ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘కరోనా’ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. శనివారం ఒక్క రోజే 5041 వైరస్ కేసులు నమోదయ్యాయి. అంటే గంటకు 210కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. శుక్ర, శనివారాల్లో 9 వేలకు పైగా కేసులు నమోదు కావడం రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితికి నిదర్శనం. ఈ 9004 కేసుల్లో ఒక్కటి కూడా వేరే రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చినది కాదు. ఆ అందరికీ స్థానికంగానే వైరస్ వ్యాపించింది. మొత్తం వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య శనివారానికి 49,650కి, మరణాలు 642కి పెరిగాయి.
2020-07-19ఏపీలో ‘కరోనా’ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో 23,872 మందికి పరీక్షలు నిర్వహించగా 3963 మందికి వైరస్ నిర్ధారణ అయింది. అంటే పాజిటివిటీ రేటు 16.60 శాతానికి పెరిగింది. పరీక్ష చేయించుకున్న ప్రతి ఆరుగురిలో ఒకరికి పాజిటివ్ ఫలితం వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా గంటకు 165.125 చొప్పున కొత్త కేసులు నమోదు కాగా, గోదావరి జిల్లాల్లో నిమిషానికి ఓ మనిషికి ‘కరోనా’ నిర్ధారణ అయింది. కొత్త బాధితుల్లో ఒక్కరు కూడా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చినవారు లేరు. ‘కరోనా’ వ్యాప్తి పతాక స్థాయికి చేరుతోందని ఈ సంఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
2020-07-18ఆంధ్రప్రదేశ్ ‘కరోనా’ ఉగ్ర రూపాన్ని చూస్తోంది. శుక్రవారం ఒకే రోజు రాష్ట్రంలో 3,963 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో తూర్పు గోదావరి జిల్లావి 994. ఇది ఆందోళనకరం. నిన్న రాష్ట్రంలో నమోదైన ప్రతి 4 కేసుల్లో ఒకటి ఈ జిల్లాదే! ఈ భారీ పెరుగుదలతో మొత్తం కేసుల సంఖ్యలో తూర్పు గోదావరి జిల్లా 2వ స్థానానికి చేరుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో మరో 407 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 13 జిల్లాల్లో నమోదైన కేసుల్లో ‘ఉభయగోదావరి’ వాటా 35.35%. కర్నూలులో 550, చిత్తూరులో 343, నెల్లూరులో 278, ప్రకాశంలో 266 కేసులు నమోదయ్యాయి.
2020-07-18బాలీవుడ్ నటీమణి ఐశ్వర్యారాయ్ బచ్చన్ తన కుమార్తె ఆరాధ్యతో సహా ముంబై లోని నానావతి ఆసుపత్రిలో చేరారు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ లతో పాటు వీరిద్దరికీ కూడా ‘కరోనా’ వైరస్ సోకినట్లు కొద్ది రోజుల క్రితం నిర్ధారణ అయింది. తండ్రీ కొడుకులు ఇద్దరూ అప్పుడే ఆసుపత్రిలో చేరగా ఐశ్వర్య, ఆమె కుమార్తె మాత్రం ‘హోం క్వారంటైన్’లో ఉన్నారు. వైరస్ లక్షణాలు వెల్లడి కావడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలని తాజాగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. జయా బచ్చన్ మినహా కుటుంబంలో అందరికీ వైరస్ నిర్ధారణ కావడంతో వారికి సంబంధించిన నాలుగు బంగ్లాలలోనూ క్రిమిసంహారకాలతో ధూపం వేశారు.
2020-07-17తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని, నిర్మాణాలకు మాత్రమే అనుమతులు తీసుకోవాల్సి వుంటుందని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా అదే స్వరాన్ని వినిపించడంతో అభ్యంతరాలను హైకోర్టు కొట్టివేసింది. దీంతో సచివాలయ భవనాల కూల్చివేతకు మార్గం సుగమమైంది.
2020-07-17ఆర్టీసీ ఎండీ స్థానం నుంచి బదిలీ చేయడంపై మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన ఐపిఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ పైన ప్రభుత్వం మండిపడింది. ఎ.పి.ఎస్.పి. బెటాలియన్స్ ఏడీజీ స్థానం నుంచి కూడా బదిలీ చేస్తూ.. సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేయాలని సీఎస్ నీలం సాహ్నీ ఆదేశించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సిఎంగా ఉండగా.. ఆయన వద్ద పని చేసిన అధికారుల్లో తనను మినహా మిగిలిన అందరినీ సీబీఐ ప్రశ్నించిందని, తన నిజాయితీకి అదే సాక్ష్యమని 3 రోజుల క్రితం మాదిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన ‘అభ్యంతరకర ప్రకటన’లపై నీలం సాహ్నీ వివరణ కోరారు.
2020-07-16‘కరోనా’ కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో కర్నూలు నగరాన్ని ‘కంటోన్మెంట్ జోన్’గా ప్రకటించింది నగర పాలక సంస్థ. బుధవారం కర్నూలు జిల్లాలో 590 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఇవి 22.83%. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కర్నూలు నగరంపై ఆంక్షలు విధించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రాకూడదని, నిత్యావసరాల షాపులను నిర్దేశించిన సమయంలో (ఉదయం 6 నుంచి 11 వరకు) మాత్రమే తెరవాలని హుకుం జారీ చేశారు. మాస్కులు ధరించనివారికి మొదటిసారి రూ. 200, తర్వాత రూ. 500 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
2020-07-16‘కరోనా’ దెబ్బకు 2020 మొదటి త్రైమాసికంలో కుదేలైన చైనా ఆర్థిక వ్యవస్థ రెండో త్రైమాసికంలో కొద్దిగా కోలుకుంది. చైనా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) జనవరి-మార్చి కాలంలో తిరోగమించగా (మైనస్ 6.8 శాతం).. ఏప్రిల్- జూన్ కాలానికి 3.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తంగా తొలి అర్ధ సంవత్సరంలో జీడీపీ వృద్ధి మైనస్ 1.6గా నమోదైంది. ‘కరోనా’ వైరస్ బారిన పడిన తొలి దేశం చైనా. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఆ దేశంలో కేసులు విపరీతంగా పెరిగాయి. మార్చినాటికి వైరస్ వ్యాప్తిని కట్టడి చేసిన చైనా ఆర్థిక కార్యకలాపాలను క్రమంగా పునరుద్ధరించింది.
2020-07-1613 జిల్లాలను 26గా విభజించే ప్రక్రియ కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అధ్యయన కమిటీని నియమించాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. ఈ కమిటీ కన్వీనరుగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, సభ్యులుగా సీసీఎల్ఎ, జీఎడి (సర్వీసెస్), ప్రణాళికా శాఖల కార్యదర్శులు, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి ఉంటారు. 25 లోక్ సభ నియోజకవర్గాలను 25 జిల్లాలుగా మారుస్తామని సిఎం జగన్ ఎన్నికలకు ముందే ప్రకటించారు. ‘అరకు’ నాలుగు జిల్లాల పరిధిలో విస్తరించినందున.. ఆ నియోజకవర్గాన్ని రెండుగా విభజించే అంశాన్ని పరిశీలించాలని సిఎం సూచించారు.
2020-07-15గుంటూరు జిల్లాలో ఒక్క రోజే 468 మందికి కొత్తగా ‘కరోనా’ వైరస్ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో మంగళవారం నమోదైన ప్రతి ఐదు కొత్త కేసుల్లో ఒకటి ఈ జిల్లాదే. కర్నూలులో 403, చిత్తూరులో 257, తూర్పుగోదావరిలో 247, పశ్చిమ గోదావరిలో 207, శ్రీకాకుళంలో 178, అనంతపురంలో 162, విశాఖపట్నంలో 123, కడపలో 112, కృష్ణా జిల్లాలో 108, ప్రకాశంలో 53, విజయనగరంలో 49, నెల్లూరులో 45 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో కర్నూలు (4226), గుంటూరు (3824), అనంతపురం (3813) ముందున్నాయి. మరణాలు కర్నూలు (113), కృష్ణా (85), అనంతపురం (49) జిల్లాల్లో ఎక్కువగా నమోదయ్యాయి.
2020-07-15