విశాఖపట్నంలోనే రాజధాని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా వైసీపీ నేతలు ప్రకటించారు. గురువారం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలోనూ, ఎమ్మెల్యేలు తాడేపల్లిలోనూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. ‘‘విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించాక తొలిసారి నగరానికి వస్తున్న జగన్మోహన్ రెడ్డిగారికి చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా స్వాగతం పలుకుతాం’’ అని విజయసాయి ప్రకటించారు. అయితే, ప్రభుత్వం తరఫున ఇంతవరకు ప్రకటన రాలేదు.
2019-12-26దక్షిణ భారత దేశంలో.. ముఖ్యంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సూర్యగ్రహణాన్ని పెద్ద సంఖ్యలో ప్రజలు వీక్షించారు. చంద్రుడు పూర్తి స్థాయిలో సూర్యుడికి అడ్డు వచ్చిన సన్నివేశం ఈ రాష్ట్రాల్లో ప్రజలకు కనువిందు చేసింది. కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్ధులు ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించారు. జన విజ్ఞాన వేదిక వంటి ప్రజా సైన్స్ వేదికలు సామూహిక సూర్యదర్శన కార్యక్రమాలను ఏర్పాటు చేశాయి.
2019-12-26కేంద్ర ప్రభుత్వం తొలిసారి ‘‘సుపరిపాలనా సూచీ (జిజిఐ)’’ని బుధవారం విడుదల చేసింది. ఇందులో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి. తమిళనాడు దాదాపు అన్ని ప్రమాణాల్లోనూ ముందుండి నెంబర్ 1గా నిలిచింది. తర్వాత మహారాష్ట్ర, కర్నాటక, చత్తీస్ గఢ్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో నిలిచింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జన్మదినాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 25ని ‘సుపరిపాలనా దినం’గా నిర్వహిస్తున్నారు.
2019-12-25ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ బ్రిటన్ ఆర్థిక మంత్రిగా త్వరలో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ప్రధాని బోరిస్ జాన్సన్ ఫిబ్రవరిలో చేపట్టే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో రిషికి ప్రమోషన్ వస్తుందని సమాచారం. ట్రెజరీ చీఫ్ సెక్రటరీగా పని చేస్తున్న రిషి, పార్లమెంటు ఎన్నికలకు ముందు టీవీ డిబేట్లలో ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నారు. గోల్డ్ మన్ శాచ్స్ వంటి సంస్థల్లో పని చేసిన ఈ ఆర్థికవేత్త బ్రిటన్ ఆర్థిక మంత్రి పదవికి సరైనవాడని బోరిస్ జాన్సన్ భావిస్తున్నారట.
2019-12-25రాజధానిని ‘‘గ్రేటర్ రాయలసీమ’’లో ఏర్పాటు చేయాలని సీనియర్ రాజకీయ నేత మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. అమరావతినుంచి రాజధానిని విశాఖపట్నానికి తరలించే సంకేతాలు వెలువడ్డ నేపథ్యంలో... బుధవారం ‘‘గ్రేటర్ రాయలసీమ’’ వాదన తెరపైకి వచ్చింది. విశాఖ నుంచి కర్నూలుకు ఎంత దూరమో.. కర్నూలు నుంచి విశాఖకూ అంతే దూరమని మైసూరా వ్యాఖ్యానించారు. ‘‘అడగనివాళ్ళకు రాజధాని ఇచ్చి... కోరినవాళ్ళకు ఎంగిలి మెతుకులు విదిలిస్తారా?’’ అని ఆయన ప్రశ్నించారు.
2019-12-25భారతీయ ఉక్కు పరిశ్రమ మరోసారి ధరలు పెంచనుంది. జనవరిలో టన్నుకు రూ. 700 నుంచి రూ. 1000 వరకు ధరలు పెరుగుతాయని పరిశ్రమ ప్రతినిధి ఒకరు చెప్పారు. అంతర్జాతీయంగా ధర 60 నుంచి 70 డాలర్లకు పెరగడం, దేశీయ మార్కెట్లలో డిమాండ్ స్థిరంగా ఉండటంతో ధరలు పెంచనున్నారు. ఉత్పత్తిదారులు నవంబరులో టన్నుకు రూ. 500 నుంచి రూ. 750 వరకు, డిసెంబరులో రూ. 750 నుంచి 1000 వరకు ధరలు పెంచారు.
2019-12-25ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి కాంశ్య విగ్రహాన్ని లక్నోలో ఆవిష్కరించారు. బుధవారం వాజపేయి జన్మ దినాన్ని పురస్కరించుకొని ఆయన పేరిట ఉత్తరప్రదేశ్ రాజధానిలోనే వైద్య విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన చేశారు. వాజపేయి లక్నో నుంచి లోక్ సభ కు ఐదు సార్లు ప్రాతినిధ్యం వహించారు.
2019-12-25క్రికెట్ దిగ్గజం, మాజీ ఎంపీ సచిన్ టెండూల్కర్ భద్రతను మహారాష్ట్ర ప్రభుత్వం ‘X’ కేటగిరి నుంచి తగ్గించింది. ఇప్పటిదాకా ఆ కేటగిరి కింద 24 గంటలూ ఒక కానిస్టేబుల్ కాపలా ఉంటుండగా, ఇకపైన సచిన్ బయటకు వెళ్ళే సమయంలో మాత్రమే భద్రత కల్పిస్తారు. అదే సమయంలో... మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ థాకరే కుమారుడు, ఎమ్మెల్యే ఆదిత్య థాకరే భద్రతను ‘వై’ కేటగిరి నుంచి ‘జడ్’ కేటగిరికి పెంచారు.
2019-12-25జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ఈ నెల 29వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్ర గవర్నర్ బుధవారం సోరెన్ ను కోరినట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో జెఎంఎం-కాంగ్రెస్-రాష్ట్రీయ జనతాదళ్ కూటమికి 47 సీట్లు లభించిన విషయం తెలిసిందే. ఇతరులతో కలిపి మొత్తం 50 మంది మద్ధతుతో కూడిన లేఖను సోరెన్ మంగళవారం గవర్నర్ కు సమర్పించారు.
2019-12-25ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం తన సొంత నియోజకవర్గం పులివెందులలో పెద్ద మొత్తంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 100 కోట్ల అంచనా వ్యయంతో పులివెందుల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు, పులివెందులలో రూ. 347 కోట్ల అంచనాతో చేపట్టిన మెడికల్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చిత్రావతి రిజర్వాయర్ నుంచి పులివెందుల, లింగాల, ఎర్రబెల్లి లకు తాగునీరు అందించే పథకానికి కూడా శంకుస్థాపన చేశారు.
2019-12-25