రాజధాని మార్పుకోసం ప్రవేశపెట్టిన ‘వికేంద్రీకరణ’ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులపై మండలి ఛైర్మన్ వేర్వేరుగా సెలక్ట్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. రెండు బిల్లులను ప్రవేశపెట్టిన మంత్రులు ఆయా కమిటీలకు ఛైర్మన్లుగా ఉంటారు. ఒక్కో కమిటీలో తెలుగుదేశం పార్టీ నుంచి ఐదుగురు, వైసీపీ, పీడీఎఫ్, బీజేపీ నుంచి ఒక్కొక్కరు చొప్పున సభ్యులుగా ఉంటారు. కమిటీల సభ్యులకోసం పేర్లు ఇవ్వాలని మండలి అధికారులు వివిధ పార్టీల నేతలకు లేఖలు పంపినట్టు సమాచారం.
2020-01-26తమిళ అగ్ర కథానాయకుల్లో ఒకరైన విజయ్, మరో హీరో విజయ్ సేతుపతి నటించిన ‘మాస్టర్’ సినిమా థర్డ్ లుక్ పేరిట కొత్త పోస్టర్ విడుదలైంది. ఎక్స్.బి. ఫిల్మ్ క్రియేటర్స్ అధినేత గ్జేవియర్ బ్రిట్టో నిర్మిస్తున్న ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 9న సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.
2020-01-26చైనా నుంచి వ్యాపిస్తున్న ‘కరోనా వైరస్’పై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇండియా సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటిదాకా ఇండియాలో ఈ వైరస్ సోకినట్టు రిపోర్టు కాలేదని సమీక్ష అనంతరం మంత్రి చెప్పారు. అనుమానంతో 11 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురు ప్రయాణీకుల నమూనాలకు కరోనా వైరస్ ‘నెగెటివ్’ ఫలితం వచ్చిందని, ఒక ముంబై రోగికి ‘రైనో వైరస్’ ఉన్నట్టు తేలిందని మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.
2020-01-26చైనాను దాటి అనేక దేశాల్లో ‘కరోనా వైరస్’ కేసులు నమోదు కావడంతో ఇండియా అప్రమత్తమైంది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్.సి.డి.సి)లో 24x7 కాల్ సెంటరును ఏర్పాటు చేశారు. +91-11-23978046 నెంబరుకు కాల్ చేస్తే ప్రజలకు సమాచారం లభిస్తుంది. జనవరి 1 నుంచి చైనా వెళ్లి వచ్చినవారు జ్వరం, దగ్గు, శ్వాస సరిగ్గా తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే స్వయంగా నివేదించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కోరారు.
2020-01-26‘కరోనా వైరస్’ ఇండియాకు వ్యాపిస్తే నియంత్రించడం ఎలాగన్న అంశంపై ప్రధానమంత్రి కార్యాలయం శనివారం సమీక్ష నిర్వహించింది. చైనాలో మరణాలు పెరిగిన నేపథ్యంలో... దేశంలోని 7 అంతర్జాతీయ విమానాశ్రయాల్లో 20,000 మందిని స్క్రీన్ చేసినట్టు వైద్య శాఖ అధికారులు పిఎంఒ ముఖ్య కార్యదర్శి పి.కె. మిశ్రాకు చెప్పారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ లేబొరేటరీలు ‘కరోనా వైరస్’ పరీక్షలకోసం సిద్ధంగా ఉన్నాయని వివరించారు.
2020-01-26‘కరోనా వైరస్’ వ్యాప్తి వేగంగా ఉందని, పరిస్థితి ఆందోళనకరమేనని చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ చెప్పారు. అయితే, ఈ యుద్ధంలో గెలుస్తామని శనివారం చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో జి ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాణాంతక వైరస్ శనివారం వరకు 41 మంది ప్రాణాలు బలిగొని... లక్షల మందిని సొంత నివాసాలకు పరిమితం చేసింది. చైనా నూతన సంవత్సర వేడుకలు జరగాల్సిన తరుణంలో పరిస్థితిని సమీక్షించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
2020-01-26చైనాను వణికిస్తున్న ‘కరోనా వైరస్’ క్లోజప్ తొలి ఫొటో విడుదలైంది. శనివారం నాటికి 41 మందిని బలితీసుకున్న ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. సుమారు కోటీ 80 లక్షల మంది ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలను కట్ చేశారు. వుహాన్ కరోనా వైరస్ (2019-nCoV) మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (మెర్స్-కావ్), సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్-కావ్) లతో దగ్గరి సంబంధం కలిగి ఉంది.
2020-01-25తమ ఫోన్లు ట్యాప్ అయినట్టు రాజకీయ నేతలందరికీ తెలుసని, అందుకే ఆ విషయాన్ని ఎవరూ అంత తీవ్రమైనదిగా తీసుకోవడం లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో బిజెపి నేతృత్వంలోని గత ప్రభుత్వం ఎన్.సి.పి, కాంగ్రెస్ ముఖ్య నేతల ఫోన్లు ట్యాప్ చేసిందని ప్రస్తుత హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఆరోపించిన నేపథ్యంలో పవార్ స్పందించారు. ‘‘ఇది కొత్తేం కాదు. మా ఫోన్లు ట్యాప్ అవుతున్నట్టు మా అందరికీ తెలుసు’’ అని పవార్ చెప్పారు.
2020-01-26ప్రస్తుతం చైనా ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ‘కరోనా వైరస్’. ఈ వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువుగా ఉన్న వుహాన్ పట్టణానికి చైనా 450 మంది మిలిటరీ వైద్య సిబ్బందిని తరలించింది. వారిలో కొంతమందికి ‘సార్స్’, ఎబోలా మహమ్మారులపై పోరాడిన అనుభవం ఉంది. శ్వాస సంబంధమైన సమస్యలు, అంటు వ్యాధులు, ఆసుపత్రి సంక్రమణ నియంత్రణ, ఐసియు విభాగాల్లో నిపుణులు ఈ బృందంలో ఉన్నారు.
2020-01-25భీమా కొరెగావ్ కేసును ఎన్.ఐ.ఎ.కు అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ తీసుకున్న నిర్ణయం ‘రాజ్యాంగ విరుద్ధం’ అని మహారాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ వ్యాఖ్యానించారు. ఎన్.ఐ.ఎ. చట్టం ప్రకారం తన జాబితాలోని నేరాలకు సంబంధించి ఎలాంటి దర్యాప్తు అయినా చేపట్టవచ్చు. అందులో రాష్ట్రాలకు పరిమితమైన పాత్ర ఉంటుంది. ఈ కేసులో ‘సిట్’ వేయాలా వద్దా? అన్న అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే క్రమంలో కేంద్ర హోంశాఖ ఎన్.ఐ.ఎ.కు అప్పగించింది.
2020-01-25