మణిపూర్ లో ప్రతి వెయ్యి మంది మగ పిల్లలకు గాను కేవలం 757 మంది ఆడపిల్లలు పుడుతున్నారు. ఇది దేశంలోనే అత్యంత అధ్వానమైన లింగ నిష్ఫత్తి. మరో ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ ప్రతి వెయ్యి మంది మగ పిల్లలకు గాను 1084 ఆడపిల్లల జననాలను నమోదు చేసి దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచింది. పౌర నమోదు వ్యవస్థ వైటల్ స్టాటిస్టిక్స్ 2018 రిపోర్టు ప్రకారం.. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ (896) అధ్వాన రాష్ట్రాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. 2018లో దేశం మొత్తంలో 2.33 కోట్ల జననాలు నమోదయ్యాయి.
2020-11-15అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ట్రంప్ మద్ధతుదారులు చేపట్టిన ర్యాలీలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆదివారం వాషింగ్టన్ నగరంలో కొన్ని పదుల వేలాది మంది ట్రంప్ కు మద్ధతుగా కదం తొక్కారు. ఈ సందర్భంగా వారికి, వారి వ్యతిరేకులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 20 మందికి పైగా గాయపడ్డట్టు సమాచారం. 21 మందిని అరెస్టు చేసి 8 తుపాకులు, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించినా.. ప్రస్తుత అధ్యక్షుడు ఓటమిని అంగీకరించడంలేదు.
2020-11-15ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రాతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్.సి.ఇ.పి) చైనా సహా 15 ఆసియా-పసిఫిక్ దేశాల ఆమోదంతో ఆదివారం ఉనికిలోకి వచ్చింది. ఇండియా గత ఏడాది ఈ భాగస్వామ్యం నుంచి తప్పుకోగా.. ‘క్వాడ్’ మిత్ర దేశాలు జపాన్, ఆస్ట్రేలియా భాగస్వాములయ్యాయి. ఆర్.సి.ఇ.పి. దేశాల్లో 220 కోట్ల జనాభా ఉండగా.. అవి ప్రపంచ జీడీపీలో 30 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 29 శాతం కలిగి ఉన్నాయి. చైనా కేంద్ర బిందువుగా జరిగిన ఈ ఒప్పందం ఆసియా దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యాన్ని పెంచనుంది.
2020-11-15చైనా కస్టమ్స్ విభాగం ఓ భారత కంపెనీకి చెందిన సముద్ర ఉత్పత్తులను నిలిపివేసింది. శుక్రవారం నుంచి వారం రోజుల పాటు ఈ నిషేధం అమలు కానుంది. ఇండియా నుంచి ఎగుమతి అయిన నురుగు చేప ప్యాకేజింగ్ పైన కరోనా వైరస్ ను కనుగొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చైనా అధికారులు ప్రకటించారు. వైరస్ సహిత ఆహారం టియాంజిన్ రేవు పట్టణం నుంచి తమకు వచ్చినట్టుగా లాంగ్జూ, గ్వాంగ్జూ అధికారులు తెలిపారు. చైనా దిగుమతుల్లో కరోనా వైరస్ ను కనుగొన్న ఉదంతాలు జూలై నుంచి ఇప్పటిదాకా కనీసం 30 వెల్లడయ్యాయి.
2020-11-13భూమిపై నుంచి ఆకాశంలో స్వల్ప దూర (30 కిలోమీటర్ల పరిధి) లక్ష్యాలను ధ్వంసం చేసే అధునాతన క్షిపణిని ఇండియా శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్ వద్ద ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లో డి.ఆర్.డి.ఒ. ఈ పరీక్షను నిర్వహించింది. రెండు వాహనాలతో కూడిన రక్షణ వ్యవస్థ నుంచి ప్రయోగించే ఈ క్షిపణి 15 కిలోమీటర్ల ఎత్తులో విహరించే విమానాలను కూల్చగలదు. ఒక వాహనంపైన ఉండే రాడార్ 100 లక్ష్యాలను గుర్తించగలదు. వాటిలో ఆరు లక్ష్యాలను రెండో వాహనంపైనున్న క్షిపణులు కూల్చగలవు.
2020-11-13పాకిస్తాన్ దాడికి భారత ఆర్మీ దీటుగా స్పందించింది. ఆ దేశ ఆర్మీ పోస్టులు, బంకర్లపై గైడెడ్ మిసైళ్లతో దాడి చేసింది. అందులో కొన్ని ఆయుధాలు, ఇంధనం దాచిన, ఉగ్రవాదులను ఉంచిన ప్రదేశాలని భారత రక్షణ శాఖ అధికార ప్రతినిధి రాజేశ్ కాలియా తెలిపారు. ఈ ప్రతిదాడిలో 8 మంది పాకిస్తాన్ సైనికులు మరణించినట్టుగా అనధికారిక కథనాలు వెలువడ్డాయి. పాకిస్తాన్ దాడిలో భారత జవాన్లు నలుగురు, పౌరులు నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఉద్ధేశపూర్వకంగానే పౌర ఆవాసాలపై దాడికి దిగిందని కాలియా విమర్శించారు.
2020-11-13కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ సైనికులు జరిపిన కాల్పులలో ముగ్గురు భారత ఆర్మీ జవాన్లు, ఒక సరిహద్దు భద్రతా దళం జవాను, నలుగురు భారత పౌరులు మరణించారు. కాశ్మీర్ లోని యూరి, నౌగామ్, కేరన్, గురెజ్ సెక్టార్లలో నియంత్రణ రేఖకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. పౌరుల మరణాలన్నీ యూరి సెక్టార్ లోనే సంభవించాయి. కమాల్ కోట్ గ్రామంలో ఇద్దరు, బాల్ కోట్, గోఖన్ గ్రామాల్లో ఒకరు చొప్పున మరణించారు. చనిపోయిన పౌరుల్లో ఒక మహిళ, ఏడేళ్ల బాలుడు ఉన్నారు.
2020-11-13జేమ్స్ బాండ్ పాత్రలో ఒదిగిపోయిన హాలీవుడ్ నటుడు సీన్ కానరీ శనివారం మరణించారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. స్కాటిష్ జాతీయుడైన కానరీ 1962, 1983 మధ్య ఏడు బాండ్ సినిమాలలో నటించారు. మొదటి బాండ్ సినిమా డాక్టర్ నో (1962)తో ప్రారంభించి ఫ్రం రష్యా విత్ లవ్ (1963), గోల్డ్ ఫింగర్ (1964), థండర్ బాల్ (1965), యు ఓన్లీ లివ్ ట్వైస్ (1967) సినిమాలలో వరుసగా నటించారు. బాండ్ పాత్రలతోపాటు... ‘ద హంట్ ఫర్ రెడ్ అక్టోబర్’, ‘ఇండియానా జోన్స్’, ‘ద రాక్’ వంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు కానరీ. 1987లో వచ్చిన ‘ద అన్ టచబుల్స్’లో సహాయ నటుడిగా ఆస్కార్ అందుకున్నారు.
2020-10-31చైనాలో ఏది చేసినా అసాధారణ స్థాయిలోనే ఉంటుంది. తాజాా జింజియాంగ్ ప్రావిన్సులోని కాష్గర్ ప్రాంతంలో ఒక 17 సంవత్సరాల యువతికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో, ఆ ప్రాంతం మొత్తంలోని ప్రజలకు కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తోంది చైనా ప్రభుత్వం. సోమవారం నాటికి 28.4 లక్షల మందికి పరీక్షలు పూర్తి కాగా, మంగళవారం మరో 20 లక్షల మందిని పరీక్షిస్తున్నారు. సోమవారం నిర్వహించిన పరీక్షలలో లక్షణాలు లేని 161 కేసులు బయటపడ్డాయి. తొలుత కరోనా వైరస్ బయటపడిన ఊహాన్ నగరంలోని కోటీ 10 లక్షల మందికీ పరీక్షలు నిర్వహించిన చైనా, తర్వాత బీజింగ్, షాంగై, క్వింగ్డావో వంటి నగరాల్లో ప్రజలందరినీ పరీక్షించింది.
2020-10-27భారతదేశం ప్రజాస్వామ్య హోదాను కోల్పోతూ నిరంకుశీకరణకు గురవుతోందని స్వీడన్ కు చెందిన పరిశోధనా సంస్థ ‘వి- డెెమ్’ స్పష్టం చేసింది. గోతెన్ బర్గ్ యూనివర్శిటీకి చెందిన ఈ సంస్థ తన ‘డెమోక్రసీ రిపోర్టు- 2020’ని తాజాగా విడుదల చేసింది. మోదీ ప్రభుత్వ హయాంలో మీడియా, పౌర సమాజం, ప్రతిపక్షాల స్థానం క్షీణించిందని, ఇండియా ప్రజాస్వామ్య హోదాను కోల్పోయే దశ అంచుల్లో ఉందని వి- డెెమ్ పేర్కొంది. నిరంకుశీకరణ ఇండియాతో పాటు అమెరికా, బ్రెజిల్ లను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని, 2001 తర్వాత తొలిసారిగా నిరంకుశ రాజ్యాలు మెజారిటీ (54 శాతం ప్రజలతో కూడిన 92 దేశాలు) అయ్యాయని నివేదిక పేర్కొంది.
2020-10-26