టి20 ఫార్మాట్లో న్యూజీలాండ్ గడ్డపై ఆతిథ్య దేశాన్ని ఇండియా తొలిసారి ఓడించింది. అదీ అలా ఇలా కాదు. ఒక్క పోటీలో కూడా ఆతిథ్య దేశాన్ని గెలవనీయకుండా 5-0 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన చివరి టి20లో ఇండియా తొలుత బ్యాటింగ్ చేసి 163 పరుగులు సాధించింది. న్యూజీలాండ్ జట్టు 156 పరుగులకే పరిమితమైంది. భారత జట్టులో రోహిత్ శర్మ 41 బంతుల్లో 60 పరుగులు సాధించగా న్యూజీలాండ్ జట్టులో టిమ్ సీఫెర్ట్ 50, రాస్ టేలర్ 53 పరుగులు చేశారు.
2020-02-02బొమ్మలు, పిల్లలు ఆడుకునే ట్రైసైకిళ్ళు, స్కూటర్లపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. ఇప్పటిదాకా 20 శాతంగా ఉన్న సుంకం ఏకంగా 60 శాతానికి పెరిగింది. ఈ పిల్లల సామాగ్రి సింహభాగం చైనా నుంచే వస్తుంది. దేశీయ కంపెనీలకోసం కొన్ని కేటగిరిల వస్తువులపై దిగుమతి సుంకాలు పెంచినట్టు శనివారం కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వాల్ నట్స్ పైన సుంకాన్ని 30 శాతం నుంచి 100 శాతానికి పెంచారు.
2020-02-02శనివారం 2020-21 కేంద్ర బడ్జెట్ వెలువడ్డాక స్టాక్ మార్కెట్లలో భారీ పతనం నమోదైంది. ఎస్ అండ్ పి బి.ఎస్.ఇ. సెన్సెక్స్ ఓ దశలో 1,274 పాయింట్లు పతనమైంది. చివరికి 987.96 పాయింట్లు (2.43 శాతం) తగ్గి 40 వేల మార్కు కంటే దిగువన (39,735.53 వద్ద) ముగిసింది. ఎన్.ఎస్.ఇ.లో నిఫ్టీ50 కూడా 392 పాయింట్ల (3.26 శాతం) పతనంతో 11,643.80 వద్ద ముగిసింది. హెచ్.డి.ఎఫ్.సి. ద్వయం, ఐటిసి, ఐసిఐసిఐ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టి, ఎస్.బి.ఐ. షేర్లు 7 శాతం వరకు పడిపోయాయి.
2020-02-02 Read More2020-21 బడ్జెట్లో కేంద్రం రక్షణ రంగానికి రూ. 4,71,378 కోట్లు కేటాయించింది. మొత్తం వ్యయంలో ఇది 15.49 శాతం. భారీ కేటాయింపులు పొందిన మంత్రిత్వ శాఖల్లో ‘రక్షణ’ నెంబర్ 1. అయితే, పెరుగుదల పెన్షన్లలోనే ఎక్కువగా కనిపిస్తోంది. రక్షణ శాఖ పెన్షన్లకోసం ఈ ఏడాది రూ. 1,12,080 కోట్లు కేటాయించగా 2020-21కోసం 1,33,825 కోట్లు కేటాయించారు. కేపిటల్ వ్యయం కింద ఈ ఏడాది రూ. 1,03,394 కోట్లు కేటాయించగా వచ్చే ఏడాదికోసం రూ. 1,13,734 కోట్లు కేటాయించారు.
2020-02-02కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ లోటు తొలిసారిగా రూ. 6 లక్షల కోట్లు దాటుతోంది. 2020-21లో లోటు రూ. 6,09,219 కోట్లు ఉండొచ్చని కేంద్రం తాజా బడ్జెట్ అంచనాల్లో పేర్కొంది. ఇది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2.7 శాతం. 2018-19లో రెవెన్యూ లోటు రూ. 4,54,483 కోట్లు (జీడీపీలో 2.4 శాతం)గా తేలింది. 2019-20లో రూ. 4,85,019 కోట్లు ఉంటుందని పోయిన బడ్జెట్ సమయంలో అంచనా వేయగా, సవరించిన అంచనాల్లో అది రూ. 4,99,544 కోట్లకు పెరిగింది. వచ్చే ఏడాది లక్షా 10 వేల కోట్లు అదనపు లోటు ఉంటుందని అంచనా.
2020-02-02ప్రస్తుత (2019-20) ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల రెవెన్యూ లోటు భర్తీకోసం రూ. 34,582 కోట్లను కేంద్రం కేటాయించింది. అయితే, తాజా బడ్జెట్లో పేర్కొన్న ‘సవరించిన అంచనాల’లో ఈ మొత్తం రూ. 28,314 కోట్లకు తగ్గింది. 2020-21 బడ్జెట్లో ఈ పద్దు కింద రూ. 30,000 కోట్లు కేటాయించారు. కేంద్ర పన్నుల్లో వాటాను బదిలీ చేశాక కూడా రెవెన్యూ లోటు ఏర్పడే పరిస్థితి ఉంటే ఈ గ్రాంటు ఇస్తారు. ఈ ఏడాది కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా భారీగా తగ్గిపోగా...రెవెన్యూ లోటు గ్రాంటు కూడా కేంద్రం తగ్గించడం గమనార్హం.
2020-02-02బడ్జెట్ ప్రసంగాల నిడివిలో రికార్డు నెలకొల్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. శనివారం ఆమె 2020 బడ్జెట్ ప్రసంగం ఏకంగా 2.40 గంటల పాటు సాగింది. అప్పటికీ పూర్తి కాలేదు. ఇంకా కొన్ని పేజీలు మిగిలి ఉండగా.. అలసిపోయిన ఆర్థిక మంత్రికి చెమటలు పట్టాయి. ఆ సమయంలో తోటి మంత్రులు చక్కెర అందించారు. చెమట తుడుచుకున్న నిర్మల, ఇక ప్రసంగాన్ని కొనసాగించలేకపోయారు. సుదీర్ఘ ప్రసంగాల్లో గత ఏడాది తానే నెలకొల్పిన రికార్డును (2.17 గంటలు) ఈసారి చెరిపేశారు.
2020-02-02చైనా సహా మెజారిటీ ఆసియా దేశాల కంటే ఇండియాలో కార్పొరేట్ పన్ను తక్కువని బడ్జెట్ చెబుతోంది. ప్రామాణికంగా తీసుకున్న 8 దేశాల్లో థాయ్ లాండ్ మినహా అన్నిచోట్లా ఇండియా కంటే కార్పొరేట్ పన్ను ఎక్కువే. నెంబర్ 2 ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాలో 25 శాతం, మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థ జపాన్లో 23.2 శాతం, శ్రీలంకలో 28 శాతం, ఫిలిప్పీన్స్ లో 30 శాతం పన్ను అమల్లో ఉన్నట్టు పేర్కొన్నారు. సంపద సృష్టికర్తలను తాము గౌరవిస్తామని ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగంలో నొక్కి చెప్పారు.
2020-02-02విభజించదగిన కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 42 శాతం నుంచి 41 శాతానికి తగ్గుతోంది. 2020-21 సంవత్సరానికి గాను 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసు ప్రకారం రాష్ట్రాల వాటా 42 శాతం నుంచి 41కి తగ్గనుంది. ఇంతకు ముందు రాష్ట్రంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2021-22 నుంచి 2025-26 వరకు ఉన్న కాలానికి 15వ ఆర్థిక సంఘం రెండో నివేదికను వచ్చే అక్టోబరులో సమర్పించనుంది.
2020-02-01 Read Moreకేంద్ర పన్నుల్లో వాటా కింద ఈ ఏడాది రాష్ట్రాలకు రావలసిన మొత్తంలో భారీగా కోత పడింది. 2018-19లో బదిలీ అయిన మొత్తం కంటే ఈ ఏడాది రాష్ట్రాలకు రూ. 1,05,408 కోట్లు (13.84 శాతం) తగ్గుతోంది. 2020-21 బడ్జెట్ పత్రం ప్రకారం... ఈ ఏడాది రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటాగా వస్తున్న మొత్తం రూ. 6,56,046 కోట్లు. ఇది గత ఏడాది రూ. 7,61,454 కోట్లుగా ఉంది. 2020-21లో ఈ వాటా రూ. 7,84,181 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అంటే.. రెండేళ్ళ పాటు రాష్ట్రాల వాటాలో స్తబ్ధత నెలకొన్నట్లు.
2020-02-01