ఎన్నికల సమయంలో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసే నాయకులు, ఇప్పుడు వరద బాధితులను ఆదుకోవడానికి డబ్బులు బయటకు తీయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఇది కూడా రాజకీయాల కోసం పెట్టుబడి అనుకోవాలని సూచించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మౌలిక సదుపాయాల సంస్థలకు వేల కోట్ల సామర్ధ్యం ఉందని పవన్ పేర్కొన్నారు. నాయకులు, వ్యాపారులతో పోలిస్తే సినిమావాళ్ల దగ్గర ఉన్న సందప ఎంతని ప్రశ్నించారు. విపత్తుల సమయంలో ఆదుకోవడంలో ప్రథమ బాధ్యత ప్రభుత్వానిదేనని ఉద్ఘాటించారు.
2020-10-22దేశంలో ప్రజలందరికీ ‘కరోనా’ వ్యాక్సిన్ అందించడానికి గాను కేంద్ర ప్రభుత్వం రూ. 50,000 కోట్లు కేటాయించినట్టు ఓ ముఖ్యమైన వార్త గురువారం వెల్లడైంది. రెండు డాలర్ల ఖరీదైన ఇంజెక్షన్లు ఒక్కొక్కరికి రెండు చొప్పున ఇవ్వడానికి, ఇతర ఖర్చులకు కలిపి అంత మొత్తం అవుతుందని కేంద్రం అంచనా వేసిందట. మొత్తంగా తలసరి వ్యయం 6 నుంచి 7 డాలర్లు అవుతుందన్నది కేంద్రం అంచనా. ఈ మొత్తాన్ని నడుస్తున్న ఆర్థిక సంవత్సరమే కేటాయిస్తున్నందున నిధుల కొరత ఉండదని చెబుతున్నారు.
2020-10-22విశ్వాంతరాళాల్లో సరికొత్త ఆవిష్కరణల కోసం అంగలు చాస్తున్న మానవుడికి ఇప్పటికీ తన శరీరంలోనే తెలియని అవయవాలున్నాయంటే ఆశ్చర్యమే. అలాంటి ఒక అజ్ఞాత అవయవాన్ని నెదర్లాండ్స్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. మనిషి గొంతు ఎగువ భాగంలో ముక్కుకు వెనుకగా లోతుగా ఉన్న లాలాజల గ్రంథుల సమూహాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు వాటికి ‘గొట్టపు లాలాజల గ్రంథులు’గా నామకరణం చేశారు. ‘ప్రొస్టేట్ క్యాన్సర్’పై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలకు ఈ అవయవం కనిపించినప్పుడు ఆశ్చర్యపోయారు. 100 మంది రోగులను క్షుణ్ణంగా పరిశీలించాక నిర్ధారణకు వచ్చారు.
2020-10-212017లో యుఎపిఎ కింద కేసు పెట్టాక అజ్ఞాతంలోకి వెళ్ళిన గూర్ఖా జనముక్తి మోర్చా (జిజెఎం) నేత బిమల్ గురుంగ్ బుధవారం మీడియా ముందుకు వచ్చారు. ఎన్డీయేతో సంబంధాలు తెంచుకుంటున్నట్టు ప్రకటించారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రత్యేక గూర్ఖాల్యాండ్ హామీని నిలబెట్టుకోలేదని ఆక్షేపించారు. 2021 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ఇవ్వనున్నట్టు చెప్పారు. ‘‘మేము గూర్ఖాల్యాండ్ డిమాండ్ కి దూరం కావడం లేదు. మా డిమాండ్ ను ముందుకు తీసుకెళ్లే పార్టీకి మద్ధతు ఇస్తాం’’ అని గురుంగ్ పేర్కొన్నారు.
2020-10-21సీబీఐ ఇష్టారాజ్యంగా దర్యాప్తు చేపట్టడానికి వీల్లేకుండా మహారాష్ట్ర ప్రభుత్వం బ్రేకులు వేసింది. సీబీఐకి ఇదివరకు ఇచ్చిన ‘సాధారణ సమ్మతి’ని ఉపసంహరించింది. దీంతో... ఇకపైన మహారాష్ట్రలో కొత్తగా ఎవరిపైనైనా కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి తీసుకోవడం సీబీఐకి తప్పనిసరి. రిపబ్లిక్ టీవీ, రెండు మరాఠా టీవీ ఛానళ్ళు ‘టి.ఆర్.పి. కుంభకోణం’కు పాల్పడ్డాయంటూ మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో, రిపబ్లిక్ అధినేత ఆర్ణబ్ గోస్వామిని కాపాడటంకోసం యూపీ ప్రభుత్వం హడావిడిగా ఓ కేసును నమోదు చేయించి దాన్ని సీబీఐకి బదలాయించింది.
2020-10-21పాఠశాలలను నవంబర్ 2 నుంచి నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఈ విషయాన్ని వెల్లడించారు. ఒక్కో తరగతి విద్యార్ధులకు రోజు మార్చి రోజు ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పాఠశాలను నిర్వహించాలని నిర్దేశించారు. పిల్లలను పంపడానికి తల్లిదండ్రులు సిద్ధపడకపోతే ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలని చెప్పారు. 1, 3, 5, 7 తరగతుల విద్యార్ధులకు ఒక రోజు తరగతులు నిర్వహిస్తే... మరుసటి రోజు 2, 4, 6, 8 తరగతుల విద్యార్ధులకు నిర్వహించాలని సిఎం సూచించారు.
2020-10-20ఉగ్రవాదులు, తీవ్రవాదులంతా మదరసాలలో చదివారని మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ మంగళవారం వాక్రుచ్చారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల ఫ్యాక్టరీగా మారిందని కూడా ఆమె వ్యాఖ్యానించారు. విద్యార్ధులను జాతీయతకు అనుసంధానించడంలో విఫలమైన మదరసాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావలసిన అవసరం ఉందని ఈ మంత్రి పేర్కొన్నారు. ఇటీవల అస్సాం ప్రభుత్వం మదరసాలను మూసివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని తన వాదనకు మద్ధతుగా ఉదహరించారు. ‘‘జాతీయతకు అవరోధాలు కల్పిస్తున్న అన్ని సంస్థలనూ దేశ ప్రయోజనాల రీత్యా మూసివేయాలి’’ అని ఠాకూర్ ఉద్ఘాటించారు.
2020-10-20కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి ఇటీవల చేసిన మూడు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ అసెంబ్లీ నాలుగు బిల్లులను ఆమోదించింది. మంగళవారం ఐదు గంటల పాటు చర్చించిన తర్వాత... కేంద్ర చట్టాలను తిరస్కరిస్తూ అసెంబ్లీ సరికొత్త బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇందుకు ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీలతో పాటు లోక్ ఇన్సాఫ్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా మద్ధతు తెలిపారు. బిజెపి మాత్రం ఈ కార్యకలాపాల్లో పాల్గొనలేదు. రైతుల ఉత్పత్తి సౌలభ్య చట్టం, రైతుల ఒప్పందం మరియు సర్వీసుల చట్టం, సివిల్ ప్రొసీజర్ కోడ్ లకు సవరణలు చేయాలని పంజాబ్ అసెంబ్లీ కేంద్రాన్ని కోరింది.
2020-10-20తమిళ సినీ నటుడు విజయ్ సేతుపతి కుమార్తెకు సామాజిక మాధ్యమాల్లో ‘మానభంగం’ బెదిరింపు వచ్చింది. సేతుపతి శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’లో నటించడానికి సిద్ధమై బెదిరింపుల మధ్య సోమవారం తప్పుకున్న నేపథ్యంలో మంగళవారం ఓ ట్వీట్ కలకలం రేపింది. ‘‘సినిమా నుంచి ఇప్పటికే తప్పుకున్న మిస్టర్ సేతుపతికి, ఆ సినిమాలో నటిస్తే అతని కుమార్తెకు మానభంగం జరుగుతుందని చెప్పబడింది. శ్రీలంక తమిళులు ఎదుర్కొన్న కష్టాలు అతనికి కేవలం లైంగిక దాడి ద్వారానే అర్ధమవుతాయి’’ అని రితిక్ రాజ్ అనే ట్విట్టర్ ఖాతాదారు పేర్కొన్నారు.
2020-10-20యాంటీట్రస్ట్ చట్టాలను ఉల్లంఘించినందుకు గాను ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం ‘గూగుల్’ పైన అమెరికా కేసు పెట్టబోతోంది. అల్ఫాబెట్ ఇంక్ కంపెనీకి చెందిన గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజన్ గా తన శక్తిని దుర్వినియోగం చేసిందన్నది ఆ కంపెనీపై అభియోగం. ఈమేరకు అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ మంగళవారం కేసు పెట్టనున్నట్టు సమాచారం. అమెరికా ఇంటర్నెట్ సెర్చ్ మార్కెట్లో గూగుల్ వాటా 90 శాతం. ఆ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి గూగుల్ పోటీని అణచివేసిందనే ఆరోపణ ఉంది. అమెరికాలో గత కొన్ని దశాబ్దాలలో ఇదే అతి ముఖ్యమైన గుత్తాధిపత్య కేసు కానుంది.
2020-10-20