‘కరోనా వైరస్’ కట్టడికి ప్రధాని నరేంద్ర మోడీ తనదైన పద్ధతిలో దేశ ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. ఈ నెల 22 ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటలవరకు ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని పిలుపునిచ్చారు. అత్యవసర సేవల్లో భాగమైన వారు మినహా మిగిలిన ప్రజలంతా ఇంటికి పరిమితం కావడమే ‘జనతా కర్ఫ్యూ’. ఈ ‘ప్రజా ఉద్యమ’ విజయం, దాని అనుభవాలు.. రానున్న సవాళ్ళను ఎదుర్కోవడంలో ఉపయోగపడతాయని మోడీ అభిప్రాయపడ్డారు. ‘కరోనా’పై పోరాటంలో భాగమవుతున్నవారికి కృతజ్ఞతగా 22న సాయంత్రం 5 గంటలకు 5 నిమిషాలపాటు గంట మోగించాలని లేదా చప్పట్లు కొట్టాలని సూచించారు.
2020-03-19తెలంగాణలో ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలను కూడా రద్దు చేసినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గురువారం రాత్రి ప్రకటించారు. ఉగాదికి ప్రభుత్వం ఏర్పాటు చేసే పంచాగ శ్రవణ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తామని, కాబట్టి ప్రజలు ఇళ్ళలోనే వీక్షించాలని సూచించారు. దేవాలయాలు, చర్చిలు, మసీదులలోకి భక్తులను అనుమతించవద్దని విన్నవించామని, కొంతమంది క్రిస్టియన్ పెద్దలు తనను కలసి అంగీకరించారని చెప్పారు. ఇటలీ, ఇరాన్ దేశాల్లో మతపరమైన కార్యక్రమాలకు ప్రభుత్వాలు అనుమతించడం వల్లనే ఆ రెండు దేశాలు దారుణంగా ‘కరోనా’ ప్రభావానికి గురి అయ్యాయని కేసీఆర్ పేర్కొన్నారు.
2020-03-19మధ్యప్రదేశ్ అసెంబ్లీలో రేపు (మార్చి 20) సాయంత్రం 5 గంటలలోగా బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు గురువారం సాయంత్రం ఆదేశించింది. మెజారిటీ నిరూపణ కార్యక్రమంలో సభ్యులు చేతులు ఎత్తి ఓటింగ్ లో పాల్గొనాలని, ఈ ప్రక్రియను వీడియో తీయాలని, ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆరుగురు మంత్రులు సహా 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమలనాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడింది. బిజెపిలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా వ్యూహంలో భాగంగా కమలనాథ్ ప్రభుత్వంపై ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు.
2020-03-19కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. 65 సంవత్సరాల వయసు దాటిన వారు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. ప్రజా ప్రతినిధులు, డాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు ఉంటుంది. 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను కూడా ఇళ్ళలోనే ఉంచాలని ప్రభుత్వం సూచించింది. ‘ఇంటినుంచే పని’ పద్ధతిని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. విద్యార్ధులు, పేషెంట్లు, వికలాంగులకు మినహా మిగిలిన ఎవరికీ రాయితీలతో కూడిన ప్రయాణాన్ని అనుమతించవద్దని ఎయిర్ లైన్స్, రైల్వేలను కేంద్రం ఆదేశించింది.
2020-03-19విదేశాల నుంచి వచ్చేవారి కారణంగా దేశంలో ‘కరోనా వైరస్’ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులను ఈ నెల 22 నుంచి వారం పాటు పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించింది. ఇండియాలో ఏ ఒక్క అంతర్జాతీయ విమానమూ దిగడానికి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. ఈ వారాంతంలోపు ఇటలీలో చిక్కుకుపోయిన భారతీయులను విమానంలో తరలించడానికి కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది.
2020-03-19‘కరోనా’ భయం వ్యాపించిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవాలయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని టీటీడీ నిర్ణయించింది. ఉత్తరాది నుంచి వచ్చిన ఓ భక్తుడికి ‘కరోనా’ లక్షణాలు కనిపించడంతో గురువారం టీటీడీ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంది. మధ్యాహ్నం నుంచి తిరుమల కొండపైకి వచ్చే వాహనాలను అనుమతించలేదు. కాలినడక మార్గాలను కూడా మూసివేసి కొండపైన దర్శనం చేసుకుంటున్న వాళ్లు తిరిగి వెళ్లడానికి మాత్రమే అనుమతించారు. అందరూ వెళ్లిపోయాక దేవాలయాన్ని మూసివేయాలని నిర్ణయించారు.
2020-03-192012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితులను శుక్రవారం (మార్చి 20) ఉరి తీయడం ఖాయమైంది. నిందితుల్లో ఒకడైన పవన్ గుప్తా వేసిన క్యూరేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నేరం జరిగినప్పుడు తాను మైనర్ నని నిందితుడు లేవనెత్తిన అభ్యంతరాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో నిందితుల ఉరిపై స్టే ఇవ్వడానికి ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు నిరాకరించింది. ఇంతకు ముందే ఇచ్చిన డెత్ వారెంట్ ప్రకారం మార్చి 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు నిందితులను తీహార్ జైలులో ఉరి తీయాల్సి ఉంది.
2020-03-19ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ భద్రతపై ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్సు (సి.ఆర్.పి.ఎఫ్) సిబ్బందిని పంపింది. ఒక ఎస్.ఐ. సహా 10 మంది సి.ఆర్.పి.ఎఫ్. సిబ్బంది ఎస్ఇసి కార్యాలయానికి చేరుకున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నెలకొన్న హింసను, ముఖ్యమంత్రి సహా అధికార పార్టీ నేతలు తనను లక్ష్యంగా చేసుకోవడాన్ని వివరిస్తూ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ నిన్న కేంద్ర హోం శాఖకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.
2020-03-19ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంపైనా ‘కరోనా వైరస్’ తీవ్ర ప్రభావాన్ని చూపింది. తిరుమల దేవస్థానానికి వెళ్లే ఘాట్ రోడ్డును టీటీడీ విజిలెన్స్ అధికారులు గురువారం మధ్యాహ్నం మూసివేశారు. దాంతోపాటు కాలి నడక మార్గాలను కూడా మూసివేశారు. ఇప్పుడు దిగువ ఘాట్ రోడ్డులో మాత్రమే పైనుంచి కిందకు వాహనాలను అనుమతిస్తున్నారు. తిరుమల దర్శనానికి కొండపైకి వెళ్ళిన అందరూ దిగి వచ్చిన తర్వాత దిగువ ఘాట్ రోడ్డును కూడా మూసివేయనున్నారు.
2020-03-19రాజ్యాంగ పీఠిక నుంచి ‘సోషలిస్టు’ అనే పదాన్ని తొలగించాలని కోరుతూ బిజెపి రాజ్యసభ సభ్యుడు రాకేష్ సిన్హా రేపు (మార్చి 20న) తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. శుక్రవారం ప్రైవేటు మెంబర్ బిల్లులకు కేటాయించిన సమయంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతించాలని సిన్హా నోటీసు ఇచ్చారు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అనుమతి కోరుతూ ఇచ్చిన ఆ నోటీసు బుధవారం అడ్మిట్ అయింది. తొలుత రాజ్యాంగంలో ‘సోషలిస్టు’, ‘సెక్యులర్’ అనే పదాలు లేవని, 1976లో చేర్చారని, కాబట్టి వాటిని తొలగించాలని మత సంస్థలు వాదిస్తున్నాయి.
2020-03-19