఉంటుంది. ‘‘హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్’’. నాగ్ పూర్- ముంబై ఎక్స్ ప్రెస్ వే మహారాష్ట్రలో కీలక రహదారి. నాగ్ పూర్ ఆర్.ఎస్.ఎస్. కేంద్రమే కాదు. మహారాష్ట్రకు శీతాకాల రాజధాని. మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇక్కడ జరుగుతాయి. శివసేన ప్రభుత్వ పగ్గాలు చేపట్టాక ఈ మార్పు జరగడం గమనార్హం.
2019-12-21రైతుల నుంచి తీసుకున్న భూములన్నీ తిరిగి ఇచ్చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిన కొద్ది గంటల్లోనే... అందుకు పూర్తి విరుద్ధంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ ప్రకటన చేశారు. రైతుల వద్ద తీసుకున్న భూములకు బదులు అభివృద్ధి చేసిన ప్లాట్లే ఇస్తామని, అసైన్ మెంట్ భూములను మాత్రమే అసలు లబ్దిదారులకు తిరిగి ఇస్తామని వివరించారు. పెద్దిరెడ్డి చెప్పింది కూడా కేవలం అసైన్ మెంట్ భూముల వరకేనని బొత్స చెప్పుకొచ్చారు.
2019-12-20పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళనలు పతాక స్థాయికి చేరాయి. గత 24 గంటల్లో ఆ రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఏడుగురు మరణించారు. నిన్న ఒక వ్యక్తి చనిపోగా... శుక్రవారం ఏకంగా ఆరుగురు హతమయ్యారు. బిజ్నోర్ పట్టణంలో ఇద్దరు, ఫిరోజాబాద్, కాన్పూర్, మీరట్, సంభాల్ పట్టణాల్లో ఒకరు చొప్పున శుక్రవారం మరణించారు. నిరసనలు, హింస కొత్త నగరాలకు విస్తరించాయి. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహించిన గోరఖ్ పూర్ లో కూడా హింస చెలరేగింది.
2019-12-20జార్ఖండ్ లో కాంగ్రెస్- జార్ఖండ్ ముక్తి మోర్చా కూటమి అధికారంలోకి వస్తుందని ‘ఇండియా టుడే- యాక్సెస్ మై ఇండియా’ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. 5 దశల పోలింగ్ శుక్రవారం ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. 81 సీట్ల అసెంబ్లీలో మెజారిటీకి 41 అవసరం. కాంగ్రెస్ కూటమికి 38 నుంచి 50 సీట్లు, బీజేపీకి 22 నుంచి 32 సీట్లు, ఎ.జె.ఎస్.యు.కి 3 నుంచి 5, ఆర్.జె.డి.కి 2 నుంచి 4, జెవిఎంకు 2 నుంచి 4 సీట్లు వస్తాయని అంచనా. ఓట్లు కాంగ్రెస్ కూటమికి 37 శాతం, బీజేపీకి 34 శాతం వస్తాయని అంచనా.
2019-12-20