సమాచార గోప్యతను మానవ హక్కుగా పరిగణించాలని, దాన్ని పరిరక్షించాలని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక వేదిక 2020 వార్షిక సమావేశంలో గురువారం సత్య మాట్లాడారు. సమ్మతితో వినియోగిస్తున్న భారీ సమాచారం సమాజహితానికే దోహదపడాలని ఆయన సూచించారు. సీఈవోల వేతనాలు, ఇతరుల వేతనాల మధ్య అంతరాలు.. పెట్టుబడిపై రాబడి వంటి ఇతర అంశాలపై చర్చను నాదెళ్ళ స్వాగతించారు.
2020-01-23ప్రతిపక్ష టీడీపీ మెజారిటీతో నడుస్తున్న శాసన మండలిపై అధికార వైసీపీ కన్నెర్ర చేసింది. రాజధాని ‘వికేంద్రీకరణ’ బిల్లును ‘సెలక్ట్ కమిటీ’ పేరిట నిలువరించిన మండలిని కొనసాగించాలా? వద్దా? అన్న కోణంలో ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో చర్చను చేపట్టింది. మండలి ఛైర్మన్ నిబంధనల ప్రకారం వ్యవహరించలేదని, లేని విచక్షణాధికారాన్ని వినియోగించారని మంత్రులు ఆరోపించారు. మండలి కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సూచించారు.
2020-01-23రాజధాని ‘వికేంద్రీకరణ’, సీఆర్డీయే రద్దు బిల్లులపై తక్షణ విచారణ అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభిప్రాయపడింది. శాసనసభ బిల్లులను ఆమోదించినా.. మండలి ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకొని విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది. ఈలోగా ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తారని పిటిషనర్ల తరపు న్యాయవాది అశోక్ భాన్ కోర్టుకు నివేదించారు. అలా చేస్తే ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తామని కోర్టు స్పష్టం చేసింది.
2020-01-23చంద్రబాబు తన తొత్తును తెచ్చి మండలి ఛైర్మన్ సీటులో కూర్చోబెట్టారని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఛైర్మన్ షరీఫ్ చట్టాలపై గౌరవం లేని వ్యక్తి అని విమర్శించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వికేంద్రీకరణ’ బిల్లును ఛైర్మన్ నిన్న సెలక్ట్ కమిటీ పరిశీలనకు నివేదించిన నేపథ్యంలో బొత్స గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డివిజన్ కోరకుండా బిల్లును సెలక్ట్ కమిటీకి ఎలా పంపుతారని ప్రశ్నించారు.
2020-01-23శాసనసభలో 151 ఎమ్మెల్యేల అసాధారణ బలగంతో అధికార పార్టీ ప్రతిపక్ష రహిత సభలో ‘వికేంద్రీకరణ’ బిల్లును ఆమోదించింది. మండలి ఛైర్మన్ సెలక్ట్ కమిటీకి నివేదించడంతో ఇప్పుడు భిన్నాభిప్రాయాలకు చోటు దొరుకనుంది. మండలిలో టీడీపీ, వైసీపీ సభ్యులతో పాటు పి.డి.ఎఫ్, బి.జె.పి, ఇతరులూ ఉన్నారు. సెలక్ట్ కమిటీలోనూ ఈ వైవిధ్యం ఉంటుంది. ఈ కమిటీ రూపొందించే నివేదికలోనూ అతి ప్రతిబింబించవచ్చు. ప్రభుత్వ బిల్లుకు సవరణలూ ప్రతిపాదించవచ్చు.
2020-01-23రాజధాని తరలింపునకు మండలి బ్రేకులు తాత్కాలికమే అయినా.. ప్రభుత్వానికి ఈ మూడు నెలల్లో రెండు సవాళ్ళు ఎదురయ్యే అవకాశముంది. ‘వికేంద్రీకరణ’ బిల్లును శాసనసభ ఆమోదించాక రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు ఎలాంటి ఉత్తర్వులిచ్చినా.. వ్యాఖ్యలు చేసినా దాని ప్రభావం గణనీయంగానే ఉంటుంది. రెండవది... గత 10 రోజుల్లోనే రాజధాని గ్రామాలను దాటిన అమరావతి పరిరక్షణ ఉద్యమం మరో 90 రోజుల్లో కొత్త ప్రాంతాలకు విస్తరించే అవకాశం లేకపోలేదు.
2020-01-2336 రోజుల క్రితం శాసనసభ శీతాకాల సమావేశాల ముగింపు రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘మూడు రాజధానుల’ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటించింది మాత్రం 2 రోజుల క్రితమే. అయితే, ఈలోగానే రాజధానిని విశాఖపట్టణానికి తరలించడానికి యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నారు. బిల్లు చట్టం రూపు దాల్చకుండా శాసన మండలి ఆపడంతో... సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల తరలింపు ప్రక్రియకూ బ్రేకులు పడ్డాయి.
2020-01-23‘వికేంద్రీకరణ’ బిల్లును శాసన మండలి సెలక్ట్ కమిటీకి నివేదించాక అమరావతి రైతుల్లో సంతోషం వెల్లివిరిసింది. అయితే, ఇది కేవలం ఉపశమనమే. శాసన సభ ఆమోదించి పంపిన ఓ బిల్లును మండలి మూడు నెలల కంటే ఎక్కువ ఆపలేదు. సెలక్ట్ కమిటీ ఈ బిల్లును, పర్యవసానాలను అధ్యయనం చేసి మూడు నెలల్లోపలే నివేదిక ఇవ్వవలసి ఉంటుంది. ‘వికేంద్రీకరణ’ను వ్యతిరేకిస్తూ మండలి తీర్మానం చేసినా..అదే ఫైనల్ కాదు. అదే అంశంపై అసెంబ్లీ మరోసారి బిల్లును పంపితే మండలి ఆమోదించక తప్పదు.
2020-01-23సెలక్ట్ కమిటీకి రిఫర్ చేసిన ‘రాజధాని వికేంద్రీకరణ’ బిల్లు మరో మూడు నెలలు వెలుగు చూసే అవకాశం లేదు. ఈలోగా శాసనసభ మరోసారి ఆ బిల్లుపై నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. అలాగని ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడమూ కుదరదు. బిల్లు ఉపసంహరణకూ అవకాశం లేదు. మూడు నెలలు దాటితే మండలి అభిప్రాయంతో నిమిత్తం లేకుండా అసెంబ్లీ నిర్ణయం తీసుకోవచ్చు. ఈ పరిస్థితిని ముందే ఊహించినందునే..మంత్రులు అధికారమంతా ఉపయోగించి మండలిలో పోరాడారు.
2020-01-23ఏపీ రాజధాని మార్పుకోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వికేంద్రీకరణ’ బిల్లును మండలి ఛైర్మన్ ‘విచక్షణాధికారం’తో సెలక్ట్ కమిటీకి పంపారు. రెండు రోజులుగా రెండు పక్షాల మధ్య వ్యూహ ప్రతివ్యూహాలకు మండలి వేదికైంది. అధికార బలంతో నిన్న టీడీపీ సభ్యులను ఇద్దరిని తమవైపు తిప్పుకోగలిగిన వైసీపీ, బుధవారం ‘మండలి రద్దు’ వంటి బెదిరింపులు, ఛైర్మన్ అధికారాలపై ప్రశ్నలు సంధించినా ఫలితం లేకపోయింది. 20 మంది మంత్రులు మోహరించి టీవీ ప్రసారాలను కట్ చేసినా ‘విచక్షణాధికారం’ పైచేయి సాధించింది.
2020-01-22