మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసును సీబీఐకి అప్పగించడంలో ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏమిటని ఏపీ హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది. వివేకా కేసును సీబీఐకి అప్పగించాలంటూ పిటిషన్లు దాఖలు చేసినవారిలో ప్రస్తుత సిఎం వైఎస్ జగన్ కూడా ఉన్నారని హైకోర్టు గుర్తు చేసింది. జగన్ ప్రతిపక్షంలో ఉండగా ఈ డిమాండ్ చేశారు. తాజాగా వివేకా కుమార్తె సునీత మరో పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం కోర్టులో అడ్వకేట్ జనరల్ లేకపోవడంతో కేసును ఫిబ్రవరి 6కి వాయిదా వేశారు.
2020-01-28విపత్తులా విరుచుకుపడిన ‘కరోనా వైరస్’ను నియంత్రించడానికి చైనా యుద్ధం చేస్తుంటే...ఆ మహమ్మారి తమదాకా రాకూడదని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. ఇలాంటి సున్నితమైన అంశంపై ఒక డానిష్ పత్రిక (Jyllands-posten Debate) చైనా జాతీయ పతాకంలోని నక్షత్రాల స్థానంలో ‘కరోనావైరస్’ను చూపిస్తూ ఓ కార్టూన్ ప్రచురించింది. అది కార్టూనిస్టు అభిప్రాయమని పేర్కొంది. అయినా, ఈ అంశంపై డెన్మార్క్ లోని చైనా ఎంబసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
2020-01-28చైనాలోని వుహాన్ నగరాన్ని సందర్శించని ఓ జపనీయుడికి కూడా ‘కరోనా వైరస్’ సోకినట్లు తాజాగా గుర్తించారు. జపాన్ నగరం ‘నారా’లో టూరిస్టు బస్సు డ్రైవర్ గా పని చేస్తున్న ఈ 60 ఏళ్ల వ్యక్తి... జనవరి 8-16 తేదీల్లో వుహాన్ నగరం నుంచి వచ్చిన సందర్శకులను కలిశారు. 14వ తేదీ నుంచి ఆయనకు వైరస్ లక్షణాలు కనిపించగా 25వ తేదీన ఆసుపత్రిలో చేరారని జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ఈ డ్రైవర్ తో కలిపి జపాన్ లో 6 కేసులను ఇప్పటిదాకా గుర్తించారు.
2020-01-28మోడీ ప్రభుత్వం ‘పిఎం కిసాన్’ పథకంలో భాగంగా 14.5 కోట్ల రైతులకు ఏటా మూడు కిస్తీలుగా రూ. 6,000 చొప్పున ఇస్తామని ప్రకటించింది. కానీ, తొలి ఏడాది (01-12-2018 నుంచి 30-11-2019 వరకు) కేవలం 26.6 శాతం మందికే రూ. 6,000 అందినట్టు ‘ద వైర్’ పేర్కొంది. 44 శాతం మందికి రెండు కిస్తీలు (రూ. 4000) అందాయి. మొత్తంగా 52 శాతం మందికి కేవలం ఒకే కిస్తీ (రూ. 2000 మాత్రమే) అందితే.. 48 శాతానికి అది కూడా రాలేదు. అంటే.. 6.8 కోట్ల రైతు కుటుంబాలకు ఒక్క రూపాయీ అందలేదు.
2020-01-28‘‘పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించినందున ప్రశ్నించరాదని వాదిస్తున్నవారు, ఎమర్జెన్సీని కూడా పార్లమెంటులో ఆమోదించారని గుర్తుంచుకోవాలి. అయినా వ్యతిరేకించాం.. పోరాడాం.. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించుకున్నాం. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి చెందిన కొంతమంది కూడా కలిశారు. అప్పుడు వారు తప్పు చేశారా?’’ అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రశ్నించారు. సిఎఎను పార్లమెంటులో వ్యతిరేకించినట్టే వీధుల్లోనూ నిరసిస్తామని వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.
2020-01-28బంగ్లాదేశ్ సెకండ్ డివిజన్ క్రికెట్ పోటీలో ఓ అరుదైన రికార్డు నమోదైంది. ఇరు జట్ల బ్యాట్స్ మెన్ కలిపి ఏకంగా 48 సిక్సర్లు, 70 ఫోర్లు బాదారు. 50 ఓవర్ల మ్యాచ్ లో ఇరు జట్ల ఉమ్మడి స్కోరు 818 కాగా...అందులో 568 కేవలం సిక్సర్లు, ఫోర్ల ద్వారా నమోదయ్యాయి. 432 పరుగులు సాధించిన ‘నార్త్ బెంగాల్ క్రికెట్ అకాడమీ’ 46 తేడాతో గెలిచింది. ఆ జట్టు బ్యాట్స్ మెన్ ఏకంగా 27 సిక్సర్లు కొట్టారు. అసాధారణ ఫలితాలకు పెట్టింది పేరైన బంగ్లా క్రికెట్లో కూడా ఎన్నడూ చూడని పరిణామమిది.
2020-01-28ఏపీ శాసన మండలిని రద్దు చేయాలన్న తీర్మానాన్ని నిన్న రాత్రే శాసనసభ ఆమోదించింది. ఆ తీర్మాన ప్రతితో పాటు ఓటింగ్ వివరాలను శాసనసభ సచివాలయం వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. కొద్ది గంటల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆ కాపీలను కేంద్ర హోం శాఖకు, ఎన్నికల సంఘానికి పంపినట్లు అధికార వర్గాల సమాచారం. రాజధాని మార్పునకు ఉద్ధేశించిన బిల్లులకు మండలి బ్రేకులు వేయడంపై మండిపడ్డ సిఎం జగన్, రద్దు ప్రక్రియను శరవేగంగా నడిపిస్తున్నారు.
2020-01-28తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ‘మిషన్ భగీరథ’, ఇతర ఎత్తిపోతల పథకాల నిర్వహణకు ప్రత్యేక గ్రాంటును సిఫారసు చేయాలని ఆ రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు 15వ ఆర్థిక సంఘాన్ని కోరారు. మంగళవారం ఢిల్లీలో కమిషన్ ఛైర్మన్ నందకిషోర్ సింగ్ ను కలసిన హరీష్ రావు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రాసిన లేఖను అందజేశారు. తెలంగాణ భౌగోళిక పరిస్థితుల కారణంగా... 80 నుంచి 610 మీటర్ల వరకు నీటిని ఎత్తిపోయవలసి వచ్చిందని వివరించినట్టు హరీష్ రావు చెప్పారు.
2020-01-28శాసన మండలికి ఖర్చు పెట్టే ప్రతి రూపాయీ దండగేనన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యను తెలంగాణ ఎంపీ కె. కేశవరావు తప్పు పట్టారు. అది ‘పూర్తిగా నాన్సెన్స్’ అని వ్యాఖ్యానించారు. ఏ పరిణతి చెందిన ప్రజాస్వామ్యంలోనైనా రెండో ఆలోచనకు తావుంటుందని, ఎగువ సభ చాలా అవసరమని కేకే పేర్కొన్నారు. మంగళవారం కేకే హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిని కలసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
2020-01-28అమెరికా వైమానిక దళం కమ్యూనికేషన్ విమానం ‘ఇ-11ఎ’ సోమవారం ఆఫ్ఘనిస్తాన్ పర్వత ప్రాంతాల్లో కూలిపోయింది. ఇద్దరు పైలట్లు మరణించారు. ఘజిని ప్రావిన్సులో తాలిబన్ల అధీనంలో ఉన్న పర్వత ప్రాంతాల్లో విహరిస్తున్న సమయంలో విమానం కూలిపోయింది. కూలిన విమానం చిత్రాలు మీడియాలో రాగానే... తామే కూల్చివేశామని తాలిబన్లు ప్రకటించారు. అయితే, తమ విమానం కూలినట్లు ఆలస్యంగా అంగీకరించిన అమెరికా.. కారణాలపై విచారణ జరుగుతోందని పేర్కొంది.
2020-01-27