గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. మొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, బీజేపీ నేత సుజనా చౌదరిని కలసిన నేపథ్యంలో వంశీ పార్టీ మారతారనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఊహించినట్టుగానే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన వంశీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. అయితే, తాను రాజకీయాలనుంచే తప్పుకొంటున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. అప్పుడైనా తన కార్యకర్తలకు వైసీపీ ప్రభుత్వం నుంచి వేధింపులు తప్పుతాయని ఆశిస్తున్నట్టు వంశీ పేర్కొన్నారు.
2019-10-27జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత విధించిన ఆంక్షలతో వ్యాపార వర్గాలు రూ. 10,000 కోట్లు నష్టపోయాయని ఆ రాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు షేక్ ఆషిక్ చెప్పారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం ఇందుకు ప్రధాన కారణంగా ఆయన పేర్కొన్నారు. ఆగస్టులో ఆంక్షలు విధించి ఇప్పటికి మూడు నెలలవుతోందని, ఇప్పటికీ వ్యాపారం సాగడంలేదని, రాష్ట్రంలో అన్ని రంగాలూ తీవ్రంగా దెబ్బ తిన్నాయని ఆషిక్ చెప్పారు.
2019-10-27మహారాష్ట్రలో అధికార పీఠం రిమోట్ కంట్రోల్ శివసేన చేతుల్లో ఉందని ఆ పార్టీ నాయకుడు సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. బాల్ థాకరే సమయంలో వాడుకలో ఉన్న ఈ పదజాలంతో బీజేపీకి మరోసారి హెచ్చరికలు పంపారు. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీతో కలసి పోటీ చేసిన శివసేన 56 సీట్లను గెలిచింది. బీజేపీ 105 సీట్లు సాధించింది. ఈ నేపథ్యంలో సిఎం కుర్చీని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలని, ఈ విషయంపై రాతపూర్వక ఒప్పందం కుదుర్చుకుందామని శివసేన నిన్న ప్రతిపాదించింది.
2019-10-27 Read Moreసిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్సులో అమెరికా నిర్వహించిన ‘సీక్రెట్ ఆఫరేషన్’ సందర్భంగా ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబుబకర్ అల్ బాగ్దాది హతమయ్యారు. శనివారం హెలికాప్టర్ల ద్వారా అమెరికా సైనికులు బాగ్దాది ఉన్న ప్రాంతంలో నేరుగా దిగారు. కొద్దిసేపు ఎదురు కాల్పుల తర్వాత బాగ్దాది బెల్టుబాంబుతో ఆత్మాహుతికి పాల్పడ్డారని అమెరికా సైనికాధికారి ఒకరు చెప్పారు. బాగ్దాది చనిపోయినట్టు తమకు పూర్తి నమ్మకం ఉందని, అయితే డిఎన్ఎ, బయో మెట్రిక్ పరీక్షలతో నిర్ధారించాల్సి ఉందని అమెరికా రక్షణ శాఖ అధికారులు శ్వేతసౌధానికి సమాచారమిచ్చారు.
2019-10-27ప్రభుత్వంలో విలీనం అనే అంశం మినహా మిగిలిన అంశాలపై చర్చిద్దామని తాము ఆర్టీసీ యూనియన్ల నేతలతో చెప్పినా వారు వినలేదని, తమవాళ్లతో మాట్లాడి వస్తామని వెళ్ళి తిరిగి రాలేదని అధికారులు ఆరోపించారు. కోర్టు చెప్పిన అంశాలపైనే తాము చర్చలకు సిద్ధమయ్యామని, కానీ యూనియన్ల నేతలు అన్ని డిమాండ్లపైనా చర్చించాలని పట్టుపట్టారని అధికారులు చెప్పారు. గంటన్నర పాటు చర్చలు జరిగాయని వారు చెప్పారు.
2019-10-26హైకోర్టు చెప్పిందనే తమను చర్చలకు పిలిచారని, ప్రభుత్వ అధికారుల్లో చిత్తశుద్ధి లేదని తెలంగాణ ఆర్టీసీ సంఘాల నేతలు ఆరోపించారు. సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. చర్చల మధ్యలోనే బయటకు వచ్చిన నేతలు విలేకరులతో మాట్లాడారు. తమ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయించి నిర్బంధ చర్చలకు ప్రయత్నించారని, శత్రుదేశాలతో కూడా ఇలాంటి చర్చలు జరగవని సంఘాల నేతలు వ్యాఖ్యానించారు. కొన్ని అంశాలకే పరిమితమై అధికారులు చర్చిస్తున్నారని, ఆ అంశంపై తమవారితో మాట్లాడతామని నేతలు చెప్పారు.
2019-10-26తెలంగాణ ఆర్టీసీ సమ్మె ప్రారంభమైన 22వ రోజు (శనివారం) సంస్థ అధికారులు, కార్మిక సంఘాల నేతల మధ్య నామమాత్రపు చర్చలు జరిగాయి. అన్ని డిమాండ్లపైనా చర్చలు జరపాలని సంఘాలు, 21 అంశాలపైనే చర్చిస్తామని యాజమాన్యం మంకు పట్టు పట్టడంతో ప్రతిష్ఠంభన నెలకొంది. సమ్మెపై చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అధికారులతో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ‘ప్రభుత్వంలో విలీనం’పై చర్చ సాధ్యం కాదని అధికారులు తేల్చి చెప్పారు. సంఘాల నేతలు అర్ధాంతరంగా బయటకు వెళ్లిపోయారు.
2019-10-26తీహార్ జైలునుంచి బెయిలుపై విడుదలై శనివారం కర్నాటకలో అడుగుపెట్టిన సీనియర్ కాంగ్రెస్ నేత డి.కె. శివకుమార్ కు ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పెద్ద సంఖ్యలో ఎయిర్ పోర్టుకు వచ్చిన నేతలు, కార్యకర్తలతో ర్యాలీగా కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘వాళ్లు (బీజేపీ పెద్దలు) నన్ను మరింత ధృఢంగా మార్చారు. బలహీనంగా మారే ప్రశ్నే లేదు. లొంగిపోయే ప్రశ్న అంతకంటే లేదు. న్యాయంకోసం పోరాడతా’ అని శివకుమార్ ఉద్ఘాటించారు.
2019-10-26ఇండియా, చైనా సైన్యాల మధ్య సెరిమోనియల్ బోర్డర్ పర్సనల్ మీటింగ్ (బిపిఎం) శనివారం లడఖ్ తూర్పు ప్రాంతంలో జరిగింది. రేపటి దీపావళి పండుగ నేపథ్యంలో ఈ సమావేశంలో లాంఛనంగా దీపావళి సంబరాలు జరిపారు. ఇండియన్ ఆర్మీ, చైనా పీపుల్స్ లిబరేషన్ అర్మీ అధికారులు స్నేహపూర్వకంగా మతాబులు కాల్చారు. సరిహద్దు సైనిక దళాల మధ్య బిపిఎంలు జరగడం సాధారణమే. కొద్ది రోజుల క్రితం చైనా జాతీయ దినోత్సవం సందర్భంగా నాథులా పాస్ వద్ద ఇరు దేశాల సైనికాధికారులు ఆనందాన్ని పంచుకున్నారు.
2019-10-26ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన నేపథ్యంలో హుజూర్ నగర్ నియోజకవర్గానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక నిధులను ప్రకటించారు. నియోజకవర్గంలోని హుజూర్ నగర్ మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, నేరేడుచెర్ల మున్సిపాలిటీకి రూ. 15 కోట్లు మంజూరు చేశారు. మండల కేంద్రాలకు రూ. 30 లక్షల చొప్పున, 134 గ్రామాలకు రూ. 20 లక్షల చొప్పున సిఎం ప్రత్యేక నిధి నుంచి మంజూరు చేయనున్నట్టు శనివారం హుజూర్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభలో సిఎం వెల్లడించారు.
2019-10-26