ఏప్రిల్ 5 రాత్రి 9 గంటలకు ఓ 9 నిమిషాల పాటు విద్యుద్దీపాలు ఆర్పి నూనె దీపాలు లేదా కొవ్వొత్తులు వెలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు ఒక్కో దీపం వెలిగిస్తే కాంతి శక్తి అర్దమవుతుందన్నది మోడీ ఉవాచ. దీపం, కొవ్వొత్తి, సెల్ ఫోన్ లైట్, టార్చ్ ఏదో ఒకటి ఉపయోగించాలని సూచించారు. కరోనా వైరస్ కారణంగా అలుముకున్న చీకటిలో కాంతిని చేరుకునే ప్రయత్నంగా ఈ ‘ఈవెంట్’ను మోడీ అభివర్ణించారు. ఈసారి రోడ్లపైన, కాలనీలలో గుమి కూడవద్దని, బాల్కనీలు లేదా ప్రధాన ద్వారాల వద్దనే చేయాలని కోరారు.
2020-04-03‘కరోనా’ మహమ్మారి పసికందు నుంచి పండు ముదుసలి వరకు ఎవరినీ వదలడంలేదు. అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో ఓ ఆరు వారాల పసిబిడ్డ వైరస్ కారణంగా మరణించింది. హర్ట్ ఫోర్డ్ ప్రాంతం నుంచి గత వారం అపస్మారక స్థితిలో ఆ బిడ్డను ఆసుపత్రికి తీసుకొచ్చారని, అప్పటి నుంచి పరిస్థితి మెరుగుపడలేదని కనెక్టికట్ గవర్నర్ నెడ్ లామంట్ చెప్పారు. పరీక్షల్లో ఆ బిడ్డకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. చికాగోలో గత శనివారం ఏడాది లోపు వయసున్న బాలుడు కరోనా వైరస్ సోకి మరణించాడు. ఈ ఘటనలతో అమెరికాలో ఇటీవల పిల్లలను కన్న తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
2020-04-03టీబీ నిరోధంకోసం బీసీజీ టీకా తప్పనిసరి చేసిన దేశాల్లో ‘కరోనా’ మరణాలు తక్కువగా ఉన్నట్టు న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టక్నాలజీ (ఎన్.వై.ఐ.టి) అధ్యయన బృందం గుర్తించింది. సార్వత్రిక విధానం లేని ఇటలీ, నెదర్లాండ్స్, అమెరికా చాలా తీవ్రంగా ప్రభావితం అయ్యాయని ఎత్తిచూపింది. చైనాలో 1950లలోనే సార్వత్రిక బీసీజీ విధానం ఉన్నా.. సాంస్కృతిక విప్లవ కాలంలో దెబ్బ తిన్నదని, ఇరాన్ 1984లో ఈ విధానాన్ని ప్రారంభించడం వల్ల 36 సంవత్సరాల కంటే తక్కువ వయసువారికే ఆ ‘రక్షణ’ ఉందని పేర్కొంది. ఇండియా 1948లోనే సార్వత్రిక బీసీజీ టీకా కార్యక్రమాన్ని చేపట్టింది. బీసీజీ టాకానే కాపాడుతోందా? అన్న అంశంపై మరింత అధ్యయనం జరగాల్సి ఉంది.
2020-04-02ప్రజలను చైతన్యం చేసే శక్తి కళలకు ఉంది. కేరళ ‘మోహినీయాట్టం’ నృత్యకారిణి మెథిల్ దేవిక ‘కరోనా’ మహమ్మారిపై అవగాహన పెంచడానికి చేసిన ప్రయత్నం ఈ కోవకే చెందుతుంది. మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తూ ఖండాలను, సముద్రాలను దాటిన ‘కరోనా’ గొలుసును ఎలా తెంచాలో తన నృత్యం ద్వారా చూపించారు దేవిక. ‘‘క్వారంటైన్లో నృత్యం’’తో మంచి సందేశం ఇచ్చి, కేరళ ఆరోగ్య- కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి కె.కె. శైలజ ముందుమాటతో వీడియోను విడుదల చేశారు. మళయాళంతో పాటు ఆంగ్లంలో సబ్ టైటిల్స్ ఉన్న ఈ వీడియో అందరూ చూడదగినది.
2020-04-02‘కరోనా’ మహమ్మారి ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 48,320 మందిని బలి తీసుకుంది. భారత కాలమానం ప్రకారం గురువారం (ఏప్రిల్ 2) సాయంత్రం 6.40 సమయానికి వైరస్ సోకిన వ్యక్తుల సంఖ్య 9,52,171గా నమోదైంది. స్పెయిన్ దేశంలో మరణాల సంఖ్య ఈ సమయానికి 10 వేల దాటింది (10,003). స్పెయిన్లో ‘కరోనా’ బారిన పడిన ప్రతి 11 మందిలో ఒకరు మరణించారు. ఇటలీ (13,155 మరణాలు) తర్వాత ‘కరోనా’ తీవ్రత అధికంగా ఉన్న దేశం స్పెయిన్. ఇటలీలో మరణాలు రేటు మరింత ఎక్కువ (11.9 శాతం). కేసుల సంఖ్యలో ఈ రెండు దేశాలకు దాదాపు రెట్టింపు సంఖ్య (2,16,722) అమెరికాలో నమోదైంది.
2020-04-02ఇండియాలో ‘కరోనా’ వేగవంతమైన విస్తరణ ప్రారంభమైందా? గత మూడు రోజుల్లో పెరిగిన పాజిటివ్ కేసులు ఈ ప్రశ్నను రేకెత్తిస్తున్నాయి. మార్చి 3వ తేదీ వరకు దేశంలో కేవలం 5 ‘కరోనా’ పాజిటివ్ కేసులు నమోదవగా తర్వాత 11 రోజులకు 100 దాటాయి. మరో 15 రోజులకు వెయ్యి దాటాయి. 1000 నుంచి 2000కు పెరగడానికి కేవలం మూడు రోజులు పట్టింది. ఢిల్లీ నిజాముద్దీన్ తబ్లిఘి జమాత్ కార్యక్రమాలు ఈ అసాధారణ పెరుగుదలకు ప్రధాన కారణం. ఏప్రిల్ ఒకటి ఉదయం నుంచి రెండో తేదీ ఉదయం వరకు గడచిన 24 గంటల్లో 601 కొత్త కేసులు నమోదయ్యాయంటే తాజా పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.
2020-04-02ముంబై ధారావి ప్రాంతంలో ఓ 56 సంవత్సరాల వ్యక్తి బుధవారం ‘కరోనా’ వైరస్ తీవ్రతతో సియోన్ ఆసుపత్రిలో మరణించారు. అతను మరే ప్రాంతానికీ ప్రయాణం చేయకుండానే వైరస్ సోకిందని ప్రాథమిక సమాచారం. ధారావిలోని ఎస్ఆర్ఎ భవనంలో బట్టల దుకాణాన్ని నిర్వహించే ఈ వ్యక్తి మార్చి 23న జర్వంతో స్థానిక డాక్టరును సంప్రదించాడు. తర్వాత శ్వాస సమస్యతో 26న సియోన్ ఆసుపత్రిలో చేరాడు. మృతుడి బట్టల దుకాణం ఉన్న భవనంలో మొత్తం 308 ఫ్లాట్లు, 91 షాపులు ఉన్నాయి. ఇప్పుడా భవనం మొత్తాన్ని ‘నియంత్రిత జోన్’గా ప్రకటించారు. పోలీసులను మోహరించి నివాసితుల రాకపోకలను నియంత్రిస్తున్నారు.
2020-04-02 Read Moreప్రపంచవ్యాప్తంగా ‘కరోనా’ సోకినవారి సంఖ్య తాజాగా 9,05,279కి చేరింది. వైరస్ తీవ్రతతో 45,371 మంది మరణించారు. మరణాల రేటు 5 శాతం దాటడం మరో ఆందోళనకర పరిణామం. అమెరికాలో ‘కరోనా’ కేసులు 2 లక్షలకు చేరువయ్యాయి (ఇప్పటికి 1,99,092). ఇటలీలో 1,10,574 మందికి వైరస్ నిర్ధారణ కాగా 13,155 మంది (11.9 శాతం) మరణించారు. మరణాల రేటు ఇటలీలో రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా స్పెయిన్ దేశంలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది (1,02,136). ఆ దేశంలో మరణాల రేటు 8.86 శాతానికి పెరిగింది. కొత్త కేసులను నియంత్రించిన చైనాలో మొత్తం 82,361 మందికి గాను 76,405 మంది కోలుకున్నారు.
2020-04-01ఏపీలోని 11 జిల్లాల్లో 111 మందికి ‘కరోనా’ నిర్ధారణ కాగా.. ఒక్క గుంటూరు జిల్లాలోనే 20 కేసులు నమోదయ్యాయి. తర్వాత కడప, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో 15 కేసుల చొప్పున నమోదయ్యాయి. బుధవారం రాత్రి 10 గంటలకు ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్లో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. పశ్చిమ గోదావరిలో 14, విశాఖపట్నంలో 11, తూర్పుగోదావరిలో 9, చిత్తూరులో 6, నెల్లూరులో 3, అనంతపురంలో 2, కర్నూలులో ఒకటి చొప్పున మొత్తం కేసులు నమోదయ్యాయి. ఉదయం బులెటిన్, రాత్రి బులెటిన్ మధ్య భారీగా కేసులు పెరిగింది కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలే ప్రస్తుతానికి మినహాయింపు.
2020-04-01ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య బుధవారం అమాంతం పెరిగింది. ఈ ఒక్క రోజే (ఏప్రిల్ 1న) 67 మందికి ‘కరోనా’ నిర్ధారణ అయింది. వీరితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 111కి పెరిగింది. ఉదయం బులెటిన్ లో 43 కొత్త కేసులను వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం, రాత్రి బులెటిన్ లో మరో 24 కేసులను నిర్ధారించింది. సోమవారం రాత్రి వరకు రాష్ట్రంలో కేవలం 23 కేసులు నమోదయ్యాయి. గత రెండు రోజుల్లో 88 మందికి ‘కరోనా’ నిర్ధారణ జరిగితే.. వారిలో మెజారిటీ ఢిల్లీ నిజాముద్దీన్ ‘మర్కజ్’ సమావేశాలకు వెళ్లినవాళ్ళేనని ప్రభుత్వం చెబుతోంది.
2020-04-01