గంటకు 600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా దేశీయంగా రూపొందించిన మాగ్నెటిక్ లెవిటేషన్ (మాగ్లెవ్) రైలును చైనా పరీక్షిస్తోంది. తొలిగా ఒకే బోగీతో షాంగైలో ఆదివారం పరీక్షను నిర్వహించారు. ఈ మాగ్లెవ్ రైలును షాండాంగ్ ప్రావిన్సులోని క్విగ్డావో నగరంలో ఉన్న సి.ఆర్.ఆర్.సి. ఫ్యాక్టరీలో రూపొందించారు. మాగ్లెవ్ రైళ్ళలో చక్రాలు పట్టాలకు రాసుకోవడం ఉండదు గనుక శబ్దం తక్కువ వస్తుంది. ఐదు బోగీల మాగ్లెవ్ రైళ్ల అభివృద్ధి సాఫీగా సాగుతోందని, 2020లోనే ఉత్పత్తి జరుగుతుందని కంపెనీ తెలిపింది.
2020-06-22సామ్రాజ్యవాదానికి, జాతివివక్షకు ప్రతీకలుగా నిలిచిన అనేక మంది విగ్రహాలు అమెరికా, ఐరోపాలలో కూలిపోతున్నాయి. ఆ క్రమంలోనే... అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ ప్రవేశ ద్వారానికి ముందు కనిపించే థియోడర్ రూజ్‌వెల్ట్ విగ్రహాన్ని తొలగించబోతున్నారు. ఆ విగ్రహ రూపకల్పనలోనే.. ఆఫ్రికన్ అమెరికన్లు, స్వదేశీ అమెరికన్లను తక్కువ జాతివారిగా చిత్రించారని అభ్యంతరాలున్నాయి. రూజ్‌వెల్ట్ గుర్రంపై కూర్చొని ఉంటే ఓ నల్లజాతీయుడు, మరో దేశీ అమెరికన్ క్రింద నిల్చొని ఉన్నట్లుగా ఆ కాంశ్య విగ్రహాన్ని చెక్కారు. రూజ్‌వెల్ట్ విగ్రహాన్ని తొలగించనున్నట్లు న్యూయార్క్ మేయర్ బిల్ డి బ్లాసియో ప్రకటించారు.
2020-06-22మూడు నెలల తర్వాత ఎన్నికల ప్రచారాన్ని మళ్ళీ ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి ర్యాలీకి లక్ష మంది హాజరవుతారని శ్వేతసౌధం ఊదరగొట్టింది. అయితే, 19 వేల సీట్లు మాత్రమే ఉన్న తుల్సా బి.ఒ.కె. స్టేడియంలో సుమారు సగం సీట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. జనం రాని కారణంగా స్టేడియం వెలుపల జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేశారు. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ నిరసనల భయంతో చాలా మంది రాలేదని, కొంతమందిని నిరసనకారులు అడ్డుకున్నారని ఈ ర్యాలీ నిర్వాహకులు వివరణ ఇచ్చారు. ‘కరోనా’ వ్యాప్తి తర్వాత ట్రంప్ కు జనాదరణ తగ్గిందని సర్వేలు చెబుతున్నాయి.
2020-06-21వివాదాలపైన వాలిపోయే వర్మ (రాంగోపాల్) ఇప్పుడు ‘మారుతీరావు- అమృత’ కథతో సినిమాను ప్రకటించారు. ‘మర్డర్’ పేరిట రూపొందిస్తున్న ఈ సినిమా తొలి పోస్టర్ ను ఆదివారం పితృ దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. హృదయాన్ని మెలిపెట్టే ఈ కథలో ‘కుమార్తెను అతిగా ప్రేమించడంలో తండ్రికి ఉండే ప్రమాదాల’ను వర్మ చెప్పబోతున్నారట. మారుతీరావు పాత్రకు శ్రీకాంత్ అయ్యంగార్, అమృత పాత్రకు సాహితి అవంచలను ఎంపిక చేసుకున్నారు. వివాదాస్పద అంశాలపై లో బడ్జెట్ సినిమాలు తీసి ఉచిత ప్రచారంతో సొమ్ము చేసుకునే ‘కళ’లో వర్మ ఆరితేరిపోయారు.
2020-06-21అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలతో తనకు ప్రాణహాని ఉందని ఆ పార్టీకే చెందిన నర్సాపురం ఎం.పి. రఘురామకృష్ణంరాజు కేంద్రానికి నివేదించారు. ఈమేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాలకు లేఖలు రాశారు. ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై మాట్లాడేందుకు సిఎంను కలవాలని ప్రయత్నించినా సాధ్యపడలేదని, బహిరంగంగా మాట్లాడితే బెదిరింపులకు దిగారని వైసీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తాను స్వేచ్ఛగా నియోజకవర్గంలో పర్యటించే అవకాశం లేనందున కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని విన్నవించారు.
2020-06-21‘కరోనా’ అత్యంత వేగంగా విస్తరిస్తున్న దేశం బ్రెజిల్. ఆదివారం నాటికి ఆ దేశంలో 10,70,139 మందికి ఈ వైరస్ సోకగా మరణాల సంఖ్య 50 వేలు దాటింది (50,058). ‘కరోనా’ మృతుల సంఖ్యలో అమెరికా (1,22,067) తర్వాత బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. యు.కె. (42,632 మంది), ఇటలీ (34,634), ఫ్రాన్స్ (29,633), స్పెయిన్ (28,322), మెక్సికో (20,781) తర్వాత ఇండియా (13,502 మరణాలు) ఉంది. కేసుల సంఖ్యలో మాత్రం ఇండియా 4వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 89,75,984కు, మృతుల సంఖ్య 4,67,850కి పెరిగాయి.
2020-06-21‘కరోనా’ రోగులకోసం ‘గిలియడ్’ రూపొందించిన ‘రెమెడిసివిర్’ను ఇండియాలో హెటెరో డ్రగ్స్ విడుదల చేయనుంది. ‘కోవిఫర్’ పేరిట మార్కెట్లోకి వస్తున్న ఈ మందు ఒక్కో డోసు (ఇంజెక్షన్) ఖరీదు రూ. 5000 నుంచి రూ. 6000 వరకు ఉండొచ్చని ‘హెటెరో’ కంపెనీ తెలిపింది. మందు ధరపై సోమవారం లేదా మంగళవారం నిర్ణయం తీసుకుంటామని కంపెనీ ఎండి బండి వంశీకృష్ణ చెప్పారు. ఇండియాకోసం ‘కోవిఫర్’ ఉత్పత్తిని ఈ వారం ప్రారంభిస్తామని, రెండు-మూడు వారాల్లో లక్ష డోసులు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. ముందుగా ఈ మందును ‘కరోనా’ తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్ర, ఢిల్లీలలో విడుదల చేయనున్నారు.
2020-06-21పనికోసం విదేశాలనుంచి వచ్చేవారిని అడ్డుకోవడానికి.. హెచ్-1బి, ఎల్1 వీసాలపై సరికొత్త ఆంక్షలను ఆదివారం లేదా సోమవారం ప్రకటిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం (అమెరికా కాలమానం) చెప్పారు. ‘కరోనా’ వైరస్ అమెరికా ఉద్యోగ మార్కెట్ ను తీవ్రంగా ప్రభావితం చేసిన నేపథ్యంలో స్థానికుల ఉద్యోగాలు కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. కొత్త ఆంక్షల్లో మినహాయింపులు ఉంటాయా? అని ‘ఫాక్స్ న్యూస్’ జర్నలిస్టు అడిగినప్పుడు ‘చాలా తక్కువ’ అని సమాధానమిచ్చారు. మరిన్ని వివరాలు చెప్పేందుకు ఆయన నిరాకరించారు.
2020-06-21ఒక్కో ప్రాజెక్టు విలువ రూ. 500 కోట్లు మించకుండా ఆయుధాలు కొనుగోలు చేసే అధికారాన్ని త్రివిధ దళాధిపతులకు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఆయుధాలను త్వరితగతిన సేకరించేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సైనిక దళాలకు ఇలాంటి ఆర్థిక అధికారాలు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. యూరి దాడి, బాలాకోట్ సర్జికల్ దాడి సందర్భాల్లోనూ తాత్కాలికంగా ఈ అధికారాలు ఇచ్చారు. బాలాకోట్ వైమానిక దాడి కోసం స్పైస్-2000 బాంబులను ఎయిర్ ఫోర్స్ ఇలాగే కోనుగోలు చేసింది.
2020-06-21అమెరికా సంస్థ ‘టైసన్ ఫుడ్స్’ నుంచి కోడి మాంసం దిగుమతిని నిలిపివేస్తున్నట్లు చైనా కస్టమ్స్ అధారిటీ ఆదివారం ప్రకటించింది. మాంసం ఎగుమతి సంస్థ ‘టైసన్ ఫుడ్స్’ ఉద్యోగుల్లో కొందరు ‘కరోనా’ బారిన పడిన నేపథ్యంలో చైనా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేశానికి చేరుకున్న, మార్గమధ్యంలో ఉన్న ఉత్పత్తుల వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. 22.56 లక్షల ‘కరోనా’ కేసులు, సుమారు 1.20 లక్షల మరణాలతో అమెరికా అల్లాడుతోంది.
2020-06-21