గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమితో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. 150 డివిజన్లు ఉన్న జి.హెచ్.ఎం.సి.లో కాంగ్రెస్ రెంటిని మాత్రమే దక్కించుకొని అత్యంత దారుణమైన ఓటమిని చవిచూసింది. అసెంబ్లీలో రెండో పెద్ద పక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటీవల మరింత బలహీనపడింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో బిజెపి విజయం సాధించగా, కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. భాగ్యనగరంలోనూ కాంగ్రెస్ స్థానాన్ని బిజెపి ఆక్రమిస్తున్నట్టు స్పష్టమవుతోంది.
2020-12-04క్రిస్మస్ రోజు హిందువులు చర్చిలకు వెళ్తే వారిపై దారుణంగా దాడి చేస్తామని అస్సాంలోని కాచర్ జిల్లా భజరంగదళ్ ప్రధాన కార్యదర్శి మీతూ నాథ్ హెచ్చరించారు. ‘‘వాళ్ళు షిల్లాంగ్ లో దేవాలయాలకు తాళాలు వేస్తున్నారు. మనం వారితో వెళ్లి వేడుకలు జరుపుకుంటున్నాము. దీన్ని మేము అనుమతించబోము’’ అని నాథ్ ఒక కార్యక్రమంలో మాట్లాడినట్టుగా ‘నార్త్ ఈస్ట్ టుడే’ రిపోర్టు చేసింది. మేఘాలయ రాజధాని (షిల్లాంగ్)లో ఇటీవల వివేకానంద కల్చరల్ సెంటర్ కు ఖాసీ విద్యార్థి యూనియన్ తాళాలు వేసినట్టు ఈ భజరంగ్ దళ్ నేత పేర్కొన్నారు.
2020-12-04కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 8వ తేదీన ‘భారత్ బంద్’కు రైతు నాయకులు పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని కార్పొరేటీకరించేందుకు మోదీ ప్రభుత్వం 3 కొత్త చట్టాలను తెచ్చిందని ఆరోపిస్తూ, వాటి ఉపసంహరణ కోసం గత 9 రోజులుగా ఉత్తర భారత రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్నారు. ఈ నెల 1, 3 తేదీల్లో రైతు ప్రతినిధులు, కేంద్ర మంత్రుల మధ్య జరిగిన చర్చలు ఫలప్రదం కాలేదు. రేపు (శనివారం) మరోసారి చర్చలకు కేంద్రం ఆహ్వానించిన నేపథ్యంలో రైతు సంఘాలు దేశవ్యాప్త ఉద్యమానికి సన్నద్ధమవుతున్నాయి.
2020-12-04రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను అక్కడి నుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో శుక్రవారం ఒక ‘ప్రజాప్రయోజన వ్యాజ్యం’ దాఖలైంది. తమకు నష్టదాయకమైన కేంద్ర వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలంటూ రైతులు గత వారం ‘చలో ఢిల్లీ’ చేపట్టిన విషయం తెలిసిందే. రైతు సమూహంవల్ల ప్రయాణీకులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని, ‘‘అత్యవసర వైద్యసేవలకు కూడా అవరోధాలు ఎదురవుతున్నందు’’న రైతు సమూహాన్ని తొలగించడం అవసరమని పిటిషనర్ పేర్కొన్నారు.
2020-12-04గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జి.హెచ్.ఎం.సి) ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. 150 సీట్లున్న కార్పొరేషన్లో ఏ పార్టీ మెజారిటీకి దగ్గరగా రాలేకపోయింది. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం టిఆర్ఎస్ కు 56 సీట్లు, బిజెపికి 46, ఎంఐఎంకు 43 సీట్లు దక్కాయి. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఘోరంగా 2 సీట్లకు పరిమితమైంది. 2016 ఎన్నికల్లో 99 సీట్లు సాధించిన టిఆర్ఎస్ బాగా దెబ్బ తిన్నట్టు స్పష్టమవుతోంది. మతపరమైన హై ఓల్టేజ్ ప్రచారంతో బిజెపి 4 సీట్ల నుంచి ఏకంగా 46కు పెరిగింది.
2020-12-04‘టైమ్’ మ్యాగజైన్ తొలిసారిగా వెల్లడించిన ‘ఈ ఏటి మేటి బాల’గా భారతీయ అమెరికన్ బాలిక గీతాంజలిరావు ఎంపికయ్యారు. 15 ఏళ్ళ అంజలిని తెలివైన యువ శాస్త్రవేత్తగా ‘టైమ్’ కీర్తించింది. కలుషితమైన తాగునీరు, ఒపియాయిడ్ వ్యసనం, సైబర్ వేధింపుల వంటి అనేక అంశాలను ఎదుర్కోవడానికి సాంకేతికతను ఉపయోగించడంలో అంజలి అద్బుతమైన కృషి చేశారని పేర్కొంది. 5000 మంది నామినీలను పరిశీలించాక గీతాంజలీరావును ఎంపిక చేశారు. గీతాంజలిని ‘టైమ్’ కోసం హాలీవుడ్ స్టార్ ఏంజెలినా జోలి ఇంటర్వ్యూ చేయడం మరో విశేషం.
2020-12-03చంద్రుడిపైన మట్టి-రాళ్ల నమూనాలను సేకరించిన చైనా వ్యోమనౌక గురువారం రాత్రి తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ రోజు చంద్రుడిపైనుంచి పైకి లేచిన ఈ నౌక ఆ ఉపగ్రహం చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్-రిటర్నర్ ను చేరాక భూమివైపు ప్రయాణం మొదలవుతుంది. ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రిటర్నర్ లతో కూడిన చాంగె-5ను చైనా గత నెల 24న ప్రయోగించింది. ల్యాండర్-అసెండర్ ద్వయం ఈ నెల 1న చంద్రుడిపైన మాన్స్ రంకెర్ ప్రాంతపు ఉత్తర భాగంలో దిగి నిన్న నమూనాలను సేకరించి కంటైనర్ లో భద్రపరిచాయి.
2020-12-03కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతు ఉద్యమంపై పంజాబ్ సిఎం అమరీందర్ సింగ్ మాట కొద్దిగా మారింది. రైతుల అందోళన పంజాబ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, ‘దేశ భద్రత’ను కూడా ప్రభావితం చేస్తోందని ఆయన గురువారం వ్యాఖ్యానించారు. రైతు ప్రతినిధులతో కేంద్ర మంత్రుల చర్చలకు ముందుగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యాక అమరీందర్ సింగ్ ఇలా మాట్లాడారు. సమస్యను త్వరగా పరిష్కరించుకోవాలని ఆయన ఉభయ పక్షాలకు విన్నవించారు. ఇదే అదనుగా ‘ఆప్’ నేతలు అమరీందర్ పై సెటైర్లు వేస్తున్నారు.
2020-12-03మూడు రోజుల్లో రెండోసారి రైతులను చర్చలకు ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం గురువారం ఏడు గంటల పాటు జరిగిన సమావేశంలో ఏమీ తేల్చలేదు. మూడు చట్టాలకూ సవరణ తీసుకొస్తామని ప్రభుత్వం తరపున చర్చలకు నాయకత్వం వహించిన వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పగా, రైతు ప్రతినిధులు తోసిపుచ్చారు. హానికరమైన మూడు చట్టాలనూ ఉపసంహరించవలసిందేనని పట్టుపట్టారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ‘‘అహం ఏమీ లేద’’ని, కనీస మద్ధతు ధర కొనసాగుతుందని మంత్రి చెప్పారు. ఈ నెల 5వ తేదీన మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.
2020-12-03‘‘చైనా ఎదిగింది. తన గురించి ప్రపంచం ఏమనుకుంటుందో పట్టించుకోదు. లక్ష్యం దిశగా వెళ్తోంది’’ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. ‘‘ప్రాపంచిక దృక్పథంలో భారతదేశ పాత్ర’’ అనే అంశంపై ఆదివారం జరిగిన సదస్సులో భగవత్ మాట్లాడిన విషయాలు ఆలస్యంగా రిపోర్టయ్యాయి. తన సిద్ధాంతం సోషలిజమని, విస్తరణ వాదం కాదని చైనా చెబుతున్నా.. అది గత కాలపు చక్రవర్తుల విస్తరణ ఆదర్శాలను పుణికిపుచ్చుకున్నదని భగవత్ అభిప్రాయపడ్డారు. అమెరికా ఎంత ప్రయత్నిస్తున్నా, బహుళ పక్ష ప్రపంచం ఆవిర్భవించిందని పేర్కొన్నారు.
2020-12-03