ఈ ఏడాది జూన్ నుంచి గడచిన ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో 537 మానభంగం కేసులు నమోదైనట్టు హోంమంత్రి సుచరిత అసెంబ్లీలో చెప్పారు. మహిళల అపహరణం కేసులు 266, శీలభంగం కేసులు 2088 నమోదైనట్టు ఆమె వెల్లడించారు. వరకట్నం కేసులు వేల సంఖ్యలోనే ఉన్నాయి. మంగళవారం అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ సభ్యురాలు ఆదిరెడ్డి భవాని ప్రశ్నకు బదులుగా హోంమంత్రి ఈ సమాచారమిచ్చారు.
2019-12-17ఏపీ ఆర్థికాభివృద్ధి మండలి (ఇడిబి) మాజీ సీఈవో జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్ ను నిలిపివేస్తూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (సిఎటి) మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కృష్ణకిషోర్ ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని సవాలు చేస్తూ కృష్ణకిషోర్ ‘క్యాట్’ను ఆశ్రయించారు. కేంద్ర సర్వీసులనుంచి వచ్చిన కృష్ణకిషోర్ పై చర్యలు తీసుకోవడం రాష్ట్ర పరిధిలోకి రాదని ఆయన తరపు న్యాయవాదులు ‘క్యాట్’లో వాదించారు. ఈ నెల 24న తదుపరి విచారణ జరగనుంది.
2019-12-16పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా ఓటు వేసిన బిజెపి మిత్రులలో అకాలీదళ్ స్వరం మార్చింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్థిస్తూనే... ముస్లింలను కూడా అందులో చేర్చాలని సోమవారం డిమాండ్ చేసింది. ‘‘ఇండియా లౌకిక దేశం. ముస్లింలను తొలగించడం సమ్మతం కాదు’’ అని పార్టీ పేర్కొంది. మత ప్రాతిపదికన పౌరసత్వ చట్టానికి సవరణలు చేయడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో అకాలీదళ్ వైఖరి మారినట్టుంది.
2019-12-16అయోధ్యలో రామమందిరాన్ని ఆకాశమంత ఎత్తున నాలుగు నెలల్లోపల నిర్మిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. సోమవారం జార్ఖండ్ ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఓవైపు నాలుగో దశ పోలింగ్ జరుగుతుండగా ఐదో దశ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో అమిత్ షా ప్రచారం సాగింది. నాలుగో దశలో 15 అసెంబ్లీ సీట్లకు సోమవారం పోలింగ్ జరిగింది. ఐదో దశ పోలింగ్ ఈ నెల 20న జరగనుంది. 23వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.
2019-12-16‘మీరు కావాలనుకుంటే నా ప్రభుత్వాన్ని రద్దు చేసుకోండి. పౌరసత్వ సవరణ చట్టం (సి.ఎ.ఎ), జాతీయ పౌర రిజిస్ట్రీ (ఎన్.ఆర్.సి)ని మాత్రం అమలు చేయబోం’ అని బెంగాల్ సిఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వానికి సవాలు విసిరారు. మమత సోమవారం కోల్ కత నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రెడ్ రోడ్ నుంచి రవీంద్రనాథ్ ఠాగూర్ నివాసం వరకు ఈ ర్యాలీ సాగింది. బిజెపి కిరాయి మనుషులు కొందరు, ముస్లింలకు స్నేహితులుగా నటించే బయటి వ్యక్తులు కొందరు మొన్న హింసకు దిగారని మమత ఆరోపించారు.
2019-12-16ఉన్నావ్ మానభంగం కేసులో బిజెపి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ దోషేనని ఢిల్లీ కోర్టు నిర్ధారించింది. అతనికి విధించే శిక్షను ఈ నెల 18న ప్రకటించనుంది. 2017లో ఒక మైనర్ బాలికను అపహరించి రేప్ చేసినట్టుగా ఈ బీజేపీ ఎమ్మెల్యేపై అభియోగాలున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ లో బాధితురాలు యుపి సిఎం యోగి ఇంటి ఎదుట ఆత్మహత్యాయత్నం చేసేవరకు నిందితుడిని అరెస్టు చేయలేదు. ఆ తర్వాత జైలు నుంచే బాధితురాలి కుటుంబం మొత్తాన్ని నిర్మూలించేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత బీజేపీ ఈ ఎమ్మెల్యేను బహిష్కరించింది.
2019-12-16ఏపీ అసెంబ్లీలో నడుస్తున్న పొగడ్తల పోటీలోకి సోమవారం జనసేన సభ్యుడు (సాంకేతికంగా) రాపాక వరప్రసాద్ కూడా దూకారు. అయితే, ఏ అంశంపైన చర్చ జరుగుతున్నదో స్పష్టంగా తెలియకుండానే సిఎంను పొగిడారు. రాష్ట్రంలో ఎస్సీ-ఎస్టీ కమిషన్ ను విభజించి విడివిడిగా కమిషన్లను ఏర్పాటు చేసే అంశంపై చర్చ జరుగుతోంది. ఆ సమయంలో రాపాక... మాల, మాదిగ, రెల్లి కులాలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేయడం చారిత్రాత్మకం అంటూ పొగడ్తలు మొదలు పెట్టారు. సహచర సభ్యులు ఉప్పందించడంతో సర్దుకున్నారు.
2019-12-16పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల సందర్భంగా అస్సాంలో 100 మందిని అరెస్టు చేసినట్టు, మరో 2000 మందిని నిర్భంధించినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. డిసెంబర్ 12, 13 తేదీల్లో ఈ అరెస్టులు జరిగాయని, ఇతరులను గుర్తించడానికి వీడియోలను పరిశీలిస్తున్నామని అస్సాం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంత చెప్పారు. కర్ఫ్యూ మాత్రం (రాత్రి నుంచి ఉదయం వరకు) కొనసాగనుంది. ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని సోమవారం సాయంత్రం వరకు పొడిగించారు.
2019-12-16జామియా మిలియా ఇస్లామియా, అలీఘర్ ముస్లిం యూనిర్శిటీలలో పోలీసుల దాడులపై వాదనలు వినడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ముందుగా అల్లర్లు ఆగాలని, శాంతి నెలకొనాలని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే స్పష్టం చేశారు. నిరసనలు ఇంకా కొనసాగుతున్నందున రేపు వాదనలు వింటామని ఆయన పిటిషనర్లకు తెలిపారు. రెండు యూనివర్శిటీలో పోలీసులు విద్యార్థులపై సాగించిన హింసపై దృష్టి సారించాలని అడ్వకేట్లు ఇందిరా జైసింగ్, కోలిన్ గొన్సాల్వెస్ సోమవారం సుప్రీంకోర్టును కోరారు.
2019-12-16 Read Moreఏపీ అసెంబ్లీలో ఈ నెల 13న ఆమోదం పొందిన ‘‘దిశ బిల్లు’’ కాపీలు కావాలని ఢిల్లీ ప్రభుత్వం కోరినట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం సభలో చెప్పారు. ‘దిశ బిల్లు’కు గొప్పగా ప్రశంసలు లభిస్తున్నాయని స్పీకర్ పేర్కొన్నారు. బిల్లును ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వాన్ని, రూపకల్పనలో భాగమైన అందరినీ ఈ సందర్భంగా స్పీకర్ అభినందించారు.
2019-12-16