రాష్ట్రంలో రివర్స్ పాలన నడుస్తోందంటూ... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం అసెంబ్లీకి రివర్స్ నడక ద్వారా నిరసన తెలిపారు. అమరావతిపై ప్రభుత్వం రోజుకో మాట చెప్పడం, రివర్స్ టెండర్లు వంటి అంశాలపై ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్ర అభివృద్ధినే రివర్స్ చేశారని నినాదాలు చేశారు.
2019-12-16‘‘నేను ముస్లింను కాదు. అయినా... మొదటి రోజు నుంచీ ముందు వరుసలో ఉన్నా. ఏది సరైనదో... దాని వైపు నిలబడకపోతే ఇక విద్య ఎందుకు?’’... పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొన్న జామియా మిలియా యూనివర్శిటీ విద్యార్ధిని మాట ఇది. వర్శిటీలో పోలీసుల హింసాకాండను వివరిస్తూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘దేశం మొత్తంమీద ఎక్కడా భద్రత ఉందని అనిపించడం లేదు. నేను ఎక్కడికి వెళ్ళాలో... ఎవరిచేత చంపబడతానో తెలియదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
2019-12-16‘‘మద్యం షాపులు తగ్గినా ఆదాయం బాగా వస్తోంది. దశలవారీగా నిషేధం అంటున్నారు. ఇది మాట తప్పడం కాదా?’’ అని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మద్యపాన నిషేధంపై ఆమె మాట్లాడారు. మద్యం షాపులు, అందుకు అనుగుణంగా కేసుల అమ్మకాలు తగ్గినా... ధరల పెంపు కారణంగా ప్రభుత్వానికి ఆదాయం మాత్రం పెరిగింది. ఈ విషయాన్ని భవాని ప్రస్తావించారు.
2019-12-16పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్ధులను నిర్భంధించిన పోలీసులు, సోమవారం ఉదయం విడిచిపెట్టారు. జామియా విద్యార్థులపై పోలీసుల దమనకాండకు నిరసనగా ఢిల్లీ జె.ఎన్.యు, ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ, హైదరాబాద్ కేంద్రీయ వర్శిటీ విద్యార్ధులు ఆదివారం రాత్రంతా ఆందోళన చేపట్టారు. కోల్ కతలో కూడా రాత్రంతా నిరసన సాగింది. నిరసనలు దేశవ్యాప్తం అవుతుండటంతో నిర్భంధంలో ఉన్న 50 మంది విద్యార్ధులను పోలీసులు విడిచిపెట్టారు.
2019-12-16మత ప్రాతిపదికన పౌరసత్వ చట్టానికి కేంద్రం చేసిన సవరణలతో అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ అట్టుడికిపోయింది. దీంతో ప్రభుత్వం యూనివర్శిటీకి ఆకస్మికంగా సెలవులు ప్రకటించింది. జనవరి 5వ తేదీ వరకు యూనివర్శిటీని మూసివేస్తున్నట్టు అధికారులు ఆదివారం వెల్లడించారు. అలీఘర్ నగరంలో ఇప్పటికే ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను నియంత్రించేందుకు ఈ చర్యలు చేపట్టారు.
2019-12-15పౌరసత్వ సవరణ చట్ట సవరణకు వ్యతిరేకంగా... జామియా మిలియా ఇస్లామియా విద్యార్ధుల తర్వాత అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ విద్యార్ధులు ఆందోళన బాట పట్టారు. విద్యార్ధుల నిరసనను అడ్డుకున్న పోలీసులు లాఠీచార్జి చేయడంతో పరిస్థితి తీవరించింది. పోలీసులు బాష్ఫవాయు గోళాలు ప్రయోగించగా... విద్యార్ధులు రాళ్లు రువ్వారు. పలువురు విద్యార్ధులు తీవ్రంగా గాయపడగా కొందరు పోలీసులకూ రాళ్ల గాయాలయ్యాయి. పోలీసులే విద్యార్ధుల వాహనాలను ధ్వంసం చేయడం వీడియోలలో స్పష్టంగా కనిపిస్తోంది.
2019-12-15మత ప్రాతిపదికన పౌరసత్వ చట్టానికి చేసిన సవరణలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘‘1000 శాతం కరెక్ట్’’ అని సమర్ధించుకున్నారు. కేంద్ర కొత్త చట్టంపై అస్సాం, పశ్చిమ బెంగాల్ రగిలిపోతున్న నేపథ్యంలో... మోదీ ఆదివారం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ఈ అంశంపై మాట్లాడారు. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లలో మైనారిటీలు అయినందుకు బాధలు పడ్డవారి జీవితాలు మెరుగుపరచడానికి, గౌరవం కల్పించడానికి ఈ చట్టం అవసరమని ప్రధాని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ సమస్యను రాజేస్తోందని మోదీ ఆరోపించారు.
2019-12-15జాతీయ పౌర రిజిస్ట్రీ (ఎన్.ఆర్.సి) బీహార్లో అమలు కాదని ఆ రాష్ట్ర సిఎం నితీష్ కుమార్ తన పార్టీ సహచరులకు హామీ ఇచ్చారు. పౌరసత్వ చట్టంపై పార్టీ ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విమర్శ నేపథ్యంలో..శనివారం ఓ సమావేశంలో నితీష్ స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని కిషోర్ చెప్పగా.. జెడి(యు) పార్లమెంటులో దానికి మద్ధతుగా ఓటు వేసింది. పౌర రిజిస్ట్రీకి పౌరసత్వ సవరణ చట్టం తోడైతే మైనారిటీలపై వివక్ష పెరుగుతుందని కిషోర్ ఆందోళన వ్యక్తం చేయగా.. నితీష్ రిజిస్ట్రీపై స్పందించారు.
2019-12-14కోర్టులు నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో ‘కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్- ఎ.ఐ)’ను ఉపయోగించే ప్రణాళికేదీ లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ బాబ్డే స్పష్టం చేశారు. ఎ.ఐ. వినియోగంపై మాజీ సీజేఐ ఆర్.ఎం. లోథా ఆందోళన వ్యక్తం చేయడంతో... జస్టిస్ బాబ్డే స్పందించారు. ‘‘మేము చూస్తున్న వ్యవస్థ... సెకనుకు పది లక్షల పదాలను చదివేంత వేగవంతమైనది. అయోధ్య కేసులో వేలాది పత్రాలున్నాయి. కృత్రిమ మేధస్సును ఉపయోగించినప్పుడు అవి చదవడం సులభం అవుతుంది’’ అని జస్టిస్ బాబ్డే చెప్పారు.
2019-12-14పౌరసత్వ సవరణ బిల్లు 2019కి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. దీంతో అది చట్టంగా మారింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలనుంచి భారతదేశానికి శరణార్థులై వచ్చే ముస్లిమేతరులకు పౌరసత్వం ఇవ్వాలనే సవరణ వివాదాస్పదమైంది. పౌరసత్వానికి మత ప్రాతిపదిక కూడదని సర్వత్రా నిరసన వ్యక్తమైంది. అయినా, బిజెపికి లోక్ సభలో ఉన్న మెజారిటీతో బిల్లు తేలిగ్గా ఆమోదం పొందింది. రాజ్యసభలో మిత్రపక్షాల ఓట్లతో కలిపి మెజారిటీ ఓట్లు పొందింది.
2019-12-13