లాక్ డౌన్... ‘కరోనా’ కట్టడికి ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవుతున్న తారక మంత్రం ఇది. అయితే, కేవలం మూసివేతలు, నియంత్రణలతో ‘కరోనా’ ప్రమాదాన్ని అరికట్టలేరని ప్రపంచ ఆరోగ్య సంస్థ టాప్ ఎమర్జెన్సీ నిపుణుడు డాక్టర్ మైక్ ర్యాన్ చెబుతున్నారు. బలమైన ప్రజారోగ్య చర్యలను చేపట్టకపోతే, మూసివేతలకు ముగింపు పలకగానే వైరస్ విరుచుకుపడుతుందని ఆయన ‘బిబిసి’ ఇంటర్వ్యూలో హెచ్చరించారు. అనారోగ్యంతో ఉన్నవారిని, వైరస్ సోకినవారిని గుర్తించి వేరు చేయడం, వారితో సహచరించిన వారిని కనిపెట్టి వేరుగా ఉంచడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
2020-03-22 Read More‘జనతా కర్ఫ్యూ’ తర్వాత కరోనా వైరస్ అంతమవుతుందని ప్రచారం చేస్తున్నవారిని సంఘ వ్యతిరేక శక్తులుగా అభివర్ణించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్. ‘‘ఈ రోజు జనతా కర్ఫ్యూ తర్వాత ఈ ప్రాణాంతక వైరస్ వెళ్లిపోతుందని కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు తప్పుడు సమాచారాన్ని ప్రచారంలోకి తెచ్చారు. రాత్రి 9 గంటల తర్వాత ప్రజలు బయటకు వచ్చేలా వారు ప్రేరేపిస్తున్నారు. ఇది తప్పు, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం’’ అని హర్షవర్ధన్ ట్విట్టర్లో ఆదివారం స్పష్టం చేశారు. సామాజిక దూరం పాటించడం అలవాటుగా మార్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
2020-03-22ఆదివారం దేశవ్యాప్తంగా పాటించిన ‘జనతా కర్ఫ్యూ’ను తమ రాష్ట్రంలో ఈ నెల 31 వరకు కొనసాగించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆహారం, మందుల వంటి అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఆదివారం చెప్పారు. మరికొన్ని రాష్ట్రాలు ఆ పేరు వాడకుండానే 31 వరకు అత్యవసర సేవలు మినహా అన్నిటినీ బంద్ చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. తెలంగాణ సిఎం కేసీఆర్, ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో ఆయా రాష్ట్రాల్లో తీసుకోబోయే చర్యలను ప్రకటించనున్నారు.
2020-03-22దేశవ్యాప్తంగా ‘కరోనా కేసులు’ నమోదైన 75 జిల్లాల్లో అత్యవసర సేవలు మినహా అన్నిటినీ నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఆదివారం కేంద్ర కేబినెట్ కార్యదర్శి, ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో ఈ విషయమై చర్చించారు. ‘జనతా కర్ఫ్యూ’ ఆంక్షలను కొనసాగించాల్సిన అత్యవసర పరిస్థితి ఉందని అందరూ అభిప్రాయపడ్డారు. మార్చి 31 వరకు అన్ని రైలు సర్వీసులు, మెట్రో సేవలు, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిపివేయాలని నిర్ణయించారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఈ చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తిస్తూ.. అవసరాన్ని బట్టి పొడిగించాలని కేంద్రం సూచించింది.
2020-03-22‘కరోనా వైరస్’ కట్టడికోసం దేశ ప్రజలంతా ఆదివారం ఇళ్లకే పరిమితమయ్యారు. అదే సమయంలో జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ ఎదుట ఓ పెట్రోల్ బాంబు పేలింది. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కి వ్యతిరేకంగా 100 రోజుల ఆందోళన తర్వాత.. నిన్న ఖాళీ చేసిన నిరసన శిబిరంపై ఓ దుండగుడు కాల్పులు జరుపుతూ పెట్రోల్ బాంబు విసిరినట్టు జామియా విద్యార్ధులు, అధ్యాపకులు చెప్పారు. డెలివరీ బాయ్ వేషధారణలో ఓ వ్యక్తి బైకుపైన వచ్చినట్టు సీసీ కెమేరాలో రికార్డయింది. ‘కరోనా’పై దేశమంతా ఏకమై పోరాడుతున్న క్రమంలో.. ఈ పెట్రోల్ బాంబుతో ఉన్మాదులు మరోసారి విభజన సందేశం పంపారు.
2020-03-22‘కరోనా వైరస్’ వ్యాప్తి నిరోధంకోసం సామాజిక దూరాన్ని పాటించే క్రమం ఇండియాలో తీవ్రతరమైంది. వైరస్ కట్టడికోసం వివిధ రాష్ట్రాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’కు పిలుపు ఇచ్చారు. స్వచ్ఛందం కొంత, బలవంతం కొంత.. వెరసి ‘జనతా కర్ఫ్యూ’ విజయవంతంగా సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ సరిహద్దులను మూసివేయగా, ఏపీలో పెట్రోల్ బంకులను కూడా మూసివేశారు. ఈ స్థితిని 24 గంటలపాటు కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ ‘కర్ఫ్యూ’ కొనసాగేలా రైళ్ళను, రాష్ట్రాల రోడ్డు రవాణాను నిలిపివేస్తున్నారు.
2020-03-22ఏపీలో శనివారం మరో ఇద్దరికి ‘కరోనా వైరస్’ నిర్ధారణ అయింది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు యువకులకు వైరస్ ఉన్నట్టు పరీక్షలలో వెల్లడైంది. పారిస్ నగరంలో ఎంఎస్ చదువుతున్న విజయవాడ యువకుడు ఈ నెల 17న నగరానికి వచ్చాడు. ‘కరోనా’ లక్షణాలతో నిన్న (మార్చి 20న) ఆసుపత్రిలో చేరగా.. పరీక్షల్లో ‘పాజిటివ్’ వచ్చింది. రాజమహేంద్రవరం యువకుడు లండన్ నుంచి 18వ తేదీన హైదరాబాద్ వచ్చాడు. నిన్న రాజమహేంద్రవరం చేరుకున్న అతనికి కూడా శనివారం ‘కరోనా’ నిర్ధారణ అయింది. ఇంతకు ముందు విశాఖ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.
2020-03-21పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) వ్యతిరేక ఆందోళనను జామియా మిలియా యూనివర్శిటీ సమన్వయ కమిటీ తాత్కాలికంగా విరమించింది. ‘కరోనా వైరస్’ వ్యాపిస్తున్న నేపథ్యంలో శనివారం ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబరులో ప్రారంభమైన జామియా విద్యార్ధులు, అధ్యాపకుల నిరసన శనివారం 100వ రోజుకు చేరింది. ఇప్పటిదాకా 24 గంటలూ నిరసన శిబిరాన్ని కొనసాగించారు. నిరసన విరమించాక పాల్గొన్నవారికి మాస్కులను పంపిణీ చేశారు. నిరసనకారులు ఈ మహమ్మారి బారిన పడకుండా తమను, ఇతరులనూ కాపాడుకోవాలని కమిటీ సూచించింది.
2020-03-21ఎంతమంది వారించినా వినకుండా.. రామనవమి ఉత్సవాలు నిర్వహించాలని మంకు పట్టు పట్టిన యోగి ఆదిత్యనాథ్ (యూపీ) ప్రభుత్వం చివరికి వెనక్కు తగ్గింది. ఈ నెల 25 నుంచి అయోధ్యలో తలపెట్టిన 9 రోజుల ఉత్సవాలను ‘కరోనా’ భయంతో రద్దు చేసింది. అయోధ్య వివాదాస్పద స్థలంలో రామమందిరాన్ని నిర్మించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో.. ఈ ఏడాది ఉత్సవాలు భారీగా నిర్వహించాలని యోగి ప్రభుత్వం తలపెట్టింది. అయితే, విమర్శల మధ్య శనివారం మత పెద్దలతో యోగి సమావేశమయ్యారు. అనంతరం.. ఇళ్లలోనే ఉత్సవాలు నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్ పిలుపునిచ్చింది.
2020-03-21సొంత పార్టీపై తిరుగుబాటు చేసి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన 21 మంది మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు శనివారం బీజేపీలో చేరారు. బిజెపి అధ్యక్షుడు జె.పి. నడ్డా సమక్షంలో వారంతా బీజేపీ కండువాలు కప్పుకున్నారు. మరో తాజా మాజీ ఎమ్మెల్యే తర్వాత చేరనున్నారు. సీనియర్ నేత కమలనాథ్ కు వ్యతిరేకంగా యువనేత జ్యోతిరాదిత్య సింధియా చేసిన తిరుగుబాటులో భాగంగా ఆరుగురు మంత్రులు, మరో 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. మెజారిటీ కోల్పోయిన కమలనాథ్ నిన్న (మార్చి 20న) సిఎం పదవికి రాజీనామా చేయగా.. ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపి సన్నాహాలు చేస్తోంది.
2020-03-21