కేంద్ర వ్యవసాయ చట్టాలపై రైతుల ఉద్యమానికి మద్ధతు మరింత పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అకాలీదళ్ అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్ ఏకంగా తన ‘పద్మ విభూషణ్’ పురస్కారాన్ని వెనక్కి ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే పలువురు క్రీడా ప్రముఖులు తమ క్రీడా పురస్కారాలతో పాటు పద్మశ్రీ వంటి పౌర పురస్కారాలను కూడా వదులుకుంటున్నట్టు ప్రకటించారు. వారు స్వయంగా రైతు ఉద్యమంలో పాల్గొంటున్నారు కూడా. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగానే కేంద్ర మంత్రివర్గం నుంచి, ఎన్డీయే నుంచి అకాలీదళ్ తప్పుకున్న విషయం తెలిసిందే.
2020-12-03రెండోసారి అధికారంలో కొనసాగలేకపోతే 2024లో మళ్ళీ వస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మంగళవారం (అమెరికా కాలమానం) స్వేతసౌధంలో నిర్వహించిన క్రిస్మస్ పార్టీలో అతిధులను ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్ ‘‘ఈ నాలుగు సంవత్సరాలు అద్భుతమైన కాలం. మేము మరో నాలుగు సంవత్సరాలు పనిచేయడానికి ప్రయత్నిస్తున్నాం. కుదరకపోతే, మరో నాలుగు సంవత్సరాలలో మిమ్మల్ని చూస్తాను’’ అని చెప్పారు. ఎన్నికల్లో ఓడినా దిగిపోవడానికి ససేమిరా అంటున్న ట్రంప్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
2020-12-02కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులు బుధవారం రెండవ రోజు నోయిడా-ఢిల్లీ సరిహద్దులో ధర్నాను కొనసాగించారు. ఈ పరిణామం ఉత్తర ప్రదేశ్‌ను జాతీయ రాజధానితో కలిపే కీలక మార్గం మూసివేతకు దారితీసింది. దీంతో.. చిల్లా మార్గానికి బదులుగా డిఎన్‌డి లేదా కాలిందికుంజ్ మార్గంలో వెళ్లాలని నోయిడా ట్రాఫిక్ పోలీసులు ఢిల్లీకి ప్రయాణించే ప్రయాణికులకు సూచించారు. ఢిల్లీ-నోయిడా సరిహద్దులోని రైతులు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు చెందినవారు.
2020-12-02పాత, కొత్త ఆయుధాలను వరుసగా పరీక్షించి చూస్తున్న భారత సైన్యం.. ఈ వరుసలో తాజాగా గగనతల రక్షణ క్షిపణులను పరీక్షించింది. దేశీయంగా రూపొందించిన ఆకాశ్ గగన తల రక్షణ వ్యవస్థను, రష్యా నుంచి కొనుగోలు చేసిన హ్యాండ్ లాంచర్ మిసైల్ ‘ఇగ్లా’లను పరీక్షించేందుకు పెద్ద ఎత్తున విన్యాసాలను చేపట్టింది. గుంటూరు జిల్లా సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద మంగళవారం నిర్వహించిన ఈ పరీక్షలను ఐఎఎఫ్ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ హెచ్ఎస్ అరోరా వీక్షించారు.
2020-12-02దేశంలోని ప్రతి పోలీసు స్టేషన్లోనూ సీసీ టీవీ కేమెరాలు ఏర్పాటు చేయాలని, వాటికి రాత్రి పూట కూడా ఆడియోతో సహా రికార్డు చేసే సామర్థ్యం ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాటిని ఏర్పాటు చేయవలసిందిగా బుధువారం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. సీబీఐ, ఎన్ఐఎ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సహా అన్ని కేంద్ర ఏజెన్సీల కార్యాలయాల్లో కూడా సీసీ కేమెరాలు, రికార్డింగ్ సామాగ్రిని ఏర్పాటు చేయాలని జస్టిస్ ఆర్.ఎఫ్. నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది.
2020-12-02వ్యవసాయ చట్టాలపై అభ్యంతరాలను పరిష్కరించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను రైతులు తిరస్కరించారు. కేంద్ర చట్టాలపై నిరసనకోసం చలో ఢిల్లీ చేపట్టిన రైతులను వెనక్కు కొట్టడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో చర్చలకు ఆహ్వానించింది ప్రభుత్వం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఆయన సహచరులు పీయూష్ గోయల్, సోమ్ ప్రకాష్ మంగళవారం రైతు ప్రతినిధులతో ఢిల్లీలో చర్చ ప్రారంభించారు. కమిటీ ప్రతిపాదనను వ్యతిరేకించిన రైతు ప్రతినిధులు సమావేశం నుంచి వెళ్లిపోయారు.
2020-12-01ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న భారత రైతుల శాంతియుత ఉద్యమానికి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ సంఘీభావం తెలిపారు. రైతు ఉద్యమ సందర్భంగా నెలకొన్న పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల నిరసనపై ఇండియా నుంచి వస్తున్న వార్తలను గుర్తించకపోతే తాను నిర్లక్ష్యంగా ఉన్నట్టేనని ట్రూడూ వ్యాఖ్యానించారు. గురునానక్ 551వ జయంతి సందర్భంగా కెనడా భారతీయులను ఉద్దేశించి జస్టిన్ ఒక వీడియోను విడుదల చేశారు. శాంతియుత ప్రదర్శనకారుల హక్కుల పరిరక్షణ కోసం కెనడా నిలబడుతుందని ఆయన ఉద్ఘాటించారు.
2020-12-01పంటల బీమా ప్రీమియం చెల్లించలేదంటూ నిన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు విరుచుకుపడిన నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం హడావుడిగా నిధులు విడుదల జీవోను జారీ చేసింది. రైతుల వాటా ప్రీమియంలో ఇచ్చే సబ్సిడీతో కలిపి రూ. 590 కోట్లకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (జీవో ఆర్.టి. నెం. 820) సోమవారం అర్ధరాత్రి దాటాక జారీ అయింది. బీమాపై చర్చ సందర్భంగా నిన్న చంద్రబాబు స్పీకర్ పోడియం ఎదుట బైఠాయించి సభ నుంచి సస్పెండ్ అయ్యారు. జగన్ ఒక ఫేక్ సిఎం అని, ప్రీమియం చెల్లించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని చంద్రబాబు ఆరోపించారు.
2020-12-01ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వివాదాలతోనే మొదలయ్యాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సహా 13 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అంతకు ముందు చంద్రబాబు స్పీకర్ పోడియం వద్ద బైఠాయించారు. తుపాను పంట నష్టంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడాక సిఎం జగన్ బదులిచ్చారు. ఆ అంశంపై చంద్రబాబు మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు అధికార వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. దీన్ని నిరసిస్తూ చంద్రబాబు స్పీకర్ పోడియం ఎదుట బైఠాయించారు.
2020-11-30రెండు దశాబ్దాలకు పైగా రాజకీయ డైలాగులతో, గత కొద్ది సంవత్సరాలుగా పార్టీ సన్నాహక సమావేశాలతో ఊరిస్తున్న తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఇంకా ముహూర్తం కుదరలేదు. సోమవారం తన ‘మక్కళ్ మండ్రం’ జిల్లా కార్యదర్శులతో సమావేశం సందర్భంగానైనా ఏదో ఒకటి చెబుతారని ఆశించినవారికి నిరాశే ఎదురైంది. రాజకీయ ప్రవేశంపై నిర్ణయం వీలైనంత త్వరగా చెబుతానంటూ మరోసారి వాయిదా వేశారు. కాగా, జనవరిలో పార్టీ ప్రకటన చేయాలనుకుంటున్నట్టు సమావేశానికి వచ్చినవారితో రజినీ కాంత్ చెప్పారని ప్రచారం జరుగుతోంది.
2020-11-30