‘ఇలయ దళపతి’ విజయ్ సహా నలుగురు తమిళ సినీ ప్రముఖుల ఇళ్ళు, కార్యాలయాల్లో ఆదాయ పన్ను అధికారుల సోదాలపై కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ఓ ప్రకటన చేసింది. లెక్కల్లో చూపని సుమారు రూ. 77 కోట్ల నగదును చెన్నై, మదురై లలోని రహస్య ప్రదేశాల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. అది ఫైనాన్షియర్‌కు చెందినదిగా పేర్కొంది. ఈ నలుగురి మధ్య ఉన్న లింకు.. ఇటీవల రూ. 300 కోట్లు వసూలు చేసిన సినిమా (బిజిల్) అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రకటనలో పేర్లను ప్రస్తావించలేదు.
2020-02-062020-21 సంవత్సరంలో ఏపీలో రూ. 1,34,402 కోట్ల మేరకు వ్యవసాయ రుణాలను ఇవ్వనున్నట్లు ‘నాబార్డు ఫోకస్ పేపర్’ తెలిపింది. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర రుణ సదస్సులో ఈ ఫోకస్ పత్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. మొత్తంగా ప్రాథమిక రంగానికి రూ. 2,11,865 కోట్ల మేర రుణాలు ఇవ్వాలని ఫోకస్ పత్రంలో లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. రాష్ట్రంలో 62 శాతానికి ఉపాధి కల్పిస్తున్న ప్రాథమిక రంగంపైనే దృష్టిపెట్టాలని సిఎం జగన్ బ్యాంకర్లకు సూచించారు.
2020-02-06రెండవ జాతీయ జ్యుడిషియల్ పే కమిషన్ తన నివేదికను గురువారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. నాలుగు భాగాలుగా ఉన్న ఈ నివేదికలో న్యాయాధికారుల వేతనాలు, పెన్షన్లు, అలవెన్సులపై పలు సిఫారసులు చేసింది. వాటి ప్రకారం... ప్రారంభ వేతనం రూ. 27,700గా ఉన్న జూనియర్ సివిల్ జడ్జి/ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వేతనం రూ. 77,840కి పెరగనుంది. సీనియర్ సివిల్ జడ్జి వేతనం రూ. 1,11,000, జిల్లా జడ్జి వేతనం రూ. 1,44,840 కానుంది. జిల్లా జడ్జి (సూపర్ టైమ్ స్కేల్) గరిష్ఠ వేతనం రూ. 2,24,100 ఉంటుంది.
2020-02-06‘కియా’ కార్ల పరిశ్రమ తరలిపోతుందనే ప్రచారాన్ని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఖండించారు. మీడియాలో జరుగుతున్నదంతా నిరాధార ప్రచారమని పేర్కొన్నారు. మరిన్ని అనుబంధ పరిశ్రమలతో ‘కియా’ విస్తరిస్తుందే తప్ప...రాష్ట్రాన్ని వీడే అవకాశమే లేదని ఆయన ధీమాగా చెప్పారు. డిఫెన్స్ ఎక్స్ పో 2020 కోసం లక్నోలో ఉన్న మేకపాటి గురువారం అక్కడి నుంచే తన ప్రకటనను వీడియో రూపంలో విడుదల చేశారు. ‘కియా’ యాజమాన్యంతో తాను చర్చించానని కూడా చెప్పారు.
2020-02-06తాను కష్టపడి కంపెనీలను తెస్తే ప్రస్తుత సిఎం ‘పిచ్చి తుగ్లక్’ పాలనలో పారిపోతున్నాయని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ‘కియా’ పరిశ్రమ తమిళనాడుకు వెళ్లిపోవచ్చనే ‘రాయిటర్స్’ కథనంపై చంద్రబాబు స్పందించారు. ‘కియా’కు ఇచ్చిన రాయితీలను ఉపసంహరిస్తామని, ఉద్యోగాలు తమ పార్టీవారికే ఇవ్వాలని, లారీ కాంట్రాక్టులూ తమకే ఇవ్వాలని వైసీపీ నేతలు ‘కియా’ యాజమాన్యాన్ని బెదిరించారని చంద్రబాబు ఆరోపించారు.
2020-02-06తెలంగాణలో బాలికల వరుస హత్యలకు పాల్పడిన హాజీపూర్ హంతకుడు శ్రీనివాసరెడ్డికి నల్లగొండ పోక్సో కోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. ముగ్గురు బాలికలను అపహరించి అత్యాచారం చేశాక హత్య చేసిన కేసుల్లో శ్రీనివాసరెడ్డి దోషి అని కోర్టు ఇప్పటికే తేల్చింది. వాటిలో రెండు కేసుల్లో ఉరిశిక్షను విధించింది. హంతకుడి దురాగతాలు గత ఏడాది ఏప్రిల్ 24న వెలుగులోకి వచ్చాయి. 101 మంది సాక్షులను విచారించి 90 రోజుల్లో తీర్పు చెప్పింది.
2020-02-06‘‘జగన్మోహన్ రెడ్డికి దమ్ము-ధైర్యం ఉంటే... మండలిని కాదు, శాసనసభను రద్దు చేయాలి. 151 మందితో మళ్లీ ప్రజల తీర్పు కోరాలి’’ అని తెలుగుదేశం పార్టీ నేత కోవెలమూడి రవీంద్ర (నాని) సవాలు విసిరారు. గురువారం గుంటూరులో అమరావతి పరిరక్షణ దీక్షా శిబిరం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే అమరావతిని నాశనం చేశారని రవీంద్ర ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తారు. కమ్మవారే ఉద్యమం చేస్తున్నారన్న ఆరోపణలపై ‘‘వాళ్లకు కళ్ళున్నాయా..లేదా’’ అంటూ మండిపడ్డారు.
2020-02-06చంద్రబాబు పాలనతోనే ఆర్థిక కష్టాలు వచ్చాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. రాష్ట్రాన్ని దివాళా తీయించారన్న చంద్రబాబు ఆరోపణలపై మంత్రి గురువారం స్పందించారు. రాష్ట్ర విభజననాటికి మార్కెట్ రుణాలు రూ. 97 వేల కోట్లు ఉంటే చంద్రబాబు దిగిపోయేనాటికి రూ. 1.92 లక్షల కోట్లకు పెరిగాయని, గ్యారంటీలు రూ. 9,500 కోట్ల నుంచి రూ. 75 వేల కోట్లకు పెరిగాయని చెప్పారు. ఇంతా చేసి రూ. 60 వేల కోట్లు బకాయిలు చెల్లించకుండా తమ నెత్తిన పెట్టారని బుగ్గన వ్యాఖ్యానించారు.
2020-02-06నెల్లూరులో ఏడేళ్ళ క్రితం సంచలనం సృష్టించిన తల్లీ కుమార్తెల హత్యల కేసులో దోషికి మరణశిక్ష పడింది. 2013 ఫిబ్రవరి 12న నెల్లూరులోని హరినాధపురంలో వైద్య విద్యార్ధిని భార్గవి, ఆమె తల్లి శకుంతల హత్యకు గురయ్యారు. ఆర్కిటెక్ట్ అయిన ఇంతియాజ్, మరో ఇద్దరు కలసి ఈ హత్యలు చేసినట్టు అభియోగం. ఫార్మసీ కళాశాల నడుపుతున్న భార్గవి తండ్రి దినకర్ రెడ్డి వద్ద ఇంతియాజ్ ఇంటీరియర్ పనులు చేశారు. ఇంట్లో బంగారం, డబ్బు ఉన్న విషయం గుర్తించి దోపిడీ కోసం భార్గవి, ఆమె తల్లిపై దాడి చేశారు.
2020-02-06బెంగాలీ సినిమాలో ‘మిస్ షెఫాలి’గా కీర్తి పొందిన నర్తకి ఆరతీ దాస్ (76) గుండెపోటుతో మరణించారు. భారత దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే తీసిన ‘ప్రతిద్వాండి’, ‘సీమాబద్ద’ వంటి క్లాసిక్ సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. 1960, 70 దశకాల్లో ఆమె ‘క్వీన్ ఆఫ్ క్యాబరెట్’గా పేరు గడించారు. దాస్ కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర24 పరగణాల జిల్లా సోడేపూర్ లోని దాస్ నివాసంలోనే గురువారం మరణించారు.
2020-02-06