వలసలపై ట్రంప్ విధించిన నిషేధం వర్తించేది వీరికే... 1. హెచ్-1బి: ప్రధానంగా టెక్నాలజీ రంగంలోని నిపుణులకు ఇచ్చే ఈ వీసాలు ఆరేళ్ల వరకు చెల్లుబాటవుతాయి. 2019లో అమెరికా 1,88,123 మందికి ఈ వీసాలు ఇస్తే వారిలో 1,31,549 మంది ఇండియన్లు. 2019 మే నెలలో 13,678 మందికి హెచ్-1బి వీసాలు జారీ చేస్తే 2020 మే నెలలో కేవలం 143 జారీ అయ్యాయి. 2. హెచ్-2బి: ఈ వీసాలు వ్యవసాయేతర సీజనల్ వర్కర్లకు జారీ చేస్తారు. మూడేళ్లవరకు చెల్లుబాటవుతాయి. వీటితో మెక్సికన్లు అధికంగా అమెరికా వెళ్తారు.
2020-06-23బైదూ నేవిగేషన్ శాటిలైట్ వ్యవస్థ (బిడిఎస్)లో చివరి ఉపగ్రహాన్ని చైనా మంగళవారం ఉదయం ప్రయోగించింది. నైరుతి చైనాలో సిచువాన్ ప్రావిన్సులో ఉన్న జిచాంగ్ ప్రయోగ కేంద్రం నుంచి ఉదయం 9.43 గంటలకు లాంగ్ మార్చ్-3బి రాకెట్ ఈ ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. బిడిఎస్-3 ఉపగ్రహాల్లో ఇది 30వది. మొత్తం బైదూ కుటుంబంలో 55వ ఉపగ్రహం. దేశీయంగా అభివృద్ధి చేసిన నేవిగేషన్ వ్యవస్థను ఈ చివరి ఉపగ్రహం సంపూర్ణం చేసింది. ప్రపంచ నేవిగేషన్ వ్యవస్థలలో అమెరికా జిపిఎస్, రష్యా గ్లోనాస్, యూరోపియన్ యూనియన్ గెలిలియోల సరసన బైదూ చేరింది.
2020-06-23దేశంలో ఆర్థిక మందగమనం ఉన్నా... ‘కరోనా’ మార్కెట్లను కకావికలు చేస్తున్నా... రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం పైపైకి ఎగబాకుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన కంపెనీలలో ఇప్పుడు ఆర్ఐఎల్ 60వ స్థానానికి ఎదిగింది. మార్కెట్ కేపిటలైజేషన్ ను 150.78 బిలియన్ డాలర్లకు పెంచుకొని 2019 కంటే ఏకంగా 13 స్థానాలు పైకి ఎగబాకింది. యూనిలివర్, మెక్ డొనాల్డ్స్ తదితర కంపెనీలను అధిగమించింది. ‘కరోనా’ కాలంలోనూ రూ. 1,68,818 కోట్ల పెట్టుబడిని సమీకరించగలిగిన కంపెనీ ఆర్ఐఎల్. అందులో రూ. 1,15,694 కోట్లు జియో వేదికల ద్వారా వచ్చింది.
2020-06-23వలస ఉద్యోగులను 2020 చివరివరకు నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులపై ‘గూగుల్’ సీఈవో సుందర్ పిచాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా ఆర్థిక విజయానికి వలసలు గణనీయంగా తోడ్పడ్డాయని, సాంకేతిక రంగంలో ప్రపంచ దిగ్గజంగా మార్చాయని, గూగుల్ ఇలా ఎదగడానికి కూడా దోహదపడ్డాయని సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. ఈ రోజు ఉత్తర్వులతో నిరాశ చెందినట్టు పేర్కొంటూ.. వలస ఉద్యోగులకు అండగా ఉంటామని, అవకాశాలను అందరికీ విస్తరింపజేసేలా పని చేస్తామని పిచాయ్ ఉద్ఘాటించారు.
2020-06-23అధ్యక్ష ఎన్నికలకోసం అమెరికన్లను ఆకర్షించేందుకు ఇండియన్ టెకీలపై వేటు వేశారు డొనాల్డ్ ట్రంప్. హెచ్-1బి, హెచ్-2బి, హెచ్-4, ఎల్-1, జె తదితర వీసాలతో అమెరికాకు వచ్చే విదేశీయులపై నిషేధాన్ని 2020 చివరి వరకు పొడిగించారు. ఈమేరకు ఒక ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై సంతకం చేశారు. దీంతో 5,25,000 మంది అమెరికన్లు లబ్ది పొందనున్నారు. ఆమేరకు విదేశీయులు పని కోల్పోతారు. అందులో మెజారిటీ భారతీయ సాంకేతిక నిపుణులే ఉంటారు. ‘కరోనా’తో ఉపాధి కోల్పోయిన అమెరికన్లకోసం తొలిసారి ఏప్రిల్ లో 60 రోజుల పాటు ఈ వీసాలను ట్రంప్ సస్పెండ్ చేశారు. నవంబరులో ఎన్నికలు ఉండటంతో డిసెంబర్ వరకు నిషేధాన్ని పొడిగించారు.
2020-06-23చైనాకు చెందిన నాలుగు మీడియా సంస్థలను దౌత్య కార్యాలయాలుగా పరిగణించడం ప్రారంభిస్తామని అమెరికా సోమవారం ప్రకటించింది. ఈ చర్యతో అమెరికా గడ్డపై చైనా మీడియా సంస్థల కార్యకలాపాలు బాగా పరిమితమవుతాయి. మారిన హోదా ‘చైనా సెంట్రల్ టెలివిజన్’, ‘చైనా న్యూస్ సర్వీస్’, ‘పీపుల్స్ డెయిలీ’, ‘గ్లోబల్ టైమ్స్’ సంస్థలను ప్రభావితం చేయనుంది. చైనా నియంత్రణలోని ‘ప్రచార సంస్థలు’గా ఆయా సంస్థల వాస్తవ హోదా ఉంటుందని తూర్పు ఆసియాకు సంబంధించిన సీనియర్ అమెరికా దౌత్యవేత్త డేవిడ్ స్టిల్ వెల్ చెప్పారు.
2020-06-23బ్రెజిల్ దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 11 లక్షలు దాటాయి. మృతుల సంఖ్య 51 వేలు దాటింది. రోజుకు 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. లెక్కించనివి ఇంకా చాలా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన చెందుతోంది. అయినా బ్రెజిలియన్లు ఇవేమీ పట్టించుకోవడంలేదు. రియో బీచ్ లలో జల్సా చేస్తున్న ఈ జనాన్ని చూడండి. ఆదివారం కనిపించిన ఈ దృశ్యం చూసినవారికే ఆందోళన కలిగిస్తోంది. కానీ, అక్కడి జనంలో చాలా మంది కనీసంగా మాస్కులు కూడా ధరించలేదు. భౌతిక దూరం అనే జాగ్రత్త ఎక్కడా కనిపించలేదు. ‘కరోనా’ కేసుల్లో బ్రెజిల్ అతి త్వరలోనే అమెరికాను దాటబోతోంది.
2020-06-23‘కరోనా’ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న 90 రోజుల్లో ప్రతి కుటుంబాన్నీ పూర్తి స్థాయిలో స్క్రీనింగ్ చేయాలని సిఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం ఆదేశించారు. అనుమానం ఉన్నవారి నుంచి ‘కోవిడ్’ నమూనాను సేకరించాలని, మధుమేహం, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించడానికి పరీక్షలు నిర్వహించి అక్కడే మందులు ఇవ్వాలని సూచించారు. ఇందుకోసం 104 వాహనాలను వినియోగించుకోవాలని, ఈ వాహనాల ద్వారా ప్రతి గ్రామంలో నెలలో ఒక్కసారైనా వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
2020-06-22రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయం సాధించి 75 సంవత్సరాలు గడచిన సందర్భంగా రష్యా ఈ నెల 24న నిర్వహిస్తున్న ఉత్సవాలలో పాల్గొనడానికి భారత రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఆ దేశానికి వెళ్ళారు. అయితే, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియా తక్షణ రక్షణ అవసరాలపైన రష్యన్ ప్రభుత్వంతో సింగ్ మాట్లాడనున్నారు. గతంలో రష్యానుంచి కొనుగోలు చేసిన మిగ్-29, సుఖోయ్-30 ఎంకెఐ యుద్ధ విమానాలు, టి-90 యుద్ధ ట్యాంకులు, కిలో- క్లాస్ జలాంతర్గాముల విడి భాగాలను, మిసైల్ రక్షణ కవచం ఎస్-400 వ్యవస్థలను త్వరగా సరఫరా చేయాలని రాజనాథ్ కోరనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.
2020-06-23టిబెట్ ప్రాంతంలో లాసా- న్యింగ్చి రైల్వే లైనులో చైనా తలపెట్టిన 120 బ్రిడ్జిలలో చివరిది తాజాగా పూర్తయింది. అరుణాచల్ ప్రదేశ్ ను ఆనుకొని ఉండే న్యింగ్చి ప్రాంతంలో నిర్మితమైన ఈ రైల్వే లైను వ్యూహాత్మకంగా చైనాకు ముఖ్యమైనది. సిచువాన్- టిబెట్ రైల్వే పరిధిలోని ఈ భాగం వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బ్రహ్మపుత్ర నదికి ఎగువ భాగం (యార్లుంగ్ జాంగ్బో నది)పై నిర్మించిన ఈ బ్రిడ్జి పొడవు 525 మీటర్లు. సముద్ర మట్టానికి 3,350 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రపంచంలో కాంక్రీట్ నిండిన స్టీల్ ట్యూబులతో నిర్మించిన ఆర్చి బ్రిడ్జిలలో ఇదే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉందని భావిస్తున్నారు.
2020-06-23