రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ ‘కరోనా వైరస్’ రూపంలో అతి పెద్ద సవాలును ఎదుర్కొంటోందని ఆ దేశాధ్యక్షురాలు ఏంజెలా మెర్కెల్ చెప్పారు. దేశ ప్రజలను ఉద్దేశించి టీవీలో ప్రసంగించిన మెర్కెల్, ‘‘పరిస్థితి తీవ్రంగా ఉంది. అందరూ తీవ్రంగా పరిగణించండి. కలసికట్టుగా ఎదుర్కోవలసిన అతి పెద్ద విపత్తు ఇది’’ అని విన్నవించారు. బుధవారంవరకు ఉన్న సమాచారం ప్రకారం జర్మనీలో గడచిన 24 గంటల్లో 1,042 మందికి వైరస్ నిర్ధారణ అయింది. చైనాలో వైరస్ వ్యాప్తిని అదుపు చేయగా.. ఇప్పుడు యూరప్ దేశాల్లో అసాధారణంగా కేసులు పెరుగుతున్నాయి.
2020-03-19ఇండియాలో ‘కరోనా కేసులు’ బుధవారం 150 దాటాయి. తెలంగాణ, కర్నాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదయ్యాయి. లడఖ్ స్కౌట్ రెజిమెంట్ లోని 34 సంవత్సరాల భారత జవాను ఒకరికి ‘కరోనా’ నిర్ధారణ అయింది. ఆర్మీలో ఇదే తొలి కేసు. దీంతో ‘యుద్ధ సన్నద్ధత’తో ఉండాలని పారా మిలిటరీ దళాలను కేంద్రం ఆదేశించింది. కరోనా నియంత్రణలో జవాన్ల బాధ్యతపై ప్రభుత్వం ఓ నోట్ జారీ చేసింది. రేపు (మార్చి 19న) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్ధేశించి ప్రసంగించనున్నారు.
2020-03-18తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య బుధవారం 13కి పెరిగింది. నిన్నటి వరకు ఐదుగురికి వైరస్ సోకినట్టు నిర్ధారణ కాగా, మరో 8 కేసుల్లో వైద్య పరీక్షల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. అందులో ఇండోనేషియా నుంచి వచ్చిన ఏడుగురు ఉన్నారు. ఈ నెల 10న ఆ ఏడుగురూ హైదరాబాద్ వచ్చారని, ‘కరోనా’ లక్షణాలు కనిపించడంతో 16వ తేదీ నుంచి వారిని విడిగా ఉంచామని అధికార వర్గాలు బుధవారం రాత్రి వెల్లడించాయి. అంతకు ముందు బుధవారం మధ్యాహ్నం మరో వ్యక్తికి వైరస్ నిర్ధారణ అయింది.
2020-03-18ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పేరిట చెలామణిలో ఉన్న లేఖ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఎస్ఇసి కేంద్ర హోం శాఖకు రాసిన లేఖ బయటకు వచ్చాక.. వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, కె. పార్ధసారథి, జోగి రమేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ లేఖ నిజమైనదో కాదో నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బ తీయడానికి కుట్ర చేస్తున్న చంద్రబాబుకు రమేష్ కుమార్ వత్తాసు పలుకుతున్నారనే భావన తమకు కలుగుతోందని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
2020-03-18ఒక్క ఓటు పడకుండానే కనీవినీ ఎరుగని హింస ద్వారా అధికార పార్టీ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ‘జిల్లా పరిషత్’ను కైవశం చేసుకుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పేరిట కేంద్రానికి అందిన లేఖలో ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో 553 ఎంపిటిసిలకు గాను 439 (79 శాతం), 50 జడ్.పి.టి.సి.లకు గాను 38 (76 శాతం) ఏకగ్రీవం చేసుకున్నారని తెలిపారు. ఫలితాలు బాగా రాకుంటే మంత్రి పదవులు పోతాయని, వచ్చే ఎన్నికల్లో సీట్లు ఉండవని ముఖ్యమంత్రి ఇచ్చిన సందేశంతోనే భారీగా హింస చోటు చేసుకున్నట్టు రాజకీయ ప్రత్యర్ధులు, ఇతరుల్లో ఏకాభిప్రాయం ఉందని పేర్కొన్నారు.
2020-03-18‘కరోనా వైరస్’ వ్యాప్తి నిరోధంకోసం అనేక రాష్ట్రాలు పూర్తి స్థాయిలో నియంత్రణలను విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం తన ఉద్యోగులను ఇంటినుంచే పని చేయాలని ఆదేశించింది. తప్పనిసరిగా హాజరు కావలసిన ఉద్యోగులను మాత్రమే కార్యాలయాలకు పిలుస్తామని, మిగిలినవారంతా ఇళ్లనుంచే పని చేయాలని బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. రేపటి (మార్చి 19) నుంచి వారం రోజుల పాటు (మార్చి 25 వరకు) ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి.
2020-03-18రైతు బజార్లు, మార్కెట్లు, సంతలు సహా రాష్ట్రంలో ఎక్కడా 10 మందికి మించి ప్రజలు గుమి కూడకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రేపటి (మార్చి 19) నుంచి అన్ని విద్యాలయాలతోపాటు వసతి గృహాలనూ మూసివేయాలని స్పష్టం చేశారు. ‘కరోనా’పై బుధవారం ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం సిఎస్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రైవేటు సంస్థల సిబ్బంది ఇంటినుంచే పని చేసేలా చూడాలని సిఎస్ ఆదేశించారు. హోటళ్ళు, రెస్టారెంట్లు, బార్లలో నిరంతరం జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ చెప్పారు.
2020-03-18రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా అధికార పార్టీ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా హింసకు పాల్పడిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరిట కేంద్రానికి అందిన లేఖలో పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో 2 శాతం ఎంపిటిసిలు ఏకగ్రీవం కాగా ఈసారి 24 శాతం అయ్యాయని, జడ్.పి.టి.సి.లు 2014లో కేవలం 0.09 శాతం ఏకగ్రీవమైతే 2020లో ఏకంగా 19 శాతం ఏకగ్రీవం చేసుకున్నారని వివరించారు. 35 చోట్ల నామినేషన్లు వేయనీయలేదని, 23 చోట్ల బలవంతంగా ఉపసంహరింపజేశారని, 55 చోట్ల ప్రతిపక్ష తెలుగుదేశం, బిజెపి-జనసేన నేతలపై హింసకు దిగారని ఆ లేఖలో వివరించారు.
2020-03-18రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పైన స్వయాన ముఖ్యమంత్రి, ఆ తర్వాత మంత్రివర్గం, వైసీపీ నేతలు మూకుమ్మడిగా దాడి చేయడం ఓ అసాధారణ పరిణామానికి దారి తీసింది. ముఖ్యమంత్రిపైన కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నట్టుగా ఓ లేఖ రమేష్ కుమార్ పేరిట కేంద్ర హోం శాఖకు అందింది. తనకు, తన కుటుంబ సభ్యులకు ముప్పు ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర బలగాలతో తనకు భద్రత కల్పించాలని కోరారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శికి బుధవారం సాయంత్రం పంపిన ఈ లేఖ కొద్దిసేపటికే మీడియాకు అందింది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వాయిదాను సుప్రీంకోర్టు సమర్ధించిందని అందులో పేర్కొన్నారు.
2020-03-18స్థానిక ఎన్నికలకు సంబంధించిన నిబంధనావళిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎత్తివేసింది. బుధవారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తిరిగి ఎన్నికల షెడ్యూలు ఇచ్చేవరకు.. రాజకీయ పార్టీలు గానీ, అభ్యర్ధులు గానీ ఎక్కడా ఎన్నికల ప్రచారం చేయరాదని స్పష్టం చేసింది. అభ్యర్ధులు, సామాన్య ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ‘కరోనా వైరస్ డిసీజ్’ను నియంత్రించడానికి ఈ ఆదేశాలు ఇస్తున్నట్టు పేర్కొన్నారు.
2020-03-18