నూతన ఐటి నిబంధనలను సవాలు చేస్తూ వివిధ హైకోర్టులలో దాఖలైన పిటిషన్లపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అన్ని కేసులనూ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ విన్నపాన్ని జూలై 16వ తేదీకి వాయిదా వేసింది. ఐటి రూల్స్ 2021 రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ ఢిల్లీ, కేరళ, మద్రాస్ హైకోర్టులలో పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్లలో ద వైర్, ద న్యూస్ మినిట్, లైవ్ లా, ద క్వింట్, ఆల్ట్ న్యూస్ వంటి డిజిటల్ మీడియా సంస్థలు ఉన్నాయి. ఆ పిటిషన్లటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రం ఈ నెల 7న కోరింది.
2021-07-09మంత్రివర్గంలో 65 శాతం పోస్టులతోనే రెండేళ్ళకు పైగా గడిపిన ప్రధాని నరేంద్ర మోదీ, బుధవారం ఒక్కసారే భారీగా మార్పులు, చేర్పులు చేశారు. 12 మంది మంత్రులకు ఉద్వాసన పలకగా, 43 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో 15 మందికి కేబినెట్ హోదా దక్కింది. ఉద్వాసనకు గురైన ఏడుగురు కేబినెట్ మంత్రుల స్థానాల్లోకి ఏడుగురు కొత్తవారు రాగా, ఇప్పటిదాకా ‘సహాయ’ మంత్రులుగా చేసిన 8 మందికి ప్రమోషన్ లభించింది. సహాయ మంత్రుల్లో ఐదుగురికి ఉద్వాసన పలకగా 28 మంది కొత్తగా ప్రమాణ స్వీకారం చేశారు.
2021-07-07కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ప్రమోషన్ వచ్చింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా బుధవారం ఆయన కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కూడా ఇదే రోజు ప్రమాణం చేయడం యాధృచ్ఛికమే. అయితే కిషన్ రెడ్డికి ప్రమోషన్ ఇవ్వడంలో మాత్రం రేవంత్ ఫ్యాక్టర్ పని చేసినట్టు భావిస్తున్నారు. తెలంగాణలో బలీయంగా ఉన్న రెడ్లను కాంగ్రెస్ వైపు సమీకరించడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్న తరుణంలో, కిషన్ రెడ్డికి ఊహించినదానికంటే ఎక్కువ ప్రాధాన్యత దక్కింది.
2021-07-07కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉద్వాసనకు గురైన 12 మంది బుధవారం రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు వారి రాజీనామాలను ఆమోదించినట్టు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రకటించారు. సీనియర్ మంత్రులు డివి సదానందగౌడ, రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్, హర్షవర్థన్, రమేష్ పోఖ్రియాల్ లతో పాటు సంతోష్ కుమార్ గంగ్వార్, బాబుల్ సుప్రియో, ప్రతాప్ చంద్ర సారంగి తదితరులు ఉన్నారు. థావర్ చంద్ గెహ్లాట్ ను నిన్ననే కర్నాటక గవర్నరుగా నియమించగా, మిగిలినవారి భవిష్యత్ ఏమిటన్నది తేలాల్సి ఉంది.
2021-07-07కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొత్తగా ‘సహకార మంత్రిత్వ శాఖ’ను ఏర్పాటు చేసింది. దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఈ మంత్రిత్వ శాఖ పరిపాలనాపరమైన, న్యాయ, విధానపరమైన నిర్మాణాన్ని అందిస్తుందని కేబినెట్ సెక్రటేరియట్ ఒక ప్రకటనలో పేర్కొంది. సహకార సంస్థల్లో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ప్రక్రియలకు, బహుళ-రాష్ట్ర సహకార సంస్థ (ఎం.ఎస్.సి.ఎస్)ల అభివృద్ధికి ఈ మంత్రిత్వ శాఖ ఉపయోగపడుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
2021-07-06విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ దిమ్మెలు కూలి ఇద్దరు మరణించారు. అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు జాతీయ రహదారిపై బ్రిడ్జిని నిర్మిస్తుండగా, మంగళవారం పుప్పాల జంక్షన్ వద్ద రెండు భారీ సిమెంటు దిమ్మెలు కూలిపోయాయి. ఫ్లైఓవర్ దిమ్మెల కింద ఒక ఆయిల్ ట్యాంకర్, ఒక కారు నలిగిపోయాయి. కారులో ఉన్న ఇద్దరు మరణించగా, ట్యాంకర్ లో ఉన్నవారు గాయపడ్డారు.
2021-07-06జూన్ నెలలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ళు రూ. 92,849 కోట్లకు పరిమితమయ్యాయి. గత 10 నెలల్లో ఇదే అత్యల్పం. ఏప్రిల్ లో రికార్డు స్థాయిలో రూ. 1.41 లక్షల కోట్లు వసూలు కాగా, మే నెలలో రూ. 1.02 లక్షల కోట్లకు తగ్గాయి. కరోనా రెండో వేవ్ ప్రభావంతో జూన్ నెలలో వసూళ్ళు మరింతగా తగ్గాయి. అయితే, ఊహించిన తగ్గుదల కంటే ఇది మెరుగేనని నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది జూన్ నెలతో పోల్చితే, ఈ ఏడాది జూన్ 5 నుంచి జూలై 5 వరకు వసూలైన మొత్తం 2 శాతం ఎక్కువ.
2021-07-06భారత ఎన్నికల కమిషన్ (సీఈసీ)పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో కమిషన్ సాయం చేయకపోతే బిజెపి సీట్లు 30కి మించేవి కావని మమత వ్యాఖ్యానించారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ ‘‘నేను పోటీ చేసిన చోట చూశాను. ప్రజలను ఓటు వేయవద్దని భయపెట్టారు’’ అని మమత ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 77 సీట్లు గెలుచుకుంది. ఎన్నికల సమయంలోనూ, తర్వాత ఈసీ పాత్రపై మమత ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.
2021-07-06రాష్ట్ర బిజెపి సీనియర్ నేత, విశాఖపట్నం మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబును మిజోరాం గవర్నరుగా నియమిస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నలుగురు గవర్నర్లను ప్రస్తుతం ఉన్నచోట నుంచి బదిలీ చేసిన కేంద్రం, కొత్తగా నలుగురిని గవర్నర్లుగా నియమించింది. కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లోట్ ను ఆ బాధ్యతల నుంచి తప్పించి కర్నాటక గవర్నరుగా పంపారు. బండారు దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ నుంచి హర్యానాకు బదిలీ చేశారు.
2021-07-06శాసన మండలి ఏర్పాటు కోరుతూ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మంగళవారం ఒక తీర్మానం చేసింది. బిజెపి వ్యతిరేకించగా సభలో ఉన్న 265 మంది సభ్యులలో 196 మంది తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. 69 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. ఇంతకు ముందు అడ్-హాక్ కమిటీ చేసిన సిఫారసును బలపరుస్తూ ఈ తీర్మానాన్ని శాసనసభా వ్యవహారాల మంత్రి పార్థా చటర్జీ ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోసమే మండలిని ముందుకు తెచ్చారని బిజెపి ఆరోపించింది.
2021-07-06